ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి తెలంగాణలో సీట్ల సంఖ్య 119 కి పెరిగింది. గతంలో భద్రాచలం పార్లమెంటరీ నియోజకవర్గం ఏపీలో కూడా విస్తరించి ఉండేది. కాని పునర్విభజనలో అలాంటిది లేకుండా తెలంగాణకు పరిమితం చేశారు. కాగా అప్పట్లో వైఎస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమి పేరుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీచేశారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల గోదాలోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు తెలంగాణకు అనుకూల లేఖ ఇవ్వడం మరో విశేషం.
అత్యంత హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. పొత్తుతో తెలంగాణలో టీడీపీ లాభపడితే, టీఆర్‌ఎస్ బాగా నష్టపోవడం మరో విశేషంగా కనిపిస్తుంది. చిరంజీవి పార్టీ విఫలం అవడం కూడా ఇంకో ప్రత్యేకత అని చెప్పాలి. తెలంగాణలో 119 సీట్లకు గాను కాంగ్రెస్ 50 సీట్లను, టీడీపీ 39, టీఆర్‌ఎస్ పది, ఎంఐఎం ఏడు, సీపీఐ నాలుగు, బీజేపీ రెండు, ప్రజారాజ్యం రెండు సీపీఎం ఒక స్థానం, లోక్ సత్తా ఒక సీటు గెలుచుకోగా, ముగ్గురు ఇండి పెండెంట్లు కూడా గెలిచారు. ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే తెలంగాణ, కోస్తా, రాయలసీమలలో కలిపి 82 మంది రెడ్డి నేతలు విజయం సాధిస్తే, వారిలో 53 మంది కాంగ్రెస్ పక్షాన గెలిచారు.
తెలుగుదేశం పార్టీ తరపున 20 మంది, టీఆర్‌ఎస్‌లో ఇద్దరు గెలిచారు. తెలంగాణ వరకు తీసుకుంటే 40 మంది రెడ్డి నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పక్షాన 22 మంది, తెలుగుదేశం పార్టీలో 12 మంది, బీజేపీ, సీపీఎం, ప్రజారాజ్యంల నుంచి ఒక్కొకరు, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. కమ్మ నేతలు ముగ్గురు గెలిస్తే వారిద్దరూ టీడీపీ, లోక్ సత్తాకు చెందినవారు. వెలమ వర్గం నుంచి 10 మంది ఎన్నికయ్యారు. వారిలో టీడీపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌లో ఒకరు, టీఆర్‌ఎస్‌లో ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరు గెలిచారు. ముస్లింలు ఏడుగురు విజయం సాధించారు. వారంతా ఎఐంఎం వారే. షెడ్యూల్ కులాల నేతలు 19 మందికిగాను కాంగ్రెస్ నుంచి పది మంది, టీడీపీలో ఆరుగురు, టీఆర్‌ఎస్ ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ఎస్టీలలో 12 మందికి గాను ఆరుగురు కాంగ్రెస్, ఐదుగురు టీడీపీ, ఒకరు సీపీఐ నుంచి గెలిచారు. బీసీలు 25 మంది గెలిస్తే కాంగ్రెస్ తరపున పది మంది, టీడీపీలో ఎనిమిది, టీఆర్‌ఎస్ ముగ్గురు బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు.
ఇతర సామాజికవర్గాలలో ముగ్గురు కాంగ్రెస్, ఒకరు టీడీపీకి చెందినవారు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కాంగ్రెస్ రెడ్డి ప్రముఖులలో పి.సుదర్శన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, డి.కె.అరుణ, కె.జానారెడ్డి, ఆర్.దామోదరరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దామోదరరెడ్డి, ఆర్.వెంకటరెడ్డిలు సోదరులు. వీరిద్దరూ ఒకే సభలో సభ్యులుగా ఉండడం విశేషం. తెలుగుదేశం నుంచి ఎన్నికైనవారిలో పోచారం శ్రీనివాసరెడ్డి, కె.హరీశ్వర్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, నాగం జనార్దనరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా కొత్తకోట దయాకరరెడ్డి, ఆయన సతీమణి సీతలు ఇద్దరూ టీడీపీ పక్షాన అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పక్షాన గెలుపొందారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా మరోసారి విజయం సాధించారు. వెలమ నేతలలో టి.హరీష్ రావు, కె.తారక రామారావు, చెన్నమనేని రమేష్, ఎర్రబెల్లి దయాకరరావు, జూపల్లి కృష్ణారావు ప్రభృతులు ఉన్నారు. కమ్మ నేతలు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావులు టీడీపీ పక్షాన గెలిచారు. బీసీ నేతలలో దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, జోగు రామన్న, ఎల్.రమణ, బసవరాజు సారయ్య తదితరులు ఉన్నారు. ఎస్సీ నేతలలో దామోదర రాజనరసింహ, మోత్కుపల్లి నరసింహులు, డాక్టర్ శంకరరావు, సుద్దాల దేవయ్య తదితరులు ఉన్నారు. గిరిజన ఎమ్మెల్యేలలో జి.నగేష్ తదితరులు ఉన్నారు.
బీసీలకు పెద్దపీట
Published Sat, Dec 1 2018 3:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment