
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోయిన్‌పల్లిలో ఉన్న గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో పీసీసీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ధరణి పోర్టల్‌పై పార్టీ నేతలకు అవగాహన కల్పించడంతో పాటు జనవరి 26న ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో యాత్రలు, పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా అమలు, ఎన్నికల నిబంధనలపై చర్చించనున్నారు.
అయితే, ఈ సమావేశం సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాట్లాడుతూ.. ‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను ఏమీ చేయలేకపోయారు. ఏ మీడియా కూడా ప్రభుత్వాన్ని శాసించలేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. అధికారం సాధించే దిశగా పనిచేద్దాము. దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని మోదీ స్పందించడం లేదు. అలాంటిదేమీ లేదని ప్రధాని చెప్పడం దురాక్రమణలకు అనుమతి ఇచినట్లే అవుతుంది.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ పదవి స్వీకరించలేదు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారు. చలిని సైతం లెక్కచేయకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. దేశంలో విచ్చినకర శక్తులకు భయపడకుండా యాత్ర కొనసాగుతోంది. జనవరి 26న జెండా ఎగరవేయడంతో బాధ్యత తీరలేదు. అందుకే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపట్టాలని సూచించింది. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2003లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించేది కాంగ్రెస్ పార్టీనే. మనందరం కష్టపడితే కేసీఆర్ ఒక లెక్క కాదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఏల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘2003లో దివంగత మహానేత వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర ఒక సంచలనం. మీడియా మొత్తం వ్యతిరేకంగా ఉన్నా.. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్సార్ బయలుదేరారు. పాదయాత్రతో వైఎస్సార్ సమూల మార్పులు తీసుకువచ్చారు. నాలాంటి ఎంతో మంది వైఎస్సార్ పాదయాత్రలో భాగస్వామ్యులు అయ్యారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment