N.kiran kumar reddy
-
మాజీ సీఎం కిరణ్ దుకాణం మూసేశాడు!
హైదరాబాద్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) దుకాణం మూసేసింది. ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత మాజీ సీఎం, ఆపార్టీ అధినేత ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితోపాటు ఇతర నాయకులు జేఎస్పీ కార్యాలయం రావడమే మానేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత జైసమైక్యాంధ్ర ఉద్యమానికి, పార్టీకి కాలం చెల్లిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో దుకాణాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత కూడా పార్టీ సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణ కూడా ఏమి లేకపోవడంతో కిరణ్ కుమార్ కూడా జై సమైక్యాంధ్రపై ఎక్కడా మాట్లాడకపోవడం, జన జీవన స్రవంతిలో కనిపించడం మానేసిన సంగతి తెలిసిందే. జై సమైక్యాంద్ర పార్టీని స్థాపించిన మూడు నెలల తర్వాత మాదాపూర్ లో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మూసివేయడం గమనార్హం. మాదాపూర్ లోని కృతికా లేఅవుట్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న ఐదు అంతస్తుల భవనానికి ఉన్న పార్టీ పోస్టర్లు, బ్యానర్లను, జెండాలను రెండు రోజుల క్రితం తొలగించారు. దాంతో అద్దెకు తీసుకునేందుకు ఆ భవనానికి ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల తాకిడి ఎక్కవైనట్టు సమాచారం. జేఎస్పీ కార్యాలయాన్ని గుట్టు చప్పుడుకాకుండా మూసేసినట్టు ఆపార్టీకి చెందిన సీనియర్ నేతలకే తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు రోజుల క్రితమే కార్యాలయం నుంచి ఫర్నిచర్, స్టేషనరీని తరలించినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్డడించింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ మీడియాలో వార్తలు రావడం, బీజేపీ నేత కిషన్ రెడ్డితో భేటి కావడం కూడా పార్టీకి మంగళం పెడుతున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. జై సమైక్యాంధ్ర అంటూ ప్రజల్లోకి వెళ్లిన కిరణ్ .. రాష్ట్ర విభజనకు కారణమైన బీజేపీలోనే చేరడానికి ప్రయత్నించడం కొసమెరుపు. Follow @sakshinews -
బీజేపీ గూటికి కిరణ్..?
కేంద్రమంత్రి వెంకయ్యతో మాజీ సీఎం కిరణ్ చర్చలు జేఎస్పీని బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన సాక్షి ప్రతినిధి, తిరుపతి : జేఎస్పీ అధినేత ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధమయ్యారా? బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారా? కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జరిపిన మంత్రాం గం ఫలిస్తే.. పక్షం రోజుల్లోనే కాషాయదళంలోకి కిరణ్ చేరనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి జేఎస్పీ వర్గాలు.. చివరి బంతి వరకూ వేచి చూడండి, రాష్ట్ర విభజనను ఆపుతానంటూ అప్పటి సీఎం కిరణ్ ప్రగల్భాలు పలికిన విషయం విదితమే. తనకు తాను సమైక్య సింహం.. చాంపియన్‌గా అభివర్ణించుకున్న కిరణ్ రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక.. సీఎం పదవికి రాజీనామా చేసి జారుకున్నారు. ఆ తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. ప్రజలు విశ్వసించి జేఎస్పీకి ఓట్లేసి కాస్తోకూస్తో సీట్లను కట్టబెడితే.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి బాగుంటే, ఆపార్టీ అధిష్టానానికి షరతులు పెట్టి పార్టీని విలీనం చేసేలా కిరణ్ అప్పట్లో ప్రణాళిక రచించారనే అభిప్రాయం క్రమంలోనే ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్ర విభజనను ఆపుతానంటూ ఊరువాడ ప్రచారం చేశారు. విజయంపై ధీమా లేని కిరణ్ తాను స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేయకుండా ఆదిలోనే కాడి దించారు. తాను ప్రాతినిథ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలోనూ కిరణ్ పోటీచేయలేదు. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి జేఎస్పీ తరఫున బరిలోకి దిగారు. రాష్ట్రంలో పీలేరు మినహా ఏ ఒక్క చోట కూడా జేఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కిరణ్ తెరమరుగయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కన్పించకపోవడమే అందుకు తార్కాణం. కాంగ్రెస్ పార్టీ కూడా అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ పూర్తిగా బలహీనపడింది. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కిరణ్ తన వ్యూహాన్ని మార్చారు. జేఎస్పీని కాంగ్రెస్‌లో కాకుండా బీజేపీలో విలీనం చేసి, ఆపార్టీలో కీలకపాత్ర పోషించడం ద్వారా రాజకీయంగా పునర్వైభవం సాధించాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బలమైన నేతలను కాషాయదళంలో చేర్చుకోవడానికి బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇది పసిగట్టిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడుతో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితోనూ కిరణ్ చర్చలు జరిపారు. తనను బీజేపీలో చేర్చుకుని.. ప్రాధాన్యం ఇస్తే జేఎస్పీని విలీనం చేస్తానని వెంకయ్యనాయుడు వద్ద ప్రతిపాదించినట్లు కిరణ్ అనుయాయులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని కిరణ్‌కు వెంకయ్య హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదే అంశంపై పీలేరు నియోజకవర్గంలోని తనకు సన్నిహితులైన నేతలకు కిరణ్ చెప్పినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపడమే తరువాయి.. జేఎస్పీని ఆపార్టీలోకి విలీనం చేయడానికి కిరణ్ సిద్ధమైపోయారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచిన బీజేపీలోకి సమైక్య చాంపియన్‌గా అభివర్ణించుకున్న కిరణ్ ఇప్పుడు చేరడానికి అర్రులు చాస్తోండటం గమనార్హం. -
పేలవంగా కిరణ్ ప్రచారం
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన పేలవంగా సాగింది. ఆయన ప్రసంగాలు ఎక్కడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజైన గురువారం ఆయన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు మూడు, నాలుగు వందల మందికి మించి ప్రజలు హాజరు కాకపోవడం జేఎస్పీ అధినేత కిరణ్‌ను, అభ్యర్థులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. హైదరాబాద్ నుంచి కిరణ్ కుమార్‌రెడ్డి విమానంలో మధురపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో జరిగిన సభకు హాజరయ్యారు. ఈ సభకు 200 మందికి మించి జనం హాజరు కాలేదు. దాంతో కిరణ్‌తోపాటు పార్టీ ఉపాధ్యక్షుడు ఉండవిల్లి అరుణ్‌కుమార్, అమలాపురం పార్లమెంట్ పార్టీ అభ్యర్థి జి.వి.హర్షకుమార్ డీలా పడ్డారు. తరువాత మండపేట కలువపువ్వు సెంటరు, రావులపాలెం మార్కెట్ రోడ్డు సెంటరు, పి.గన్నవరం మూడు రోడ్ల జంక్షన్, అమలాపురం గడియారస్తంభం సెంటర్లలో జరిగిన సభలకు సైతం జనం హాజరు అంతంతమాత్రంగానే ఉంది. జనసేకరణకు అభ్యర్థులు డబ్బులు బాగా ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా ఇతర నాయకుల ప్రసంగాలు మొక్కుబడిగా సాగాయి. వారి ప్రసంగాలకు పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టిన తెలంగాణ బిల్లును కోర్టు కొట్టివేస్తుందని కిరణ్ చెప్పుకొచ్చారు. మరోసారి బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోను పెట్టాల్సి వస్తుందని, దానిని అడ్డుకునేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. విభజన పాపం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లదేనని, చెప్పు గుర్తుకు ఓటు వేసి వారికి బుద్దిచెప్పాలని కోరారు. పార్టీ అభ్యర్థులు హేమా సయ్యద్, తలాటం వీరరాఘవులు, కె.వి. సత్యనారాయణరెడ్డి, జి.వి. శ్రీరాజ్, మత్తి జయప్రకాష్, నెల్లి కిరణ్‌కుమార్, టి.స్వామినాయకర్ పాల్గొన్నారు. -
చంద్రబాబును నమ్మొద్దు: కిరణ్
చిత్తూరు, తెలంగాణ విషయమై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న టీడీపీ నేత చంద్రబాబును నమ్మొద్దని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరులో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. గోద్రా అల్లర్లకు నరేంద్రమోడీనే కారణమన్న చంద్రబాబు ఎన్నికల్లో ఆయనతో జట్టు కట్టేందుకు తహతహలాడారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై మే 5వ తేదీన సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు విచారణకు వస్తుందని, విభజన తప్పని తీర్పు వస్తుందని నమ్మకం ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత బిల్లు అసెంబ్లీకి వస్తుందన్నారు. తీర్పు వచ్చేనాటికి జేఎస్పీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటే బిల్లును వ్యతిరేకించి రాష్ట్రాన్ని సమైక్యం గా ఉంచుతారన్నారు. -
ఉమ్మేసిన వారికే ఓటేస్తారా?: కిరణ్
పలమనేరు/తిరుపతి, న్యూస్‌లైన్: తెలుగు ప్రజలను విడగొట్టి అవమానపరిచి ఉమ్మేసిన వారికే ఓట్లు వేస్తారా అని జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పలుచోట్ల రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుప్రజల దయాదాక్షిణ్యాలతో ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఓటుతో బుద్దిచెప్పాలని ఆయన కోరారు. పీలేరు నుంచే కిరణ్ పోటీ!: మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచే ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నారు. ఈనెల 17వ తేదీన నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డిని నిలిపి రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి కిరణ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. . శుక్రవారం పీలేరు నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్యులతో సమావేశమై తాను పీలేరు నుంచి పోటీ చేయాలన్న నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిసింది. -
చంద్రబాబు పిరికివాడు: కిరణ్
ఏలూరు: తెలుగు జాతి కలిసుండాలని నోటితో చెప్పలేని పిరికివాడు చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆదివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రసంగించిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. తన లేఖవల్లే రాష్ట్ర విభజన జరిగిందని తెలంగాణకు వెళ్లినప్పుడు, ఎలా విభజిస్తారంటూ ఆంధ్రాకు వచ్చినప్పుడు రెండు నాల్కల ధోరణి అవలంబించిన చంద్రబాబు అసెంబ్లీలో 40 రోజులు చర్చ జరిగితే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏనాడైనా చెప్పారా? రాష్ట్రాన్ని విభజించుకోమని కేంద్రానికి రెండు లేఖలు రాసిన వ్యక్తిని మీరు నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. అది కేసీఆర్ ఆఫీస్‌లో కొళాయి కాదు కైకలూరు, న్యూస్‌లైన్: నదీ జలాల విడుదల అంశం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ కార్యాలయంలో కొళాయి లాంటిది కాదని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్, చంద్రబాబులపై ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్రకు నీటి విడుదలను ఆపే సత్తా కేసీఆర్‌కు లేదన్నారు. -
చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నాడు
మీట్ ది ప్రెస్‌లో మాజీ సీఎం కిరణ్ ఎద్దేవా అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ.. పార్లమెంట్లో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి కారణమైన ఆర్టికల్-3 రద్దు చేయాలని లేదా పునఃపరిశీలించాలని తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని మాజీ సీఎం, జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధ్యక్షుడు ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించాయని ధ్వజమెత్తారు. తృతీయఫ్రంట్తో కలిసి రాష్ట్రాన్ని తిరిగి సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు తానే కారణమన్న కేంద్రమంత్రి చిరంజీవిపై కిరణ్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తిగా ఆయన్ను తాను భావిస్తున్నానని చెప్పారు. రాజకీయాలంటే స్క్రిప్టు రాసుకొచ్చి చదవడం కాదన్నారు. తాను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదన్నారు. మిగులు జలాలపై హక్కు సీమాంధ్రకే: సీమాంధ్రకు నీళ్లురాకుండా అడ్డుకోవడం కేసీఆర్ వల్ల కాదని, మనం ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే తెలంగాణకు కరెంట్ రాకుండా చేయవచ్చని మాజీ సీఎం అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి.. కర్ణాటక, మహారాష్ట్ర తరహాలోనే తెలంగాణ కూడా నికర జలాలను మాత్రమే వాడుకోవాలని, మిగులు జలాలను వాడుకునే హక్కు సీమాంధ్రకే ఉంటుందని గుర్తుచేశారు. తెలంగాణలో నీళ్లు నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు. -
హడావుడి వెనుక ఆంతర్యమేమిటో?
హుజూర్నగర్,న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ అనేక దఫాలుగా పనులు కొనసాగించిన ప్రభుత్వం పనులు పూర్తిస్థాయిలో ముగియకముందే ప్రారంభానికి సిద్ధంకావడం వెనక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల బాధితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయలేదు. బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు బాధితుల గృహ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్‌ను ఈ నెల 27 లేదా 30న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రారంభించేందుకు హడావుడిగా తేదీ ప్రకటించి సన్నాహాలు చేస్తుండడంతో ప్రాజెక్ట్ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై రూ.1260 కోట్లతో కృష్ణాడెల్టా పరిధిలోని 13లక్షల 8వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తికాగా, ముంపుబాధితుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో కొనసా..గుతున్న పనులు మేళ్లచెరువు మండలంలోని నెమలిపురి, చింతిర్యాల, కిష్టాపురం, అడ్లూరు, వెల్లటూరు, పీక్లానాయక్‌తండా, తంబారం, రేపల్లె, శోభనాద్రిగూడెం, నేరేడుచర్ల మండలంలోని రావిపాడ్, గుండెబోయినగూడెం, మఠంపల్లి మండలంలోని గుండ్లపాడ్, సుల్తాన్పూర్తండాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలకుదోరకుంట, గుడిబండ, మేళ్లచెరువు, కిష్టాపురం అడ్డరోడ్డు, నక్కగూడెం, చింతిర్యాల, తంబారం, శోభనాద్రిగూడెం, పీక్లానాయక్‌తండా, పెదవీడు సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పునరావాస కేంద్రాలలో పనులు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో పూర్తయిన దాఖలాలు కనిపించడం లేదు. మేళ్లచెరువు మండలం కిష్టాపురం అడ్డరోడ్డు పునరావాస కేంద్రంలో మాత్రమే కొన్ని కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. మిగిలిన కేంద్రాలలో ఎక్కడా కూడా బాధితులు గృహ ప్రవేశాలు చేయలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాలలోనే నివాసం ఉంటూ సమీప సాగుభూములలో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. అంతేగాక నెమలిపురి, చింతిర్యాల, నక్కగూడెం రెండో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల సంబంధిత అధికారులు సర్వేలు నిర్వహించారు. భూ సేకరణ చేసి నక్కగూడెం, చింతిర్యాల పునరావాస కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన మాత్రమే చేశారు. అయితే నెమలిపురి పునరావాస కేంద్రం ఏర్పాటుకు సేకరించిన భూమి విషయంలో సమస్యలు ఉండటంతో నేటి వరకు పునరావాస కేంద్రం పనులు ప్రారంభం కాలేదు. -
బాలల సినిమాలకు ప్రాధాన్యం: సీఎం కిరణ్
18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో సీఎం కిరణ్ వచ్చే చిత్రోత్సవానికి మౌలిక వసతుల కల్పన సాక్షి, హైదరాబాద్: బాలల చలనచిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ నిధులు కేటాయించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లలితాకళాతోరణంలో జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఇప్పటికే భూమి కేటాయించామని, ఇకపై ఈ వేడుకలకు శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి రంగంలోనూ పోటీ పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు అద్భుతంగా నటించి మంచి సినిమాలు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. దేశ జనాభాలో 25 ఏళ్ల లోపు వారే ఎక్కువమంది ఉన్నారని, యువకులు అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ప్రతి చిన్నారినీ తల్లిదండ్రులు బడికి పంపాలని, వంద శాతం అక్షరాస్యత ఉన్నప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగవచ్చని సీఎం చెప్పారు. సృజనాత్మక సినిమాలు రావాలి: మనీష్ తివారీ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం హైదరాబాద్‌లో జరగడం అదృష్టమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు. బాలల సినిమాల్లో సృజనాత్మకత ఉండాలని, అది భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, అందుకే అన్ని తరాల వారిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. బాలల సినిమాలు ప్రదర్శనకు మాత్రమే కాకుండా, వాటిలో బాలల హక్కులు, సంస్కృతి, సంప్రదాయం, గౌరవం అన్నీ ప్రతిబింబించాలని అన్నారు. ప్రపంచస్థాయి సినిమాలకు వేదిక: డీకే అరుణ హైదరాబాద్ ప్రపంచ స్థాయి బాలల సినిమాల ప్రదర్శనకు వేదికైందని, వారం రోజుల పాటు ఈ సినిమాలు చూసే అవకాశం చిన్నారులకు దక్కిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ నగరం గాజులకు, బిర్యానీకి ఎంత ప్రసిద్ధి చెందిందో బాలల చలన చిత్రోత్సవానికీ అంతే ప్రసిద్ధి అని అన్నారు. బాలల చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రకృతిమిత్ర సావనీర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, దర్శకుడు గుల్జార్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రాణా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తారే జమీన్ పర్ సినిమాలో అద్భుతంగా నటించిన బాలనటుడు దర్శిల్ సఫారి వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాలి: సీఎం కిరణ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు అభివృద్ధి బాటలో పయనించాలని సీఎం కిరణ్‌కుమార్ సూచించారు. విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదని ఉద్బోధించారు. జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల కార్యక్రమంలో కిరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ప్రతి సందర్భంలోనూ సరైన కీలక నిర్ణయం తీసుకునేందుకు విద్య తోడ్పడుతుందని తెలిపారు. సమీకృత శిశు సంక్షేమ అభివృద్ధి పథకానికి అదనంగా రూ.77 కోట్లు, హైదరాబాద్‌లోని జవహర్ బాల భవన్ అభివృద్ధికి రూ.4 కోట్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శైలజానాథ్, ముఖేష్‌గౌడ్, పితాని సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
విభజనపై నా వైఖరి మారలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో తాను కన్విన్స్ కాలేదని, తన వైఖరిని మార్చుకోలేదని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. విభజనతో అనేక సమస్యలున్నాయని, మున్ముందు ఇంకా వస్తాయని, అందుకే పునరాలోచన కోరుతున్నామని చెప్పారు. అయినా ‘‘ఈ సబ్జెక్ట్ ఇక క్లోజ్డ్... దీనిపై ఇంకేం ప్రస్తావించొద్దు’’ అని ఆయన మీడియాకు సూచించారు. కిరణ్ శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘విభజనకు మీరు అంగీకరించారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ చెప్పార’ంటూ విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అది ఆయన వెర్షన్ ఏమో... నేనైతే కన్విన్స్ కాలేదు. మొదటినుంచీ నా వైఖరి ఎక్కడా మారలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వాళ్లలో మేమందరం ఉన్నాం. ఇదొక సున్నిత అంశం. దయచేసి దాన్ని లేవనెత్తొద్దు. ఇది సమయం కాదు. నా భావన కానీ, అభిప్రాయం కానీ మార్చుకోలేదు. అలా మాట కూడా చెప్పలేదు’’ అని ఆయన బదులిచ్చారు. ‘పదే పదే సమైక్యవాదన వినిపించడంతో తెలంగాణ ప్రజలను కించపరిచినట్టు మీరు భావించడం లేదా?’ అని అడగగా.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ప్రజల ఆకాంక్ష. దాన్ని మేం ఎక్కడా కించపరచటం లేదు. కానీ విభజిస్తే తెలంగాణకు, ఆంధ్ర రాష్ట్రం కంటే ఎక్కువ నష్టం వస్తుందనే చెబుతున్నాం. మళ్లీ పునరాలోచన చేసుకోవాలని మాత్రమే కోరుతున్నాం. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ ముందుకు వస్తాయ్. ఏమేం సమస్యలొస్తాయనేది తెలుస్తుంది. ఈ సబ్జెక్ట్ ఇక క్లోజ్డ్... దీనిపై ఇంకేం ప్రస్తావించొద్దు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఆంటోనీ కమిటీ నివేదిక అంశాలు చూశాక మీరు కన్విన్స్ అయ్యారంటున్నారని అనగా.. ‘‘ఆ సమావేశం మీ భాషలో అయితే ఇన్‌కెమెరా మీటింగ్. మేం బయట మాట్లాడకూడదు’’ అని సీఎం బదులిచ్చారు. ఇతర ప్రశ్నలకు స్పందిస్తూ, ఉద్యమం జరుగుతున్నపుడు తామేం మాట్లాడినా కించపరిచినట్టు ఉంటుంది కనుక దానికి వ్యతిరేకంగా మాట్లాడదల్చుకోలేదన్నారు. ‘‘ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా మేం మాట్లాడటం లేదు. కానీ రాబోయే సమస్యలు, పరి ష్కారం కాని సమస్యలు ఎన్నో మనముందున్నాయి. అవి పరిష్కారం అయ్యాక మనం విభజన చేయాలి. భారతదేశంలో ఎక్కడైనా కానీ 300 కిలోమీటర్ల మేరకు నదీ జలాల్ని రెండు రాష్ట్రాల మధ్య విభజించే పరిస్థితి లేదు. అలా ప్రాజెక్టులను విభజించే పరిస్థితి లేదు. రెండు ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. సమన్వయం ఉండకపోతే ఒకవేళ 2009 మాదిరిగా వరదలు వస్తే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ఆస్కారం ఉంది. ఒక ప్రాజెక్టును కేంద్రం పరిధిలో పెట్టి, ఒక జిల్లాను ఒక రాష్ట్రంలో, మరో జిల్లాని ఇంకో రాష్ట్రంలో పెడితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పరిశీలించి పరిష్కారం కనుగొన్నాకే ముందుకెళ్లాలి. ఉద్యోగులది పెద్ద సమస్య ఉంది. 371డీ ఉంది. విద్య... పెద్ద సమస్య ఉంది. వైద్య సౌకర్యాలు.. పెద్ద సమస్య ఉంది. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల ఉంటున్నవారి సమస్య ఉంది. వీటన్నింటినీ కూడా పరిష్కరించాకే ముందుకెళ్లాలి’’ అని ఆయనన్నారు. తెలంగాణ బిల్లుపై ప్రశ్నలకు ఆయన బదులివ్వలేదు. విభజనపై ప్రశ్నలు వరుసగా అడుగుతుండటంతో ఆయన విలేకరుల సమావేశాన్ని అర్థాంతరంగా ముగించేసి బయటకు నడిచారు. పాత్రికేయులపై బొత్స అనుచిత వ్యాఖ్యలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీ భవన్లో విలేకరుల సమావేశం ముగించి తన అధికార నివాసంలోకి వెళుతున్నప్పుడు.. కొంత మంది విలేకరులు కూడా సీఎంతో వెళ్లారు. వారితో పాటే లోనికి వెళ్లిన బొత్స సత్యనారాయణ విలేకరులను ఉద్దేశించి.. ‘వేస్ట్ ఫెలోస్‌ను లోపలకు ఎందుకు రానిచ్చారు?’ అని సీఎంతో అన్నారు. దానికి సీఎం నవ్వి ఊరుకున్నారు. కాసేపటికి సీఎం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న బొత్సతో.. తమను ఉద్దేశించి సంస్కారం లేకుండా మాట్లాడారంటూ పాత్రికేయులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘నాఇష్టం.. అంటాను. ముఖ్యమంత్రికి నేను ఏమైనా చెప్పుకుంటా. అడగడానికి మీరెవరు?’ అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత్రికేయులు, బొత్స మధ్య వాగ్వాదం జరిగింది. బొత్స వ్యాఖ్యలను పాత్రికేయులు ఖండించారు. -
ఆర్ఆర్కు సీఎం నివాళి
రాయచోటి /లక్కిరెడ్డిపల్లె న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి మాజీ మంత్రి ఆర్. రాజగోపాల్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం లక్కిరెడ్డిపల్లెలో నిర్వహించిన ఆర్ఆర్ దశదినకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కలికిరి నుంచి ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్లో బయలుదేరి లక్కిరెడ్డిపల్లెకు 12.50 గంటలకు చేరుకున్నారు. తొలుత ఆయన మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులు భార్య హేమలతమ్మ, కుమారులు మాజీ శాసన సభ్యుడు ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీనివాసులురెడ్డి, కుమార్తె రాధమ్మ, మనవళ్లు, మనరాళ్లను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సుమారు 40 నిముషాల పాటు ఆర్ఆర్ కుటుంబీకులతో గడిపిన అనంతరం ఆయన తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి అహ్మదుల్లా, మాజీ మంత్రులు జె.సి.దివాకరరెడ్డి, ఎస్.రామమునిరెడ్డి,బ్రహ్మయ్య, 20 సూత్రాల ఆర్థిక అమలు కమిటీ సభ్యుడు తులసిరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులురెడ్డి, నారాయణరెడ్డి, శివరామక్రిష్ణారావు, కందుల శివానందరెడ్డి, డిసిసి అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటు ఇన్చార్జ్ మిథున్ రెడ్డి,ఎమ్మెల్సీలు సతీష్‌కుమార్‌రెడ్డి, బత్యాల చెంగల్రాయుడు, మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ జ్యోతిరెడ్డి, పీసీసీ సభ్యుడు రాంప్రసాద్‌రెడ్డి, కాంగ్రెస్‌నేత మేడా మల్లిఖార్జున రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ ఛైర్మన్ కాలాడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు జిఎండి రఫీ, నర్సారెడ్డి, ఉమాపతిరెడ్డి, మాజీ జెడ్పీటిసిలు రెడ్డెయ్యయాదవ్, నాగసుబ్బారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, ఆర్ఆర్ అభిమానులు, అనుచరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
సీఎం కిరణ్ది అవివేకం
కొత్తూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారదాహంతో తనస్థాయిని మరిచి మాట్లాడుతున్నారని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. ఆయన కేవలం సీమాంధ్రకు ముఖ్యమంత్రి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఆ స్థాయిలో ఉన్న కిరణ్ అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సిందిపోయి ఒకే ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడటం అవివేకమని, అలాంటి తీరును వెంటనే మార్చుకోవాలని సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాగర్జన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత సుష్మస్వరాజ్‌కు స్వాగతం పలకడానికి ఆయనతో పాటు పలువురు రాష్ర్ట, జిల్లా నాయకులు జిల్లా ముఖద్వారమైన తిమ్మాపూర్ వద్దకు భారీసంఖ్యలో చేరుకున్నారు. నాగం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న పలు పరిస్థితుల కారణంగా రానున్న నెలరోజుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొన సాగడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణకు అడ్డుచెప్పినా..బీజేపీ అధికారంలోకి రాగానే నెలరోజుల్లో ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు అనేక కారణాలు ఉన్నాయని, సీమాంధ్రప్రజలు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన ంతరం బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మస్వరాజ్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పలువురు నేతలు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీవర్దన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌సెల్ కో కన్వీనర్ చెంది మహేందర్‌రెడ్డి, స్టేట్‌కౌన్సిల్ సభ్యుడు పాతపల్లి కృష్ణారెడ్డి, బీజేఎంఎం జిల్లా అధ్యక్షుడు ఆశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.