18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో సీఎం కిరణ్
వచ్చే చిత్రోత్సవానికి మౌలిక వసతుల కల్పన
సాక్షి, హైదరాబాద్: బాలల చలనచిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ నిధులు కేటాయించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లలితాకళాతోరణంలో జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు.
చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఇప్పటికే భూమి కేటాయించామని, ఇకపై ఈ వేడుకలకు శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి రంగంలోనూ పోటీ పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు అద్భుతంగా నటించి మంచి సినిమాలు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. దేశ జనాభాలో 25 ఏళ్ల లోపు వారే ఎక్కువమంది ఉన్నారని, యువకులు అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ప్రతి చిన్నారినీ తల్లిదండ్రులు బడికి పంపాలని, వంద శాతం అక్షరాస్యత ఉన్నప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగవచ్చని సీఎం చెప్పారు.
సృజనాత్మక సినిమాలు రావాలి: మనీష్ తివారీ
అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం హైదరాబాద్‌లో జరగడం అదృష్టమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు. బాలల సినిమాల్లో సృజనాత్మకత ఉండాలని, అది భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, అందుకే అన్ని తరాల వారిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. బాలల సినిమాలు ప్రదర్శనకు మాత్రమే కాకుండా, వాటిలో బాలల హక్కులు, సంస్కృతి, సంప్రదాయం, గౌరవం అన్నీ ప్రతిబింబించాలని అన్నారు.
ప్రపంచస్థాయి సినిమాలకు వేదిక: డీకే అరుణ
హైదరాబాద్ ప్రపంచ స్థాయి బాలల సినిమాల ప్రదర్శనకు వేదికైందని, వారం రోజుల పాటు ఈ సినిమాలు చూసే అవకాశం చిన్నారులకు దక్కిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ నగరం గాజులకు, బిర్యానీకి ఎంత ప్రసిద్ధి చెందిందో బాలల చలన చిత్రోత్సవానికీ అంతే ప్రసిద్ధి అని అన్నారు. బాలల చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రకృతిమిత్ర సావనీర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, దర్శకుడు గుల్జార్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రాణా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తారే జమీన్ పర్ సినిమాలో అద్భుతంగా నటించిన బాలనటుడు దర్శిల్ సఫారి వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది.
ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాలి: సీఎం కిరణ్
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు అభివృద్ధి బాటలో పయనించాలని సీఎం కిరణ్‌కుమార్ సూచించారు. విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదని ఉద్బోధించారు. జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల కార్యక్రమంలో కిరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ప్రతి సందర్భంలోనూ సరైన కీలక నిర్ణయం తీసుకునేందుకు విద్య తోడ్పడుతుందని తెలిపారు. సమీకృత శిశు సంక్షేమ అభివృద్ధి పథకానికి అదనంగా రూ.77 కోట్లు, హైదరాబాద్‌లోని జవహర్ బాల భవన్ అభివృద్ధికి రూ.4 కోట్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శైలజానాథ్, ముఖేష్‌గౌడ్, పితాని సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.