Childrens Film Festival
-
బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ విభిన్న రకాల సదస్సులు, కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు నగరం శాశ్వత వేదికగా మారాలని ఆకాంక్షించారు. బాలల చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం ఇక్కడి శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని మాట్లాడుతూ... ఈ వేడుకను నిర్వహంచడంలో ప్రభుత్వం విజయవంతమైందని అన్నారు. సాంకేతికంగానూ ఈ సారి వేడుక కొత్త పుంతలు తొక్కిందన్నారు. విభిన్న దేశాల నుంచి చిత్రోత్సవాలకు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారని, సినిమాలు తీసిన, నటించిన చిన్నారుల ప్రతిభ అబ్బురపరచిందన్నారు. చదువులో మాత్రమే కాకుండా విద్యార్థులకు ఇష్టమైన రంగాల్లో తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా విభిన్న కేటగిరీల్లో గెలుపొందిన చిత్రాలకు గోల్డెన్ ఎలిఫెంట్ ట్రోఫీలను అందజేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలతో పాటు బాల నటి భజరంగీ భాయీజాన్ ఫేం హర్షాలీ మల్హోత్రా పాడిన పాట అలరించింది. ఈ కార్యక్రమంలో సినీ తారలు శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్, చిత్రోత్సవాల చైర్మన్ ముకేశ్ ఖన్నా, డైరెక్టర్ శ్రవణ్‌కుమార్, జ్యూరీ చైర్పర్సన్ అమల అక్కినేని తదితరులు పాల్గొన్నారు. -
మంచి చెడుల మేళవింపే సినిమా
‘ఒక ప్రాంతంలో పుట్టి పెరిగిన పిల్లలపై ఆ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటుంది.. చలన చిత్రాల ప్రదర్శన ద్వారా వివిధ దేశాల సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం తెలుసుకునే అవకాశం ఉంటుంది.. జీవితాన్ని చిత్రీకరించి చూపగలిగేది సినిమా ఒక్కటే’ అని సినీ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు. నగరంలోని భవాని థియేటర్లో రూరల్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన బాలల చలన చిత్రోత్సవాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. వరంగల్ రూరల్: మంచి చెడులను మేళవించి చెప్పేదే సినిమా అని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు ఆర్.పి.పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని బుధవారం వరంగల్ నగరం కాజీపేటలోని భవానీ థియేటర్లో రూరల్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వర్ధమాన నటి హిమాన్షి చౌదరి కలిసి ప్రారంభించి మాట్లాడారు. బాలల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు తొలుత మంబాయిలో నిర్వహించారని, ఆ తర్వాత దేశంలోని ప్రముఖ పట్టణాలకు విస్తరించాయని, 1993 నుంచి హైదరాబాద్ శాశ్వత వేదికైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి జిల్లాలో ఈ వేడుకలు నిర్వహించాని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని, దీని వల్ల జిల్లాలోని పిల్లలు సినిమాలు చూసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో పుట్టి పెరిగిన పిల్లలపై ఆ పరిసర ప్రాంతాల ప్రభావం ఉంటుందని, చలన చిత్రాల ప్రదర్శన ద్వారా వివిధ దేశాల సంస్కృతి, జీవన విధానం పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. జీవితాన్ని చిత్రీకరించి చూపగలిగేది సినిమా ఒక్కటేనని, ప్రాంతాలు, భాషలకు అతీతంగా మంచిని పంచేదే సినిమా అని వివరించారు. సినిమాపై ఒక దురాభిప్రాయం కూడా ఉందని, చెడు చూసి అంతా చెడిపోతున్నారనే అపోహను తోసిపుచ్చారు. చెడుపై మంచి ఎలా గెలుస్తుందో చెప్చేదే సినిమా అని, మంచినే స్వీకరించాలని సూచించారు. డీఆర్వో భూక్యా హరిసింగ్ మాట్లాడుతూ ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో 21 సినిమాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. డీఈఓ కె.నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు చెందిన 14వేల మంది విద్యార్థులకు వారం రోజుల పాటు సినిమాలు చూపిస్తామని, రోజుకు 1800 నుంచి 2వేల మందికి అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఆర్వో కిరణ్మయి, ఖాదీ విలేజ్ బోర్డు రీజినల్ మేనేజర్ సంతోష్ గీసుగొండ ఎంఈఓ.సృజన్ తేజ, భవానీ థియేటర్ యజమాని తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నఆర్.పి.పట్నాయక్ -
12 నుంచి 14 వరకూ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు అమరావతి చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2017ను నిర్వహించనున్నట్లు కమిషనర్ జె.నివాస్ వెల్లడించారు. తన చాంబర్లో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతోందన్నారు. పిల్లల హక్కులకు సంబంధించిన సినిమాలు చూపించి వాటిపై చర్చ చేపట్టనున్నట్లు తెలిపారు. సినిమాను చూసి ఏం నేర్చుకోవాలనే విషయాన్ని తెలియజెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యమన్నారు. 48 గంటల చాలెంజ్‌లో భాగంగా పిల్లలతో షార్ట్ ఫిల్మ్స్‌ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో వచ్చిన పిల్లల చిత్రాలను చూపించి వాటి ఆధారంగా షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక రూపొం దించామని వివరించారు. పూణేకు చెందిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు షార్ట్ ఫిల్మ్ తయారీపై పిల్లలకు శిక్షణ ఇస్తారన్నారు. బెస్ట్ ఫిల్మ్స్‌కు బహుమతుల్ని అందిస్తామన్నారు. వర్థమాన కథానాయకులు ఆదర్మ్, నిఖిల్ హాజరుకానున్నట్లు తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ తయారీపై ఆసక్తి గల నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులతో పాటు, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆయా స్కూల్స్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించి 24 క్రాఫ్ట్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు మేకింగ్‌కు సంబంధించి పరికరాలను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండియా సమకూరుస్తోందని తెలిపారు. నగరంలోని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. -
8 నుంచి బాలల చలన చిత్రోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు ఘనంగా నిర్వ హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రారంభ, ముగింపు వేడు కలను శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ అధ్యక్ష తన వివిధ రంగాలకు చెందిన 42 మంది ప్రముఖు లతో ఆర్గనైజింగ్ కమిటీని నియమించామన్నారు. ఈ చలన చిత్రోత్సవంలో 19 మంది జ్యూరీ మెంబర్స్‌ను ఎంపిక చేయగా, వీరిలో భారత్ నుంచి 8 మందిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. 93 దేశాలు, 295 సినిమాలు ప్రదర్శనలో పాల్గొంటాయని తెలిపారు. అన్ని దేశాల నుంచి 291 మంది, మన రాష్ట్రం నుంచి 50 మంది బాలల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొ ననున్నట్లు వివరించారు. 108 దేశాల నుంచి 1,408 చిత్రాలను ఈ ఉత్సవాల్లో ప్రదర్శనకుగాను ఎంట్రీ లను పంపినట్లు తెలిపారు. చిత్రాల ప్రదర్శనకు ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌ను ఎంపిక చేశామని చెప్పారు. బుద్ధిమాంద్యం, వికలాంగ బాలల కోసం తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేకంగా చిత్రా లను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక థియేటర్లో బాలల చలన చిత్రాలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొ న్నారు. 45 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొని సుమారు 1.50 లక్షల మంది పిల్లలను థియేటర్ల వరకు తీసుకువచ్చి, తిరిగి పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రదర్శించే చిత్రాలు... బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకుగాను షాను, మట్టిలో మాణిక్యాలు, ఎగిసే తారాజువ్వలు, డూడూ – డీడీ, ఇండీవర్ స్పెషల్ ఫిల్మ్‌గా పూర్ణ తెలుగు చిత్రాలు ఎంపికైనట్లు మంత్రి తలసాని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని ఈశ్వర్ (అత్తాపూర్), శివపార్వతి (కూకట్పల్లి), రంగా (జీడిమెట్ల), మహాలక్ష్మి (కొత్తపేట), ప్రశాంత్( సికింద్రాబాద్), సినీ–పోలీస్ స్క్రీన్ 3 (మల్కాజ్గిరి), సినీ పోలీస్ స్క్రీన్ 4 (మల్కాజ్గిరి), హైటెక్ (మాదాపూర్), కుమార్ (కాచిగూడ), గోకుల్ (ఎర్రగడ్డ) సినిమా థియేటర్లను అద్దెకు తీసుకున్నట్లు వివరించారు. తెలుగు లలిత కళాతోరణంలో నవంబర్ 9 నుండి 13 వరకు రోజూ సాయంత్రం చలనచిత్ర ప్రదర్శనతోపాటు 98 పాఠశాలలకు చెందిన బాలలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. పబ్లిక్ గార్డెన్‌లోని జవహర్ బాల భవన్లో నవంబర్ 9 నుండి 13వ తేదీ వరకు రోజూ సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు దాదాపు 120 మంది పిల్లలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఎంపిక చేసిన 30 మంది, రెసిడెన్షియల్ స్కూల్స్‌కు చెందిన 20 మంది బాలలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా శాశ్వతంగా అనుమతులు వచ్చిన వెంటనే నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయనున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేస్తామని ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సమావేశంలో ఎఫ్డీసీ జేఎండీ కిషోర్‌బాబు పాల్గొన్నారు. -
పిల్లల స్క్రిప్ట్‌తో...
‘‘చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఇన్స్పిరేషన్తో ఈ చిత్రం చేశాను. దీనికోసం చిన్నారులను ఎంపిక చేసి వర్క్‌షాప్ నిర్వహించాం. చిన్నపిల్లలే ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించడం విశేషం. ఆరుగురు స్నేహితులు తమ స్నేహితురాలు కోసం ఏం చేశారనేదే ఈ చిత్రం కథ’’ అని దర్శకుడు రషీద్ బాషా తెలిపారు. మాస్టర్ మహమ్మద్ అఫ్పాన్స్ సమర్పణలో హెచ్.డి. విజన్ ఇండియా పతాకంపై నిర్మించిన ‘లిటిల్ స్టార్స్’ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిర్మాతలు: ఇబ్రహీం షేక్, అమీర్ బాషా షేక్, ఖాజాబి షేక్, నజీమ్ షేక్, కెమెరా: కిషన్ సాగర్, సంగీతం: శ్రీ వెంకట్. -
మీ నవ్వులతో నగరాన్ని వెలిగించొచ్చు!
♦ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ♦ ఆర్భాటంగా ప్రారంభమైన బాలల చిత్రోత్సవం సాక్షి, హైదరాబాద్: ‘మీ నవ్వులతో భాగ్యనగరాన్ని దేదీప్యమానంగా వెలిగించవచ్చు’ అని కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ చిన్నారులనుద్దేశించి అన్నారు. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం శనివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో వైభవంగా ప్రారంభమైంది. ఇందులో రాజ్యవర్ధన్ మాట్లాడుతూ... ‘బాలల నవ్వులు చూస్తుంటే మాన్స్టర్ సినిమా గుర్తుకు వస్తోంది. అందులో నవ్వులతో విద్యుచ్ఛక్తిని తయారు చేయడం కథాంశం. ఇక్కడ చేరిన మీ అందరి నవ్వుల్లో అలా ఓ అద్భుతమైన వెలుగు ఉద్భవిస్తోంది. హైదరాబాద్‌ను బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా మార్చే ఆలోచనలో ఉన్నాం. పిల్లలంతా ఈ ఉత్సవంలో పాల్గొని మధుర జ్ఞాపకాలతో ఇంటికి వెళ్లాలి. ప్రపంచమంతా ఆశావహ దృక్పథంలో సినిమాలు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు. 7 రోజులు... 400 చిత్రాలు... రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... ‘ఈ చిత్రోత్సవాలకు వేదికగా నగరాన్ని తరచూ ఎంపిక చేయడం సంతోషం కలిగిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా 14 థియేటర్లలో ఏడు రోజుల పాటు 400 చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సవాలుగా తీసుకొని నిర్వహిస్తోంది. 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. సినీ నిర్మాతలకు అవసరమైన సదుపాయాలన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుంది’ అన్నారు. చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) చైర్మన్ ముకేష్‌ఖన్నా మాట్లాడుతూ... ‘మిమ్మల్ని చూస్తుంటే 1997లో నేను నటించిన శక్తిమాన్ ధారావాహికలోని పాటలో వసుైధైక కుటుంబం గుర్తుకు వస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులంతా కలసి ఈ ఉత్సవాన్ని ఆస్వాదించాలని కోరుకొంటున్నా’ అన్నారు. ప్రముఖ నటి టబూ మాట్లాడుతూ... ‘నాకు ఇష్టమైన నగరంలో ఈ అద్భుత వేడుక జరగడం ఆనందంగా ఉంది. నా కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది. అందుకే హైదరాబాద్ ఎప్పుడూ నాకు స్పెషలే’ అని చెప్పారు. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ మాట్లాడుతూ... ‘నాకు ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్. సోదరి కరిష్మాకపూర్ కుమార్తె నటించిన బీ హ్యాపీ షార్ట్ ఫిల్మ్ ఈ పోటీలో ఉండటం ఒక కారణమైతే... బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలను ఒకే చోట కలుసుకోవడం మరో కారణం’ అన్నారు. కేంద్ర సమాచార శాఖ సినిమా విభాగం డెరైక్టర్ దీపక్ కుమార్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పర్యాటకాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కిషన్‌రావు, సీఎఫ్ఎస్ఐ కార్యనిర్వహణాధికారి శ్రవణ్‌కుమార్, ఐ అండ్ పీఆర్ సెక్రటరీ సునీల్ అరోరా పాల్గొన్నారు. -
బాలల చిత్రోత్సవం అద్భుతం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల పాటు రాష్ట్ర రాజధాని వేదికగా లక్షలాది విద్యార్థులు, విదేశీ అతిథులకు ఆనందాన్ని పంచిన 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన భార్య విమలా నరసింహన్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ, సినీ నటుడు పవన్‌కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన వాటికి ప్రముఖుల చేతుల మీదుగా బంగారు ఏనుగులను(గోల్డెన్ ఎలిఫెంట్) ప్రదానం చేశారు. ఈనెల 14 నుంచి మొదలైన బాలల చలనచిత్రోత్సవాలు 48 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు మంచి అనుభూతులను మిగిల్చాయని ప్రముఖులు పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, ప్రాంతాలకు అతీతంగా యువతీ, యువకులు వారి బాధలు, సంతోషాలు, ఆశలు, ఆశయాలను చిత్రాల రూపంలో పిల్లల ముందు అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. ఇంతటితో ఆగిపోకుండా మరింత ముందుకు సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఉత్సవం సందర్భంగా లక్ష మందికిపైగా చిన్నారులు చిత్రాలను చూశారని మంత్రి డీకే అరుణ తెలిపారు. చిత్ర ప్రదర్శనలే కాకుండా పిల్లల హక్కులు, లింగ వివక్ష తదితర అంశాలపై చర్చాగోష్టులు కూడా నిర్వహించామని ఉత్సవ కమిటీ సంచాలకులు, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించడం తనకు సంతోషంగా ఉందని నటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సీఎస్ మహంతి, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్.శివశంకర్, మేనేజింగ్ డెరైక్టర్ దాన కిశోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వీఐపీ గ్యాలరీలో కూర్చు న్న ఒక వ్యక్తి ‘జై సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని నినాదాలు చేశారు. పోలీసులు ఆయనను బయటకు తీసుకెళ్లడంతో గందరగోళం సద్దుమణిగింది. బంగారు ఏనుగు, ఫలకాలు అందుకున్న చిత్రాలు లిటిల్ డెరైక్టర్స్ విభాగం: ఉత్తమ చిన్నారి దర్శకుడు: బ్రేకింగ్ ది సెలైన్స్, టమాటర్ చోర్ రెండో ఉత్తమ చిన్నారి దర్శకుడు: ఎకోల్ మోండియెల్ వరల్డ్ స్కూల్, పూల్వతి అమ్మ ఉత్తమ చిన్నారి దర్శకుడు (జ్యూరీ స్పెషల్): 1. ది ట్రిక్, 2. అవర్ బిట్, 3. గివ్ మీ ఏ ఛాన్స్ ఇంటర్నేషనల్ లఘు చిత్రాల విభాగంలో ఉత్తమ లఘు చిత్రం: చింటి, రష్యా రెండో ఉత్తమ లఘు చిత్రం: నూడుల్ ఫిష్, చిన్నారుల జ్యూరీ: తమాష్, భారత్ ప్రత్యేక ఎంపిక: మై షూస్ యానిమేషన్ విభాగం ఉత్తమ యానిమేషన్ ఫీచర్: ఎర్నెస్ట్ ఈటీ సెలస్టిన్ రెండో ఉత్తమ యానిమేషన్ ఫీచర్: జరాఫా బెస్ట్ ఆర్ట్ వర్క్(జ్యూరీ బహుమతి): గోపీ గవయ్యా బాఘా భజయ్యా, భారత్ స్పెషల్ జ్యూరీ అవార్డు: మూన్ మ్యాన్ ఉత్తమ యానిమేషన్ ఫీచర్( చిన్నారుల జ్యూరీ): అర్జున్ లైవ్ యాక్షన్ విభాగం ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్: కౌబాయ్, డచ్ రెండో ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్: ఎ హార్స్ అన్ ద బాల్కనీ ఉత్తమ లైవ్ యాక్షన్ డెరైక్టర్: బతుల్ ముక్తియార్(కఫాల్ సినిమా డెరైక్టర్) ఉత్తమ లైవ్ యాక్షన్ స్క్రీన్‌ప్లే : నోనో ది జిగ్ జాగ్ కిడ్ ఉత్తమ లైవ్ యాక్షన్ ఫీచర్ (చిన్నారుల జ్యూరీ): ది హార్స్ ఆన్ ది బాల్కనీ బెస్ట్ సినిమాటోగ్రఫీ (చిన్నారుల జ్యూరీ): విండ్ స్ట్రాం ఉత్తమ సందేశాత్మక చిత్రం (చిన్నారుల జ్యూరీ): మదర్ ఐ లవ్ యూ -
ముగిసిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం
రాష్ట్ర రాజధానిలో వారం రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం బుధవారం ముగిసింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో 48 దేశాలకు చెందిన దాదాపు 200 చిత్రాలను ప్రదర్శించారు. బాలల చిత్రోత్సవంలో ప్రదర్శించినవాటిలో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఉత్తమ చిత్రంగా బ్రేకింగ్ ది సైలెన్స్, టమోటో చోర్ను ఎంపిక చేశారు. షార్ట్ ఫిలిం డివిజన్లో తొలి ఉత్తమ చిత్రంగా చింటి, రెండో ఉత్తమ చిత్రంగా ఓమోగియా నిలిచాయి. జ్యూరీ అవార్డు మై ష్యూస్ దక్కించుకోగా.. యానిమేషన్ విభాగంలో ఏమెస్ట్ సెల్సిలైన్, జరాఫా ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. -
బాలల సినిమాలకు ప్రాధాన్యం: సీఎం కిరణ్
18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో సీఎం కిరణ్ వచ్చే చిత్రోత్సవానికి మౌలిక వసతుల కల్పన సాక్షి, హైదరాబాద్: బాలల చలనచిత్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ నిధులు కేటాయించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ లలితాకళాతోరణంలో జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఇప్పటికే భూమి కేటాయించామని, ఇకపై ఈ వేడుకలకు శాశ్వత వేదికను ఏర్పాటు చేయడానికి మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి రంగంలోనూ పోటీ పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని చిన్నారులు అద్భుతంగా నటించి మంచి సినిమాలు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. దేశ జనాభాలో 25 ఏళ్ల లోపు వారే ఎక్కువమంది ఉన్నారని, యువకులు అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. ప్రతి చిన్నారినీ తల్లిదండ్రులు బడికి పంపాలని, వంద శాతం అక్షరాస్యత ఉన్నప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగవచ్చని సీఎం చెప్పారు. సృజనాత్మక సినిమాలు రావాలి: మనీష్ తివారీ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం హైదరాబాద్‌లో జరగడం అదృష్టమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు. బాలల సినిమాల్లో సృజనాత్మకత ఉండాలని, అది భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, అందుకే అన్ని తరాల వారిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. బాలల సినిమాలు ప్రదర్శనకు మాత్రమే కాకుండా, వాటిలో బాలల హక్కులు, సంస్కృతి, సంప్రదాయం, గౌరవం అన్నీ ప్రతిబింబించాలని అన్నారు. ప్రపంచస్థాయి సినిమాలకు వేదిక: డీకే అరుణ హైదరాబాద్ ప్రపంచ స్థాయి బాలల సినిమాల ప్రదర్శనకు వేదికైందని, వారం రోజుల పాటు ఈ సినిమాలు చూసే అవకాశం చిన్నారులకు దక్కిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. హైదరాబాద్ నగరం గాజులకు, బిర్యానీకి ఎంత ప్రసిద్ధి చెందిందో బాలల చలన చిత్రోత్సవానికీ అంతే ప్రసిద్ధి అని అన్నారు. బాలల చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రకృతిమిత్ర సావనీర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, దర్శకుడు గుల్జార్, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రాణా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ దానకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తారే జమీన్ పర్ సినిమాలో అద్భుతంగా నటించిన బాలనటుడు దర్శిల్ సఫారి వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందాలి: సీఎం కిరణ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులు అభివృద్ధి బాటలో పయనించాలని సీఎం కిరణ్‌కుమార్ సూచించారు. విద్య కేవలం ఉద్యోగం కోసమే కాదని ఉద్బోధించారు. జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల కార్యక్రమంలో కిరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవితంలో ప్రతి సందర్భంలోనూ సరైన కీలక నిర్ణయం తీసుకునేందుకు విద్య తోడ్పడుతుందని తెలిపారు. సమీకృత శిశు సంక్షేమ అభివృద్ధి పథకానికి అదనంగా రూ.77 కోట్లు, హైదరాబాద్‌లోని జవహర్ బాల భవన్ అభివృద్ధికి రూ.4 కోట్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, శైలజానాథ్, ముఖేష్‌గౌడ్, పితాని సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది నిర్వహించే 18వ బాలల చిత్రోత్సవ వేడుకలను చిల్డ్రన్స్ డే అయిన నవంబర్ 14న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిశాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేడుకలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. నవంబర్ 14న ప్రారంభమయ్యే ఈ చిత్రోత్సవం 20 వరకూ కొనసాగుతుందని వివరించారు.