చిన్నారితో కలిసి డాన్స్ చేస్తున్న కరీనా, కరిష్మా కపూర్
♦ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్
♦ ఆర్భాటంగా ప్రారంభమైన బాలల చిత్రోత్సవం
సాక్షి, హైదరాబాద్: ‘మీ నవ్వులతో భాగ్యనగరాన్ని దేదీప్యమానంగా వెలిగించవచ్చు’ అని కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ చిన్నారులనుద్దేశించి అన్నారు. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం శనివారం మాదాపూర్ శిల్పకళా వేదికలో వైభవంగా ప్రారంభమైంది. ఇందులో రాజ్యవర్ధన్ మాట్లాడుతూ... ‘బాలల నవ్వులు చూస్తుంటే మాన్‌స్టర్ సినిమా గుర్తుకు వస్తోంది. అందులో నవ్వులతో విద్యుచ్ఛక్తిని తయారు చేయడం కథాంశం. ఇక్కడ చేరిన మీ అందరి నవ్వుల్లో అలా ఓ అద్భుతమైన వెలుగు ఉద్భవిస్తోంది. హైదరాబాద్‌ను బాలల చిత్రోత్సవాలకు శాశ్వత వేదికగా మార్చే ఆలోచనలో ఉన్నాం. పిల్లలంతా ఈ ఉత్సవంలో పాల్గొని మధుర జ్ఞాపకాలతో ఇంటికి వెళ్లాలి. ప్రపంచమంతా ఆశావహ దృక్పథంలో సినిమాలు రావాలని ఆకాంక్షిస్తున్నా’ అన్నారు.
7 రోజులు... 400 చిత్రాలు...
రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... ‘ఈ చిత్రోత్సవాలకు వేదికగా నగరాన్ని తరచూ ఎంపిక చేయడం సంతోషం కలిగిస్తోంది. ఈ ఉత్సవంలో భాగంగా 14 థియేటర్లలో ఏడు రోజుల పాటు 400 చిత్రాలను ప్రదర్శిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం సవాలుగా తీసుకొని నిర్వహిస్తోంది. 400 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు. సినీ నిర్మాతలకు అవసరమైన సదుపాయాలన్నింటినీ ప్రభుత్వం కల్పిస్తుంది’ అన్నారు.
చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్‌ఎస్‌ఐ) చైర్మన్ ముకేష్‌ఖన్నా మాట్లాడుతూ... ‘మిమ్మల్ని చూస్తుంటే 1997లో నేను నటించిన శక్తిమాన్ ధారావాహికలోని పాటలో వసుైధైక కుటుంబం గుర్తుకు వస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులంతా కలసి ఈ ఉత్సవాన్ని ఆస్వాదించాలని కోరుకొంటున్నా’ అన్నారు. ప్రముఖ నటి టబూ మాట్లాడుతూ... ‘నాకు ఇష్టమైన నగరంలో ఈ అద్భుత వేడుక జరగడం ఆనందంగా ఉంది. నా కెరీర్ ఇక్కడే ప్రారంభమైంది. అందుకే హైదరాబాద్ ఎప్పుడూ నాకు స్పెషలే’ అని చెప్పారు. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ మాట్లాడుతూ... ‘నాకు ఈ ఫెస్టివల్ చాలా స్పెషల్. సోదరి కరిష్మాకపూర్ కుమార్తె నటించిన బీ హ్యాపీ షార్ట్ ఫిల్మ్ ఈ పోటీలో ఉండటం ఒక కారణమైతే... బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలను ఒకే చోట కలుసుకోవడం మరో కారణం’ అన్నారు.
కేంద్ర సమాచార శాఖ సినిమా విభాగం డెరైక్టర్ దీపక్ కుమార్, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్, పర్యాటకాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కిషన్‌రావు, సీఎఫ్‌ఎస్‌ఐ కార్యనిర్వహణాధికారి శ్రవణ్‌కుమార్, ఐ అండ్ పీఆర్ సెక్రటరీ సునీల్ అరోరా పాల్గొన్నారు.