బీజేపీ గూటికి కిరణ్..?
- కేంద్రమంత్రి వెంకయ్యతో మాజీ సీఎం కిరణ్ చర్చలు
- జేఎస్పీని బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జేఎస్పీ అధినేత ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధమయ్యారా? బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమయ్యారా? కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడుతో జరిపిన మంత్రాం గం ఫలిస్తే.. పక్షం రోజుల్లోనే కాషాయదళంలోకి కిరణ్ చేరనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి జేఎస్పీ వర్గాలు..
చివరి బంతి వరకూ వేచి చూడండి, రాష్ట్ర విభజనను ఆపుతానంటూ అప్పటి సీఎం కిరణ్ ప్రగల్భాలు పలికిన విషయం విదితమే. తనకు తాను సమైక్య సింహం.. చాంపియన్‌గా అభివర్ణించుకున్న కిరణ్ రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నాక.. సీఎం పదవికి రాజీనామా చేసి జారుకున్నారు. ఆ తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీ స్థాపించారు. ప్రజలు విశ్వసించి జేఎస్పీకి ఓట్లేసి కాస్తోకూస్తో సీట్లను కట్టబెడితే.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి బాగుంటే, ఆపార్టీ అధిష్టానానికి షరతులు పెట్టి పార్టీని విలీనం చేసేలా కిరణ్ అప్పట్లో ప్రణాళిక రచించారనే అభిప్రాయం క్రమంలోనే ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్ర విభజనను ఆపుతానంటూ ఊరువాడ ప్రచారం చేశారు.
విజయంపై ధీమా లేని కిరణ్ తాను స్థాపించిన పార్టీ తరఫున పోటీ చేయకుండా ఆదిలోనే కాడి దించారు. తాను ప్రాతినిథ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలోనూ కిరణ్ పోటీచేయలేదు. పీలేరు నుంచి ఆయన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి జేఎస్పీ తరఫున బరిలోకి దిగారు. రాష్ట్రంలో పీలేరు మినహా ఏ ఒక్క చోట కూడా జేఎస్పీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కిన దాఖలాలు లేవు.
ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కిరణ్ తెరమరుగయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కన్పించకపోవడమే అందుకు తార్కాణం. కాంగ్రెస్ పార్టీ కూడా అటు దేశంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ పూర్తిగా బలహీనపడింది. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది.
రాష్ట్రంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కిరణ్ తన వ్యూహాన్ని మార్చారు. జేఎస్పీని కాంగ్రెస్‌లో కాకుండా బీజేపీలో విలీనం చేసి, ఆపార్టీలో కీలకపాత్ర పోషించడం ద్వారా రాజకీయంగా పునర్‌వైభవం సాధించాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. బలమైన నేతలను కాషాయదళంలో చేర్చుకోవడానికి బీజేపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు.
ఇది పసిగట్టిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి, బీజేపీ జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడుతో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డితోనూ కిరణ్ చర్చలు జరిపారు. తనను బీజేపీలో చేర్చుకుని.. ప్రాధాన్యం ఇస్తే జేఎస్పీని విలీనం చేస్తానని వెంకయ్యనాయుడు వద్ద ప్రతిపాదించినట్లు కిరణ్ అనుయాయులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని కిరణ్‌కు వెంకయ్య హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదే అంశంపై పీలేరు నియోజకవర్గంలోని తనకు సన్నిహితులైన నేతలకు కిరణ్ చెప్పినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ అధిష్ఠానం పచ్చజెండా ఊపడమే తరువాయి.. జేఎస్పీని ఆపార్టీలోకి విలీనం చేయడానికి కిరణ్ సిద్ధమైపోయారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచిన బీజేపీలోకి సమైక్య చాంపియన్‌గా అభివర్ణించుకున్న కిరణ్ ఇప్పుడు చేరడానికి అర్రులు చాస్తోండటం గమనార్హం.