సీపీఎం కేంద్ర కమిటీ నేత శ్రీనివాసరావు డిమాండ్
ఒంగోలు టౌన్ : ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించలేదు. ఇటీవల ప్రకటించిన ఆర్థిక, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంయమనం పాటిం చాలంటూ మభ్యపెడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. చంద్రబాబునాయుడు-నరేంద్రమోదీల మధ్య ఏదో లాలూచీ ఉంది.
అదేంటో వెంటనే బయటపెట్టాలి’ అని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సీపీఎం అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తోంది.
రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేంద్రంలో చేరిన తరువాత నిధులన్నీ మనకే వస్తాయంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నారు’ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు అంజయ్య, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ హనీమూన్ పిరియడ్ ముగిసింది
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసింది. ఇక ముళ్ల కిరీటం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ రెండు చెంపలు వాచిపోయేలా ప్రజలు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అంత సానుకూల పరిస్థితులు ఉండవన్నారు.
వెంకయ్యనాయుడు తెలివి తక్కువ దద్దమ్మ...
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలివి తక్కువ దద్దమ్మ అని శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే, వెంకయ్యనాయుడు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఫుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడేమో ఐదేళ్ల ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా దాటవేస్తూ అసలుకే మోసం వచ్చేలా చేస్తున్నారన్నారు.
బాబు-మోదీల మధ్య లాలూచీ బయటపెట్టాలి
Published Fri, Mar 6 2015 3:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement