వైఎస్సార్‌సీపీలోకి బీజేపీ నాయకులు
కండువా కప్పి ఆహ్వానించిన భూమన
తిరుపతి (అలిపిరి): తిరుపతి నగర బీజేపీకి చెందిన 35 మంది నాయకులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆదివారం సాయంత్రం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భూమన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాను కప్పి సాద ర స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీలోకి చేరిన వారిలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు పెనగడ్డం జాషువా, కార్యదర్శి తమ్మంపల్లి జగదీష్, బీజేవైఎం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కేశవుల వెంకటేష్ రెడ్డి, బీజేపీ ఓబీసీ తిరుపతి ఇన్‌చార్జ్ కఠారి వినోద్‌రెడ్డి, తిరుపతి 13వ వార్డు అధ్యక్షుడు పెనగడ్డం హరిప్రసాద్, 47వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఎం. లక్ష్మీ, 49వ వార్డు ఉపాధ్యక్షుడు ఎస్.కె. బాషా, వెంకటేష్, రాజశేఖర్, కిరణ్, కె. వినోద్, వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన బీజేపీ నగర కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నేరవేర్చలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే జగన్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నగరంలో వైఎస్‌ఆర్‌సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
కులరాజకీయాలు చేయడం బాబుకే చెల్లు: భూమన
ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం కులాల మధ్య చిచ్చుపెడుతూ కుల రాజకీయాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తరువాత హామీలను మాఫీ చేశారన్నారు. సోషల్ మీడియాలో జగన్‌పై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం నీతిమాలిన చర్యఅని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాజేంద్ర, యుగంధర్, బాలిశెట్టి కిషొర్ తదితరులు పాల్గొన్నారు.