పేలవంగా కిరణ్ ప్రచారం
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన పేలవంగా సాగింది. ఆయన ప్రసంగాలు ఎక్కడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజైన గురువారం ఆయన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు మూడు, నాలుగు వందల మందికి మించి ప్రజలు హాజరు కాకపోవడం జేఎస్పీ అధినేత కిరణ్‌ను, అభ్యర్థులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. హైదరాబాద్ నుంచి కిరణ్ కుమార్‌రెడ్డి విమానంలో మధురపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో జరిగిన సభకు హాజరయ్యారు. ఈ సభకు 200 మందికి మించి జనం హాజరు కాలేదు.
దాంతో కిరణ్‌తోపాటు పార్టీ ఉపాధ్యక్షుడు ఉండవిల్లి అరుణ్‌కుమార్, అమలాపురం పార్లమెంట్ పార్టీ అభ్యర్థి జి.వి.హర్షకుమార్ డీలా పడ్డారు. తరువాత మండపేట కలువపువ్వు సెంటరు, రావులపాలెం మార్కెట్ రోడ్డు సెంటరు, పి.గన్నవరం మూడు రోడ్ల జంక్షన్, అమలాపురం గడియారస్తంభం సెంటర్లలో జరిగిన సభలకు సైతం జనం హాజరు అంతంతమాత్రంగానే ఉంది. జనసేకరణకు అభ్యర్థులు డబ్బులు బాగా ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా ఇతర నాయకుల ప్రసంగాలు మొక్కుబడిగా సాగాయి. వారి ప్రసంగాలకు పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టిన తెలంగాణ బిల్లును కోర్టు కొట్టివేస్తుందని కిరణ్ చెప్పుకొచ్చారు. మరోసారి బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోను పెట్టాల్సి వస్తుందని, దానిని అడ్డుకునేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. విభజన పాపం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లదేనని, చెప్పు గుర్తుకు ఓటు వేసి వారికి బుద్దిచెప్పాలని కోరారు. పార్టీ అభ్యర్థులు హేమా సయ్యద్, తలాటం వీరరాఘవులు, కె.వి. సత్యనారాయణరెడ్డి, జి.వి. శ్రీరాజ్, మత్తి జయప్రకాష్, నెల్లి కిరణ్‌కుమార్, టి.స్వామినాయకర్ పాల్గొన్నారు.