jai samikyandhra party
-
సీమాంధ్రలో జేఎస్పీ, లోక్‌సత్తాకు ఘోర పరాభవం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), లోక్‌సత్తా పార్టీలకు సీమాంధ్రలో ఘోర పరాభవం ఎదురైంది. సీమాంధ్రలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కనీసం ఒక్కచోటన్నా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ఈ రెండు పార్టీల నేతలు ఫలితాలు చూసి కంగుతిన్నారు. సీమాంధ్రలో మొత్తం 152 అసెంబ్లీ స్థానాల్లో జేఎస్పీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా మరో 18 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు మద్దతు తెలిపారు. అయితే సీమాంధ్రలో జేఎస్పీ తరపున బరిలో నిలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ గెలవకపోవడంతో జేఎస్పీ అధినేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నీరుగారిపోయారు. గెలుస్తారని భావించిన అమలాపురం లోక్‌సభ అభ్యర్థి జీవీ హర్షకుమార్‌తోపాటు విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాల పరిధిలోని పలువురు అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఓటమి పాలవడంతో ఆయన పూర్తిగా డీలాపడ్డారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి తన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని భావించిన ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. మరోవైపు లోక్‌సత్తా పార్టీ శ్రేణుల్లోనూ నిరుత్సాహం అలుముకుంది. సీమాంధ్రలోని 75 అసెంబ్లీ స్థానాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడగా.. కనీసం ఒక్కచోటన్నా గెలవలేదు. అంతేగాక ఎక్కడా 5 వేలకు మించి ఓట్లు కూడా రాలేదు. ప్రజల తీర్పు శిరోధార్యమంటూ ఆ పార్టీ నేతలు అభ్యర్థులకు సర్దిచెప్పారు. -
డబ్బులు కుమ్మరిస్తున్నారు
ఓటర్లకు నోట్ల పంపిణీలో టీడీపీ నేతలు తలమునకలు కుప్పంలో ఓటుకు ఐదు వందలు అత్యధికంగా తిరుపతి, చిత్తూరులో వెయ్యి నుంచి రెండు వేలు పంపిణీ పీలేరులో వెయ్యి రూపాయలు అందజేస్తున్న జై సమైక్యాంధ్ర అభ్యర్థి తంబళ్లపల్లె, నగరిలో టీడీపీ కార్యకర్తల నుంచి డబ్బు స్వాధీనం సాక్షి, తిరుపతి: ప్రలోభాల పర్వానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు 24 గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓట్ల కొనుగోలుకు సర్వశక్తులు వినియోగిస్తోంది. జిల్లాలో కీలకమైన కుప్పం, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో సోమవారం నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు పంపకాలు సాగిస్తోంది. మద్యం ఏరులై ప్రవహింపజేస్తోంది. పలు చోట్ల టీడీపీ కార్యకర్తల నుంచి డబ్బు, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి తరఫున విచ్చలవిడిగా ఓటర్లను కొనుగోలుచేసే పనిలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓటు రేటు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు నిర్ణయించారు. ఇంటింటికి వెళుతున్న కార్యకర్తలు ఓటరు స్లిప్పులు చూపించిన వారికి డబ్బులు అందజేస్తున్నారు. ప్రమాదకరమైన మద్యం పంపిణీ జరుగుతోంది. కుప్పం ఎన్టీఆర్ కాలనీ సమీపంలో గుట్టల్లో దాచి ఉంచిన 132 క్వార్టర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. ఈ మద్యాన్ని బాటిళ్లలో కాకుండా జ్యూస్ ప్యాకెట్లలో నిల్వ చేసి ఉంచడం గమనార్హం. శాంతిపురం మండలంలో ఒకరి నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం, కుప్పంలో లభ్యమైన మద్యం ఒకటేనని పోలీసులు తేల్చారు. దీంతో నియోజకవర్గం మొత్తం మద్యం పంపిణీ జరిగినట్టు తెలుస్తోంది. మద్యం శాంపిళ్లను లేబొరేటరీకి పంపినట్టు అధికారులు వెల్లడించారు. పలమనేరు నియోజకవర్గం పరిధిలో సముద్రపల్లె గ్రామంలో టీడీ పీ యువనేత ఒకరి పొలంలో దాచిపెట్టిన 87 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యువనేత సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపంజాణి మండలంలో 40 కేసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే నియోజకవర్గంలోని భద్రాచలం వద్ద 1400 క్వార్టర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్త షబ్బీర్ కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకొస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో టీడీపీ కార్యకర్త ఒకరు దాచిఉంచిన రూ. 39.5 లక్షలు పోలీసులకు పట్టుబడింది. ఈ నియోజకవర్గంలో ఓటుకు ఐదు వందల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు. మదనపల్లెలో బీజేపీ అభ్యర్థి తరఫున ఐదు వందలు అందజేస్తున్నట్టు సమాచారం. పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్ధి తరఫున ప్రాంతాలవారీగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల పంపిణీ జరుగుతోంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు ఓటుకు మూడు వందలు పంపిణీ చేస్తూ పది కిలోల బియ్యం ప్యాకెట్ అందజేస్తామని హామీ ఇస్తున్నారు. చిత్తూరులో కొన్నిచోట్ల వెయ్యి, మరికొన్నిచోట్ల రెండు వేల రూపాయలు కూడా ఇస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో మద్యం బాటిల్‌తో పాటు వెయ్యి రూపాయలు వంతున అందజేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో టీడీపీ కార్యకర్త ఒకరి నుంచి లక్షా 80 వేల రూపాయలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. సీతారామపురం గ్రామంలో దినకర్‌నాయుడు అనే కార్యకర్త నుంచి లక్ష రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ ఓటుకు ఐదు వందల వంతున పంపిణీ జరుగుతోంది. తిరుపతి టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు ధర నిర్ణయించింది. కొన్నిచోట్ల వెండి కుంకుమభరిణలు పంపిణీచేస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో మద్యం తీసుకువెళ్తున్న టీడీపీ సర్పంచ్ భర్త ఒకరి నుంచి ఐదు కేసుల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. -
పేలవంగా కిరణ్ ప్రచారం
అమలాపురం, న్యూస్‌లైన్ : జిల్లాలో జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన పేలవంగా సాగింది. ఆయన ప్రసంగాలు ఎక్కడా ప్రజలను ఆకట్టుకోలేకపోయాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజైన గురువారం ఆయన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు మూడు, నాలుగు వందల మందికి మించి ప్రజలు హాజరు కాకపోవడం జేఎస్పీ అధినేత కిరణ్‌ను, అభ్యర్థులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. హైదరాబాద్ నుంచి కిరణ్ కుమార్‌రెడ్డి విమానంలో మధురపూడి చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన నేరుగా రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామలో జరిగిన సభకు హాజరయ్యారు. ఈ సభకు 200 మందికి మించి జనం హాజరు కాలేదు. దాంతో కిరణ్‌తోపాటు పార్టీ ఉపాధ్యక్షుడు ఉండవిల్లి అరుణ్‌కుమార్, అమలాపురం పార్లమెంట్ పార్టీ అభ్యర్థి జి.వి.హర్షకుమార్ డీలా పడ్డారు. తరువాత మండపేట కలువపువ్వు సెంటరు, రావులపాలెం మార్కెట్ రోడ్డు సెంటరు, పి.గన్నవరం మూడు రోడ్ల జంక్షన్, అమలాపురం గడియారస్తంభం సెంటర్లలో జరిగిన సభలకు సైతం జనం హాజరు అంతంతమాత్రంగానే ఉంది. జనసేకరణకు అభ్యర్థులు డబ్బులు బాగా ఖర్చుపెట్టినా ఫలితం లేకుండా పోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా ఇతర నాయకుల ప్రసంగాలు మొక్కుబడిగా సాగాయి. వారి ప్రసంగాలకు పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్ర విభజన ఇంకా జరగలేదని, పార్లమెంట్ ఉభయ సభల్లో పెట్టిన తెలంగాణ బిల్లును కోర్టు కొట్టివేస్తుందని కిరణ్ చెప్పుకొచ్చారు. మరోసారి బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లోను పెట్టాల్సి వస్తుందని, దానిని అడ్డుకునేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థులను పార్లమెంట్‌కు పంపాలని పిలుపునిచ్చారు. విభజన పాపం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లదేనని, చెప్పు గుర్తుకు ఓటు వేసి వారికి బుద్దిచెప్పాలని కోరారు. పార్టీ అభ్యర్థులు హేమా సయ్యద్, తలాటం వీరరాఘవులు, కె.వి. సత్యనారాయణరెడ్డి, జి.వి. శ్రీరాజ్, మత్తి జయప్రకాష్, నెల్లి కిరణ్‌కుమార్, టి.స్వామినాయకర్ పాల్గొన్నారు. -
నేడు హైదరాబాద్‌లో కిరణ్ రోడ్‌షో
సాక్షి, హైదరాబాద్: జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించనున్నారు. కృష్ణానగర్, జూబ్లీహిల్స్, నేరేడ్మెట్ చౌరస్తా, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ప్రగతినగర్, బాచుపల్లి ప్రాంతాల్లో ఆయన రోడ్‌షో ద్వారా ప్రసంగించేందుకు జేఎస్పీ నేతలు ఏర్పాట్లు చేశారు.