సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ(జేఎస్పీ), లోక్‌సత్తా పార్టీలకు సీమాంధ్రలో ఘోర పరాభవం ఎదురైంది. సీమాంధ్రలో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కనీసం ఒక్కచోటన్నా గెలుస్తామని ఆశలు పెట్టుకున్న ఈ రెండు పార్టీల నేతలు ఫలితాలు చూసి కంగుతిన్నారు. సీమాంధ్రలో మొత్తం 152 అసెంబ్లీ స్థానాల్లో జేఎస్పీ అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా మరో 18 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు మద్దతు తెలిపారు. అయితే సీమాంధ్రలో జేఎస్పీ తరపున బరిలో నిలిచిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ గెలవకపోవడంతో జేఎస్పీ అధినేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నీరుగారిపోయారు.
గెలుస్తారని భావించిన అమలాపురం లోక్‌సభ అభ్యర్థి జీవీ హర్షకుమార్‌తోపాటు విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాల పరిధిలోని పలువురు అసెంబ్లీ అభ్యర్థులు సైతం ఓటమి పాలవడంతో ఆయన పూర్తిగా డీలాపడ్డారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లాలోని పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి తన సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి గెలుపు ఖాయమని భావించిన ఆయనకు తీవ్ర నిరాశే ఎదురైంది. మరోవైపు లోక్‌సత్తా పార్టీ శ్రేణుల్లోనూ నిరుత్సాహం అలుముకుంది. సీమాంధ్రలోని 75 అసెంబ్లీ స్థానాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడగా.. కనీసం ఒక్కచోటన్నా గెలవలేదు. అంతేగాక ఎక్కడా 5 వేలకు మించి ఓట్లు కూడా రాలేదు. ప్రజల తీర్పు శిరోధార్యమంటూ ఆ పార్టీ నేతలు అభ్యర్థులకు సర్దిచెప్పారు.
సీమాంధ్రలో జేఎస్పీ, లోక్‌సత్తాకు ఘోర పరాభవం
Published Sat, May 17 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement
Advertisement