అభిప్రాయం
గతంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్న రోజుల్లో, ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అనే నినాదం గోడల మీద విస్తృతంగా దర్శనం ఇచ్చేది. ఆ నినాదం నిజమైందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రపంచంలో ఉన్న ఒక వర్గం ‘మేధావులంతా ఏకం కండి!’ అనే నినాదాన్ని అంది పుచ్చుకొని వాళ్లంతా ఏకమవుతూ తమ సర్వశక్తుల్నీ ఒడ్డుతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అలియాస్ జేపీ హైదరాబాదు నుంచి విజయవాడ విచ్చేసి, ప్రెస్‌మీట్ పెట్టి తన మద్దతు ఎన్డీయే కూటమికే అంటూ దానికి బహు నిర్వచనాలు ప్రవ చించారు.
అంతటితో ఆగకుండా ‘గాంధీ మహాత్ముడు, అంబేడ్కర్‌లకు కులం అంటగడతామా?’ అంటూ పరోక్షంగా తను కూడా అంతటి మహాత్ము డినే అని ప్రకటించుకున్నారు. అక్కడే చంద్రబాబుతో అంటకాగడంలో అపరాధ భావం ప్రస్ఫుట మవుతోంది. ఇంకా త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి పంతులు పేర్లు కూడా ఉటంకించారు. అసలు ఆయన మాట్లాడేదానికీ, ప్రస్తుత రాజకీయాలకూ; నాటి సంఘ సంస్కర్తలూ, భాషా వేత్తలైన త్రిపురనేని, గిడుగులకు సంబంధం ఏంటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. ఈ జేపీ లోక్‌సత్తా పార్టీని ఎప్పుడో చుట్ట చుట్టే శారు. లోక్ సత్తా ఇకపై రాజకీయ పార్టీ కాదని ప్రకటించేశారు కూడా! అయితే, చంద్రబాబు కోసం అర్జెంటుగా మళ్లీ పార్టీని వెలుగులోకి తెచ్చారు కాబోలు!
నిజానికి ఈ పార్టీ పుట్టుక పరిశీలిస్తే, ఒక దశలో చంద్రబాబు నాయుడుతో రామోజీరావుకి తేడాలు వచ్చి, ‘‘నేను కింగ్ మేకర్‌ని. ఎన్టీఆర్ నుంచి పీఠాన్ని అప్పజెప్పింది నేను. అటువంటిది నాకే ‘మింగుడు పడకపోతే’ ఎలా? మీలాంటి వాడిని జాతీయ స్థాయిలో మరొకడిని తయారుచేస్తా!’’ అని ఈ జేపీని తెర మీదకు లోక్‌సత్తా పేరుతో తీసుకురావ డంలో రామోజీరావు కీలక పాత్ర వహించారని అంటారు పరిశీలకులు. అందుకే కాబోలు! అప్పట్లో ‘ఈనాడు’లో జేపీ వార్తలు పుంఖానుపుంఖాలుగా వచ్చేవి.
ఆ పబ్లిసిటీ ప్రభావంతో విద్యావంతులు చాలా మంది లోక్‌సత్తా పట్ల ఆకర్షితులయ్యారు. అయితే జేపీ ‘హై వోల్టేజ్ యారగెన్సీ’కి షాక్ అయి స్వల్పకాలంలోనే జారుకున్నారు. జేపీని ఒకసారి గెలిపించిన హైదరాబాద్ కుకట్‌పల్లి ప్రజలు కూడా అతడి మేధా అహంకారానికి బెదిరిపోయారు. కాగా, మల్కాజ్‌గిరిలో మైండ్ బ్లాక్ అయ్యే జవాబు ఇచ్చారు జనం. దాంతో రాజకీయాలకు దూరంగా తన మేధాతనాన్ని అప్పుడప్పుడు మాత్రమే ప్రదర్శిస్తూ రోజులు గడుపుతున్నారు జేపీ.
ఎంతైనా పబ్లిసిటీకి అలవాటైన ప్రాణం కదా! పైగా తను పేద్ద లౌకిక వాదినని కూడా చాటుకోవాలయ్యె! అందుకే, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, ఒకసారి పవన్ కల్యాణ్‌తో కలిసి ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ అంటూ నాలుగు రోజులు హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయి పోయారు. ఆ మధ్య జగన్ ప్రభుత్వంలో పథకాలను ప్రశంసించారు.
ఇప్పుడు మళ్లీ ‘ప్రపంచ మేధా వులారా ఏకం కండి!’ అన్న నినాదాన్ని అంది పుచ్చుకొని చంద్రబాబుకు మద్దతుగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే, గాంధీ, అంబేడ్కర్, వైశ్య కులం, దళిత కులం; త్రిపురనేని రామస్వామి చౌదరి, గిడుగు రామ్మూర్తి అంటూ మోకాలికీ బోడి గుండుకీ ముడిపెడుతూ తన మేధాతనాన్ని ప్రదర్శించడానికి చాలా ప్రయాసపడ్డారు.
ప్రకటన వికటించింది. చంద్రబాబుకి వర్గ పరంగా బహిరంగ మద్దతు ఇస్తున్నాను అని ఆయన ప్రకటిస్తే ఎవరికీ పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఏదేదో మాట్లాడేసేసి, ఆంధ్ర ప్రదేశ్‌లో ఏదో అరాచకం జరిగి పోతుందని తన భాషా ప్రావీణ్యమంతా ప్రదర్శించే సరికి, ఆయన మీద విమర్శల జడి మొదలైంది. పాపం జేపీని చూసినప్పుడల్లా విదు రుడు చెప్పిన పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది.
‘‘ధనమును, విద్యయు, వంశంబును, దుర్మతులకు మదంబు ఒనరించును / సజ్జను లైన వారికి అణకువయును, వినయము ఇవియే తెచ్చును ఉర్వీ నాథా!’’ అంటాడు. ధనం, విద్య, ఉత్తమ కులంలో పుట్టాననే భావన దుష్టులకు మదాన్నీ, అహంకారాన్నీ కలిగిస్తాయి. ఇవే శిష్టులకు అణకువ, వినయం కలిగిస్తాయి అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఈ పద్యం చదివితే జేపీ ఏ బాపతు మేధావో చెప్పనవసరం లేదనుకుంటాను. జనానికి ఏమి కావాలో అది చెప్పాలి.లేదంటే నేల విడిచి సాము చేసినట్టు ఉంటుంది. జనం ఏమైనా ‘జేపీలా’?
పి. విజయబాబు
వ్యాసకర్త పూర్వ సంపాదకులు
Comments
Please login to add a commentAdd a comment