రాజధానికి రెండువేల ఎకరాలు చాలు: జేపీ
గుంటూరు : రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములు సేకరిస్తే సహించేది లేదని లోక్సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ హెచ్చరించారు. రాజధాని కోసం రెండు, మూడువేల ఎకరాలు సరిపోతాయని, ముప్పై వేల ఎకరాలంటూ భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వాళ్లను పెంచి పోషించాలనుకుంటున్నారా అని ఆయన శనివారమిక్కడ ప్రశ్నించారు.
లోక్సత్తా పార్టీ 8వ వార్షికోత్సవ సభలో జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ రైతుల దగ్గర తీసుకున్న భూమిలో అభివృద్ధి చేసిన సగం తిరిగి వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన పనికిమాలిన హామీలతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని జయప్రకాష్ నారాయణ విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో రైతులను నిలువునా ముంచారని ఆయన వ్యాఖ్యానించారు.