హోదా అడిగితే దేశ ద్రోహమా? | Jayaprakash Narayana interview with sakshi | Sakshi
Sakshi News home page

హోదా అడిగితే దేశ ద్రోహమా?

Published Mon, Jan 30 2017 2:16 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

హోదా అడిగితే దేశ ద్రోహమా? - Sakshi

హోదా అడిగితే దేశ ద్రోహమా?

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జయప్రకాష్‌ నారాయణ
♦ పారిశ్రామిక రాయితీలు హోదాలో భాగం కాదనడం అవాస్తవం
♦ ప్యాకేజీ ఒక నాన్సెన్స్‌.. హోదా ఉన్న రాష్ట్రాలకే రాయితీలు దక్కాయి
♦ హోదా ప్రైవేట్‌ వ్యవహారం కాదు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తామని ఆరు నెలల కిత్రం వరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ఇతర కేంద్ర మంత్రులు చెప్పిన మాటలనే ఇప్పుడు రాష్ట్రంలో యువత, ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేయడానికి పూనుకుంటే అది దేశద్రోహ చర్య ఎలా అవుతుందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ ప్రశ్నించారు. నిన్నటి దాకా వారు చేసిన వాదన అధికారంలో ఉన్న వారికి నచ్చకపోతే అన్యాయమైపోతుందా? అక్రమమైపోతుందా? ఆ మాట ఎత్తడమే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు. పాలకుల్లో ఇలాంటి అసహనం పెరగడం ఆంధ్రప్రదేశ్‌కు ఏ మాత్రం మంచిది కాదన్నారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏమాత్రం ప్రజాస్వామిక చర్య అనిపించుకోబోదన్నారు. తిమ్మిని బమ్మి చేసి ప్రజలను భ్రమింపజేసేందుకు టీడీపీ, బీజేపీ ప్రత్యేక హోదా నిర్వచనాన్ని మార్చి, పారిశ్రామిక రాయితీలు అందులో భాగం కానట్టు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సహాయానికి ప్యాకేజీ అన్న పేరు పెట్టడాన్ని ఆయన నాన్సెన్స్‌గా పేర్కొన్నారు. ‘సాక్షి’కి ఆయన ప్రత్యేకంగా ఇంటర్వూ్య ఇచ్చారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

► ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు వస్తాయి.. రాయితీలు వస్తే ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమల పెట్టుబడులు గణనీయంగా వచ్చే అవకాశం ఉంది. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు దక్కాయి.
► అధికారంలో ఉన్నవారికి నచ్చినా, నచ్చకపోయినా, ప్రజలు తమ కోరికకు అనుగుణంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది. రాష్ట్రంలో ఫలానాది జరిగితే బాగుండని.. ఎవరూ పట్టించుకోవడం లేదని పది మంది గుమికూడి నిరసన తెలపచ్చు. ఇది ప్రజాస్వామ్య హక్కు. ఇతరులకు ఇబ్బంది లేకుండా ఎవరైనా, ఎంతమందైనా గుమిగూడొచ్చు. ఇవన్నీ ప్రజాస్వామ్య హక్కులు.
► ప్రత్యేక హోదా కోసం అడిగితే అది దేశద్రోహం ఎలా అవుతుంది? ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటే శ్వేతపత్రం ప్రకటించి, పన్ను రాయితీ అవసరం లేదు, ప్యాకేజీ సరిపోతుందని చెప్పమనండి. నిన్నటిదాకా వాళ్లు చేసిన వాదన ఇప్పుడు అన్యాయమైపోయింది, అక్రమమైపోయింది. మాట ఇచ్చారు కాబట్టి అడుగుతున్నారు. ఇది తప్పు ఎలా అవుతుం ది? అడిగేవారి గొంతు నొక్కడం విజ్ఞత కాదు. బలవంతంగా నోరు మూసే ప్రయత్నం చేస్తే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది కాని తగ్గదు.
► రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీల కోసం ఇప్పుటి వరకు ప్రభుత్వ పరంగా ప్రయత్నమే జరగలేదు. అది కచ్చితంగా తప్పు.
►అధికారంలో ఉంటే మేం ఫలానా పని చేశామని చెప్పుకుంటారు. ప్రతిపక్షం వాళ్లు ఫలానాది చేయడం లేదని ప్రచారం చేస్తారు. దీనిని భయంకరమైన కుట్రగా చిత్రీకరించడం సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా వారికి ఆ హక్కు ఉందని గుర్తించండి. ఈ హక్కు మీరు ఇవ్వలేదు. ఇది రాచరికం కాదు. ఒక అధికారో, ప్రభుత్వమో ఈ హక్కులను ఇవ్వలేదు.
► ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించడం హర్షించదగ్గ విషయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసను ప్రేరేపించకుండా, ఇతరులకు భంగం కలగకుండా ఎవరైనా ఏదైనా చెప్పుకునే హక్కు ఉంది. ఈ ఫండమెంటల్‌ గుర్తించకపోతే ప్రజస్వామ్యం నడవదు. అధికారంలో ఉన్న వారు తమకు ఇష్టంలేని ప్రతివారిని దేశ ద్రోహులుగా చిత్రీకరించడం ప్రజాస్వామ్యం కానేకాదు. ప్రభుత్వానికి ఆ హక్కు లేదు.
► రాష్ట్రానికి కేంద్రం పెద్దలు ఏయే హామీలు ఇచ్చారు. ఏవి జరిగాయి, ఏవి జరగలేదు. ఏం సాధించుకోవాలి. సాధ్యం కాకపోతే ఎందుకు సాధ్యం కాదో ప్రభుత్వం శ్వేతప్రతం రూపం లో చెప్పాలి. కానీ ఇదంతా జరగలేదు. ఇది ప్రైవేట్‌ వ్యవహారం కాదు. ప్రజల ముందు పెట్టాలి. ప్యాకేజీ అంటున్నారు. ఆ పదమే నాన్సెన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement