ముఖ్యమంత్రి చంద్రబాబు పరువు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చలో ఏపీకి ప్రత్యేక హోదా
పరువు నిలుపుకునేందుకు పాట్లు
సాక్షి, విజయవాడ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు పరువు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో గురు, శుక్రవారాల్లో జరిగిన చర్చలో ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకుం డా, కేంద్రాన్ని నిలదీయకుండా విమర్శల పాలైన టీడీపీ అధినేత నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం విజయవాడలో పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్న బాబు.. సోమవారం నుంచి పార్లమెంట్‌లో హడావుడి చేయాలని నిర్ణయించారు. హోదా సెంటిమెంట్ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలతో బీజేపీ, టీడీపీలపై జనం రగలిపోతున్నారు. దీంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మీడియాకు రకరకాల లీకులు ఇచ్చి జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు బాబు ప్రయత్నించారు.
బీజేపీతో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు మీడియాకు అనధికారికంగా వెల్లడించారు. అవసరమైతే ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని ఒక దశలో సమాచారం పంపారు. అయితే, ఇదంతా కేవలం జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికేనని, ప్రజల్లో పలుచన కాకుండా పరువు నిలుపుకోవడానికేనని టీడీపీ వర్గాలంటున్నాయి. కేంద్రం నుంచి చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి లేనేలేదని, వెళ్లిపొమ్మంటూ బీజేపీ గట్టిగా అల్టిమేటం ఇస్తే తప్ప తాము బయటకు రాబోమని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.