గోదాలోకి దింపుతున్న‘హోదా’ | Devulapalli Amar writes on TDP dramas on AP special status | Sakshi
Sakshi News home page

గోదాలోకి దింపుతున్న‘హోదా’

Published Wed, May 11 2016 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గోదాలోకి దింపుతున్న‘హోదా’ - Sakshi

గోదాలోకి దింపుతున్న‘హోదా’

డేట్‌లైన్ హైదరాబాద్

 

రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి.  ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు? కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహచరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం.

 

 

బీజేపీ, తెలుగుదేశం కూటములు ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో అధికారంలో ఉండగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్పష్టమై పోయింది. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్య పెట్టకుండా ఆ రెండు పార్టీల బాధ్యులూ, ముఖ్యంగా నాయుడు ద్వయం ఒక పత్రికా గోష్టి నిర్వహించి ఆ విషయం స్పష్టంగా ప్రకటించి ఈ మూడేళ్లూ ఎవరి పనులు వాళ్లు చక్క బెట్టుకుంటే మంచిది. ఆ తరువాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో అన్నీ అనుభవించి తెలుగుదేశానికి వలసపోయి, పార్లమెంట్ సభ్యుడ యిన జేసీ దివాక రరెడ్డి చెప్పినా, రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి పార్లమెంట్ ఆవరణ నుంచి ఇంత మట్టి, కొన్ని కలుషిత యమునా జలాలు తెచ్చి ఇచ్చినా, రాజ్యసభలో కేంద్రమంత్రి చౌదరి ప్రకటించినా, టీడీపీ లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాసరావుకు మరో కేంద్రమంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేసినా, వాటన్నిటి సారాంశం - ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రభుత్వాల హయాంలో ప్రత్యేక హోదా రాదనే.

 

హోదా పాటను మరిచారు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం శాసనసభ లోపలా వెలుపలా ఒంటరి పోరాటం చేస్తోంది. శాసనసభలోకి ప్రవేశం దొరకని ఇతర పార్టీలూ, ప్రజాసంఘాలూ, మేధావులూ వారూవీరూ అని తేడా లేకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడడం కనిపిస్తోంది. అయితే రెండు అధికార పక్షాలకూ చీమ కుట్టినట్టు కూడా లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల యువ భేరి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక హోదా అవసరం మీద యువతను జాగృతం చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు హోదా కోరుతూ ఏకగ్రీవ తీర్మానానికి దోహదం చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా బంద్ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారు. మంగళవారం నాడు రాష్ర్ట మంతటా జిల్లా కలెక్టరేట్‌ల ముందు ఆ పార్టీ ధర్ణాలు నిర్వహించింది. రాష్ర్ట విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని వారి వారి స్థాయిల్లో ఉద్యమాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లు ఈవారం చర్చకు రానుంది. మరి తెలుగుదేశం తదితర పక్షాలు ఏం చేస్తాయో చూడాలి.

 

రాష్ర్ట విభజనలో తన వంతు పాత్ర కూడా నిర్వహించిన బీజేపీ, రాష్ర్ట విభజనను సమర్థిస్తూ కేంద్రానికి లేఖలు ఇచ్చిన తెలుగుదేశం మాత్రం ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడానికి కూడా సిద్ధంగా లేవు. ఈ రెండు పార్టీలూ మొదటి నుంచీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం అయితే, ఏనాడూ హోదా గురించి మాట్లాడకపోయుంటే వాళ్లను విమర్శించడం ఏమిటి అని అనుకోవచ్చు. కానీ పోటీలు పడి ప్రత్యేక హోదా కాల పరిమితిని వేలం పాట మాదిరిగా ఐదు, పది, పదిహేను సంవత్స రాలంటూ పెంచుకుంటూ పోయింది ఆ రెండు పార్టీల పెద్దలే, అందునా ఆ ఇద్దరు నాయుళ్లే. ఆ మధ్య తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణ మనాయుడు ఒక ప్రకటన చే శారు- వెంకయ్యనాయుడు భావి రాష్ర్టపతి, చంద్రబాబునాయుడు భావి ప్రధానమంత్రి అని.

 

నిన్నకాక మొన్న అదే నోటితో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు ముద్దుకృష్ణమనాయుడు. మంత్రులూ, పాత విధేయులూ కొత్తగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాగం అందుకున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా తాజా విధేయుడు జలీల్ ఖాన్ రెండు రోజులలో మా పార్టీ కేంద్రమంత్రులు ఇద్దరూ రాజీనామా చేస్తారు చూడండి అని ప్రకటించేశారు. ఆయన చెప్పి పది రోజులయినా ఆ సూచనలేవీ లేవు. ఆమధ్య కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ప్రత్యేక హోదా త్వరలో వస్తుందని ప్రకటించి కూర్చున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో ఆయనకే తెలియాలి. మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు, అధికారపక్షంలోని  ఛోటా బడా నాయకులందరూ ఎవరి తోచినట్టు వారు మాట్లాడి ప్రత్యేక హోదా విషయంలో గందర గోళం సృష్టిస్తున్నారు. అసలు వారి నాయకుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎంత గందరగోళంలో ఉన్నారో, జనాన్ని ఎంత గందరగోళంలోకి నెడుతున్నారో ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధమయిన ప్రకటనలు చూస్తే తెలుస్తుంది.

 

హోదా కోసం ఏదీ కృషి?

రాష్ర్ట విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆనాటి ప్రతిపక్షం బీజేపీ తరఫున ముప్పవరపు వెంకయ్యనాయుడు, కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారు. చంద్ర బాబు అది పదిహేను సంవత్సరాలకు పెంచేశారు. పరిశ్రమలు రావ డానికే మూడేళ్లు పడితే, ప్రత్యేక హోదా ఐదేళ్లకు సరిపెడితే అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న చంద్రబాబు, మరి ఆ దిశగా చేసిన కృషి ఏమిటి అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ గందరగోళ పడిపోవడమే. ఒకసారి ప్రత్యేక హోదా సంజీవని కాదంటారాయన. హోదా కంటే ఎక్కువ నిధులొస్తే వద్దంటామా అనే అర్థంలో కోడలు కొడుకును కంటా నంటే వద్దు అనే అత్త ఉంటుందా అని తన పురుషాహంకారాన్ని ప్రద ర్శించుకుంటారు. ఒకసారి రాజధాని నిర్మాణానికి ఐదులక్షల కోట్లు అడుగుతారు. మరోసారి రెండున్నర లక్షల కోట్లు ఇవ్వండి చాలంటారు.

వీటన్నిటికీ పరాకాష్ట కొత్త రాజధాని శంకుస్థాపన ఉత్సవంలో చంద్రబాబు చేసిన ప్రకటన, ఆ వెంటనే సవరించుకున్న తీరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులంతా ఉన్న వేదిక మీద చంద్ర బాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోండి అన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే నాలిక కరుచుకుని మీడియా వారిని పిలిచి, ప్రత్యేక హోదా అనబోయి, తొందరలో ప్రత్యేక ప్యాకేజీ అన్నానని సవరించుకున్నారు. కోట్లాది మంది రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్య మీద సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధోరణి ఇది. ప్రత్యేక హోదా పట్ల ఆయనకున్న ఆసక్తి ఎంతో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక నాయుడు కోరినట్టు పదేళ్లో, ఇంకో నాయుడు కోరి నట్టు పదిహేనేళ్లో లభించే ప్రత్యేక హోదాను మించి రాష్ట్రానికి ఎక్కువ లాభం ఒనగూడే రీతిలో ఎక్కువ నిధులు ప్యాకేజీల ద్వారా లభించేటట్టు ఉంటే అదే తీసుకురావచ్చు. కానీ అదీ జరగడం లేదేమిటి?

 

మోదీ అంటే భయమా?

రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి.  ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు, కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహ చరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం.

 తెలంగాణలో తొలి రోజులలోనే ఓటుకు కోట్లు నిర్వాకంలో ఇరుక్కున్న కేసులకు భయపడో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మరే అవినీతి కార్యక్రమాలు బయటికొస్తాయన్న భయంతోనో కానీ మొత్తానికి ఆయన ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేరని తేలిపోయింది. మాతో ఉండాలనుకుంటే మేం చెప్పినట్టు నడవండి అని కేంద్రం ఇప్పటికే రాష్ర్ట ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం చేయబోతున్నదో స్పష్టమయిన ఒక ప్రకటన రాబోతున్నదనీ, దానికోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతున్నదని సమాచారం.

ప్రతిపక్షనేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రోడ్డెక్కితే, కనీవినీ ఎరుగని ఎండలకు గొంతు తడుపుకోవడానికి కూడా కూడా నీరందక రాష్ర్ట ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి అమెరికా విహారయాత్రకు వెళ్లారు. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నారు వినండి.

 

- దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement