date line hyderabad
-
బొప్పి కట్టిన తెలుగు పెద్దతలలు
మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తల దూర్చారు. ఇద్దరి తలలూ బొప్పి కట్టాయి. పైకి నొప్పి లేనట్టు నటిస్తున్నా ఇద్దరూ ఎవరూ చూడకుండా అద్దం ముందు నిలబడి బొప్పి తడుముకుని బావురుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పబ్లిగ్గానే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారికి పిలుపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లి కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు ఎక్కువగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులో లేదా హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డారు. బెంగళూరులో స్థిరపడ్డ తెలుగువారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారు. చంద్రబాబు పిలుపును వాళ్లెవరూ లెక్క చెయ్యలేదు. ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి బీజేపీకి ఓట్లు పడకుండా చేయాలన్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కర్ణాటకలో బీజేపీ సీట్లు 2013 కంటే ఈసారి గణనీ యంగా పెరిగాయి. ఎవరి ప్రయోజనాలు వారివి! చంద్రబాబునాయుడు తిరుపతి నుంచే ‘బీజేపీని ఓడించండి!’ అని కర్ణాటక తెలుగు వారికి పిలుపు ఇస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఒక ప్రత్యేక విమానంలో మందీమార్బలంతో వెళ్లి మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడను ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలసి మద్దతు ప్రకటించి వచ్చారు. ఆయన ఆలోచన అక్కడ కాంగ్రెస్ గెలవకూడదని! అయితే ఇటీవలే జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు నడుపుతానని బయలుదేరిన చంద్రశేఖరరావు బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను దుయ్యబడుతున్న కారణంగా కర్ణాటకలో బీజేపీని గెలిపించాలని బహిరంగంగా ప్రకటించలేకపోయారు. అయితే ఆయన రహస్య ఎజెండా మాత్రం బీజేపీకి మేలు చేయడమే అని రాజకీయ పండితుల వాదన. అందుకు కారణం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో తన ప్రథమ శత్రువుగా ఉన్న కాంగ్రెస్‌లో కొత్త ఊపు వస్తుంది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంటుంది, జేడీ(ఎస్) పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ అస్తిత్వంతోనే కొనసాగుతున్నందున ఎక్కువ స్థానాలు వచ్చేటట్టు చేస్తే అది బీజేపీకి లాభించి అధికారంలోకి రావడానికి పనికొస్తుందన్నది కేసీఆర్ రహస్య ఎజెండా. అయితే ఆయన పిలుపును అందుకోవాల్సిన తెలుగువారు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగువారు. వాళ్లలో ఎక్కువ మంది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడ్డవారు. బెంగళూరులో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంతపు తెలుగువారు చంద్రబాబు పిలుపును లెక్క చేయనట్టే, హైదరాబాద్ కర్ణాటక ప్రాంత తెలుగువారు చంద్రశేఖరరావు పిలుపును పట్టించుకోలేదు. అక్కడ జేడీ (ఎస్) కన్నా బీజేపీకే ఎక్కువ స్థానాలు లభించాయి. పైగా కేసీఆర్ బహిరంగంగా మద్దతు తెలిపిన జేడీ(ఎస్)కు మొన్నటి ఎన్నికలలో 2013 ఎన్నికల కంటే తక్కువ స్థానాలు లభిం చాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కర్ణాటక ఎన్నికల ఫలితాల మీద బహిరంగ ప్రకటన చేయలేదు. అయితే ఆయన అనుకున్నదొకటి, అయింది మరొకటి. జేడీ (ఎస్) తెలంగాణలో తన ప్రథమ శత్రువు కాంగ్రెస్ గూట్లో చేరిపోయింది. మింగలేక కక్కలేక అన్నట్టు తయారయింది ఆయన పరిస్థితి. దానికి తోడు బీజేపీ నుంచి తమ ఎంఎల్ఏలను రక్షించుకోవడం కోసం శిబిరం ఏర్పాటుకు కేరళ వెళ్లాల్సిన కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసనసభ్యులు హైదరాబాద్ బయలుదేరి రావడం కూడా కేసీఆర్‌కు మింగుడుపడని విషయమే. సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యమా అని హైదరాబాద్ శిబిరం ఒక్కరోజుతో ముగిసిపోయింది కానీ, ఏ పదిహేను రోజులో కొనసాగి ఉంటే జేడీ (ఎస్) బహిరంగ మిత్రుడిగా తన ఇలాఖాలో ఉన్నారు కాబట్టి కాపాడే చర్యలు గట్టిగా చేయవలసి వచ్చేది. అట్లా చేస్తే తన రహస్యమిత్రులు అమిత్ షా, మోదీల ఆగ్రహం చవిచూడాల్సి వచ్చేది. ఆంధ్రప్రదేశ్ సీఎం వ్యూహం వేరు ఎన్డీఏను వీడి వచ్చాక తన మీద కేసులు పెడతారని చంద్రబాబునాయుడు చాలా భయపడుతున్నారు. అది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. అందుకే బీజేపీ బలహీనపడాలనీ, కర్ణాటకలో ఓడిపోతే బీజేపీ ముఖ్యంగా షా, మోదీ ద్వయం దూకుడుకు కళ్లెం పడుతుందనీ, దానితో తన జోలికి రాకుండా ఉంటారనీ చంద్రబాబు ఆశించారు. కానీ ఆయన ఆశ నెరవేరలేదు. కర్ణాటకలో బీజేపీ అధిక స్థానాలు పొందిన ఏకైక పార్టీగా అవతరించింది. చంద్రబాబు ఆశల మీద కర్ణాటక ప్రజలు ఆ విధంగా నీళ్లు జల్లి, చంద్రశేఖరరావుకు కూడా నిరాశే మిగిల్చారు. కాంగ్రెస్ స్థానాలు తగ్గాయి కానీ, అక్కడ అధికారంలో భాగస్వామిగా ఉండబోతున్నది. కాంగ్రెస్ అధినేత్రి సోని యాగాంధీ అత్యంత వేగంగా పావులు కదిపి జేడీ (ఎస్)ను బీజేపీ వైపు పోకుండా నిలువరించగలిగారు. తగిన సంఖ్యలో ఎంఎల్ఏలు లేకపోయినా ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యడంలో దిట్టలని పేరుగాంచిన అమిత్ షా, మోదీలకే చెక్ పెట్టిన సోనియా రాజకీయ చతురతను అందరూ పొగుడుతున్నారు. చంద్రబాబు గవర్నర్‌ను విమర్శించడమా!? మొత్తానికి ఓడి గెలిచామా, గెలిచి ఓడామా అర్థం కాని స్థితిలో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులూ తలలు పట్టుకున్న పరిస్థితి. చంద్రబాబునాయుడు అవసరం కోసం మాట మార్చడంలో దిట్ట. కర్ణాటక తాజా పరిస్థితి మీద ఆయన అక్కడి గవర్నర్ పాత్రను తీవ్రంగా విమర్శించారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి అక్కడి గవర్నర్ మహా నేరం చేశాడని ఆయన అంటున్నారు. మరి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కృష్ణకాంత్ అడ్డగోలుగా తనను ప్రభుత్వం ఏర్పాటు చేయనిచ్చిన విషయం ఆయనకు గుర్తురాదు. 23 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను అడ్డంగా కొని అందులో నుండి నలుగురిని మంత్రులను చేస్తే వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం కూడా గుర్తుకు రాదు. వజూ భాయ్ వాలా రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటే కృష్ణకాంత్, నరసింహన్‌ల చేత తాను చేయించింది ఏమిటి? రాజ్యాంగ పరిరక్షణా? రాజ కీయాల్లో అధికారమే పరమావధి అయినప్పుడు మర్యాద, హుందాతనం వంటివి లుప్తమయిపోతుంటాయి. ఒకప్పుడు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినందుకు దేవత అని ప్రస్తుతించిన చంద్రశేఖరరావు ఈ రోజు బెంగళూరులో జరగనున్న కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడానికి కారణం అక్కడికి సోనియా, రాహుల్ తదితర కాంగ్రెస్ పెద్దలు వస్తున్నందునే. జేడీ (ఎస్), కాంగ్రెస్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటులో తానూ పాల్గొంటే తెలంగాణలో కాంగ్రెస్ నైతిక స్థయిర్యం పెరుగుతుందనే దుగ్ధతో బాటు సోనియాగాంధీని ముఖాముఖి ఎదుర్కోలేక పోవడమూ, బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకూడదన్న వెరపూ కారణం కావచ్చు. అందుకే ఆయన మంగళవారం సాయంత్రమే బెంగళూరు వెళ్లి కుమారస్వామికి అభినందనలు తెలిపి వచ్చేశారు. అవతలి వైపు సోనియాగాంధీని దెయ్యం అనీ, ఇటలీ దేశీయురాలనీ నానా తిట్లూ తిట్టిన చంద్రబాబునాయుడుకుమారస్వామి ప్రమాణ స్వీకారానికి బెంగళూరు బయలుదేరారు. సోనియా గాంధీ సరసన కూర్చోడానికి, కాంగ్రెస్ నాయకత్వంలో కొత్త కూటమి గూట్లో చేరిపోవడానికి తెగ ఆరాట పడిపోతున్నారాయన. భూమి గుండ్రంగా ఉంటుందన్నట్టు కాంగ్రెస్ నుంచి బయలుదేరిన చంద్రబాబు చివరికి అదే కాంగ్రెస్ పంచన చేరక తప్పని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్‌లో మథనం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కాడి కింద పారేసింది కానీ తెలంగాణలో 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆశ పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మాత్రం కొత్త గుబులు పట్టుకున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక ఫలితం పునరావృతం అయితే ఎట్లా అన్న సందేహం వాళ్లనువెంటాడుతున్నది.తెలంగాణలో కర్ణాటక మాదిరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని స్థానాలు కాంగ్రెస్‌కు లభించకపోతే, జేడీ (ఎస్) లాగా కోదండరాం నాయకత్వంలోని టీజేఎస్కో, టీటీడీపీకో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందేమో అన్నది వాళ్ల ఆందోళన. బీజేపీని నిలువరించడానికి కర్ణాటక మోడల్‌ను 2019 దాకా కొనసాగిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల చంద్రశేఖరరావు రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం తెస్తానని చెపుతున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నం అటకెక్కినట్టే. కొత్త, పాత మిత్రులతో మరో యూపీఏ ఏర్పాటయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే కేసీఆర్ ఎన్డీఏలో చేరడమో, ఒంటరిగా మిగిలిపోవడమో జరుగుతుంది. దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
‘చంద్రుల’ నోట చైనా పాట
డేట్లైన్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరూ తమకు అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ కాలరాస్తున్నారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. నిరసనలకు తావే లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు సీఎంలకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్లుంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఈ మధ్య వేర్వేరు సందర్భాలలో చైనాలో పరిపాలనను, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఉదహరించారు. ఇటు తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాను జాతీయ రాజకీయాలకు వెళ్లనున్నట్టు ప్రకటించిన సభలో చైనాను ప్రస్తావిస్తే, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అక్కడి శాసనసభలో మాట్లాడుతూ చైనాను కొనియాడారు. ఇద్దరి మాటల్లోనూ మనకు అర్థం అయింది ఏమిటంటే అభివృద్ధి సాధించాలంటే చైనాను ఆదర్శంగా తీసుకోవాలి అని. అభివృద్ధి అంటే ఏమిటి? అది ఎవరి అభివృద్ధి? దేన్నయినా పణంగా పెట్టి ఆ అభివృద్ధి సాధించుకోవలసిందేనా? చైనా సాధిస్తున్న అభివృద్ధిని గురించి ఇంకోసారి చర్చించుకుందాం. ఇటీవలే చైనా దేశ రాజ్యాంగాన్ని సవరించి ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ జీవితకాలం పదవిలో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించింది ఆ దేశ పార్లమెంట్. రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పదవిలో ఎవరూ కొనసాగకూడదన్న నియమాన్ని సవరించి జిన్‌పింగ్‌కు నిరాఘాటంగా అధికారంలో కొనసాగే అవకాశం కల్పించడం చైనా దేశాన్ని ఏకవ్యక్తి నియంతృత్వం వైపు నెట్టడమే అన్న విమర్శను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చి ఈ చర్యకు ప్రజల ఆమోదం ఉందని తేల్చేసింది. చైనా మోడల్ దేనికి నిదర్శనం? అభివృద్ధి పేరిట చైనా దేన్ని పణంగా పెడుతుందో ఈ తాజా చర్యల వల్ల మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో, అభివృద్ధి కోసం దేశాన్ని నియంతృత్వ పాలకుల చేతుల్లో ఎలా పెట్టెయ్యవచ్చునో, దానికోసం స్వేచ్ఛాస్వాతంత్య్రాల అవసరం అసలే అక్కరలేదనో ఎవరయినా ఆర్థిక శాస్త్ర పండితులు చెప్తారేమో. కానీ భావ ప్రకటనా స్వేచ్ఛను, జీవించే హక్కును కోరుకునే వారెవ్వరూ ఇప్పటి చైనా పోకడలను హర్షించరు, ఆమోదించరు. విచిత్రంగా చైనాలో ఈ రాజ్యాంగ సవరణ జరుగుతున్న సమయంలోనే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరి నోటా చైనా అభివృద్ధి పాట వినిపించింది. నిజంగా ఈ ఇద్దరు నాయకులను చైనాలో జరుగుతున్న అభివృద్ధి ఆకర్షించిందా లేకపోతే జిన్‌పింగ్ లాగా తమకు శాశ్వత అధికారం కట్టబెడితేనే చైనా మోడల్ అభివృద్ధి సాధిస్తామని ప్రజలకు చెప్పదల్చుకున్నారా తెలియదు. ఈ సందేహం రావడానికి కారణం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులూ తాము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక ప్రతిపక్షాల అవసరం లేదంటారు. తాము అధికారంలో ఉన్నాం కాబట్టి నిరసనలకు తావు లేదంటారు. అక్కడా ఇక్కడా ప్రభుత్వం చేస్తున్న తప్పులను గురించి వేలెత్తి చూపే హక్కు, గొంతెత్తి మాట్లాడే హక్కూ లేకుండా చెయ్యడం నిత్యకృత్యం అయిపొయింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు తానూ చెయ్యబోయే అభివృద్ధిని 2050 సంవత్సరం వరకూ విస్తరిస్తుంటారు. అంటే ఆయన, ఆయన కొడుకు లోకేష్, ఆ తరువాత మనుమడు దేవాన్‡్ష కూడా ముఖ్యమంత్రులు అయిపోవొచ్చు ఈ 52 ఏళ్ళ కాలంలో. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 20 ఏళ్ళ దాకా మాదే అధికారం అంటారు. ప్రతిపక్షాలు లేనే లేవు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్ట్ర శాసనసభలోని 119 స్థానాల్లో 106 మావేననీ, వచ్చే 20 ఏళ్ళు అధికారం మాదే అని కూడా అంటుంటారు. ఇద్దరూ ప్రతిపక్షాలను ఖాళీ చేయించడానికి అన్ని ప్రజాస్వామ్య సూత్రాలనూ, విలువలనూ కాలరాస్తుంటారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం మరిచిపోయి జిన్పింగ్లాగా శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని అనుకుంటూ ఉన్నందువల్లనే ఇద్దరు ముఖ్యమంత్రులకూ అభివృద్ధిలో చైనా ఆదర్శంగా కనిపిస్తున్నట్టు ఉన్నది. ప్రత్యేక హోదాపై మొదటి నుంచి కుప్పిగంతులే! రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలిచ్చి, విడిపోతున్న సమయంలో 15 ఏళ్ళు ప్రత్యేక తరగతి హోదా కావాలని డిమాండ్ చేసి ఆ తరువాత అధికారంలోకి వచ్చాక అదే హోదా కోసం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాన్ని, ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కదలనివ్వదు, జైళ్ళలో పెడుతుంది. కేసులు పెడుతుంది. హోదా సంజీవని కాదు, ప్యాకేజీతోనే ప్రయోజనం అని చెప్పి చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేసి, చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గక తప్పని స్థితిలో మళ్ళీ ప్రత్యేక హోదా పాట అందుకున్నది. ఎన్నికల ఎత్తుగడగా బీజేపీని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నప్పటికీ చంద్రబాబుకు పూర్తి ధైర్యం చాలడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో నుండి మాత్రం తన మంత్రులతో రాజీనామా చేయించి ఎన్డీఏ కూటమిలో మాత్రం కొనసాగుతున్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ కేంద్రంతో తగాదా పడలేము, మంచిగా ఉండి సాధించుకోవాలి అనే పాట పాడుతూ వొచ్చిన చంద్రబాబుకు, ఆయన పార్టీ నాయకులకూ ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడేసరికి సహకార ఫెడరలిజం గుర్తొచ్చింది. 2016 సెప్టెంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తున్న ప్యాకేజీ గురించి ప్రకటించినప్పుడు ఉబ్బితబ్బిబ్బయిపోయి ఆయనకు సన్మానాలు చేసిన చంద్రబాబు, అదే ప్రకటనను అక్షరం పొల్లుపోకుండా 2018 మార్చిలో చేస్తే మాత్రం అన్యాయం జరిగిందని ప్రకటనలు చేస్తున్నారు. అధికారాన్ని మళ్ళీ ఎట్లాగయినా దక్కించుకోవాలన్న ఆరాటం స్పష్టంగా కని పిస్తూనే ఉంది ఆయన నిర్ణయాల్లో. తాము ఇంకా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, ప్రత్యేక హోదా ఇచ్చే ఏ పార్టీకయినా మద్దతు ఇస్తామన్న ప్రతిపక్షాన్ని మాత్రం బీజేపీలో చేరబోతున్నది అని నిందించేందుకు చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు శతవిధాలా చేస్తున్న ప్రయత్నాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకోలేరని అనుకుంటే పొరపాటు. ఇక దేశానికే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తాను ఇస్తాననీ మూడవ ఫ్రంట్‌కు తాను నాయకత్వం వహిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రైతు సమస్యల మీద కేంద్రాన్ని నిలదీయడానికి ఉద్యమం చేస్తానని, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండదు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్ ఎత్తేసి నిరసనకారులను ఇళ్ళల్లో నిర్బంధించి అవసరం అయితే పోలీస్ స్టేషన్లకు తరలించి ముఖ్యమంత్రి మాత్రం జంతర్ మంతర్‌కు నిరసన కార్యక్రమం నిర్వహించడానికి వెళతారు. రిజర్వేషన్ల పెంపు డిమాండ్ మీద ఆయన పార్టీ ఎంపీలు లోక్‌సభను స్తంభింప చెయ్యొచ్చు, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపవచ్చు కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం విపక్షాల నిరసనకు అనుమతి లేదు. ప్లకార్డులు ధరించి సభకు రావడం అరాచకం. దాడుల రాజకీయంలోనూ పక్షపాతమే! శాసనసభలో గవర్నర్ మీద దాడి హేయమయిన చర్య. ఎవరూ సమర్థించకూడని చర్య. అయితే గవర్నర్ ప్రసంగం సమయంలో నిరసన తెలపడం ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. నిలబడి నిరసన తెలపడం, నినాదాలు చెయ్యడం, ప్రసంగాల ప్రతులను చించివెయ్యడం చాలా కాలంగా శాసనసభల్లో మామూలు అయిపోయింది. అయితే భౌతికంగా గవర్నర్ మీద దాడికి దిగడం ఎవరితో ప్రారంభం అయింది? ఉమ్మడి రాష్ట్రంలో ఇదే గవర్నర్ గారి మీద ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు కాదా దాడి చేసింది. శాసన సభ ఆవరణలో ఒక ఎంఎల్ఏను కొట్టండిరా తన్నండిరా అని రెచ్చగొట్టిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్నాడు. రేపో మాపో ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సంఘటనను ఆదర్శంగా చేసుకుని గవర్నర్ మీద మళ్లీ దాడి చెయ్యడాన్ని ఎవరూ సమర్థించరు. చెప్పేదేమంటే మేం చేస్తే మంచిది, ఇతరులు చేస్తే చెడ్డది అన్న ప్రభుత్వాల, రాజ కీయ పక్షాల వైఖరి సరయినది కాదు అనే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమం అనేక మార్గాల్లో, అనేక పద్ధతుల్లో సాగింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష ప్రజల్లో ఎంత బలంగా ఉందో చెప్పడానికి మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పూ వంటి పలు కార్యక్రమాలు జరి గాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఆ ఉద్యమ కార్యక్రమాలు అన్నింట్లో భాగస్వామి. వాటిల్లో ఒకటయిన మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ జరుపుకోవడాన్ని ఎందుకు ప్రభుత్వం అడ్డుకున్నట్టు? ఉద్యమ కాలంలో తెలంగాణ సాధన కోసం ఆ నాటి ప్రభుత్వంతో తలపడిన దానికి, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి తేడా లేదా? మిలియన్ మార్చ్ నిర్వహణను నిషేధించడానికి ఆ నాడు ప్రభుత్వం ఏ కారణాలు చెప్పిందో, స్ఫూర్తి సభను నిషేధించడానికి నేటి ప్రభుత్వమూ అవే కారణాలు చూపడం విడ్డూరం. ఆ నాటి దృశ్యమే ఈనాడూ ట్యాంక్ బండ్ చుట్టూ కనిపించింది. ఆనాడు వేల మంది పోలీసులు ఉద్యమకారుల మీద విరుచుకుపడి అరెస్టులు సాగిస్తే ఈనాడు పోలీసులు అంతకంటే ఎక్కువ దాష్టీకం చేశారు, దౌర్జన్యం చేశారు. పాలకులు ఎవరయినా ప్రజా ఉద్యమాల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ప్రదర్శించే అసహనంలో మాత్రం మార్పు ఉండదేమో! మన పాలకులూ చైనా దారి పట్టినట్టు ఉన్నారు..!! దేవులపల్లి అమర్ ఈమెయిల్ : datelinehyderabad@gmail.com -
గోదాలోకి దింపుతున్న‘హోదా’
డేట్లైన్ హైదరాబాద్ రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి. ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు? కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహచరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం. బీజేపీ, తెలుగుదేశం కూటములు ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో అధికారంలో ఉండగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్పష్టమై పోయింది. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్య పెట్టకుండా ఆ రెండు పార్టీల బాధ్యులూ, ముఖ్యంగా నాయుడు ద్వయం ఒక పత్రికా గోష్టి నిర్వహించి ఆ విషయం స్పష్టంగా ప్రకటించి ఈ మూడేళ్లూ ఎవరి పనులు వాళ్లు చక్క బెట్టుకుంటే మంచిది. ఆ తరువాత ప్రజలే నిర్ణయించుకుంటారు ఏం చేయాలో. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో అన్నీ అనుభవించి తెలుగుదేశానికి వలసపోయి, పార్లమెంట్ సభ్యుడ యిన జేసీ దివాక రరెడ్డి చెప్పినా, రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రి పార్లమెంట్ ఆవరణ నుంచి ఇంత మట్టి, కొన్ని కలుషిత యమునా జలాలు తెచ్చి ఇచ్చినా, రాజ్యసభలో కేంద్రమంత్రి చౌదరి ప్రకటించినా, టీడీపీ లోక్‌సభ సభ్యుడు అవంతి శ్రీనివాసరావుకు మరో కేంద్రమంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేసినా, వాటన్నిటి సారాంశం - ఆంధ్రప్రదేశ్‌కు ఈ ప్రభుత్వాల హయాంలో ప్రత్యేక హోదా రాదనే. హోదా పాటను మరిచారు! ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం శాసనసభ లోపలా వెలుపలా ఒంటరి పోరాటం చేస్తోంది. శాసనసభలోకి ప్రవేశం దొరకని ఇతర పార్టీలూ, ప్రజాసంఘాలూ, మేధావులూ వారూవీరూ అని తేడా లేకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడడం కనిపిస్తోంది. అయితే రెండు అధికార పక్షాలకూ చీమ కుట్టినట్టు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలుచోట్ల యువ భేరి కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక హోదా అవసరం మీద యువతను జాగృతం చేసింది. అసెంబ్లీలో రెండుసార్లు హోదా కోరుతూ ఏకగ్రీవ తీర్మానానికి దోహదం చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా బంద్ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారు. మంగళవారం నాడు రాష్ర్ట మంతటా జిల్లా కలెక్టరేట్ల ముందు ఆ పార్టీ ధర్ణాలు నిర్వహించింది. రాష్ర్ట విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని వారి వారి స్థాయిల్లో ఉద్యమాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లు ఈవారం చర్చకు రానుంది. మరి తెలుగుదేశం తదితర పక్షాలు ఏం చేస్తాయో చూడాలి. రాష్ర్ట విభజనలో తన వంతు పాత్ర కూడా నిర్వహించిన బీజేపీ, రాష్ర్ట విభజనను సమర్థిస్తూ కేంద్రానికి లేఖలు ఇచ్చిన తెలుగుదేశం మాత్రం ప్రత్యేక హోదా గురించి నోరు మెదపడానికి కూడా సిద్ధంగా లేవు. ఈ రెండు పార్టీలూ మొదటి నుంచీ ప్రత్యేక హోదాకు వ్యతిరేకం అయితే, ఏనాడూ హోదా గురించి మాట్లాడకపోయుంటే వాళ్లను విమర్శించడం ఏమిటి అని అనుకోవచ్చు. కానీ పోటీలు పడి ప్రత్యేక హోదా కాల పరిమితిని వేలం పాట మాదిరిగా ఐదు, పది, పదిహేను సంవత్స రాలంటూ పెంచుకుంటూ పోయింది ఆ రెండు పార్టీల పెద్దలే, అందునా ఆ ఇద్దరు నాయుళ్లే. ఆ మధ్య తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణ మనాయుడు ఒక ప్రకటన చే శారు- వెంకయ్యనాయుడు భావి రాష్ర్టపతి, చంద్రబాబునాయుడు భావి ప్రధానమంత్రి అని. నిన్నకాక మొన్న అదే నోటితో వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు ముద్దుకృష్ణమనాయుడు. మంత్రులూ, పాత విధేయులూ కొత్తగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక రాగం అందుకున్నారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందంగా తాజా విధేయుడు జలీల్ ఖాన్ రెండు రోజులలో మా పార్టీ కేంద్రమంత్రులు ఇద్దరూ రాజీనామా చేస్తారు చూడండి అని ప్రకటించేశారు. ఆయన చెప్పి పది రోజులయినా ఆ సూచనలేవీ లేవు. ఆమధ్య కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ప్రత్యేక హోదా త్వరలో వస్తుందని ప్రకటించి కూర్చున్నారు. అది ఎక్కడి వరకు వచ్చిందో ఆయనకే తెలియాలి. మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు, అధికారపక్షంలోని ఛోటా బడా నాయకులందరూ ఎవరి తోచినట్టు వారు మాట్లాడి ప్రత్యేక హోదా విషయంలో గందర గోళం సృష్టిస్తున్నారు. అసలు వారి నాయకుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఎంత గందరగోళంలో ఉన్నారో, జనాన్ని ఎంత గందరగోళంలోకి నెడుతున్నారో ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధమయిన ప్రకటనలు చూస్తే తెలుస్తుంది. హోదా కోసం ఏదీ కృషి? రాష్ర్ట విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ ప్రకటిస్తే, ఆనాటి ప్రతిపక్షం బీజేపీ తరఫున ముప్పవరపు వెంకయ్యనాయుడు, కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారు. చంద్ర బాబు అది పదిహేను సంవత్సరాలకు పెంచేశారు. పరిశ్రమలు రావ డానికే మూడేళ్లు పడితే, ప్రత్యేక హోదా ఐదేళ్లకు సరిపెడితే అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న చంద్రబాబు, మరి ఆ దిశగా చేసిన కృషి ఏమిటి అంటే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ గందరగోళ పడిపోవడమే. ఒకసారి ప్రత్యేక హోదా సంజీవని కాదంటారాయన. హోదా కంటే ఎక్కువ నిధులొస్తే వద్దంటామా అనే అర్థంలో కోడలు కొడుకును కంటా నంటే వద్దు అనే అత్త ఉంటుందా అని తన పురుషాహంకారాన్ని ప్రద ర్శించుకుంటారు. ఒకసారి రాజధాని నిర్మాణానికి ఐదులక్షల కోట్లు అడుగుతారు. మరోసారి రెండున్నర లక్షల కోట్లు ఇవ్వండి చాలంటారు. వీటన్నిటికీ పరాకాష్ట కొత్త రాజధాని శంకుస్థాపన ఉత్సవంలో చంద్రబాబు చేసిన ప్రకటన, ఆ వెంటనే సవరించుకున్న తీరు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇతర ప్రముఖులంతా ఉన్న వేదిక మీద చంద్ర బాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోండి అన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే నాలిక కరుచుకుని మీడియా వారిని పిలిచి, ప్రత్యేక హోదా అనబోయి, తొందరలో ప్రత్యేక ప్యాకేజీ అన్నానని సవరించుకున్నారు. కోట్లాది మంది రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్య మీద సాక్షాత్తూ ముఖ్యమంత్రి ధోరణి ఇది. ప్రత్యేక హోదా పట్ల ఆయనకున్న ఆసక్తి ఎంతో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక నాయుడు కోరినట్టు పదేళ్లో, ఇంకో నాయుడు కోరి నట్టు పదిహేనేళ్లో లభించే ప్రత్యేక హోదాను మించి రాష్ట్రానికి ఎక్కువ లాభం ఒనగూడే రీతిలో ఎక్కువ నిధులు ప్యాకేజీల ద్వారా లభించేటట్టు ఉంటే అదే తీసుకురావచ్చు. కానీ అదీ జరగడం లేదేమిటి? మోదీ అంటే భయమా? రాష్ర్ట ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగడం లేదు? రెండేళ్లు గడిచిపోయాయి. ఇట్లా అయితే దోస్తీ కటీఫ్ అని ఎందుకు మోదీకి చెప్పడం లేదు, కేంద్రంలోని తన ఇద్దరు మంత్రులను ఎందుకు వెనక్కి పిలిపించుకోవడం లేదు? ప్రత్యేక హోదా అనే సరికి ఎందుకు ఆయన పిల్లిమొగ్గలేస్తున్నారు? పైగా కేంద్రంతో ఘర్షణ కూడదని సహ చరులతో పదే పదే ఎందుకు చెబుతున్నట్టు? కారణాలు ఏమైనా ఆయన కేంద్రాన్ని నిలదీయడానికి జంకుతున్నారన్నది స్పష్టం. తెలంగాణలో తొలి రోజులలోనే ఓటుకు కోట్లు నిర్వాకంలో ఇరుక్కున్న కేసులకు భయపడో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మరే అవినీతి కార్యక్రమాలు బయటికొస్తాయన్న భయంతోనో కానీ మొత్తానికి ఆయన ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని నిలదీయలేరని తేలిపోయింది. మాతో ఉండాలనుకుంటే మేం చెప్పినట్టు నడవండి అని కేంద్రం ఇప్పటికే రాష్ర్ట ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు సమాచారం. అంతేకాదు రేపో మాపో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏం చేయబోతున్నదో స్పష్టమయిన ఒక ప్రకటన రాబోతున్నదనీ, దానికోసం ఢిల్లీలో కసరత్తు జరుగుతున్నదని సమాచారం. ప్రతిపక్షనేత రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రోడ్డెక్కితే, కనీవినీ ఎరుగని ఎండలకు గొంతు తడుపుకోవడానికి కూడా కూడా నీరందక రాష్ర్ట ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి అమెరికా విహారయాత్రకు వెళ్లారు. నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తున్నారు వినండి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తుని తగువుతో నగుబాటు
డేట్లైన్ హైదరాబాద్ తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నేత కనిపించాడు, పులివెందుల కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగితే వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గడిచిన గురువారం తెలంగాణ భవన్లో పత్రికల వారితో మాట్లాడారు. ఈ పత్రికా గోష్టి, రెండురోజులకు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగం వరకే ఆయన తన ప్రచారాన్ని పరిమితం చేశారు. ముఖ్యమంత్రి బదులు ఆయన కుమారుడు, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రచార బాధ్యత మొత్తం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మంచిదే. ఆయన నగరంలో తిరిగి ప్రచారం చేస్తే జనానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. భద్రతా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమంత్రి పత్రికాగోష్టిలో పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఏం పని? హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా ఊడ్చాల్సిన నగరాలు బోలెడున్నాయి’ అని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆక్షేపణను చాలామంది తప్పు పట్టారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌కు పరిమితమయిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికయిన ఇద్దరు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుని, అందులో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చిన చంద్రశేఖర్‌రావు తోటి తెలుగు ముఖ్య మంత్రికి ఇక్కడేం పని అనడం బాగా లేదన్నారు కొందరు. హైదరాబాద్‌లోనే ఉంటారా? ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు, జాతీయ అధ్యక్షుడి హోదాలో వస్తేతప్పేంటి అన్నారు మరికొందరు విమర్శకులు. నిజమే, ఎవరయినా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఆ కోణం నుంచేచంద్రబాబు ప్రచారం చేయడాన్ని చూడాలి. అప్పటికే ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌బాబు, ఇతర నాయకులు హైదరాబాద్ ప్రచారంలో ఉన్నారు. లోకేశ్ తన ప్రచారంలో కొన్నిచోట్ల, ‘నేను హైదరాబాద్‌లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, కాబట్టి ఇక్కడి వాడినే!’ అని చెప్పారు. ఎవరికీ అభ్యంతరం ఉండ నక్కరలేదు. నిజానికి ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా హైదరాబాద్ వాసే. 2014 ఎన్నికలలో ఆయన హైదరాబాద్(తెలంగాణ)లో ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అయితే పరిస్థితులు మారిపోయాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ చంద్రబాబు, నేనెక్కడికీ పోలేదు, ఇక్కడే ఉన్నా, ఉంటాను అని కూడా అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటా నంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు. భారతదేశంలో ఎక్కడయినా స్వేచ్ఛగా జీవించే హక్కు మన రాజ్యాంగం అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ప్రసాదించింది. మరి, ఆయన ఇక్కడే ఉంటానని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? నేనున్నానని ఆయన ఎవరికి భరోసా కలిగించాలని అనుకుంటున్నారు, హైదరాబాద్‌లో? ఇక్కడ ఆయన లేనప్పుడు ఎవరికయినా ఇబ్బంది కలిగితే, అప్పుడు అలాంటి భరోసా కలిగిస్తే అర్థం ఉంది. అటువంటి వాతావరణం హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించలేదు ఈ 20 మాసాల్లో. ఇక్కడ లేకుండా పోవాల్సిన పరిస్థితులను ఆయనే కల్పించుకున్నారు. సరిగా ఉంటే పదేళ్లపాటు (2019లో ప్రజలు మళ్లీ అధికారం ఇస్తే గిస్తే ) ఆయన ప్రభుత్వాన్ని హాయిగా హైదరాబాద్ నుంచే నడుపుకుని ఉండేవారు. అట్లా కాకుండా అర్ధంతరంగా మూటా ముల్లే సర్దు కుని విజయవాడలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన చెయ్యాల్సి రావ డానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ జూన్ మాసం నాటికి అంతా విజయవాడ వచ్చెయ్యాల్సిందేనని ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదేశాలు జారీ చేసి, ఇంకో పక్క నేనెక్కడికీ పోను ఇక్కడే ఉంటానని చంద్రబాబు చెప్ప డంలో అర్థం ఉందా? మరి ఇలా మాట్లాడతారెందుకు? ఎందుకంటే, నగ రంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతవాసులు ఈ భరోసాతో జీహెచ్ఎంసీ ఎన్నిక లలో టీఆర్ఎస్కు కాకుండా, తమకు ఓట్లేస్తారన్న ఆశ. పోలింగ్ కూడా పూర్త యింది. ఇక్కడి ఆంధ్రుల ఓటు ఎవరిదో రెండురోజుల్లో తెలిసిపోతుంది. ఎప్పుడూ పరనిందే ఇక తెలంగాణ సీఎం పత్రికా గోష్టిలో చేసిన వ్యాఖ్య గురించి- ఆయన చెప్పిన హిందూపురం, ఇచ్ఛాపురాల మధ్యలోనే తుని అనే పట్టణం ఉంది. హిందూ పురానికీ ఇచ్ఛాపురానికీ మధ్య చంద్రబాబునాయుడు ఊడ్చాల్సింది చాలా ఉందన్నమాట అక్షరసత్యమని మొన్ననే తుని చెప్పేసింది. వెనుకబడిన వర్గాల జాబితాలో తమను చేర్చాలని కాపు సామాజికవర్గం కొన్ని దశా బ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విషయం అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహి స్తున్న ముద్రగడ పద్మనాభం పట్టుదల, కార్యాచరణ శైలి కూడా చంద్ర బాబుకు సుపరిచితమే. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉద్యమంలో ముద్రగడ దగ్గరికి వెళ్లి చంద్రబాబు మద్దతు కూడా ప్రకటించారు. ఇది తెగని సమస్యగా ఉందనీ, పూర్తిగా తమ చేతుల్లో ఉండదనీ, కేంద్ర ప్రభుత్వం కూడా కలసి రావాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బీసీల జాబితాలో చేర్చితే ఇంకోచోట గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు తలనొప్పిగా తయారవుతారు కాబట్టి కేంద్రం ఈ అంశంలో కలసిరాదనీ చంద్రబాబుకు తెలియదనుకోవాలా? ఆయనకు అన్నీ తెలుసు. రైతు రుణ మాఫీ తమ వల్ల కాదని తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేననీ తెలుసు. కాపులను బీసీలలో చేర్చలేననీ తెలుసు. అయినా అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కడానికి ఆయన చేసిన ఒకానొక వాగ్దానం ఇవ్వాళ తుని సంఘటన రూపంలో మెడకు చుట్టుకున్నది. తన మెడకు చుట్టుకున్న పామును ప్రతిపక్షాల మెళ్లో, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి మెడలో వెయ్యడానికి ఆయన రెండు రోజులుగా అవస్థపడుతున్నారు. విపక్షనేతపై అసహనం కాపులను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చుతామని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1,000 కోట్లు సమకూరుస్తామని ఎన్నికల సమ యంలో వాగ్దానం చేసి, మాట తప్పినందుకు ఆ సామాజికవర్గం ఆందోళనకు దిగబోతున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ చాలా ముందే తెలుసు. తునిలో జరగబోయే కాపు గర్జనను అడ్డుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. అయినా సాధ్యం కాలేదు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్న ఆ సామాజికవర్గం వారు చిన్నా పెద్దా తుని చేరుకున్నారు. ఆందోళన అదుపు తప్పింది. ఒక రైలు మొత్తం దగ్ధం చేశారు. పోలీస్స్టేషన్ల మీద దాడి చేశారు. పోలీసులను కొట్టారు. దీనినం తటినీ అన్ని న్యూస్ చానళ్లూ ప్రసారం చేశాయి. కానీ, ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ మరీ ముఖ్యంగా నిఘా విభాగానికీ సమాచారం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎంత అదుపు తప్పి సాగుతున్నదో అర్థం చేసు కోవచ్చు. ఒక పక్క తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే సీఎం విజయవాడలో మీడియాను పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు మాత్రం మొత్తం జరిగిందంతా కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కనిపించాడు, పులివెందుల పట్టణం కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘ టన జరిగితే సంయమనం పాటించి, వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ (ద్వేష ప్రసంగం) యథేచ్ఛగా చేసేశారు. ఆందోళన అదుపు తప్పి విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం సేకరించి తనకు అందించలేకపోయిన నిఘా వ్యవస్థను నిలదీయాల్సింది పోయి, ఆరు న్యూస్ చానళ్ల ఓబీ వ్యాన్లు అక్కడికి ఎలా వెళ్లాయి? వాళ్లకు ముందే ఇదంతా జరుగుతుందని తెలుసు అని ఒక సీఎం మాట్లాడటం హాస్యాస్పదం. ప్రచార ప్రసార మాధ్యమాలు ఎట్లా పనిచేస్తాయో ఆయనకూ, ఆయన సమాచార వ్యవస్థను నిర్వహిస్తున్న భజనపరులకూ తెలియని కారణంగానే చంద్రబాబు మీడియాను ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని అని తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ఆక్షేపించిన వాళ్లే ఇప్పుడు అవును, అక్కడ తుని తగలబడుతుంటే చంద్రబాబు హైదరాబాద్‌లో ఫిడేల్ వాయించడం ఏమిటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. కాపుల ఉద్యమం ఇక్కడితో ఆగిపోవడం లేదు. శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య ఆమరణ నిరాహార దీక్షకు కూర్చో బోతున్నారు. ముద్రగడ దీక్షలు ఎట్లా ఉంటాయో చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకుడినీ, మీడియానూ తిడుతూ కూర్చో కుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన నిఘా వ్యవస్థను చక్క దిద్దుకుని, కాపుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిది. కేరళలో షూటింగ్లో ఉన్న పవన్ కల్యాణ్‌ను హుటాహుటిన రప్పించి మీడియా ముందు హాజరుపరిస్తే సమసిపోయే అంత సులువయిన సమస్య కాదిది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు కొట్టి పోయారు
(డేట్లైన్ హైదరాబాద్) మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును ఆహ్వానించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లారనే వార్త విని సంతోషం పట్టలేకపోయానని ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదిక మీద పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు సఖ్యంగా ఉంటే ప్రధాని నిజంగా సంతోషించవలసిందే. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ విభేదాలను, అహాన్ని పక్కన పెట్టి ప్రజోప యోగం కోసం కలసి పని చెయ్యాలనుకుంటే ప్రధానమంత్రే కాదు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలూ సంతోషిస్తారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ భుజం భుజం కలిపి నడిస్తే తెలుగు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వారవుతారని ప్రధాని కూడా చెప్పారు. చంద్రబాబు ఆహ్వానించడంతో కేసీఆర్ సహచరులతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారట, శంకుస్థాపనకు తాను స్వయంగా వెళ్లడమా లేక మంత్రుల బృందాన్ని పంపడమా అని. ఆయనే హాజరైతే బాగుంటుందని అందరూ సూచించాక, అందుకు సిద్ధమై, తెలంగాణ నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా ప్రకటించాలని కూడా నిర్ణయించుకుని బయలు దేరారట. అయితే రాజధాని నిర్మాణానికి నిధులను గురించిన ప్రస్తావన ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి కానీ, అటు ప్రధాని నుంచి కానీ రాకపోవ డంతో తెలంగాణ ముఖ్యమంత్రి తానెందుకు ఆ చొరవ చూపాలని మిన్న కుండిపోయారనీ, లాంఛనంగా అభినందనలతో ముగించారనీ టీఆర్ఎస్ ముఖ్యవర్గాలే చెబుతున్నాయి. నిజమే, నిర్మాణ భారం వహించవలసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ, ఇచ్చిన మాట మేరకు ఇతోధిక సాయం ప్రకటిం చాల్సిన కేంద్ర ప్రభుత్వానికీ పట్టనప్పుడు చంద్రశేఖర్‌రావు ఎందుకు అత్యు త్సాహం చూపించడం? ఇదే ప్రధాని చూపిన స్వర్గం గత సార్వత్రిక ఎన్నికలలో మోదీ, బాబు జోడీ కలసి పోటీ చేసింది. ప్రపంచ ప్రఖ్యాత రాజధానిని నిర్మించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అందలం ఎక్కిస్తామని వాగ్దానాలు చేశారు. కానీ అమరావతి శంకుస్థాపన నాడు ఆ అంశం జోలికి ఎందుకు వెళ్లలేదు? అంతకు ముందు దాదాపు రెండుమాసాల నుంచి టీడీపీ, బీజేపీ నాయకులు మీడియాలో ఊదరగొట్టారు, ‘ప్రధాని వస్త్తున్నారు, చూసు కోండి, ఏమేం తెస్తున్నారో!’ అని. ఓ జన్నత్ దిఖాయేగా (ఆయన స్వర్గం చూపిస్తాడు) అని. అవును, ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే స్వర్గం చూపించారు. పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం. ఆ దేవాలయం నుంచి స్వయంగా మట్టి తెచ్చారు. అది స్వర్గం నుంచి వచ్చినట్టే! మరో స్వర్గతుల్య మయిన యమునా పుణ్యజలాలను కూడా రాజధాని నిర్మాణంలో తమ వాటాగా అందించారు ప్రధాని. ఓ జన్నత్ ది ఖాయా అవుర్ జహాన్నూం మే పహుంచాయా (అరచేతిలో స్వర్గం చూపించి అడవిలో వదిలి వెళ్లాడు). శంకు స్థాపన ముగిశాక లెక్కకు మించిన హెలికాప్టర్లు ప్రముఖులను తీసుకుని గాలిలోకి ఎగరడంతో దుమ్ము పడ్డ కళ్లు నులుముకుంటూ ఇంటి దారి పట్టిన ఆ ప్రాంత రైతులు ఇదే గొణుక్కున్నారు. కార్యక్రమం ముగిశాక మామూలు మనుషులు కావడానికి టీడీపీ, బీజేపీ కూటమికి రెండు మూడురోజులే పట్టింది. చంద్రబాబు ఇరవై నాలుగు గంటల తరువాత మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తాను ప్రత్యేక హోదా అనబోయి, పొరపాటున ప్రత్యేక ప్యాకేజీ అన్నానని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధాన మంత్రి, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఇంత ముఖ్యమైన విషయంలో ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? ఎన్నో చేశారు అని ముఖ్యమంత్రి, అన్నీ చేస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం తప్ప బోలెడు ప్రజాధనాన్ని వెచ్చించి ఇంత అట్టహాసంగా, ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రం నుంచి భవిష్యత్లోనయినా ఎలాంటి సాయం వస్తుంది అన్న అంశం మీద ఎవరికీ స్పష్టత రాలేదు. ఆత్మార్పణల సంగతి తెలియదా? ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి ఆహ్వానించిన విషయం ప్రధాని దృష్టికి వచ్చింది కానీ, కేంద్రమే ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలుకు జరుగుతున్న ఆందోళనలు మాత్రం ఆయన దృష్టికి రాలేదు. ప్రత్యేక హోదా రాదేమో అన్న నిస్పృహతో కొందరు ఆత్మాహుతికి పాల్పడ్డారు. భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్‌లో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేయగల ఉద్యమం ఒకటి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్నదన్న విషయం, దాని కోసం ఆ అమరావతికి కూతవేటు దూరంలోనే ఒక పక్షం రోజుల ముందు ప్రతిపక్ష నేత నిరవధిక దీక్ష చేసిన విషయం ప్రధాని దృష్టికి రాష్ర్ట ప్రభుత్వం కానీ, కేంద్ర నిఘావర్గాలు కానీ, ఆయన పార్టీ యంత్రాంగం కానీ తీసుకుపోకపోవడం చిత్రమే. కనీసం మీడియా ద్వారానైనా తెలిసి ఉండదా అంటే జాతీయ మీడియాకు ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ర్టం ఉన్నట్టు కానీ, అక్కడ ప్రత్యేక హోదా కోసం జీవన్మరణ పోరాటం జరుగుతున్నట్టు కానీ తెలిసినట్టే లేదు. తెలంగాణలో కవితమ్మ ఆధ్వర్యంలో ఆడించే బతుకమ్మలను చూడటానికీ, అమరావతిలో రాజధాని శంకుస్థాపన వేడుకలు చూడటానికీ పొలోమని రావడానికి తీరిక ఉన్న ఢిల్లీగత జీవులయిన జాతీయ మీడియాకు ఆంధ్రప్రదేశ్‌లో హోదా కోసం సాగుతున్న ఉద్యమం ఊసే పట్టకపోవడం విచారకరం. మూడు నాలుగు పంటలు పండే బంగారం లాంటి భూములు కోల్పోయిన రైతులకు ఏ ప్రయోజనం చేకూర్చనున్నారో శంకుస్థాపన సందర్భంగా ప్రకటిస్తారని అంతా ఆశించారు. ప్రత్యేక హోదాపైనకూడా ఒక స్పష్టత ఇస్తారని కూడా అనుకున్నారు. బిహార్ తరహాలో కొన్ని లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని కొందరు ఆశపడ్డారు. కుండెడు మన్ను, చెంబెడు నీళ్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ముఖాన కొట్టి వెళ్లిపోయారు ప్రధానమంత్రి. ఈ మన్ను, నీళ్ల కథే పెద్ద ప్రహసనం. ఆంధ్రప్రదేశ్ ప్రజలను అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించి సెంటిమెంట్‌తో కొట్టాలన్న పనికిరాని ఆలోచన ఇది. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కి రాజధాని ప్రాంతం అంతటా సర్వమత సమానత్వం పేరిట చర్చిల నుంచి, గురుద్వారాల నుంచి, మసీదుల నుంచి తెచ్చిన మట్టి, నీళ్లు చల్లడం, దీనికో పవిత్రతను ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వాధినేతలే చేయడం రాజకీయ జిమ్మిక్కు అని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ముందున్నది ముసళ్ల పండుగ ప్రత్యేకహోదా కావాలని ముఖ్యమంత్రి ఈ వేదిక మీద పట్టుపట్టనందుకు ప్రధాన మంత్రి మోదీ, రాజధాని నిర్మాణం ఎవరికి అప్పగించనున్నారు? లెక్కాపత్రం ఏమిటి అని ప్రధాని ప్రశ్నించనందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి- ఇద్దరే ఆ ప్రాంగణం నుంచి సంతోషంగా తిరిగి వెళ్లారు. సంతో షంగా తిరిగి వెళ్లిన మూడో వ్యక్తి- తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను చూసి చేసిన హర్షధ్వానాలు, త్వరలో వస్తాయనుకుంటున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర ప్రజల ఓట్లు తన పార్టీకి తెచ్చి పెడతాయనడానికి నిదర్శనమన్న సంబరం ఆయనది. అటు ప్రధానమంత్రికి కానీ, ఇటు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు కానీ ఇందులో సంతోషించాల్సింది ఏమీలేదు. ముందున్నది ముసళ్ల పండుగ. ఆయన పిలిచారు, మీరు వెళ్లారు బాగానే ఉంది. కాని ఓటుకు కోట్లు వ్యవహారం సంగతి ఏమిటి అని చంద్రశేఖర్ రావును తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తారు. అంతేకాదు, మీరు కూర్చున్న వేదిక మీద ప్రధాని తెలంగాణ రాష్ర్ట ఏర్పాటునే వ్యతిరేకిస్తూ మాట్లాడితే మీరేం చేస్తున్నారు అని కూడా అడుగుతారు తెలంగాణ ప్రజలు. స్వార్థపరులు, రాజ కీయ స్వప్రయోజనాలు ఆశించిన వారూ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌ను చీల్చారు అని అమరావతి సాక్షిగా నరేంద్ర మోదీ మరొక్కమారు ప్రకటిం చారు. ఇది తెలంగాణ ఉద్యమ వీరుడు చంద్రశేఖర్‌రావు చెవులకు సోకలేదా? అమరావతి సందర్శన ప్రధానమంత్రికీ ఆయన పార్టీకీ రెండు రాష్ట్రా ల్లోనూ రెంటికీ చెడ్డ రేవడి అనుభవాన్ని మిగిలించే అవకాశం ఉంది. చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన, రాష్ర్ట విభజనను పూర్తిగా సమర్థించిన భారతీయ జనతా పార్టీ విధానమూ, నరేంద్ర మోదీ విధానమూ వేర్వేరా అనే అభిప్రాయం కలుగుతున్నది. ఆయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారు అని రాష్ట్ర విభజన వ్యతిరేక వైఖరినే చాటుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తెలంగాణలోనూ, ప్రత్యేక హోదా సహా ఏ ప్రయోజనమూ అందించక ఆంధ్రప్రదేశ్‌లోనూ బీజేపీ నాయకులు, శ్రేణులు ప్రజల్లో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకోవడం మాత్రం తథ్యం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ ఒత్తిడుల కారణంగా చేస్త్తున్నారో కానీ మొన్న అమరావతి వేదిక మీద మాట్లాడినప్పటి లాగానే కేంద్రాన్ని సమర్థిస్తూ పోతే విపరిణామాలు మరింత తీవ్రం కాకతప్పదు. (వ్యాసకర్త: దేవులపల్లి అమర్, ప్రముఖ పాత్రికేయులు) -
ప్రభుత్వాల ‘ప్యాకేజీ’ ప్రహసనం
డేట్లైన్ హైదరాబాద్ ప్రత్యేక హోదాకు, ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా ప్రభుత్వంలోని పెద్దలకు, వారి తరఫున లేదా వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్న పెద్దలకు, ఆ వర్గం మీడియాకు తెలియదనుకోవాలా? ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీల కారణంగా ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులకు నడుమ ఉండే తేడాను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది అభివృద్ధి కాగా, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. అందులో ఎంత సద్వినియోగం అవుతుందో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? నరేంద్ర మోదీ మహరాజ్ బిహార్ రాష్ర్టం మీద వరాల జల్లు కురిపించారు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, మహరాజ్ అంటారేమిటి అనే సందేహం వద్దు. ఆయన తాను ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నానని కానీ, ఆ దేశానికి అయిదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉండి తమ తరఫున పరిపాలన చెయ్యమని ప్రజలు ఓట్లేసి గెలిపించారని కానీ అనుకుంటున్నట్టు లేరు. బిహార్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన ప్రసంగం, ఆయన హావభా వాలూ రాజరిక వ్యవస్థ ప్రతినిధిని తలపిస్తాయే తప్ప, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్న నాయకుడు ఉపన్యసిస్తున్న తీరులో మాత్రం కనిపించవు. బిహార్‌కు ఆర్థికసాయం ఎంత కావాలి అని అడిగిన మోదీ, జనం చప్పట్లు, ఈలల మోత పెరిగిన కొద్దీ ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోయారు. ఆయన బిహార్‌కు ఒక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలనుకున్నారు. దాని కోసం ఆయన 50 వేల కోట్ల రూపాయల నుండి మొదలు పెట్టి లక్షా ఇరవై ఐదు వేల కోట్ల సాయం ప్రకటించారు. ఆ కోట్లు ఎవరివి? బిహార్‌కు బోలెడు డబ్బు అవసరమే కావచ్చు. కేంద్ర సహాయం కూడా చాలా అవసరమే కావచ్చు. కానీ ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, బిహార్‌కు సాయంగా అందిస్తానని మోదీ చెబుతున్న లక్షా ఇరవై ఐదువేల కోట్లు ఎవరి డబ్బు? ఎక్కడి నుండి వచ్చింది? రెండు, ఏ ప్రాతిపదికన, ఎవరి ఆమోదంతో ఈ సాయం ప్రకటించారు? ఈ ప్రశ్నలు ఎందుకు వెయ్యాల్సి వస్తున్నదంటే రాష్ర్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఊసు ఎత్తితేనే కేంద్రంలోని పెద్దలు లేవనెత్తే అభ్యంతరాల జాబితా, చూపే కుంటిసాకుల జాబితా చేంతాడంత ఉంటుంది. మరి, బిహార్‌కు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించేటప్పుడు ఈ సమస్యలేవీ అడ్డురాలేదా? లేకపోతే 2014 ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన ఉత్తుత్తి హామీగానే బిహార్‌కు ప్రకటించిన సహాయాన్ని కూడా పరిగణించాలా? ఈ అనుమా నాలు ఎందుకొస్తాయంటే బిహార్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి. ఎన్నికల తరువాత ఓడిపోతే సరే సరి, మమ్మల్ని గెలిపిస్తే ఈ సాయం అందేది అని తప్పించుకోవచ్చు. గెలిచినా కూడా ఎగ్గొట్టెయ్యవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసింది అదే కదా! ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాల్సిందే అని రాజ్యసభలో వీరంగం వేసిన వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రి. పదేళ్లు కూడా సరిపోవు పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనన్న తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీని భాగస్వామిగా చేర్చుకున్నదే. ఆంధ్ర ప్రజలకు ఏం చెబుతారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీని ఎన్నికలలో గెలిపించడానికి బిహార్‌లో ఇంకా ఇటువంటి సర్కస్‌లు ఎన్నయినా చెయ్యొచ్చు. ఒక్కటి మాత్రం బీజేపీ పెద్దలు గుర్తించుకోవాలి. పద్నాలుగు మాసాలు గడిచి పోతున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చక పోగా, ఢిల్లీ నుండి గల్లీ దాకా బీజేపీ, టీడీపీ పెద్దలు, చిన్నలు మాట్లాడుతున్న మాటలు ఆ రాష్ర్ట ప్రజల మనోధైర్యాన్ని ఎంతగా దెబ్బతీశాయో తిరుపతిలో మునికోటి ఆత్మా హుతితో అయినా గుర్తించకపోతే అధికార టీడీపీ సరే, స్వతంత్రంగా రాజ కీయ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి కూడా భంగపాటు తప్పదు. బిహార్‌కు నరేంద్ర మోదీ చేసిన వాగ్దానం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజలకు ఏం జవాబు చెబు తుందో చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షాలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ఇప్పటి దాకా రకరకాల కార ణాలు చెబుతూ కాలయాపన చేశారు. ముఖ్యమైన ఈ సమస్య మీద అఖిల పక్షాన్ని దగ్గరికి తీసుకుని, చర్చించడానికి ఏనాడూ ప్రయత్నం చేయలేదు. పైగా కాసేపు ప్రణాళికా సంఘం రద్దయి, నీతి ఆయోగ్ వచ్చిందంటారు. మరి కాసేపు ఆర్ధిక సంఘం బూచిని చూపిస్తారు. ఇంకాసేపు ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్లో ప్రకటనలు చేయిస్తారు. మళ్లీ ప్రత్యేక హోదా మీద పట్ట్టుదల ఎందుకు, ప్రత్యేక ప్యాకేజీల ద్వారా బోలెడు నిధులు తెస్తాం అంటారు. ఏదీ, మరి ఏ సాయమూ అందలేదేమిటంటే, బిహార్ ఎన్నికల భూతాన్ని చూపిస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రే స్వయంగా బిహార్‌కు చేయబోయే సాయాన్ని ప్రకటించాక ఏం చెబుతారు? ప్రత్యేక హోదా ఎక్కడ? ప్యాకేజీ ఎక్కడ? అసలు ఈ ప్రత్యేక హోదా కోసం పట్టుదల ఎందుకు? మనకు కావలసినన్ని నిధులు తెచ్చుకుంటే చాలదా అని వాదిస్తున్న పెద్దలు కొందరు ఉన్నారు. మీడియాలోని ఒక వర్గం కూడా ఈ అంశాన్నే గట్టిగా ప్రచారం చేస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక దశ వరకు ప్రజలను మానసికంగా ప్యాకే జీలకు సిద్ధం చేసే ప్రయత్నమే చేసింది. ఇదొక విచిత్రమయిన వాదన. జనాన్ని మోసం చేసే మాటలు ఇవి. ప్రత్యేక హోదాకు, ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా ప్రభుత్వంలోని పెద్దలకు, వారి తరఫున లేదా వారిని కాపాడ టానికి ప్రయత్నిస్తున్న పెద్దలకు, ఆ వర్గం మీడియాకు తెలియదనుకోవాలా? ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీల కారణంగా ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవ కాశాలకు, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులకు నడుమ ఉండే తేడాను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది అభివృద్ధి కాగా, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. అందులో ఎంత సద్వినియోగం అవుతుందో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? అయినా ప్యాకేజీల జపమే చేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు చివరికి కేంద్రాన్ని కొంచెం గట్టిగా అడిగినట్టు జనానికి చూపించుకోక తప్పలేదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మళ్లీ ఇందులో రాజకీయ క్రీడ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ర్టంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల ముందు ఒకరినొకరు పలచన చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదంతా అన్న వాదన కూడా వినబడుతున్నది. ఏకాంతంలో ఏం చర్చిస్తారు? ఏదిఏమైనా, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారూ రోడ్డెక్కాక, ప్రత్యేక హోదా కోసం తొలి నాటి నుండే పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమం జంతర్ మంతర్ చేరాక, మునికోటి ఆత్మాహుతి చేసుకున్నాక ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నుండి రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్లో ఆహ్వానం అందింది. చూశారా! ‘మీరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి!’ అని చెప్పడా నికి మనుషులు చావాలన్న మాట. కనీసం ఇప్పుడైనా పిలిచారు సంతోషం. రేపు, అంటే ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు, ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి. తామిద్దరూ జంటగా ఎన్నికల ప్రచార వేదికలెక్కి ఇచ్చిన మాట ప్రత్యేక హోదా. దాని మీద మళ్లీ ఏకాంతంలో ఏం చర్చిస్తారు? బిహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ మీద లక్ష కోట్ల కాసుల వాగ్దాన వర్షం కురిపిస్తారా? బిహార్ విషయంలో ఇది ఎవరి సొమ్ము అని ఎట్లా అంటున్నామో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అదే అనవలసివస్తుంది. ఆహ్వానం తెప్పించుకుని మరీ ఢిల్లీ వెళుతున్న ముఖ్యమంత్రికి బాగా తెలుసు- కేంద్రం నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు రాబోయే సాయం ఏమిటో. అయినను పోయిరావలె హస్తినకు. కాబట్టి వెళతారు, వస్తారు. (వ్యాసకర్త దేవులపల్లి అమర్) -
తుపాకులే మాట్లాడతాయా?
డేట్లైన్ హైదరాబాద్ ఒకే ఎన్కౌంటర్లో 20 మంది చనిపోతే... నోరైనా విప్పకుండా చైనా వెళ్ళిన ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు నేరస్తులే కావొచ్చు. రాష్ట్రానికి బోలెడు ఆదాయాన్నిచ్చే ఎర్ర చందనం దొంగలే కావొచ్చు. నేరస్తులే అయినా వారిని చంపే అధికారాన్ని రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇవ్వలేదు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌కు కితాబులిచ్చిన వెంకయ్యనాయుడు ఏపీ ఎన్‌కౌంటర్‌పై మాత్రం ఎన్కౌంటర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని మౌనం దాల్చారు. గత వారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే రోజున జరిగిన రెండు ఎన్కౌంటర్లకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితి. తెలంగాణలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమైన ఐదుగురూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియో గాలతో జైల్లో ఉండి విచారణను ఎదుర్కొంటున్నవారు, అంతా ముస్లింలే కావడంతో... బీజేపీ స్థానిక నాయకులు కొందరు చాలా అలవోకగానో లేదా యధాలాపంగానో వికారుద్దీన్ ముఠాను మట్టుబెట్టడంలో మన పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడారు. స్థానిక నాయకులేం కర్మ, జాతీయస్థాయిలోనే అత్యంత ముఖ్య నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కుడిభుజంగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడుది సైతం అదే ధోరణి. ‘సిమి’ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవా దులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని ప్రశంసించారు. (ఉగ్రవాదాన్ని సమర్థవం తంగా ఎదుర్కోవడ మంటే ఇట్లా చేతులకు సంకెళ్ళు వేసివున్న ఖైదీలను చంపేసి, చేతిలో తుపాకీ పెట్టేయడమేనా వెంకయ్య నాయుడు గారూ?) ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో అనుమానాలను నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత మాత్రం ఆ రాష్ర్ట ప్రభుత్వానిదేనని ఆయన ఒక్క మాటలో తేల్చిపారేశారు. ‘శేషాచలం’పై వెంకయ్య మౌనవ్రతం ఈ రెండు ఎన్కౌంటర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్రా లకు సంబంధించిన అంశం అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలం గాణలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి కితాబులిచ్చిన కేంద్ర మంత్రి ఏపీ ఎన్కౌంటర్ విషయంలో కూడా అంతే స్పష్టంగా ఏదో ఒక మాట అని ఉండొచ్చు కదా? ఏపీలోని ‘‘శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం నరుక్కుపోతున్న వాళ్ళను చంపడంలో తప్పు లేదు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, మా అడవుల్లోకి వస్తే ఇదే పని చేస్తాం’’ అని అధికార పార్టీకి చెందిన బాధ్యతగలిగిన నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉన్నారు కదా! వారితో ఏకీభవిస్తున్నామనో లేదా వ్యతిరేకిస్తున్నామనో చెప్పా లి కదా, మరి ఎందుకిలా రాష్ర్ట ప్రభుత్వంపైకి బాధ్యతను నెట్టేసి మౌనంగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారూ? రెండు రాష్ట్రాల్లో పోలీసు కాల్పుల్లో మరణించిన వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం వల్లనేనా? వెంకయ్య నాయుడు ప్రకటనే అటువంటి అనుమానానికి తావునిస్తున్నది. ముస్లింలకు ఓటు హక్కు తీసెయ్యాలనే విపరీత ధోరణిని వెంకయ్యనాయుడు భావజాలానికి సన్నిహితులైనవారు అతి బిగ్గరగా మాట్లాడుతున్న రోజులివి. ‘‘ఇండోనేసియా తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలు నివసించే భారత దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఎంతో దారుణం, బాధాకరం’’ అన్నారు ప్రముఖ మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ ఒక సందర్భంలో. ఎర్రచందనం నెత్తుటి మడుగున ఏపీ సర్కారు సరే, ఈ అంశాన్ని పక్కన పెట్టి ఏపీ ఎన్కౌంటర్ గురించే మాట్లాడుకుందాం. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించాక రాష్ర్ట ప్రభుత్వానికి వేరే దారి లేదు. ప్రత్యక్ష సాక్షులున్నారు కాబట్టి శేషాచలం ఎన్కౌంటర్ నిజానిజాలు బయటికి రాక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లెక్కలేనన్ని ఎన్కౌంటర్లలో ఎన్నిం టిని బూటకంగా నిరూపించగలిగారు? ఎన్నింట్లో పోలీసులకు శిక్షలు పడ్డాయి? అని తేలికగా కొట్టి పారేయలేరు. గతంలో జరిగిన ఎన్కౌంటర్ లకూ, దీనికి తేడా ఉంది. ‘శేషాచలం’లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుకున పడక తప్పేట్టు లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసు అధికారులు, కొన్ని మీడియా సంస్థలు ఎంతసేపూ ఆ ఎన్‌కౌంటర్‌ను సమర్థిం చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయే తప్ప ఎంతటి నేరస్తులనైనా చంపే అధి కారం పోలీసులకు లేదనే విషయం మరచిపోతున్నారు. దొంగలకు కూడా పౌర హక్కులుంటాయని బాలగోపాల్ కొన్ని వందలసార్లు చెప్పి ఉంటాడు, రాసి ఉంటాడు. ఎర్ర చందనాన్ని దొంగతనంగా నరుక్కుపోయే స్మగ్లర్లకూ, పొట్ట కూటి కోసం, కిరాయికి స్మగ్లర్ల కోసం అడవుల్లో చె ట్లు కొట్టడానికి వ చ్చి తూటాలకు బలైన కూలీలకు కూడా ఆ పౌర హక్కులుంటాయి. ఆ మాటంటే మరి విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందినీ అధికారులనూ, పోలీసు ఉద్యోగులనూ ఎర్ర చందనం స్మగ్లర్లు హింసించి చంపినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు. అధికార పార్టీ, ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అంతా నిజానికి అదే. ఎర్ర చందనం దొంగల అకృత్యాల గురించి గతంలో ఎన్నడు లేనంతగా పత్రికల్లో వరుసగా కథనాలు వస్తు న్నాయి. అధికారులూ, రాజకీయ నాయకులూ అదే మాట్లాడుతున్నారు. ఈ ఎన్కౌంటర్ అన్యాయం అని అంటే చాలు... ఈ ఉదాహరణలతో వారి మీద విరుచుకు పడిపోతున్నారు. ఆ ఇరవై మందినీ చంపేయడం న్యాయమేనని అందరినీ ఒప్పించేయడానికి సకల ప్రయత్నాలూ సాగుతున్నాయి. అడ్డగోలు ప్రకటనలతో బిగుస్తున్న ఉచ్చు శేషాచలం అడవుల నుంచి ఎర్ర చందనం నరుక్కుపోవడానికి 150 మంది కూలీలు వచ్చినట్టు సమాచారమని డీఐజీ కాంతారావు తొలి ప్రకటన. వాళ్ళను ఎదుర్కోవడానికి 24 మందితో కూడిన రెండు టాస్క్ఫోర్సు బృందాలు వెళ్లాయనీ ఆయనే చెప్పారు. ఆ బృందాలకు 100 మంది స్మగ్లర్లు ఎదురుపడ్డారనీ ప్రకటించారు. 100 మంది గొడ్డళ్ళూ, రాళ్ళతో దాడికి దిగితే, 24 మంది సాయుధ పోలీసులు వారిని నిలువరించలేక కాల్పులు జరిపారనీ, 20 మందిని చంపగలిగారనీ చెబితే ఎవరు నమ్మాలి? ఆ ప్రకటనలే ఇదో కట్టు కథని స్పష్టంగా చెబుతున్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కూడా బోలెడు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మంత్రులూ, అధికార పార్టీ నాయకులూ చేస్తున్న ప్రకట నలను చూస్తే వీళ్ళకు రాజ్యాంగంపట్లా, చట్టాల పట్లా ఏ మాత్రం గౌరవం లేదనుకోవాలో, అవగాహన లేదనుకోవాలో అర్థంకాని పరిస్థితి. మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఎన్కౌంటర్ జరిగిన జిల్లాకే చెందినవారు, పైగా అటవీశాఖ మంత్రి. అటవీ సంపదను హరించడానికి వస్తే హతమారుస్తాం అంటాడాయన. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన బొజ్జల, ఈ ప్రకటన చేశాక ఇంకా మంత్రి పదవిలో ఎట్లా కొనసాగుతారు? కూలీలు అర్ధరాత్రి గడ్డి కోసుకోడానికి వచ్చారా? తమిళనాడు కూలీలకు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఏం పనీ? అంటూ అటవీ శాఖామాత్యులు ఇంకా చాలానే మాట్లాడారు. ఇక సాక్షాత్తూ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నిమ్మకాయల చిన్నరాజప్ప ఎన్కౌంటర్లో చనిపోయినవారు మన రాష్ట్రానికి చెందిన వారు కారు కాబట్టి నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేశారు. రాష్ర్ట సంపదను కళ్ళ ముందే కొల్లగొట్టి, తీసుకెళ్ళే వాళ్ళను కాల్చి చంపేస్తే తప్పేంటి? అంటూ మాజీ మంత్రి, చాలా సీనియర్ నాయ కుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏకంగా విధాన ప్రకటనే చేసేశారు. ఇదీ మన నాయకుల తీరు. బాధ్యతారహితమైన ఈ ప్రకటనలన్నీ తమ ప్రభుత్వం గొంతుకు ఉచ్చును మరింతగా బిగిస్తున్నాయని వారు అర్థం చేసుకోడం లేదు. నేరస్తులను చంపే హక్కు ప్రభుత్వాలకు లేదు ఇంత పెద్ద సంఘటన జరిగి, ఒక పొరుగు రాష్ర్టంతో సంబంధాలు చెడిపోయే పరిస్థితి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం మరీ విడ్డూరం. వాళ్ళు నేరస్తులే కావొచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి బోలెడు ఆదాయాన్ని సమకూర్చే ఎర్ర చంద నాన్ని కొల్లగొట్టుకుపోతున్న దొంగలే కావొచ్చు. కానీ ఒకే ఒక్క ఎన్కౌంటర్ ఘటనలో 20 మంది మనుషులు తానే పాలకునిగా ఉన్న రాజ్యంలో చని పోతే... కనీసం నోరైనా విప్పకుండా చైనా వెళ్ళిపోయిన ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనాగానీ ఇక్కడ చూడవలసినది ఎన్కౌంటర్ మృతులు తమిళనాడు వారా, స్మగ్లర్లా, కూలీలా, మరింకెవరైనానా? అనేది కాదు. ఎర్ర చందనం నరుక్కుపోవడానికి వచ్చారా, గడ్డి కోసుకోవడానికి వచ్చారా? అనేదీ కాదు. వాళ్ళు మనుషులు, ఆ మనుషులు నేరస్తులయినా సరే చంపే అధికారాన్ని మన రాజ్యాంగం ప్రభుత్వాలకు ప్రసాదించలేదు. ఇక్కడ తుపాకులే మాట్లాడతాయి అంటే చెప్పేదేమీ లేదు. datelinehyderabad@gmail.com -
రెండు రాష్ట్రాలు.. రెండు ఘటనలు..
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటువంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో మంగళవారం రెండు భారీ స్థాయి ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలనొప్పిగా తయారైన ఎర్రచందనం దొంగ రవాణాకు సంబంధించిన ఘటన ఇందులో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం భారతదేశాన్నీ, ఆ మాటకొస్తే ప్రపంచాన్నే చికాకు పరుస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు సంబం ధించిన ఘటన రెండవది. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం శేషాచలం అడవులలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకంగా 20 మందిని చంపేశారు. ఇం తకూ, ఆ చనిపోయినవారు ఎవరు అన్న విషయం నిర్ధారణ కావలసి ఉంది. ఆంధ్ర ప్రభుత్వానికి మచ్చ ఎవరిని చంపుతున్నామో తెలియకుండానే చంపేసి, ఇంకా నిర్ధారణ కావలసి ఉంది అంటే అర్థం ఏమిటి? చనిపోయిన వారిలో ఎవరు కూలీలో, ఎవరు స్మగ్లర్లో ఇంకా నిర్ధారణ కాలేదని సామాన్యులెవరో అనలేదు. ఆ మాటలు అన్నది ఏదో మీడియా వారు అయినా ఫరవాలేదు. ఇంకా పూర్తి సమాచారం తెలిసి ఉండకపోవచ్చునని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆ మాటలు అన్నది సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు. వాళ్లు కూలీలా, స్మగ్లర్లా అన్నది నిర్ధారణ కాకుండా ఇరవై మందిని ఏకబిగిన ఎట్లా కాల్చి చంపారు? స్మగ్లర్లు తలనొప్పిగా మారారు, నిజమే. వారి ఆగడాలను అరికట్టవలసిందే. ఇప్పటికే చాలామంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో వారికి రాజభోగాలు కల్పిస్తున్నారన్న నింద మోస్తున్న వారు ఇప్పుడు తాజా ఎన్కౌంటర్ ఘటనలో ఇరవైమంది మృతికి కారణమై మరింత అప్ర తిష్ట మూటకట్టుకోబోతున్నార న్నది నిజం. శేషాచలం అడవులలో జరిగిన ఈ భారీ ఎదురుకాల్పులలో చనిపోయిన వారు స్మగ్లర్లు నియమించిన కూలీలే అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమూ, పోలీసు బాసులూ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? పొట్టకూటి కోసం వచ్చిన కూలీలను పొట్టన పెట్టుకున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. మిగి లిన ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను ఖండించాయి. పొరుగు రాష్ట్రం తమిళ నాడు రాజకీయ పార్టీలు కూడా నిరసన తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చించుకుని పరిష్కరించవలసిన అంశమని అంటున్నారు. మొత్తం మీద గోరుచుట్టు మీద రోకటిపోటులా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. వీటిలో అత్యంత ముఖ్యమైనది రాజ ధాని నిర్మాణం. దీనితో మిగిలిన సమస్యలన్నీ పక్కకు పోయాయి. అదే క్రమంలో శాంతిభద్రతలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యాల నుంచి తప్పు కున్నట్టు కనిపిస్తోంది. టీ హోంమంత్రి ప్రకటన హాస్యాస్పదం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోను ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొని ఉందని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రెండుమూడు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనలో ఈ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహా రెడ్డి, పోలీస్ డెరైక్టర్ జనరల్ అనురాగ్ శర్మ చేసిన ప్రకటన, శేషాచలం అడవుల ఘటన మీద ఆంధ్ర డీజీపీ చేసిన ప్రకటన కంటే హాస్యాస్పదం. సూర్యాపేట బస్టాండ్ దగ్గర పోలీసుల మీద కాల్పులు జరిపినవారు దోపిడీ దొంగలేననీ, ఉగ్రవాదులు కానేకారనీ ఆ ఇద్దరూ ప్రకటించారు. పూర్తి సమా చారం లేకుండానే బాధ్యత గల పదవులలో ఉన్నవారు మీడియా ముందు ఇలా మాట్లాడడం క్షమించరాని విషయం. ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటు వంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. సరే, ప్రస్తుత సంఘటనల దగ్గరకొద్దాం! ప్రహసన ప్రాయమైన ఎదురుకాల్పుల కథలు మంగళవారం వరంగల్ నుంచి ఖైదీలను హైదరాబాద్ కోర్టుకు తీసుకు వస్తుం డగా ఘర్షణ జరిగి విచారణలో ఉన్న ఐదుగురు ఖైదీలు పోలీసుల ‘ఎదురు కాల్పులలో చనిపోయారు’. నిజానికి పోలీసులూ, వారు జరిపే ఎదురు కాల్పులూ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయాయి. వీటిని సమాజం నమ్మే స్థితి ఎప్పుడో పోయింది. నిజానికి మంగళవారం పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న విచారణ ఖైదీలలో ఒకడు వికారుద్దీన్. గతంలో కూడా ఇదే మార్గంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈసారి కూడా నిజంగానే ఆ ఐదుగురు తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. కానీ తెలంగాణ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ నవీన్‌చంద్ చెబుతున్నట్టుగానే ఆ ఖైదీలు ఐదుగురు, పోలీసులు పదిహేనుమంది. పోలీసుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. వీళ్ల చేతులకు బేడీలు ఉంటాయి. ఎట్లా తిరగబడతారు? ఎట్లా పోలీసుల చేతులలో నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేస్తారు? లేదా పారిపోయే సాహసం చేస్తారు? ఇదంతా నమ్మశక్యంగా ఉండదు. దీనికితోడు ఎన్కౌంటర్ అనగానే పోలీసులే చంపి ఉంటారులేనన్న భావన. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని వికారుద్దీన్ అనే విచారణ ఖైదీ తండ్రి అంటూనే ఉన్నాడు. శనివారం నల్లగొండ జిల్లా సూర్యా పేటలో జరిగిన ఘటన, దాని కొనసాగింపుగా జానకీపురం దగ్గర ఎన్ కౌంటర్, మళ్లీ మంగళవార ం అదే జిల్లాలోని ఆలేరు దగ్గర విచారణలో ఉన్న ఖైదీలు ఎదురుకాల్పులలో చనిపోవడం వరుసగా పేర్చి చూస్తే - సూర్యాపేట ఘటనకు సంబంధించి పోలీస్‌శాఖ మీద వచ్చిన విమర్శల పర్యవసానమే ఆలేరు పరిణామమన్న అనుమానం కలగక తప్పదు. ఆలేరు ఎదురుకాల్పుల ఘటన ఎలా జరిగింది? ఏమిటి? అనే వివ రాలన్నీ తరువాత తప్పక వెల్లడవుతాయి. కానీ ఈ వార్తా లేఖ రాస్తున్న సమ యానికే జానకీపురం ఘటనలో గాయపడిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య మరణించిన వార్త వచ్చింది. దీనితో నలుగురు పోలీసులు ఈ ఘటనలలో మరణించినట్టయింది. ఆ నలుగురు లింగయ్య, మహేశ్, నాగరాజు, సిద్ధయ్య - ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్. జానకీపురం దగ్గర జరిగిన ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు విజయవాడవైపు వెళ్లినట్టు కూడా అనుమానం. హైదరాబాద్ ప్రశాంతమేనా? సూర్యాపేట బస్టాండ్‌లో జరిగిన సంఘటన నుంచి, జానకీపురంలో ఉగ్ర వాదులతో జరిగిన ఘర్ణణ నుంచి మన పోలీసుశాఖ, ప్రభుత్వం ఏం నేర్చుకు న్నాయి. ఏం తెలుసుకున్నాయి? నిన్నటికి నిన్న కూడా తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి హైదరాబాద్ ప్రశాంతంగా ఉందనీ, అనవ సరంగా ఒక మతస్థులను నిందించవద్దనీ అన్నారు. నిజంగానే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందా? లేకపోతే హోమంత్రి చెబుతున్నట్టు వినిపిస్తున్నవన్నీ నిందలేనా? వాటిలో నిజాలే లేవా? అంతే అయితే హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని దేశమంతా కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు పథకాలు రచిస్తు న్నారంటూ కేంద్ర స్థాయి పరిశోధనా సంస్థలు, నిఘా సంస్థలు ఇస్తున్న నివేదికలకు అర్థం ఏమిటి? ఆలేరు ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్‌లో సోదాలు ఎందుకు మొదలయ్యాయి? భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రశ్నల న్నింటికీ బయటకు జవాబులు చెప్పకపోయినా, ప్రభుత్వం వీటన్నిటి మీదా దృష్టి పెడితే మంచిది. ఇక గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు సివిల్ పోలీసులకు కూడా కొంత మెరుగైన శిక్షణ ఇవ్వడం, మెలకువలు నేర్పడం వంటివి చేసి ఉంటే సూర్యాపేట, జానకీపురాలలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్టు ఆయుధాలు ఉపయోగించడంలో తరచూ పోలీసుల ప్రావీణ్యాన్ని మెరుగు పరచాలి. శరీర దారుఢ్యాన్ని పెంచుకునే వ్యాయామాలు కూడా మరచిపోతున్నారట మన పోలీసులు. రాజకీయ నాయకులకు రక్షణ కల్పిం చడం ఒక్కటే కాదు, తమను తాము రక్షించుకునే నేర్పు కూడా పోలీసు వ్యవస్థకు ఉండాలి. నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే ఆ నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక వాహనాలు సమకూరిస్తే సరిపోదు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించే వైపుగా కూడా దృష్టి సారించవలసి ఉంది. datelinehyderabad@gmail.com -
నిధుల వేట.. నేతల ఆట
దేవులపల్లి అమర్ బాబు కోరుతున్న సహాయం చెయ్యడానికి కేంద్రం వద్ద నిధులు గుట్టలుగా లేవు. టీడీపీ, బీజేపీలు రెండూ వాస్తవ పరిస్థితిని ప్రజల నుంచి దాచినందువల్లనే ఈ దుస్థితి. పైగా మోదీ-షా నాయకద్వయం ఏపీ, తెలంగాణల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం మీదనే దృష్టి కేంద్రీకరిం చింది. దీంతో తాము కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వాపోవాల్సిన విచిత్ర స్థితి నెలకొంది. బాబు వంటి సీనియర్ నేత మాటకే దిక్కులేని చోట పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ రాయబారం ద్వారా ఏం సాధించనున్నారో వేచి చూడాలి. పరిశేష ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగు తున్నాయి. సరిగ్గా తొమ్మిది నెలలయినా గడవక ముందే ఒక రకమైన రాజకీయ అనిశ్చితి ఆ రాష్ర్ట అధికార పక్షాలలో అలుముకున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార కూటమికి నాయకత్వం వహిస్త్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్థితిలో తలపట్టుకుని కూర్చున్నారు. ఏమిటి ఇట్లా జరిగింది? అన్న అడిగిన మీడియా మిత్రులతో... నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని నిట్టూర్పు విడిచారు. రేపటి నుంచి ఏం చెయ్యా లి? ప్రజలకు ఏం చెప్పాలి? వాళ్లను ఎట్లా నమ్మించాలి? ఎట్లా ముందుకు పోవాలి? బీజేపీని నమ్ముకుని నట్టేట మునగాల్సి వస్తుందని బాబు కలలో కూడా ఊహించి ఉండనందునే ఆయన ఇంతగా దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషుల మాట. మా నేత అత్యంత అనుభవ శాలి, రాజకీయ చతురుడు. ఈ గండం నుంచి తాను బయటపడతారు. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు అన్న ధీమాను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతున్నది? కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్ల్లీ ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్లో ఏపీకి సరైన కేటాయింపులు లేవు. రాష్ర్ట విభజన నాడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం రూ.100 కోట్లు కేటా యించి చేతులు దులుపుకున్నది. ‘‘ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజధానిని నిర్మించుకోండి, నేనున్నాను’’ అన్న ప్రధాని బడ్జెట్లో దానికి రూపాయి విదిలించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ బాగా వాడుకున్న అస్త్రం రుణమాఫీ విషయంలో కూడా కేంద్రానిది సహాయ నిరాకరణ ధోరణే. హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రను కుదిపివేయగా దాదాపు 70 వేల కోట్ల నష్టం సంభవించింది. వెయ్యి కోట్లు తక్షణ సహాయం ప్రకటించిన మోదీ హామీ ప్రకటనకే పరిమితమైంది. వీటన్నిటికీ ‘‘కేంద్రం సహాయం చేస్త్తుం దిలే’’ అన్న ధీమాతో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏం చెయ్యాలో తోచనిస్థితిలో పడింది. ఇదంతా చూసి ఏపీ ప్రజలు అయోమయంలో పడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అండ ఉంటే తమ రాష్ర్టం బాగుపడుతుందని నేతలు చెప్పిన మాటలు నమ్మి వారు టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించారు. తీరా జరుగుతున్నది చూసి వారు హతాశులు కావడంలో ఆశ్చర్యం లేదు. అనూహ్య ఫలితాలు 2004 ఎన్నికలకు ముందు బీజేపీ మతతత్వ పార్టీ అంటూ టీడీపీ దానితో తెగ తెంపులు చేసుకుంది. రెండుసార్లు ఓటమిని చవిచూశాక, చివరి ప్రయత్నంగా మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీ చెయ్యి అందుకున్నది. లోక్‌సభలో మెజారి టీని సాధించి మోదీని ప్రధానిని చేసుకునే ప్రయత్నంలో బీజేపీ కూడా టీడీపీ మద్దతు తీసుకోక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీకి ఇటు టీడీపీకి కూడా అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. టీడీపీ వంటి పార్టీల అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగల సంఖ్యాబలం బీజేపీకి లభించింది. ఇది టీడీపీకి మింగుడుపడని విషయమే. ఎన్నికలకు వెళుతున్న ప్పుడు ఆ పార్టీకి గెలుపుపట్ల పెద్దగా ఆశలులేవు. బీజేపీతో పొత్తుపెట్ట్టుకున్నా, సినిమా నటుడు పవన్ కల్యాణ్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినా, రుణమాఫీ వంటి అలవికాని వాగ్దానాలు చేసినా... అన్నీ ఆ ఆశలు లేని కారణంగానే. తప్పిన బాబు లెక్కలు రాష్ట్రంలో టీడీపీ గెలుపును, కేంద్రంలో తమలాంటి ప్రాంతీయ మిత్రుల మీద ఆధారపడ్డ సంకీర్ణ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత ఆశించారు. అట్లా జరిగితే యునెటైడ్ ఫ్రంట్ కాలంలోనూ, ఆ తరువాత అటల్ బిహారీ వాజపేయి జమానాలో లాగే ఇప్పుడు కూడా తాను కేంద్రంలో చక్రం తిప్పొచ్చునని ఆయన భావించారు. కానీ దేశ ప్రజలు సంకీర్ణ యుగానికి స్వస్తి పలికి బీజేపీకి సొంత బలం ఇచ్చారు. మిత్రుల మీద ఆధారపడవలసిన అవసరం లేక పోవడంతో బాటు, మోదీ ప్రధాన మంత్రి కావడం కూడా టీడీపీకి కలిసి రాని వ్యవహారమే. పోనీలే ఏపీకి చెందిన వెంకయ్య నాయుడు కేంద్రంలో అత్యంత కీలక స్థానంలో ఉన్నారు, రాష్ట్ర అవసరాలను చూసుకోడానికి ఆయన చాలులే అనుకుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న మాటను ఆయన పదే పదే వినిపిస్తూ వచ్చారు. పైగా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ సహజ మిత్రులైన శివసేన వంటి పార్టీలనే పక్కన పెట్టి తమ సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. వారు ఏపీ, తెలం గాణల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి పెట్టడం కూడా టీడీపీని ఇబ్బందుల్లో పడేసింది. రాష్ర్టంలో బీజేపీ, కేంద్రంలో టీడీపీ ప్రభుత్వ భాగ స్వాములుగా ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వాపో వడం ఒక విచిత్ర స్థితి. పవన్ రాయబార పర్వం ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. బాబు ప్రభుత్వం కోరుతున్న మేరకు సహా యం చెయ్యడానికి కేంద్రం దగ్గరా నిధులు గుట్టలు గుట్టలుగా పడి లేవు. రెండు పార్టీలూ వాస్తవ పరిస్థితిని ప్రజల నుంచి దాచి ఉంచినందువల్లే ఇవ్వాళ ఈ దుస్థితి. గోప్యత కొంప ముంచుతుందని ఇకనైనా తెలుసు కుంటే మంచిది. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదీ ప్రతిపక్షాలకు తెలియదు. వాళ్లను విశ్వాసంలోకి తీసుకోవడం అట్లా ఉంచి ప్రతిపక్షం అస్థిత్వాన్నే గుర్తించడానికి సిద్ధంగా లేని స్థితి. చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని మహజరులు ఇచ్చి వచ్చారు. ప్రతిపక్షంతో కనీసం ఇదీ పరిస్థితి అని చెప్పారా? లేదు. ఇప్పుడు కూడా చేస్తున్నదేమిటి? జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాయబారానికి పంపుతున్నారని వార్తలు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన ప్రధాన మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యండని బాబు తరఫున కోరతారట. ఏపీ సీఎం బాబు వంటి సీనియర్ నాయకుని మాటకే దిక్కులేని దగ్గర పార్ట్ టైం రాజకీయాల పవన్ కల్యాణ్ ఏం సాధించు కొస్తారో చూడాలి. ఏపీని మేం తప్ప ఇంకెవరూ ఆదుకోలేరు అన్నట్టు విభజన బిల్లు మీద చర్చ సందర్భంగా రాజ్యసభలో వాదించిన వెంకయ్య నాయుడు కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన మాటకంటే పవన్ కల్యాణ్ మాటే అక్కడ చెల్లు బాటయ్యే పరిస్థితి ఉందేమో కూడా చూడాలి . ముందున్నది మొసళ్ల పండుగే ఇదంతా మొన్న శనివారం నాటి బడ్జెట్ కేటాయింపులతో మొదలు కాలేదు, అక్కడితో ఆగిపోదు కూడా. రాష్ర్టంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య అధికారం లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పొరపొచ్చాలు బయట పడ్డాయి. బీజేపీ తమకు దీర్ఘకాల మిత్రుడేమీ కాదని తెలుగుదేశం వారూ, టీడీపీ నమ్మదగ్గ స్నేహితు డేమీ కాదని భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న ఉదంతాలు మనకు మొదటి నుంచి కనిపిస్తాయి. కాకపోతే బడ్జెట్ వ్యవహారం తరువాత గొంతులు పెంచారంతే. ముఖ్యమంత్రి వెంట వెళ్లి నమస్కారాలు పెట్టి రావడం తప్ప మేం చెయ్యగలిగింది ఏమీ లేదన్న ఎంపీ దివాకర్ రెడ్డి అంటే, ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఇక తిరుపతి ఎంపీ డాక్టర్ శివప్రసాద్, విరాట రాజు కొలువులోని పాండవుల పరిస్థితి మాది అని వాపోయారు. వారితోపాటూ ఇంకా పలువురు ఇతర టీడీపీ నాయకులు మాట్లాడుతున్న ఇలాంటి మాటలు ఆషామాషీగా కొట్టి పారేయాల్సినవి కావు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు ముందున్నది మొసళ్ల పండుగే. datelinehyderabad@gmail.com -
బంగారు తెలంగాణకు కల్తీ బాధ
డేట్లైన్ హైదరాబాద్ ఓడిపోయిన ఒక నేతను వేరే పార్టీ నుండి తెచ్చి నేరుగా మంత్రి పదవి ఇచ్చినా, ఒక బలమైన సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇచ్చినా, వేరే పార్టీలో ఉండగా తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రత్యక్షంగా దాడులు చేసి ,ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి మంత్రివర్గంలో పెద్ద పీట వేసినా, మహిళలను చేర్చుకోకపోయినా అడిగే వాడు లేడు కాబట్టి ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతుంది. దీర్ఘకాల రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడదన్న విషయం ఏలికలు తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గ విస్తరణతో ఆరుమాసాలుగా నెలకొని ఉన్న ఉత్కంఠ తొలగింది. జూన్ రెండున ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోబాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పలుమార్లు మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు గత వారం మరో ఆరుగురు సభ్యులను చేర్చుకోవడంతో మంత్రివర్గ ఏర్పాటు కసరత్తు పూర్తయిం ది. మామూలుగానే మంత్రివర్గం ఏర్పాటు క్లిష్టమయింది. అన్ని సామాజిక వర్గా లకు తగిన ప్రాతినిధ్యం లభించే విధంగా ఆ కసరత్తు ఉండాలి. మంత్రుల సం ఖ్య చాలా పరిమితంగా ఉన్నప్పుడు, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పు డు కేబినెట్లో సమతౌల్యం కష్టమైన పని. తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రి అంత పెద్ద ఎత్తున కసరత్తు సాగించారా? ఈ ప్రశ్నకు ఆయన మంత్రివర్గ కూర్పును ఒకసారి పరిశీలిస్తే జవాబు దొరుకుతుంది. ఎవరినో మచ్చిక చేసుకోవడానికే ఈ విస్తరణ! ముఖ్యమంత్రి సహా మొత్తం 18 మంది సభ్యులు గల ఈ మంత్రివర్గంలో 11 మంది అగ్రకులాల వారు ఉంటే, నలుగురు వెనుకబడిన తరగతులవారు, ఒక ముస్లిం మైనారిటీ, షెడ్యూల్డ్ కులానికి, షెడ్యూల్డ్ తెగకు చెందిన ఒక్కొక్కరు అవ కాశం పొందారు. మంత్రివర్గ కూర్పులో పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రికే ఉం టుంది. అయితే అన్ని వర్గాలకు, ముఖ్యంగా చాలా కాలంగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా న్యాయం చెయ్యడమే కాకుండా, న్యాయం చేసినట్టు కనిపించాలి. ఇది అట్లా కనిపించడం లేదు. ఒక బలమయిన సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది. ఆ సామాజిక వర్గానిదే మంత్రివర్గంలో సంఖ్యాపరంగా పెద్ద పీట. తెలంగాణలో వెనుకబడిన తరగతుల జనాభా ఎక్కువ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా కాలం ఈ వర్గాలకు రాజ్యాధికారంలో తగిన చోటు దొరకలేదు. 1982లో నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టాకనే తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం గానీ, పలుకుబడి గానీ రాజకీయాల్లో పెరిగింది. గ్రామస్థాయి నుండి చట్టసభ దాకా ఆయన వెనుక బడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన కులా లకు ఎన్టీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనక రాజకీయ మతలబు లేకపో లేదు. తెలంగాణలో రాజకీయ ఆధిపత్యం బలమైన రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో నుండి తప్పించడం ఆయన ఉద్దేశం. ఆ మేరకు రాజకీయంగా కొంత ఫలితం ఆయన సాధించి ఉండొచ్చు కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఆ వర్గాలు కొంత ఆర్థికంగా బలపడి రాజ్యాధికారంలో పోటీ పడే స్థాయికి ఎదిగి, అగ్ర కులాలకు సవాలుగా తయారయ్యాయి. అరైవైఏళ్ల సుదీర్ఘ పోరాటం చివరిదశలో కూడా తెలంగాణలోని వెనుక బడిన తరగతులూ, దళితులూ పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. తెలం గాణ ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి, నేను కాపలాదారుడిని మాత్రమేనన్న కేసీఆర్ ప్రకటన దళిత, వెనుకబడిన వర్గాలలో రాజకీయ న్యాయం జరుగుతుందనే ఆశ కలిగించాయి. తెలంగాణ తొలి మంత్రివర్గ కూర్పు ఆ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లింది. మమ్మల్ని ఎవరూ విమర్శించలేదే అని ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ పెద్ద లూ అనొచ్చు. ‘మేమంతా సంతృప్తి చెందాం’ అని ఆయా వర్గాల నాయకుల చేత ప్రకటనలు ఇప్పించవచ్చు. ఎవరేమన్నా ఇది రాజకీయ ఎజెండాతో ఏర్పాటు చేసిన మంత్రివర్గం తప్ప అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో చేసింది మాత్రం కాదని తెలుస్తూనే ఉంది. రెండు అగ్రకులాలకు చెందిన 11 మంది మంత్రివర్గంలో ఉంటే, నలుగురే వెనుకబడిన తరగతుల వారు, ఒక్కొక్కరు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలవారు ఉండడాన్ని ముఖ్యమంత్రి ఎట్లా సమర్థించుకుంటారు? మంత్రివర్గం కులాల ప్రాతిపదికన జరగదు, సమర్థతను బట్టి నిర్మిస్తాం అంటారా? అంటే ఆ రెండు కులాలలో ఉన్నంత మంది సమర్థులు కింది కులాలలో లేరనే కదా! పార్లమెంటరీ సెక్రట రీల పేరుతో వారిలో కొందరికి సహాయ మంత్రుల హోదా కల్పించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. 119 మంది శాసనసభ్యుల్లో అధికార పార్టీ తరఫున గెలిచిన వారూ, తరువాత బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారు కలిసి 70 మందికి పైగానే ఉన్నారు కదా. అందులో సమర్థులే కనిపించలేదా అన్నది ప్రశ్న. ఒక్క మహిళా మంత్రి పదవికి తగరా? మహిళా ప్రాతినిధ్యం మాటేమిటి ? మంత్రిగా పనిచేసే సామర్థ్యంగల మహిళ ఒక్కరు కూడా అధికార పార్టీలో లేరా? పోనీ గెలవలేదనుకుందాం. సమర్థు రాలైన మహిళా నేతకు మంత్రి పదవి ఇచ్చి శాసనమండలికి పంపే ఏర్పాటు చేయవచ్చు కదా! ఇది శాసనసభ ఎన్నికల్లో వేరే పార్టీ నుండి పోటీ చేసి ఓడి పోయిన నాయకుడిని తెచ్చి కేబినెట్లో కూర్చోబెట్టడం కంటే అన్యాయం కాదు కదా! రాజకీయ పార్టీలు ఆ ప్రయోజనాలను ఆశించడం సహజమే. ఓడిపో యిన ఒక నేతను వేరే పార్టీ నుండి తెచ్చి నేరుగా మంత్రి పదవి ఇచ్చినా, ఒక బలమయిన సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇచ్చినా, వేరే పార్టీలో ఉండగా తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రత్యక్షంగా దాడులుచేసి, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి మంత్రివర్గంలో పెద్ద పీటవేసినా, మహిళలను చేర్చుకోక పోయినా అడిగే వాడు లేడు కాబట్టి ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతుంది. దీర్ఘ కాల రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడదన్న విషయం ఏలికలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి సహా ఒకే కుటుంబం నుండి ముగ్గురు ఎందుకు మంత్రివర్గంలో ఉండాలి అంటే రుచించకపోవచ్చు. వాళ్లు ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించారనవచ్చు. తెలంగాణ చివరి దశ ఉద్యమంలో అటు వంటి పాత్ర నిర్వహించిన వారు అసంఖ్యాకంగా ఉన్నారు. వారందరికీ ఈ న్యాయం వర్తించడం లేదేమి? సరే, ఎవరెన్ని మాట్లాడినా మంత్రివర్గ కూర్పు ముఖ్య మంత్రి విచక్షణ ప్రకారమే జరుగుతుంది, ఒప్పుకుందాం. కురుమ భవంతికి కొమురయ్య పేరా? మొన్న ముఖ్యమంత్రి కొమురవెల్లి జాతరకు వెళ్లిన సందర్భంలో కురుమల కోసం ఒక భవనం నిర్మిస్తామని, దానికి దొడ్డి కొమురయ్య పేరు పెడతామని ప్రకటించారు. గ్రామాల్లో కులవృత్తులు అంతరించిపోతున్నాయి. వాటిని బతికించే ఆలోచన లేదు కానీ కులానికో భవనం కట్టించే కార్యక్రమంలో పడ్డది తెలంగాణ ప్రభుత్వం. ఒక ఆదివాసి భవనం, మరో బంజారా సదనం, ఇంకో దళిత భవనం; ఇప్పుడో కురుమ భవనం- కట్టించి ఏం చేస్తారు? రెడ్డి భవనాలు, వెలమ భవనాలు, కమ్మ సంఘాలు, బ్రాహ్మణ సమాజాలు ఉండగా, ఇవి ఉంటే తప్పా అని ప్రశ్నించవచ్చు. తప్పేమీ లేదు. అయితే అది ఎవరి ప్రయోజనం కోసం? అవన్నీ మళ్లీ ఆయా వర్గాల్లో ప్రాబల్యం గల కొద్ది మంది నాయకులకు అధికార కేంద్రాలుగా మారతాయి తప్ప, ఆ వర్గాల పేదప్రజలకు ఏ రకంగానూ మేలు చెయ్యవనేది సత్యం. ఇక కురుమ భవనానికి దొడ్డి కొమురయ్య పేరు పెడతామని ప్రకటించడం హాస్యాస్పదం. కురుమ అనే పదానికి కొమురయ్య అనే పేరు దగ్గరగా ఉందని ఆ పేరు ఎంచుకున్నారా ? లేక కొమురయ్య ఆ కులానికి చెందిన వారని ఎవరయినా చెప్పారా? వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో కులవ్యవస్థకు వ్యతిరేకంగా, నిజాం అకృత్యాలకు వ్యతిరే కంగా జరిగిన పోరాటంలో దొర గడీలో నుండి జరిగిన తుపాకీ కాల్పుల్లో అమరుడయిన దొడ్డి కొమురయ్య పేరును ఒక కుల సంఘ భవనానికి ఎట్లా పెడతారు? నిజాం పరి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులయిన వారి జ్ఞాపకార్థం ఏదయినా నిర్మాణం చేపడితే దానికి దొడ్డి కొమురయ్య పేరు పెడితే అర్థం, సార్థకత. అంతేకానీ ఆ వీరుడిని ఒక కులానికి పరిమితం చేయ ప్రయత్నించడం అన్యాయం. 1940 ప్రాంతాలో గుత్పల సంఘంగా ఏర్పడి కుల వ్యవస్థకు, నిజాం దుష్టపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో, ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా బ్రిటిష్ పాలకుల కోసం యుద్ధ నిధిని వసూలు చెయ్యడానికి ప్రయత్నించిన నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో అసువులుబాసినవాడు కొమురయ్య. అగ్రకులాల ఆధిప త్యాన్ని ధిక్కరిస్తూ, గొల్ల, కురుమవర్గాల నుండి వినిపిస్తున్న బలమైన గొంతు కలను తమ దారికి తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కాని అది కొమురయ్య అమర త్వాన్ని అవమానించడమే. ఒక పక్క నిజాం పాలనను వేనోళ్లా పొగుడుతూ, మరోపక్క ఆ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొము రయ్య పేరిట భవనాలు కట్టడం ఏ రాజనీతి? (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 98480 48536) -
ఊగిసలాటే ఉత్తమమా!
డేట్లైన్ హైదరాబాద్ వారానికి ఐదు రోజులు విజయవాడలో ఉండి పరిపాలన సాగిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడా మాటే ఎత్తడం మానేశారు. పైగా హైదరాబాద్‌లో ఇప్పుడు ఉన్న ఇల్లు చిన్నదయిందనీ, కొత్తది నిర్మించుకోవాలని నిర్ణయించారనీ వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఇల్లు ఉండకూడదని ఎవరూ అనరు. కానీ కోట్లాది మంది ప్రజలకు ఆత్మస్థయిర్యం కలిగించాల్సిన సమయంలో రాష్ట్రాధినేత చెయ్యవలసిన పని కాదు. హుద్‌హుద్ తుపాను వస్తే ఆ వారం రోజులు అక్కడ బస చేసి అధికార యంత్రాంగాన్ని అదిలించినంత మాత్రాన ప్రజల ఆత్మస్థయిర్యం పెరగదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మానసపుత్రిక ‘జన్మభూమి’ కార్యక్రమంలో భాగంగా ఈ వారంలో కర్నూలు జిల్లాలో పర్యటిం చారు. గర్భిణులకు సీమంతం చేయించడం సహా, పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు మండలం హుస్సైనాపురం గ్రామంలో ‘బడి పిలుస్తోంది, రా!’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అప్పుడు విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో ఆయన, ‘మీలో ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు?’ అని అడిగారు. పిల్లలు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. కానీ షఫీ అనే 6వ తరగతి విద్యార్థి మాత్రం ‘నేను ముఖ్యమంత్రినవుతా’ అన్నాడు. ‘నా కుర్చీకే ఎసరు పెడతావా ఏంటి?’ అని ముఖ్యమంత్రి చమత్కరించారు. కృత్యాద్యవస్థ మీద దక్కిన కుర్చీ ఆ విద్యార్థికి చంద్రబాబునాయుడు పదవికి ఎసరు పెట్టాలనే ఆలోచన ఉండే అవకాశంలేదు. అయితే మన ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు ఎక్కడ ఈ పద వికి ఎసరువస్తుందో, దీన్ని కాపాడుకోవడానికి ఏమేంచెయ్యాలో అన్న ఆందోళన ఉండడం సహజం. ఇది చాలామంది ముఖ్యమంత్రులకు ఉండే ఆందోళనే. ఇది చంద్రబాబుకు కొంచెం ఎక్కువ. ఎందుకంటే, ఈసారి అధికారం ఆయనకు అం త సులభంగా దక్కలేదు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తిరిగి అధికారం చేజిక్కిం చుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం చిన్నదేమీ కాదు. ఏ నరేంద్ర మోదీని అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు, ‘మా రాష్ర్టంలో అడుగు పెట్టని వ్వను’ అన్నారో, అదే మోదీ మంత్రం జపించాల్సిరావడం మాటలకందని అను భవం. తన బంధువర్గంలోనే పలువురు సినిమా హీరోలున్నా పవన్ కల్యాణ్ వంటి హీరో మద్దతు కోసం పరుగులు తీయడం కూడా చిన్న విషయం కాదు మరి. ‘ఒక్క పైసా కూడా కట్టకండి. నేను అధికారంలోకి వచ్చాక మొత్తం రుణా లు మాఫీ చేసేస్తా’నని కూడా రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చారా యన. ఆ తరువాత ఈ రుణ మాఫీ హామీ ఎంత దారుణంగా తన రూపాన్ని మార్చుకుందో అంతా చూశారు. పసుపు పవనంలో కాషాయం రెపరెప ఇన్ని చేసినా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైన మెజారిటీ ఏమీ ఇవ్వ లేదు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా ఒక బలమైన ప్రతిపక్షాన్ని మాత్రం ఇచ్చారు ప్రజలు. పైగా ఏ జాతీయపార్టీ మీదైతే ఆధారపడి మొన్న ఆయన అధి కారంలోకి వచ్చారో, ఏ పార్టీతో కేంద్రంలో, రాష్ర్టంలో అధికారం పంచుకుం టున్నారో, ఆ భారతీయ జనతాపార్టీ చాపకింద నీరులాగా ఆంధ్రప్రదేశ్‌లో సొంత బలాన్ని పెంచుకునే పనిలో పడింది. గత సోమవారంనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ సభ్యత్వ కార్యక్ర మం ప్రారంభించిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఇరు రాష్ట్రాలలోనూ 2019 నాటికి తాము ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామని బహిరం గంగానే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటికి నిన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీజేపీ బాట పట్టడం, ఇప్పటికే దాదాపు పదిమంది ఆ పార్టీ నాయకులు బీజేపీలో చేరడం అంతా గమనించారు. ఇదం తా ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలన్న మోదీ, అమిత్ షాల వ్యూహం లో భాగంగా జరుగుతున్నదేనని ఆ పార్టీ ప్రస్తుత మిత్రుడు చంద్రబాబు గ్రహిం చలేనంత అమాయకుడు కాదు కదా. అయితే దశాబ్దాల తరబడి అధికారంలో ఉండి, మంత్రి పదవులు వెలగబెట్టి ఇప్పుడు ప్రజలు చీత్కరించాక బీజేపీలోకి వెళ్తున్న నాయకులు అక్కడేం వెలగబెడతారో చూడాల్సిందే. మనిషొకచోట, మనసొకచోట ఒక పక్క చంద్రబాబు తానూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎంత అంకితభావంతో పనిచెయ్యబోతున్నారో ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తూనే, న భూతో న భవిష్యతి అన్న విధంగా అద్భుతమైన రాజధానిని నిర్మిస్తా నని చెపుతూనే హైదరాబాద్‌తో, తెలంగాణతో తన రాజకీయ బంధాన్ని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నిజమే, ఉమ్మడి రాష్ర్ట రాజధానిగా హైదరాబాద్‌తో ఉన్న బంధం అంత సులభంగా తెగిపోదు. అయితే అక్కడ ఓటు హక్కు కూడా లేని ముఖ్యమంత్రి, తనకు సభ్యత్వం కూడా లేని పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహించడం విడ్డూరం. తెలుగుదేశం పార్టీలో ప్రాథ మిక సభ్యత్వాన్ని ఆయన ఇటీవలనే హైదరాబాద్‌లో తీసుకున్నారు. హైదరా బాద్ జూబిలీహిల్స్‌లో ఓటేసి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాకూడదని నియ మం ఏమీ లేదు. అట్లాగే తెలంగాణ లో పార్టీ సభ్యుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని నడిపించరాదని కూడా నిబంధన లేదు. బెజవాడ మకాం మాటే లేదు అయితే కొత్త రాష్ర్టం ఏర్పడి రాజధాని ఎక్కడో, పరిపాలన ఎక్కడి నుండి సాగు తుందో, ఎట్లా సాగుతుందో తెలియని అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిక్కుతోచనిస్థితిలో ఉన్నప్పుడు వారికి మనోస్థయిర్యం కల్పించడానికి అక్కడే ఉండి గుడారాలు వేసుకుని అయినా పరిపాలన జరపాల్సింది. వారానికి ఐదు రోజులు విజయవాడలో ఉండి పరిపాలన సాగిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడా మాటే ఎత్తడం మానేశారు. పైగా హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఇల్లు చిన్నదైం దనీ, కొత్తది నిర్మించుకోవాలని నిర్ణయించారనీ వార్తలు వచ్చాయి. హైదరా బాద్‌లో ఇల్లు ఉండకూడదని ఎవరూ అనరు. భారతదేశంలో ఎక్కడైనా, ఒక్క జమ్మూ కాశ్మీర్లో మినహాయిస్తే, చంద్రబాబుగారు, ఆ మాటకొస్తే ఎవరైనా, ఆస్తులు కలిగి ఉండొచ్చు. కానీ కోట్లాదిమంది ప్రజలకు ఆత్మస్థయిర్యం కలిగిం చాల్సిన సమయంలో రాష్ట్రాధినేత చెయ్యవలసిన పనికాదు. హుద్‌హుద్ తుపాను వస్తే ఆ వారంరోజులు అక్కడ బసచేసి అధికార యంత్రాంగాన్ని అది లించినంత మాత్రాన ప్రజల ఆత్మస్థయిర్యం పెరగదు. నేను రాకపోయి ఉంటే ఇంకో 30 రోజులైనా ఇక్కడ సహాయక చర్యలు ప్రారంభమై ఉండేవి కావని ఆయన ఈ సందర్భంలో చెప్పుకోవడం తెలిసిందే. పోనీ తెలంగాణ రాజధాని లోనే బసచేసి, అక్కడే ఓటేసి, అక్కడే పార్టీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన తెలుగుదేశం పరిస్థితి తెలంగాణలో బ్రహ్మాండంగా ఉందా అంటే, అదీ లేదు. మొత్తం శాసనమండలిలోని తెలుగుదేశం పక్షం గంపగుత్తగా వెళ్లి టీఆర్ఎస్లో చేరింది. దీనిమీద చంద్రబాబు ఏం మాట్లాడగలరు? విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేరు రాజధాని ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలి. కేంద్రం నియమించిన కమిటీ సిఫార్సులను కాదని, ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షాన్ని కనీసం విశ్వాసంలోకి తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయం మాటే ఎత్తకుండా రాజధాని ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్నదో చూస్తూనే ఉన్నాం. రాజధాని నగ రం విజయవాడ నుండి బయలుదేరి తుళ్ళూరు మండలం దాకా వచ్చింది. ఏటా మూడు పంటలు పండే సస్యశ్యామలమైన భూములు. రైతులు వదలుకో వడానికి సిద్ధంగాలేరు. సిద్ధపడ్డా, బదులుగా తమకు ఎంత ప్రతిఫలం లభిస్తుం దో తెలియనిస్థితి. ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారం సక్రమంగా అందుతుం దని నమ్మకం కలిగించే నాథుడు లేడు. ఈ విధంగా ముందుకు పోతే 2019 నాటికి అద్భుతమైన రాజధానిని నిర్మించి దాన్నే ఎన్నికల ప్రచారానికి ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని అనుకుం టున్న ముఖ్యమంత్రి కోరిక నెరవేరడం కష్టమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇరువురూ ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని ముందుకుపోవడానికి సిద్ధంగాలేరు. స్థానిక శాసన సభ్యుడిని, ఆ ప్రాంత నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా రాజధాని కోసం భూసేకరణ సజావుగా ఎట్లా సాగుతుందని చంద్రబాబునాయుడు అనుకుంటు న్నారో! ఆయనకే తెలియాలి మరి! -దేవులపల్లి అమర్