ఊగిసలాటే ఉత్తమమా!
డేట్‌లైన్ హైదరాబాద్
వారానికి ఐదు రోజులు విజయవాడలో ఉండి పరిపాలన సాగిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడా మాటే ఎత్తడం మానేశారు. పైగా హైదరాబాద్‌లో ఇప్పుడు ఉన్న ఇల్లు చిన్నదయిందనీ, కొత్తది నిర్మించుకోవాలని నిర్ణయించారనీ వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లో ఇల్లు ఉండకూడదని ఎవరూ అనరు. కానీ కోట్లాది మంది ప్రజలకు ఆత్మస్థయిర్యం కలిగించాల్సిన సమయంలో రాష్ట్రాధినేత చెయ్యవలసిన పని కాదు. హుద్‌హుద్ తుపాను వస్తే ఆ వారం రోజులు అక్కడ బస చేసి అధికార యంత్రాంగాన్ని అదిలించినంత మాత్రాన ప్రజల ఆత్మస్థయిర్యం పెరగదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మానసపుత్రిక ‘జన్మభూమి’ కార్యక్రమంలో భాగంగా ఈ వారంలో కర్నూలు జిల్లాలో పర్యటిం చారు. గర్భిణులకు సీమంతం చేయించడం సహా, పలు కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు మండలం హుస్సైనాపురం గ్రామంలో ‘బడి పిలుస్తోంది, రా!’ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అప్పుడు విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో ఆయన, ‘మీలో ఎంత మంది డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు?’ అని అడిగారు. పిల్లలు ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. కానీ షఫీ అనే 6వ తరగతి విద్యార్థి మాత్రం ‘నేను ముఖ్యమంత్రినవుతా’ అన్నాడు. ‘నా కుర్చీకే ఎసరు పెడతావా ఏంటి?’ అని ముఖ్యమంత్రి చమత్కరించారు.
కృత్యాద్యవస్థ మీద దక్కిన కుర్చీ
ఆ విద్యార్థికి చంద్రబాబునాయుడు పదవికి ఎసరు పెట్టాలనే ఆలోచన ఉండే అవకాశంలేదు. అయితే మన ముఖ్యమంత్రికి మాత్రం ఎప్పుడు ఎక్కడ ఈ పద వికి ఎసరువస్తుందో, దీన్ని కాపాడుకోవడానికి ఏమేంచెయ్యాలో అన్న ఆందోళన ఉండడం సహజం. ఇది చాలామంది ముఖ్యమంత్రులకు ఉండే ఆందోళనే. ఇది చంద్రబాబుకు కొంచెం ఎక్కువ. ఎందుకంటే, ఈసారి అధికారం ఆయనకు అం త సులభంగా దక్కలేదు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తిరిగి అధికారం చేజిక్కిం చుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం చిన్నదేమీ కాదు. ఏ నరేంద్ర మోదీని అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు, ‘మా రాష్ర్టంలో అడుగు పెట్టని వ్వను’ అన్నారో, అదే మోదీ మంత్రం జపించాల్సిరావడం మాటలకందని అను భవం. తన బంధువర్గంలోనే పలువురు సినిమా హీరోలున్నా పవన్ కల్యాణ్ వంటి హీరో మద్దతు కోసం పరుగులు తీయడం కూడా చిన్న విషయం కాదు మరి. ‘ఒక్క పైసా కూడా కట్టకండి. నేను అధికారంలోకి వచ్చాక మొత్తం రుణా లు మాఫీ చేసేస్తా’నని కూడా రైతులను నమ్మబలికి అధికారంలోకి వచ్చారా యన. ఆ తరువాత ఈ రుణ మాఫీ హామీ ఎంత దారుణంగా తన రూపాన్ని మార్చుకుందో అంతా చూశారు.
పసుపు పవనంలో కాషాయం రెపరెప
ఇన్ని చేసినా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమైన మెజారిటీ ఏమీ ఇవ్వ లేదు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా ఒక బలమైన ప్రతిపక్షాన్ని మాత్రం ఇచ్చారు ప్రజలు. పైగా ఏ జాతీయపార్టీ మీదైతే ఆధారపడి మొన్న ఆయన అధి కారంలోకి వచ్చారో, ఏ పార్టీతో కేంద్రంలో, రాష్ర్టంలో అధికారం పంచుకుం టున్నారో, ఆ భారతీయ జనతాపార్టీ చాపకింద నీరులాగా ఆంధ్రప్రదేశ్‌లో సొంత బలాన్ని పెంచుకునే పనిలో పడింది.
గత సోమవారంనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ సభ్యత్వ కార్యక్ర మం ప్రారంభించిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఇరు రాష్ట్రాలలోనూ 2019 నాటికి తాము ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదుగుతామని బహిరం గంగానే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటికి నిన్న కన్నా లక్ష్మీనారాయణ వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీజేపీ బాట పట్టడం, ఇప్పటికే దాదాపు పదిమంది ఆ పార్టీ నాయకులు బీజేపీలో చేరడం అంతా గమనించారు. ఇదం తా ప్రాంతీయ పార్టీలను బలహీనపరచాలన్న మోదీ, అమిత్ షాల వ్యూహం లో భాగంగా జరుగుతున్నదేనని ఆ పార్టీ ప్రస్తుత మిత్రుడు చంద్రబాబు గ్రహిం చలేనంత అమాయకుడు కాదు కదా. అయితే దశాబ్దాల తరబడి అధికారంలో ఉండి, మంత్రి పదవులు వెలగబెట్టి ఇప్పుడు ప్రజలు చీత్కరించాక బీజేపీలోకి వెళ్తున్న నాయకులు అక్కడేం వెలగబెడతారో చూడాల్సిందే.
మనిషొకచోట, మనసొకచోట
ఒక పక్క చంద్రబాబు తానూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఎంత అంకితభావంతో పనిచెయ్యబోతున్నారో ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తూనే, న భూతో న భవిష్యతి అన్న విధంగా అద్భుతమైన రాజధానిని నిర్మిస్తా నని చెపుతూనే హైదరాబాద్‌తో, తెలంగాణతో తన రాజకీయ బంధాన్ని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నిజమే, ఉమ్మడి రాష్ర్ట రాజధానిగా హైదరాబాద్‌తో ఉన్న బంధం అంత సులభంగా తెగిపోదు. అయితే అక్కడ ఓటు హక్కు కూడా లేని ముఖ్యమంత్రి, తనకు సభ్యత్వం కూడా లేని పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహించడం విడ్డూరం. తెలుగుదేశం పార్టీలో ప్రాథ మిక సభ్యత్వాన్ని ఆయన ఇటీవలనే హైదరాబాద్‌లో తీసుకున్నారు. హైదరా బాద్ జూబిలీహిల్స్‌లో ఓటేసి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాకూడదని నియ మం ఏమీ లేదు. అట్లాగే తెలంగాణ లో పార్టీ సభ్యుడిగా ఉండి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని నడిపించరాదని కూడా నిబంధన లేదు.
బెజవాడ మకాం మాటే లేదు
అయితే కొత్త రాష్ర్టం ఏర్పడి రాజధాని ఎక్కడో, పరిపాలన ఎక్కడి నుండి సాగు తుందో, ఎట్లా సాగుతుందో తెలియని అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దిక్కుతోచనిస్థితిలో ఉన్నప్పుడు వారికి మనోస్థయిర్యం కల్పించడానికి అక్కడే ఉండి గుడారాలు వేసుకుని అయినా పరిపాలన జరపాల్సింది. వారానికి ఐదు రోజులు విజయవాడలో ఉండి పరిపాలన సాగిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పుడా మాటే ఎత్తడం మానేశారు. పైగా హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఇల్లు చిన్నదైం దనీ, కొత్తది నిర్మించుకోవాలని నిర్ణయించారనీ వార్తలు వచ్చాయి.
హైదరా బాద్‌లో ఇల్లు ఉండకూడదని ఎవరూ అనరు. భారతదేశంలో ఎక్కడైనా, ఒక్క జమ్మూ కాశ్మీర్‌లో మినహాయిస్తే, చంద్రబాబుగారు, ఆ మాటకొస్తే ఎవరైనా, ఆస్తులు కలిగి ఉండొచ్చు. కానీ కోట్లాదిమంది ప్రజలకు ఆత్మస్థయిర్యం కలిగిం చాల్సిన సమయంలో రాష్ట్రాధినేత చెయ్యవలసిన పనికాదు. హుద్‌హుద్ తుపాను వస్తే ఆ వారంరోజులు అక్కడ బసచేసి అధికార యంత్రాంగాన్ని అది లించినంత మాత్రాన ప్రజల ఆత్మస్థయిర్యం పెరగదు. నేను రాకపోయి ఉంటే ఇంకో 30 రోజులైనా ఇక్కడ సహాయక చర్యలు ప్రారంభమై ఉండేవి కావని ఆయన ఈ సందర్భంలో చెప్పుకోవడం తెలిసిందే. పోనీ తెలంగాణ రాజధాని లోనే బసచేసి, అక్కడే ఓటేసి, అక్కడే పార్టీ సభ్యత్వం తీసుకున్నంత మాత్రాన తెలుగుదేశం పరిస్థితి తెలంగాణలో బ్రహ్మాండంగా ఉందా అంటే, అదీ లేదు. మొత్తం శాసనమండలిలోని తెలుగుదేశం పక్షం గంపగుత్తగా వెళ్లి టీఆర్‌ఎస్‌లో చేరింది. దీనిమీద చంద్రబాబు ఏం మాట్లాడగలరు?
విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేరు
రాజధాని ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలి. కేంద్రం నియమించిన కమిటీ సిఫార్సులను కాదని, ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షాన్ని కనీసం విశ్వాసంలోకి తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయం మాటే ఎత్తకుండా రాజధాని ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్నదో చూస్తూనే ఉన్నాం. రాజధాని నగ రం విజయవాడ నుండి బయలుదేరి తుళ్ళూరు మండలం దాకా వచ్చింది. ఏటా మూడు పంటలు పండే సస్యశ్యామలమైన భూములు. రైతులు వదలుకో వడానికి సిద్ధంగాలేరు. సిద్ధపడ్డా, బదులుగా తమకు ఎంత ప్రతిఫలం లభిస్తుం దో తెలియనిస్థితి. ప్రభుత్వం ఇస్తానంటున్న పరిహారం సక్రమంగా అందుతుం దని నమ్మకం కలిగించే నాథుడు లేడు.
ఈ విధంగా ముందుకు పోతే 2019 నాటికి అద్భుతమైన రాజధానిని నిర్మించి దాన్నే ఎన్నికల ప్రచారానికి ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని అనుకుం టున్న ముఖ్యమంత్రి కోరిక నెరవేరడం కష్టమే.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇరువురూ ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని ముందుకుపోవడానికి సిద్ధంగాలేరు. స్థానిక శాసన సభ్యుడిని, ఆ ప్రాంత నాయకులను విశ్వాసంలోకి తీసుకోకుండా రాజధాని కోసం భూసేకరణ సజావుగా ఎట్లా సాగుతుందని చంద్రబాబునాయుడు అనుకుంటు న్నారో! ఆయనకే తెలియాలి మరి!
-దేవులపల్లి అమర్