దేవులపల్లి అమర్
డేట్‌లైన్ హైదరాబాద్
ఓడిపోయిన ఒక నేతను వేరే పార్టీ నుండి తెచ్చి నేరుగా మంత్రి పదవి ఇచ్చినా, ఒక బలమైన సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇచ్చినా, వేరే పార్టీలో ఉండగా తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రత్యక్షంగా దాడులు చేసి ,ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి మంత్రివర్గంలో పెద్ద పీట వేసినా, మహిళలను చేర్చుకోకపోయినా అడిగే వాడు లేడు కాబట్టి ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతుంది. దీర్ఘకాల రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడదన్న విషయం ఏలికలు తెలుసుకోవాలి.
తెలంగాణ రాష్ర్ట మంత్రివర్గ విస్తరణతో ఆరుమాసాలుగా నెలకొని ఉన్న ఉత్కంఠ తొలగింది. జూన్ రెండున ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతోబాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పలుమార్లు మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు గత వారం మరో ఆరుగురు సభ్యులను చేర్చుకోవడంతో మంత్రివర్గ ఏర్పాటు కసరత్తు పూర్తయిం ది. మామూలుగానే మంత్రివర్గం ఏర్పాటు క్లిష్టమయింది. అన్ని సామాజిక వర్గా లకు తగిన ప్రాతినిధ్యం లభించే విధంగా ఆ కసరత్తు ఉండాలి. మంత్రుల సం ఖ్య చాలా పరిమితంగా ఉన్నప్పుడు, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పు డు కేబినెట్‌లో సమతౌల్యం కష్టమైన పని. తెలంగాణ రాష్ర్ట తొలి ముఖ్యమంత్రి అంత పెద్ద ఎత్తున కసరత్తు సాగించారా? ఈ ప్రశ్నకు ఆయన మంత్రివర్గ కూర్పును ఒకసారి పరిశీలిస్తే జవాబు దొరుకుతుంది.
ఎవరినో మచ్చిక చేసుకోవడానికే ఈ విస్తరణ!
ముఖ్యమంత్రి సహా మొత్తం 18 మంది సభ్యులు గల ఈ మంత్రివర్గంలో 11 మంది అగ్రకులాల వారు ఉంటే, నలుగురు వెనుకబడిన తరగతులవారు, ఒక ముస్లిం మైనారిటీ, షెడ్యూల్డ్ కులానికి, షెడ్యూల్డ్ తెగకు చెందిన ఒక్కొక్కరు అవ కాశం పొందారు. మంత్రివర్గ కూర్పులో పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రికే ఉం టుంది. అయితే అన్ని వర్గాలకు, ముఖ్యంగా చాలా కాలంగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా న్యాయం చెయ్యడమే కాకుండా, న్యాయం చేసినట్టు కనిపించాలి. ఇది అట్లా కనిపించడం లేదు. ఒక బలమయిన సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది. ఆ సామాజిక వర్గానిదే మంత్రివర్గంలో సంఖ్యాపరంగా పెద్ద పీట.
తెలంగాణలో వెనుకబడిన తరగతుల జనాభా ఎక్కువ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా కాలం ఈ వర్గాలకు రాజ్యాధికారంలో తగిన చోటు దొరకలేదు. 1982లో నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టాకనే తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం గానీ, పలుకుబడి గానీ రాజకీయాల్లో పెరిగింది. గ్రామస్థాయి నుండి చట్టసభ దాకా ఆయన వెనుక బడిన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన కులా లకు ఎన్‌టీఆర్ అధిక ప్రాధాన్యం ఇవ్వడం వెనక రాజకీయ మతలబు లేకపో లేదు. తెలంగాణలో రాజకీయ ఆధిపత్యం బలమైన రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో నుండి తప్పించడం ఆయన ఉద్దేశం. ఆ మేరకు రాజకీయంగా కొంత ఫలితం ఆయన సాధించి ఉండొచ్చు కానీ, ఈ మొత్తం వ్యవహారంలో ఆ వర్గాలు కొంత ఆర్థికంగా బలపడి రాజ్యాధికారంలో పోటీ పడే స్థాయికి ఎదిగి, అగ్ర కులాలకు సవాలుగా తయారయ్యాయి.
అరైవైఏళ్ల సుదీర్ఘ పోరాటం చివరిదశలో కూడా తెలంగాణలోని వెనుక బడిన తరగతులూ, దళితులూ పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. తెలం గాణ ఏర్పడితే దళితుడే తొలి ముఖ్యమంత్రి, నేను కాపలాదారుడిని మాత్రమేనన్న కేసీఆర్ ప్రకటన దళిత, వెనుకబడిన వర్గాలలో రాజకీయ న్యాయం జరుగుతుందనే ఆశ కలిగించాయి.
తెలంగాణ తొలి మంత్రివర్గ కూర్పు ఆ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లింది. మమ్మల్ని ఎవరూ విమర్శించలేదే అని ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ పెద్ద లూ అనొచ్చు. ‘మేమంతా సంతృప్తి చెందాం’ అని ఆయా వర్గాల నాయకుల చేత ప్రకటనలు ఇప్పించవచ్చు. ఎవరేమన్నా ఇది రాజకీయ ఎజెండాతో ఏర్పాటు చేసిన మంత్రివర్గం తప్ప అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో చేసింది మాత్రం కాదని తెలుస్తూనే ఉంది. రెండు అగ్రకులాలకు చెందిన 11 మంది మంత్రివర్గంలో ఉంటే, నలుగురే వెనుకబడిన తరగతుల వారు, ఒక్కొక్కరు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలవారు ఉండడాన్ని ముఖ్యమంత్రి ఎట్లా సమర్థించుకుంటారు? మంత్రివర్గం కులాల ప్రాతిపదికన జరగదు, సమర్థతను బట్టి నిర్మిస్తాం అంటారా? అంటే ఆ రెండు కులాలలో ఉన్నంత మంది సమర్థులు కింది కులాలలో లేరనే కదా! పార్లమెంటరీ సెక్రట రీల పేరుతో వారిలో కొందరికి సహాయ మంత్రుల హోదా కల్పించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. 119 మంది శాసనసభ్యుల్లో అధికార పార్టీ తరఫున గెలిచిన వారూ, తరువాత బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా ఇతర పార్టీల నుండి వలస వచ్చిన వారు కలిసి 70 మందికి పైగానే ఉన్నారు కదా. అందులో సమర్థులే కనిపించలేదా అన్నది ప్రశ్న.
ఒక్క మహిళా మంత్రి పదవికి తగరా?
మహిళా ప్రాతినిధ్యం మాటేమిటి ? మంత్రిగా పనిచేసే సామర్థ్యంగల మహిళ ఒక్కరు కూడా అధికార పార్టీలో లేరా? పోనీ గెలవలేదనుకుందాం. సమర్థు రాలైన మహిళా నేతకు మంత్రి పదవి ఇచ్చి శాసనమండలికి పంపే ఏర్పాటు చేయవచ్చు కదా! ఇది శాసనసభ ఎన్నికల్లో వేరే పార్టీ నుండి పోటీ చేసి ఓడి పోయిన నాయకుడిని తెచ్చి కేబినెట్‌లో కూర్చోబెట్టడం కంటే అన్యాయం కాదు కదా! రాజకీయ పార్టీలు ఆ ప్రయోజనాలను ఆశించడం సహజమే. ఓడిపో యిన ఒక నేతను వేరే పార్టీ నుండి తెచ్చి నేరుగా మంత్రి పదవి ఇచ్చినా, ఒక బలమయిన సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు ఇచ్చినా, వేరే పార్టీలో ఉండగా తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రత్యక్షంగా దాడులుచేసి, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికి మంత్రివర్గంలో పెద్ద పీటవేసినా, మహిళలను చేర్చుకోక పోయినా అడిగే వాడు లేడు కాబట్టి ప్రస్తుతానికి చెల్లుబాటు అవుతుంది. దీర్ఘ కాల రాజకీయ ప్రయోజనానికి మాత్రం ఉపయోగపడదన్న విషయం ఏలికలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి సహా ఒకే కుటుంబం నుండి ముగ్గురు ఎందుకు మంత్రివర్గంలో ఉండాలి అంటే రుచించకపోవచ్చు. వాళ్లు ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించారనవచ్చు. తెలంగాణ చివరి దశ ఉద్యమంలో అటు వంటి పాత్ర నిర్వహించిన వారు అసంఖ్యాకంగా ఉన్నారు. వారందరికీ ఈ న్యాయం వర్తించడం లేదేమి? సరే, ఎవరెన్ని మాట్లాడినా మంత్రివర్గ కూర్పు ముఖ్య మంత్రి విచక్షణ ప్రకారమే జరుగుతుంది, ఒప్పుకుందాం.
కురుమ భవంతికి కొమురయ్య పేరా?
మొన్న ముఖ్యమంత్రి కొమురవెల్లి జాతరకు వెళ్లిన సందర్భంలో కురుమల కోసం ఒక భవనం నిర్మిస్తామని, దానికి దొడ్డి కొమురయ్య పేరు పెడతామని ప్రకటించారు. గ్రామాల్లో కులవృత్తులు అంతరించిపోతున్నాయి. వాటిని బతికించే ఆలోచన లేదు కానీ కులానికో భవనం కట్టించే కార్యక్రమంలో పడ్డది తెలంగాణ ప్రభుత్వం. ఒక ఆదివాసి భవనం, మరో బంజారా సదనం, ఇంకో దళిత భవనం; ఇప్పుడో కురుమ భవనం- కట్టించి ఏం చేస్తారు? రెడ్డి భవనాలు, వెలమ భవనాలు, కమ్మ సంఘాలు, బ్రాహ్మణ సమాజాలు ఉండగా, ఇవి ఉంటే తప్పా అని ప్రశ్నించవచ్చు. తప్పేమీ లేదు. అయితే అది ఎవరి ప్రయోజనం కోసం? అవన్నీ మళ్లీ ఆయా వర్గాల్లో ప్రాబల్యం గల కొద్ది మంది నాయకులకు అధికార కేంద్రాలుగా మారతాయి తప్ప, ఆ వర్గాల పేదప్రజలకు ఏ రకంగానూ మేలు చెయ్యవనేది సత్యం. ఇక కురుమ భవనానికి దొడ్డి కొమురయ్య పేరు పెడతామని ప్రకటించడం హాస్యాస్పదం. కురుమ అనే పదానికి కొమురయ్య అనే పేరు దగ్గరగా ఉందని ఆ పేరు ఎంచుకున్నారా ? లేక కొమురయ్య ఆ కులానికి చెందిన వారని ఎవరయినా చెప్పారా? వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో కులవ్యవస్థకు వ్యతిరేకంగా, నిజాం అకృత్యాలకు వ్యతిరే కంగా జరిగిన పోరాటంలో దొర గడీలో నుండి జరిగిన తుపాకీ కాల్పుల్లో అమరుడయిన దొడ్డి కొమురయ్య పేరును ఒక కుల సంఘ భవనానికి ఎట్లా పెడతారు? నిజాం పరి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులయిన వారి జ్ఞాపకార్థం ఏదయినా నిర్మాణం చేపడితే దానికి దొడ్డి కొమురయ్య పేరు పెడితే అర్థం, సార్థకత. అంతేకానీ ఆ వీరుడిని ఒక కులానికి పరిమితం చేయ ప్రయత్నించడం అన్యాయం. 1940 ప్రాంతాలో గుత్పల సంఘంగా ఏర్పడి కుల వ్యవస్థకు, నిజాం దుష్టపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో, ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా బ్రిటిష్ పాలకుల కోసం యుద్ధ నిధిని వసూలు చెయ్యడానికి ప్రయత్నించిన నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలో అసువులుబాసినవాడు కొమురయ్య. అగ్రకులాల ఆధిప త్యాన్ని ధిక్కరిస్తూ, గొల్ల, కురుమవర్గాల నుండి వినిపిస్తున్న బలమైన గొంతు కలను తమ దారికి తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. కాని అది కొమురయ్య అమర త్వాన్ని అవమానించడమే. ఒక పక్క నిజాం పాలనను వేనోళ్లా పొగుడుతూ, మరోపక్క ఆ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొము రయ్య పేరిట భవనాలు కట్టడం ఏ రాజనీతి?
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 98480 48536)