తుని తగువుతో నగుబాటు | Devulapalli Amar opinion on tuni incident | Sakshi
Sakshi News home page

తుని తగువుతో నగుబాటు

Published Wed, Feb 3 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

తుని తగువుతో నగుబాటు

తుని తగువుతో నగుబాటు

డేట్‌లైన్ హైదరాబాద్
 
తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి విజయవాడలో మీడియాను  పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు. అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నేత కనిపించాడు, పులివెందుల కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగితే వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ ఇచ్చారు.
 
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గడిచిన గురువారం తెలంగాణ  భవన్‌లో పత్రికల వారితో మాట్లాడారు. ఈ పత్రికా గోష్టి, రెండురోజులకు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగం వరకే ఆయన తన ప్రచారాన్ని పరిమితం చేశారు. ముఖ్యమంత్రి బదులు ఆయన కుమారుడు, రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రచార బాధ్యత మొత్తం తీసుకున్నారు.  
 
ముఖ్యమంత్రి నిర్ణయం మంచిదే. ఆయన నగరంలో తిరిగి ప్రచారం చేస్తే జనానికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. భద్రతా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యమంత్రి పత్రికాగోష్టిలో పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబునాయుడుకు హైదరాబాద్‌లో ఏం పని? హిందూపురం నుంచి ఇచ్ఛాపురం దాకా ఊడ్చాల్సిన నగరాలు  బోలెడున్నాయి’  అని జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ ఆక్షేపణను చాలామంది తప్పు పట్టారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌కు పరిమితమయిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఎన్నికయిన ఇద్దరు శాసనసభ్యులను పార్టీలో చేర్చుకుని, అందులో ఒకరికి మంత్రి పదవి కూడా ఇచ్చిన చంద్రశేఖర్‌రావు తోటి తెలుగు ముఖ్య మంత్రికి ఇక్కడేం పని అనడం బాగా లేదన్నారు కొందరు.
 
హైదరాబాద్‌లోనే ఉంటారా?
ఆయన పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు, జాతీయ అధ్యక్షుడి హోదాలో వస్తేతప్పేంటి అన్నారు మరికొందరు విమర్శకులు. నిజమే, ఎవరయినా ఎక్కడికైనా వెళ్లి మాట్లాడవచ్చు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు. ఆ కోణం నుంచేచంద్రబాబు ప్రచారం చేయడాన్ని చూడాలి. అప్పటికే ఆయన కుమారుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌బాబు, ఇతర నాయకులు హైదరాబాద్ ప్రచారంలో ఉన్నారు. లోకేశ్ తన ప్రచారంలో కొన్నిచోట్ల, ‘నేను హైదరాబాద్‌లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, కాబట్టి ఇక్కడి వాడినే!’ అని చెప్పారు. ఎవరికీ అభ్యంతరం ఉండ నక్కరలేదు.
 
నిజానికి ఆయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా హైదరాబాద్ వాసే. 2014 ఎన్నికలలో ఆయన హైదరాబాద్(తెలంగాణ)లో ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యారు. అయితే పరిస్థితులు మారిపోయాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికలలో ప్రచారం చేస్తూ చంద్రబాబు, నేనెక్కడికీ పోలేదు, ఇక్కడే ఉన్నా, ఉంటాను అని కూడా అన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటా నంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండకూడదు.
 
భారతదేశంలో ఎక్కడయినా స్వేచ్ఛగా జీవించే హక్కు మన రాజ్యాంగం అందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కూడా ప్రసాదించింది. మరి, ఆయన ఇక్కడే ఉంటానని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది?  నేనున్నానని ఆయన ఎవరికి భరోసా కలిగించాలని అనుకుంటున్నారు, హైదరాబాద్‌లో? ఇక్కడ ఆయన లేనప్పుడు ఎవరికయినా ఇబ్బంది కలిగితే, అప్పుడు అలాంటి భరోసా కలిగిస్తే అర్థం ఉంది.
 
అటువంటి వాతావరణం హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించలేదు ఈ 20 మాసాల్లో. ఇక్కడ లేకుండా పోవాల్సిన పరిస్థితులను ఆయనే కల్పించుకున్నారు. సరిగా ఉంటే పదేళ్లపాటు (2019లో  ప్రజలు మళ్లీ అధికారం ఇస్తే గిస్తే ) ఆయన ప్రభుత్వాన్ని హాయిగా హైదరాబాద్ నుంచే నడుపుకుని ఉండేవారు. అట్లా కాకుండా అర్ధంతరంగా మూటా ముల్లే  సర్దు కుని విజయవాడలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలన చెయ్యాల్సి రావ డానికి కారణం అందరికీ తెలిసిందే. ఈ జూన్ మాసం నాటికి అంతా విజయవాడ వచ్చెయ్యాల్సిందేనని  ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదేశాలు జారీ చేసి, ఇంకో పక్క నేనెక్కడికీ పోను ఇక్కడే ఉంటానని చంద్రబాబు చెప్ప డంలో అర్థం ఉందా? మరి ఇలా మాట్లాడతారెందుకు? ఎందుకంటే, నగ రంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతవాసులు ఈ భరోసాతో జీహెచ్‌ఎంసీ ఎన్నిక లలో టీఆర్‌ఎస్‌కు కాకుండా, తమకు ఓట్లేస్తారన్న ఆశ. పోలింగ్ కూడా పూర్త యింది. ఇక్కడి ఆంధ్రుల ఓటు ఎవరిదో రెండురోజుల్లో తెలిసిపోతుంది.


ఎప్పుడూ పరనిందే
ఇక తెలంగాణ  సీఎం పత్రికా గోష్టిలో చేసిన వ్యాఖ్య గురించి- ఆయన చెప్పిన హిందూపురం, ఇచ్ఛాపురాల మధ్యలోనే తుని అనే పట్టణం ఉంది. హిందూ పురానికీ ఇచ్ఛాపురానికీ మధ్య చంద్రబాబునాయుడు ఊడ్చాల్సింది చాలా ఉందన్నమాట అక్షరసత్యమని మొన్ననే తుని చెప్పేసింది. వెనుకబడిన వర్గాల జాబితాలో తమను చేర్చాలని కాపు సామాజికవర్గం కొన్ని దశా బ్దాలుగా ఉద్యమాలు చేస్తున్న విషయం అపార రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియని విషయం కాదు.
 
ఆ ఉద్యమానికి నాయకత్వం వహి స్తున్న ముద్రగడ పద్మనాభం పట్టుదల, కార్యాచరణ శైలి కూడా చంద్ర బాబుకు సుపరిచితమే. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉద్యమంలో ముద్రగడ దగ్గరికి వెళ్లి చంద్రబాబు మద్దతు కూడా ప్రకటించారు. ఇది తెగని సమస్యగా ఉందనీ, పూర్తిగా తమ చేతుల్లో ఉండదనీ, కేంద్ర ప్రభుత్వం కూడా కలసి రావాలనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాపులను బీసీల జాబితాలో చేర్చితే ఇంకోచోట గుజ్జర్లు, జాట్లు, పటేళ్లు తలనొప్పిగా తయారవుతారు కాబట్టి కేంద్రం ఈ అంశంలో కలసిరాదనీ చంద్రబాబుకు తెలియదనుకోవాలా? ఆయనకు అన్నీ తెలుసు.
 
రైతు రుణ మాఫీ తమ వల్ల కాదని తెలుసు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేననీ తెలుసు. కాపులను బీసీలలో చేర్చలేననీ తెలుసు. అయినా అసెంబ్లీ ఎన్నికలలో గట్టెక్కడానికి ఆయన చేసిన ఒకానొక వాగ్దానం ఇవ్వాళ తుని సంఘటన రూపంలో మెడకు చుట్టుకున్నది. తన మెడకు చుట్టుకున్న పామును ప్రతిపక్షాల మెళ్లో, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడి మెడలో వెయ్యడానికి ఆయన రెండు రోజులుగా అవస్థపడుతున్నారు.
 
 విపక్షనేతపై అసహనం
కాపులను వెనుకబడిన కులాల జాబితాలో  చేర్చుతామని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ. 1,000 కోట్లు  సమకూరుస్తామని ఎన్నికల సమ యంలో వాగ్దానం చేసి, మాట తప్పినందుకు ఆ సామాజికవర్గం ఆందోళనకు దిగబోతున్నదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ చాలా ముందే తెలుసు. తునిలో జరగబోయే కాపు గర్జనను అడ్డుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. అయినా సాధ్యం కాలేదు. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలలో ఉన్న ఆ సామాజికవర్గం వారు చిన్నా పెద్దా తుని చేరుకున్నారు. ఆందోళన అదుపు తప్పింది.
 
ఒక రైలు మొత్తం దగ్ధం చేశారు. పోలీస్‌స్టేషన్‌ల మీద దాడి చేశారు. పోలీసులను కొట్టారు. దీనినం తటినీ  అన్ని న్యూస్ చానళ్లూ ప్రసారం చేశాయి. కానీ, ముఖ్యమంత్రికీ, ప్రభుత్వానికీ మరీ ముఖ్యంగా నిఘా విభాగానికీ సమాచారం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎంత అదుపు తప్పి సాగుతున్నదో అర్థం చేసు కోవచ్చు. ఒక పక్క తునిలో విధ్వంసం కొనసాగుతూ ఉండగానే సీఎం విజయవాడలో మీడియాను  పిలిచి, ఆ ఘటనకు బాధ్యులెవరో ప్రకటించేశారు.
 
అక్కడ ఏం జరుగుతున్నదో అక్కడ ఉన్నవారికే అర్థంకాని పరిస్థితిలో చంద్రబాబుకు మాత్రం మొత్తం జరిగిందంతా కళ్లకు కట్టినట్టు కనిపించడం ఆశ్చర్యం. ఆ దృశ్యంలో ఆయనకు ప్రతిపక్ష నాయకుడు కనిపించాడు, పులివెందుల పట్టణం కూడా కనిపించింది. ఇటువంటి అవాంఛనీయ సంఘ టన జరిగితే సంయమనం పాటించి, వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వాధినేత ఒక పక్క తుని తగలబడుతుంటే హేట్ స్పీచ్ (ద్వేష ప్రసంగం) యథేచ్ఛగా చేసేశారు.
 
ఆందోళన అదుపు తప్పి విధ్వంసం జరిగే ప్రమాదం ఉందన్న సమాచారం సేకరించి తనకు అందించలేకపోయిన నిఘా వ్యవస్థను నిలదీయాల్సింది పోయి, ఆరు న్యూస్ చానళ్ల  ఓబీ వ్యాన్‌లు అక్కడికి ఎలా వెళ్లాయి? వాళ్లకు ముందే ఇదంతా జరుగుతుందని తెలుసు అని ఒక సీఎం మాట్లాడటం హాస్యాస్పదం.
 
ప్రచార ప్రసార మాధ్యమాలు ఎట్లా పనిచేస్తాయో ఆయనకూ, ఆయన సమాచార వ్యవస్థను నిర్వహిస్తున్న భజనపరులకూ తెలియని కారణంగానే చంద్రబాబు మీడియాను ఆడిపోసుకుంటున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్‌లో ఏం పని అని తెలంగాణ  ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తే ఆక్షేపించిన వాళ్లే ఇప్పుడు అవును, అక్కడ తుని తగలబడుతుంటే చంద్రబాబు హైదరాబాద్‌లో ఫిడేల్ వాయించడం ఏమిటి అని ముక్కున వేలేసుకుంటున్నారు.
 
కాపుల ఉద్యమం ఇక్కడితో ఆగిపోవడం లేదు. శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య ఆమరణ నిరాహార దీక్షకు కూర్చో బోతున్నారు. ముద్రగడ దీక్షలు ఎట్లా ఉంటాయో చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రతిపక్ష నాయకుడినీ, మీడియానూ తిడుతూ కూర్చో కుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన నిఘా వ్యవస్థను చక్క దిద్దుకుని, కాపుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిది. కేరళలో షూటింగ్‌లో ఉన్న పవన్ కల్యాణ్‌ను హుటాహుటిన రప్పించి మీడియా ముందు హాజరుపరిస్తే సమసిపోయే అంత సులువయిన సమస్య కాదిది.
 
 దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement