ప్రజలకు దారి చూపినవాడు నాయకుడవుతాడు. ప్రజలు నడిచే దారిలో తానూ నడిచినవాడే నాయకుడవుతాడు. ప్రజలు నాయకుడి వైపు ఎందుకు చూస్తారు? మా దారిలో కష్టం ఉంది తొలగించు... మా గింజలకు వెలితి ఉంది పూరించు... మాకు జబ్బు చేస్తే వైద్యానికి దోవ లేదు చూపించు... మా పిల్లలకు చదువు చెప్పించు... మా నెత్తిన ఒక నీడ పరువు... మా పిల్లలకు ఒక ఉపాధి చూపించు... ఇలా చెప్పుకోవడానికే కదా.అవి విన్నవాడే నాయకుడవుతాడు. నేను ఉన్నానని అనేవాడే పాలకుడవుతాడు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వర్తమాన పరిణామాలకు మూలాలు ఏమిటో తెలియడం తెలుగు ప్రజలకు అవసరం. ఎందుకంటే ప్రజల నొసట రాత పాలకులే రాస్తారు. నాటి మద్రాసు రాష్ట్రంతో మొదలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, హైదరాబాద్ స్టేట్ ఆవిర్భావం, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రకటన, తెలంగాణ ఉద్యమాల దరిమిలా తెలుగు రాష్ట్రాల విభజన... వీటన్నింటిలో పాలకుల ఎత్తుగడలకు, ప్రజల ఆకాంక్షలకు జరిగిన ఘర్షణ ఒక క్రమానుగతంగా చదివితే ఎక్కడెక్కడ నాయకుడనేవాడవసరమో అక్కడక్కడ తెలుగు జాతి ఒక నాయకుణ్ణి తయారు చేసుకోగలిగింది అనిపిస్తుంది. అయితే ముందే చెప్పుకున్నట్టుగా ఈ నాయకుల్లో ప్రజల కోసం నిలిచే నాయకులూ ఉన్నారు. ప్రజలను వంచించే నాయకులూ ఉన్నారు.
సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల విషయంలో ప్రదర్శించిన అహం, ప్రోత్సహించిన ముఠా రాజకీయాల సంస్కృతి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక అనిశ్చితిలోనే ఉంచాయి. స్థిరంగా నిలిచి, బలంగా కొనసాగే నాయకుడు ఉన్నప్పుడే జాతి ముందుకు వెళ్లగలదు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌కు సమర్థమైన నాయకత్వం వహించినా కుర్చీ కింద పెట్టే మంటలు వారిని కుర్చీ వదులుకునేలా చేశాయి. అసలు తెలుగువారికి ఒక ఆత్మాభిమానం ఉందా అనే సందేహం కలిగించాయి.
ఈ సందర్భమే ఎన్.టి.రామారావు పుట్టుకకు కారణమైంది. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన నాయకుడిగా, చరిష్మా కలిగిన పాలకుడిగా, పేదవాడి గురించి ఆలోచన చేసిన అభిమాన నేతగా ఎన్.టి.రామారావు ప్రజల మెప్పును పొందారు. కాని ఆయన అహం, తొందరపాటు చర్యలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు నాయుడు తెలుగుజాతి అవమానపడే రీతిలో ఎన్.టి.ఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొడ్డి దారిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పాటు పార్టీ ఫండ్ ఉన్న అకౌంట్‌ను కూడా హస్తగతం చేసుకున్న వార్త అందిన రోజున ఎన్.టి.ఆర్. తీవ్ర మనస్తాపం చెందారు. అదే ఆయన మృతికి కారణమైందన్న భావన ఉంది.
‘దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్’ అన్నాడు గురజాడ. ఒక రాష్ట్రాన్ని ప్రజల వారసత్వంగా చూడాల్సిందిపోయి దానినో కార్పొరెట్ ఆఫీసుగా మార్చి, దానికి తాను సి.ఇ.ఓగా భావించి పాలించడం మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలుగు ప్రజలు చులకనను ఎదుర్కొన్నారు. గుండు దెబ్బలు తిన్నారు. నీతి, రీతులే వ్యక్తిత్వమని భావించే మన సంస్కృతిలో వంచనతో వచ్చిన నాయకుడిని నమ్మి మోసపోతున్నామని తెలుగు ప్రజలకు పదేపదే అనిపించిన ఉదంతాలు ఉన్నాయి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వచ్చి పెద్ద గీత గీసే వరకూ చంద్రబాబు ఎంత చిన్న గీతో ప్రజలకు అర్థమైందని విశ్లేషకులు అంటారు.
ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత... పాలన చేస్తే ఎలా ఉంటుందో వై.ఎస్.రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చూపారు. విశాలమైన హృదయం, దయ, ఆర్ద్రత ఉన్న నాయకుడు తన పాలనలో ప్రతి వ్యక్తి ఉన్నతి కోసం తపన పడతాడని, పడాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి చూపారు. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రియింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత కరెంట్, జలయజ్ఞం... రాష్ట్రం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నదని ప్రజలు పూర్తి సంతృప్తితో, సంతోషంగా ఉన్న కాలమది.
కాని రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తెలుగుజాతిని స్థాణువును చేసింది. రాజశేఖర రెడ్డిని చూసిన కళ్లు అలాంటి నాయకుడి కోసమే వెతుకులాడాయి. ఆ నాయకుణ్ణి వై.ఎస్.జగన్‌లో చూసుకున్నాయి. అయితే రాజకీయ కుయుక్తులు పన్నడంలో తలపండిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, జగన్‌కు మధ్య సైంధవుడిలా నిలిచారు. టక్కుటమార విద్యలు ప్రదర్శించి, అబద్ధాల మేడలు కట్టి మరోసారి జనాన్ని నమ్మించి సి.ఎం. అయ్యారు. కాని చంద్రబాబు పరిపాలనా కాలంలో రాష్ట్రం మన్నుతిన్న పాములా ఉండిపోయింది. చిన్నా చితక పథకాల ప్రయోజనాల కోసం కూడా ప్రజలు అల్లల్లాడారు. ఒక వర్గం ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల లబ్ధి పొందుతున్నారని సామన్యులకు అవగతమైంది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుని కోసం వారు తిరగబడ్డారు. వై.ఎస్.జగన్‌ని తమ ముఖ్యమంత్రిని చేసుకున్నారు.
రాష్ట్ర విభజన వల్ల అనేక వెసులుబాట్లు కోల్పోయి, నిధుల లోటులో రాష్ట్రం ఉన్నప్పటికీ జగన్ తన విశిష్ట సమర్థతతో ప్రజాహిత పాలన కోసం నవరత్నాలతో ముందుకు వచ్చారు. రెండేళ్ల కరోనా కాలం ప్రపంచాన్ని స్తంభింపచేసినా తెలుగు రాష్ట్రం ముందంజలో ఉండేలా చూసుకున్నారు. విద్య నుంచి వికాసం, వైద్య ఖర్చు నుంచి విముక్తి ప్రధాన అజెండాగా చేసుకున్న జగన్ విస్తృత తెలుగు సమూహాలను గట్టున పడేశారు. తెలుగు ప్రజలు ఎన్నడూ చూడని విధంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణి జరిగింది. రాజధానిలో పేదలకూ చోటుండాలని భావించిన జగన్ వంటి ముఖ్యమంత్రి ఉన్నారా?
దారులు స్పష్టం. ప్రజలు ఏ దారిని ఎంచుకోవాలో తమకు తాముగా నిర్ణయించుకోవాలని అంటారు దేవులపల్లి అమర్. ఆయన రాసిన ‘మూడు దారులు’ గ్రంథం ఆంధ్ర రాష్ట్ర అవతరణ నుంచి మొదలయ్యి ప్రభావవంతమైన ముఖ్యమంత్రులుగా పని చేసిన ఎన్.టి.రామారావు, వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధోరణులను తెలియచేస్తూ ఇప్పుడు వై.ఎస్. జగన్‌తో తల పడుతున్న చంద్రబాబు ‘యూ టర్న్’లను, వెన్నుపోట్లను, నమ్మించి వచించిన సంఘటలను విపులంగా తెలియచేసి పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.
అనుభవజ్ఞుడైన జర్నలిస్టుగా మాత్రమే కాదు, చేయి తిరిగిన జర్నలిస్టుగా కూడా దేవులపల్లి అమర్ ఎంతో సులభంగా, సరళంగా చరిత్రని, వర్తమానాన్ని, తెలుగు నేలకు సంబంధించిన రాజకీయ ఘటనలను ఒక వరుసలో ఉంచి పాఠకులకు గొప్ప అవగాహన కలిగిస్తారు. కొన్ని ఘటనలు జరక్కపోయి ఉంటే తెలుగు జాతి మరింత ముందంజలో ఉండేది కదా అనిపించే విషయాలన్నో ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇది నేటి రాజకీయ కార్యకర్తలకు, నిపుణులకే కాదు భావి విద్యార్థులకు కూడా కీలకమైన రిఫరెన్స్ గ్రంథం.
‘చరిత్రదేముంది... చింపేస్తే చిరిగి పోతుంది’ అనేది సినిమాలో డైలాగ్. కాని చరిత్ర చిరిగిపోదు. అలాగే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఉజ్జీవనం చెందుతూనే ఉంటుంది. చరిత్ర నిర్మింపబడే కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విభజన అయ్యాక కాళ్లూ చేతులు ఊనుకుని ఒక గొప్ప పురోగమనానికి సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ సమయంలో ఎటువంటి నాయకుణ్ణి ఎన్నుకోవాలో, తద్వారా ఎటువంటి ఘన చరిత్రకు తెలుగు జాతి ఆలవాలంగా ఉండాలో ఈ ఎన్నికల కాలంలో నిర్ణయించుకోవాలి. దారి స్పష్టం కావాలంటే ఈ గ్రంథం చదవండి.
మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు;
రచన– దేవులపల్లి అమర్;
ప్రచురణ– రూప బుక్స్; పేజీలు: 210; వెల–395;
ప్రతులకు–రూప పబ్లికేషన్స్, హైదరాబాద్.
– వి.ఎన్.ప్రసాద్
(చదవండి: మూడు దారులు– రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు)
Comments
Please login to add a commentAdd a comment