ప్రభుత్వాల ‘ప్యాకేజీ’ ప్రహసనం | opinion on governements package | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాల ‘ప్యాకేజీ’ ప్రహసనం

Published Wed, Aug 19 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

ప్రభుత్వాల ‘ప్యాకేజీ’ ప్రహసనం

ప్రభుత్వాల ‘ప్యాకేజీ’ ప్రహసనం

డేట్‌లైన్ హైదరాబాద్
ప్రత్యేక హోదాకు, ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా ప్రభుత్వంలోని పెద్దలకు, వారి తరఫున లేదా వారిని కాపాడటానికి ప్రయత్నిస్తున్న పెద్దలకు, ఆ వర్గం మీడియాకు తెలియదనుకోవాలా? ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీల కారణంగా ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులకు నడుమ ఉండే తేడాను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది అభివృద్ధి కాగా, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. అందులో ఎంత సద్వినియోగం అవుతుందో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు?

 నరేంద్ర మోదీ మహరాజ్ బిహార్ రాష్ర్టం మీద వరాల జల్లు కురిపించారు. ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కదా, మహరాజ్ అంటారేమిటి అనే సందేహం వద్దు. ఆయన తాను ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నానని కానీ, ఆ దేశానికి అయిదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉండి తమ తరఫున పరిపాలన చెయ్యమని ప్రజలు ఓట్లేసి గెలిపించారని కానీ అనుకుంటున్నట్టు లేరు. బిహార్ పర్యటనలో భాగంగా ఆయన చేసిన ప్రసంగం, ఆయన హావభా వాలూ రాజరిక వ్యవస్థ ప్రతినిధిని తలపిస్తాయే తప్ప, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్న నాయకుడు ఉపన్యసిస్తున్న తీరులో మాత్రం కనిపించవు. బిహార్‌కు ఆర్థికసాయం ఎంత కావాలి అని అడిగిన మోదీ, జనం చప్పట్లు, ఈలల మోత పెరిగిన కొద్దీ ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోయారు. ఆయన బిహార్‌కు ఒక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలనుకున్నారు. దాని కోసం ఆయన 50 వేల కోట్ల రూపాయల నుండి మొదలు పెట్టి లక్షా ఇరవై ఐదు వేల కోట్ల సాయం ప్రకటించారు.

 ఆ కోట్లు ఎవరివి?
 బిహార్‌కు బోలెడు డబ్బు అవసరమే కావచ్చు. కేంద్ర సహాయం కూడా చాలా అవసరమే కావచ్చు. కానీ ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, బిహార్‌కు  సాయంగా అందిస్తానని మోదీ చెబుతున్న లక్షా ఇరవై ఐదువేల కోట్లు ఎవరి డబ్బు? ఎక్కడి నుండి వచ్చింది? రెండు, ఏ ప్రాతిపదికన, ఎవరి ఆమోదంతో ఈ సాయం ప్రకటించారు? ఈ ప్రశ్నలు ఎందుకు వెయ్యాల్సి వస్తున్నదంటే రాష్ర్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఊసు ఎత్తితేనే కేంద్రంలోని పెద్దలు లేవనెత్తే అభ్యంతరాల జాబితా, చూపే కుంటిసాకుల జాబితా చేంతాడంత ఉంటుంది. మరి, బిహార్‌కు లక్షా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించేటప్పుడు ఈ సమస్యలేవీ అడ్డురాలేదా? లేకపోతే 2014 ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన ఉత్తుత్తి హామీగానే బిహార్‌కు ప్రకటించిన సహాయాన్ని కూడా పరిగణించాలా? ఈ అనుమా నాలు ఎందుకొస్తాయంటే బిహార్ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి.

ఎన్నికల తరువాత ఓడిపోతే సరే సరి, మమ్మల్ని గెలిపిస్తే ఈ సాయం అందేది అని తప్పించుకోవచ్చు. గెలిచినా కూడా ఎగ్గొట్టెయ్యవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసింది అదే కదా! ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదు పదేళ్లు కావాల్సిందే అని రాజ్యసభలో వీరంగం వేసిన వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రి. పదేళ్లు కూడా సరిపోవు పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనన్న తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీని భాగస్వామిగా చేర్చుకున్నదే.

 ఆంధ్ర ప్రజలకు ఏం చెబుతారు?
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్టీని ఎన్నికలలో గెలిపించడానికి  బిహార్‌లో ఇంకా ఇటువంటి సర్కస్‌లు ఎన్నయినా చెయ్యొచ్చు. ఒక్కటి మాత్రం బీజేపీ పెద్దలు గుర్తించుకోవాలి. పద్నాలుగు మాసాలు గడిచి పోతున్నా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చక పోగా, ఢిల్లీ నుండి గల్లీ దాకా బీజేపీ, టీడీపీ పెద్దలు, చిన్నలు మాట్లాడుతున్న మాటలు ఆ రాష్ర్ట ప్రజల మనోధైర్యాన్ని ఎంతగా దెబ్బతీశాయో తిరుపతిలో మునికోటి ఆత్మా హుతితో అయినా గుర్తించకపోతే అధికార టీడీపీ సరే, స్వతంత్రంగా రాజ కీయ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి కూడా భంగపాటు తప్పదు. బిహార్‌కు నరేంద్ర మోదీ చేసిన వాగ్దానం తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికా రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజలకు ఏం జవాబు చెబు తుందో చూడాలి.

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షాలు చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా ఇప్పటి దాకా రకరకాల కార ణాలు చెబుతూ కాలయాపన చేశారు. ముఖ్యమైన ఈ సమస్య మీద అఖిల పక్షాన్ని దగ్గరికి తీసుకుని, చర్చించడానికి ఏనాడూ ప్రయత్నం చేయలేదు. పైగా కాసేపు ప్రణాళికా సంఘం రద్దయి, నీతి ఆయోగ్ వచ్చిందంటారు. మరి కాసేపు ఆర్ధిక సంఘం బూచిని చూపిస్తారు. ఇంకాసేపు ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్‌లో ప్రకటనలు చేయిస్తారు. మళ్లీ ప్రత్యేక హోదా మీద పట్ట్టుదల ఎందుకు, ప్రత్యేక ప్యాకేజీల ద్వారా బోలెడు నిధులు తెస్తాం అంటారు. ఏదీ, మరి ఏ సాయమూ అందలేదేమిటంటే, బిహార్ ఎన్నికల భూతాన్ని చూపిస్తారు. ఇప్పుడు ప్రధానమంత్రే స్వయంగా బిహార్‌కు చేయబోయే సాయాన్ని ప్రకటించాక ఏం చెబుతారు?
 ప్రత్యేక హోదా ఎక్కడ? ప్యాకేజీ ఎక్కడ?
 అసలు ఈ ప్రత్యేక హోదా కోసం పట్టుదల ఎందుకు? మనకు కావలసినన్ని నిధులు తెచ్చుకుంటే చాలదా అని వాదిస్తున్న పెద్దలు కొందరు ఉన్నారు. మీడియాలోని ఒక వర్గం కూడా ఈ అంశాన్నే గట్టిగా ప్రచారం చేస్తున్నది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక దశ వరకు ప్రజలను మానసికంగా ప్యాకే జీలకు సిద్ధం చేసే ప్రయత్నమే చేసింది. ఇదొక విచిత్రమయిన వాదన. జనాన్ని మోసం చేసే మాటలు ఇవి. ప్రత్యేక హోదాకు, ప్యాకేజీలకు మధ్య ఉన్న తేడా ప్రభుత్వంలోని పెద్దలకు, వారి తరఫున లేదా వారిని కాపాడ టానికి ప్రయత్నిస్తున్న పెద్దలకు, ఆ వర్గం మీడియాకు తెలియదనుకోవాలా? ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీల కారణంగా ఏర్పడే ఉద్యోగ ఉపాధి అవ కాశాలకు, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులకు నడుమ ఉండే తేడాను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రత్యేక హోదా ద్వారా వచ్చేది అభివృద్ధి కాగా, ప్యాకేజీల ద్వారా వచ్చే నిధులు తాత్కాలిక ప్రయోజనాలనే నెరవేరుస్తాయి. అందులో ఎంత సద్వినియోగం అవుతుందో ఎవరు మాత్రం ఎలా చెప్పగలరు? అయినా ప్యాకేజీల జపమే చేస్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు చివరికి కేంద్రాన్ని కొంచెం గట్టిగా అడిగినట్టు జనానికి చూపించుకోక తప్పలేదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మళ్లీ ఇందులో రాజకీయ క్రీడ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ర్టంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల ముందు ఒకరినొకరు పలచన చేసుకోడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇదంతా అన్న వాదన కూడా వినబడుతున్నది.

 ఏకాంతంలో ఏం చర్చిస్తారు?
 ఏదిఏమైనా, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారూ రోడ్డెక్కాక,  ప్రత్యేక హోదా కోసం తొలి నాటి నుండే పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉద్యమం జంతర్ మంతర్ చేరాక, మునికోటి ఆత్మాహుతి చేసుకున్నాక ఎట్టకేలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నుండి రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫోన్‌లో ఆహ్వానం అందింది. చూశారా! ‘మీరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి!’ అని చెప్పడా నికి మనుషులు  చావాలన్న మాట. కనీసం ఇప్పుడైనా పిలిచారు సంతోషం. రేపు, అంటే ఇరవయ్యవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారు, ప్రత్యేక హోదా గురించి చర్చించడానికి.

తామిద్దరూ జంటగా ఎన్నికల ప్రచార వేదికలెక్కి ఇచ్చిన మాట ప్రత్యేక హోదా. దాని మీద మళ్లీ ఏకాంతంలో ఏం చర్చిస్తారు? బిహార్ తరహాలో ఆంధ్రప్రదేశ్ మీద లక్ష కోట్ల కాసుల వాగ్దాన వర్షం కురిపిస్తారా? బిహార్ విషయంలో ఇది ఎవరి సొమ్ము అని ఎట్లా అంటున్నామో ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అదే అనవలసివస్తుంది. ఆహ్వానం తెప్పించుకుని మరీ ఢిల్లీ వెళుతున్న ముఖ్యమంత్రికి బాగా తెలుసు- కేంద్రం నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు రాబోయే సాయం ఏమిటో. అయినను పోయిరావలె హస్తినకు. కాబట్టి వెళతారు, వస్తారు.

 

(వ్యాసకర్త దేవులపల్లి అమర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement