రెండు రాష్ట్రాలు.. రెండు ఘటనలు.. | Two States - Two Incidents | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాలు.. రెండు ఘటనలు..

Published Wed, Apr 8 2015 2:09 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

దేవులపల్లి అమర్ - Sakshi

దేవులపల్లి అమర్

 డేట్‌లైన్ హైదరాబాద్

 ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది.  ఇటువంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి.
 
 రెండు తెలుగు రాష్ట్రాలలో మంగళవారం రెండు భారీ స్థాయి ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలనొప్పిగా తయారైన ఎర్రచందనం దొంగ రవాణాకు సంబంధించిన ఘటన ఇందులో ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మొత్తం భారతదేశాన్నీ, ఆ మాటకొస్తే ప్రపంచాన్నే చికాకు పరుస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు సంబం ధించిన ఘటన రెండవది. చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం శేషాచలం అడవులలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకంగా 20 మందిని చంపేశారు. ఇం తకూ, ఆ చనిపోయినవారు ఎవరు అన్న విషయం నిర్ధారణ కావలసి ఉంది.

 ఆంధ్ర ప్రభుత్వానికి మచ్చ
 ఎవరిని చంపుతున్నామో తెలియకుండానే చంపేసి, ఇంకా నిర్ధారణ కావలసి ఉంది అంటే అర్థం ఏమిటి? చనిపోయిన వారిలో ఎవరు కూలీలో, ఎవరు స్మగ్లర్లో ఇంకా నిర్ధారణ కాలేదని సామాన్యులెవరో అనలేదు. ఆ మాటలు అన్నది ఏదో మీడియా వారు అయినా ఫరవాలేదు. ఇంకా పూర్తి సమాచారం తెలిసి ఉండకపోవచ్చునని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆ మాటలు అన్నది సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ డెరైక్టర్ జనరల్ జేవీ రాముడు. వాళ్లు కూలీలా, స్మగ్లర్లా అన్నది నిర్ధారణ కాకుండా ఇరవై మందిని ఏకబిగిన ఎట్లా కాల్చి చంపారు? స్మగ్లర్లు తలనొప్పిగా మారారు, నిజమే. వారి ఆగడాలను అరికట్టవలసిందే. ఇప్పటికే చాలామంది స్మగ్లర్లను అరెస్ట్ చేసి రాజమండ్రి జైలులో వారికి రాజభోగాలు కల్పిస్తున్నారన్న నింద మోస్తున్న వారు ఇప్పుడు తాజా ఎన్‌కౌంటర్ ఘటనలో ఇరవైమంది మృతికి కారణమై మరింత అప్ర తిష్ట మూటకట్టుకోబోతున్నార న్నది నిజం.

 శేషాచలం అడవులలో జరిగిన ఈ భారీ ఎదురుకాల్పులలో చనిపోయిన వారు స్మగ్లర్లు నియమించిన కూలీలే అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమూ, పోలీసు బాసులూ సమాజానికి ఏం సమాధానం చెబుతారు? పొట్టకూటి కోసం వచ్చిన కూలీలను పొట్టన పెట్టుకున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. మిగి లిన ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనను ఖండించాయి. పొరుగు రాష్ట్రం తమిళ నాడు రాజకీయ పార్టీలు కూడా నిరసన తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చించుకుని పరిష్కరించవలసిన అంశమని అంటున్నారు. మొత్తం మీద గోరుచుట్టు మీద రోకటిపోటులా తయారైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి. విభజన తరువాత రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. వీటిలో అత్యంత ముఖ్యమైనది రాజ ధాని నిర్మాణం. దీనితో మిగిలిన సమస్యలన్నీ పక్కకు పోయాయి. అదే క్రమంలో శాంతిభద్రతలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యాల నుంచి తప్పు కున్నట్టు కనిపిస్తోంది.

 టీ హోంమంత్రి ప్రకటన హాస్యాస్పదం
 ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోను ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొని ఉందని ఇటీవలి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రెండుమూడు రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనలో ఈ రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహా రెడ్డి, పోలీస్ డెరైక్టర్ జనరల్ అనురాగ్ శర్మ చేసిన ప్రకటన, శేషాచలం అడవుల ఘటన మీద ఆంధ్ర డీజీపీ చేసిన ప్రకటన కంటే హాస్యాస్పదం. సూర్యాపేట బస్టాండ్ దగ్గర పోలీసుల మీద కాల్పులు జరిపినవారు దోపిడీ దొంగలేననీ, ఉగ్రవాదులు కానేకారనీ ఆ ఇద్దరూ ప్రకటించారు. పూర్తి సమా చారం లేకుండానే బాధ్యత గల పదవులలో ఉన్నవారు మీడియా ముందు ఇలా మాట్లాడడం క్షమించరాని విషయం.

 ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు కొన్నేళ్ల పాటు మొత్తం అందరి దృష్టి - పోలీసులతో సహా- ఉద్యమాల మీదనే నిలిచిపోయింది. ఉద్యమాలను అణచివేయడానికి కొంతకాలం, ఉదారంగా ఉండడానికి మరికొంతకాలం వెచ్చించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొత్త రాష్ట్రాలలో మామూలు కర్తవ్యం మరచిపోయారేమోనన్న సందేహం అందరికీ కలుగుతున్నది. ఇటు వంటి నిర్ధారణలకు రావడానికి దోహదం చేసే విధంగానే సంఘటనలు జరుగుతున్నాయి. సరే, ప్రస్తుత సంఘటనల దగ్గరకొద్దాం!

 ప్రహసన ప్రాయమైన ఎదురుకాల్పుల కథలు
 మంగళవారం వరంగల్ నుంచి ఖైదీలను హైదరాబాద్ కోర్టుకు తీసుకు వస్తుం డగా ఘర్షణ జరిగి విచారణలో ఉన్న ఐదుగురు ఖైదీలు పోలీసుల ‘ఎదురు కాల్పులలో చనిపోయారు’. నిజానికి పోలీసులూ, వారు జరిపే ఎదురు కాల్పులూ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయాయి. వీటిని సమాజం నమ్మే స్థితి ఎప్పుడో పోయింది. నిజానికి మంగళవారం పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న విచారణ ఖైదీలలో ఒకడు వికారుద్దీన్. గతంలో కూడా ఇదే మార్గంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈసారి కూడా నిజంగానే ఆ ఐదుగురు తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. కానీ తెలంగాణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నవీన్‌చంద్ చెబుతున్నట్టుగానే ఆ ఖైదీలు ఐదుగురు, పోలీసులు పదిహేనుమంది. పోలీసుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. వీళ్ల చేతులకు బేడీలు ఉంటాయి. ఎట్లా తిరగబడతారు? ఎట్లా పోలీసుల చేతులలో నుంచి ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేస్తారు? లేదా పారిపోయే సాహసం చేస్తారు? ఇదంతా నమ్మశక్యంగా ఉండదు. దీనికితోడు ఎన్‌కౌంటర్ అనగానే పోలీసులే చంపి ఉంటారులేనన్న భావన. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని వికారుద్దీన్ అనే విచారణ ఖైదీ తండ్రి అంటూనే ఉన్నాడు. శనివారం నల్లగొండ జిల్లా సూర్యా పేటలో జరిగిన ఘటన, దాని కొనసాగింపుగా జానకీపురం దగ్గర ఎన్ కౌంటర్, మళ్లీ మంగళవార ం అదే జిల్లాలోని ఆలేరు దగ్గర విచారణలో ఉన్న ఖైదీలు ఎదురుకాల్పులలో చనిపోవడం వరుసగా పేర్చి చూస్తే - సూర్యాపేట ఘటనకు సంబంధించి పోలీస్‌శాఖ మీద వచ్చిన విమర్శల పర్యవసానమే ఆలేరు పరిణామమన్న అనుమానం కలగక తప్పదు.

 ఆలేరు ఎదురుకాల్పుల ఘటన ఎలా జరిగింది? ఏమిటి? అనే వివ రాలన్నీ తరువాత తప్పక వెల్లడవుతాయి. కానీ ఈ వార్తా లేఖ రాస్తున్న సమ యానికే జానకీపురం ఘటనలో గాయపడిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ సిద్ధయ్య మరణించిన వార్త వచ్చింది. దీనితో నలుగురు పోలీసులు ఈ ఘటనలలో మరణించినట్టయింది. ఆ నలుగురు లింగయ్య, మహేశ్, నాగరాజు, సిద్ధయ్య - ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్. జానకీపురం దగ్గర జరిగిన ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరు విజయవాడవైపు వెళ్లినట్టు కూడా అనుమానం.

  హైదరాబాద్ ప్రశాంతమేనా?
 సూర్యాపేట బస్టాండ్‌లో జరిగిన సంఘటన నుంచి, జానకీపురంలో ఉగ్ర వాదులతో జరిగిన ఘర్ణణ నుంచి మన పోలీసుశాఖ, ప్రభుత్వం ఏం నేర్చుకు న్నాయి. ఏం తెలుసుకున్నాయి? నిన్నటికి నిన్న కూడా తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి హైదరాబాద్ ప్రశాంతంగా ఉందనీ, అనవ సరంగా ఒక మతస్థులను నిందించవద్దనీ అన్నారు. నిజంగానే హైదరాబాద్ ప్రశాంతంగా ఉందా? లేకపోతే హోమంత్రి చెబుతున్నట్టు వినిపిస్తున్నవన్నీ నిందలేనా? వాటిలో నిజాలే లేవా? అంతే అయితే హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకుని దేశమంతా కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు పథకాలు రచిస్తు న్నారంటూ కేంద్ర స్థాయి పరిశోధనా సంస్థలు, నిఘా సంస్థలు ఇస్తున్న నివేదికలకు అర్థం ఏమిటి? ఆలేరు ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్‌లో సోదాలు ఎందుకు మొదలయ్యాయి? భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రశ్నల న్నింటికీ బయటకు జవాబులు చెప్పకపోయినా, ప్రభుత్వం వీటన్నిటి మీదా దృష్టి పెడితే మంచిది. ఇక గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక విభాగాలతో పాటు సివిల్ పోలీసులకు కూడా కొంత మెరుగైన శిక్షణ ఇవ్వడం, మెలకువలు నేర్పడం వంటివి చేసి ఉంటే సూర్యాపేట, జానకీపురాలలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్టు ఆయుధాలు ఉపయోగించడంలో తరచూ పోలీసుల ప్రావీణ్యాన్ని మెరుగు పరచాలి. శరీర దారుఢ్యాన్ని పెంచుకునే వ్యాయామాలు కూడా మరచిపోతున్నారట మన పోలీసులు. రాజకీయ నాయకులకు రక్షణ కల్పిం చడం ఒక్కటే కాదు, తమను తాము రక్షించుకునే నేర్పు కూడా పోలీసు వ్యవస్థకు ఉండాలి.

 నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే ఆ నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న మాట వాస్తవం. తెలంగాణ ప్రభుత్వం ఆధునిక వాహనాలు సమకూరిస్తే సరిపోదు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించే వైపుగా కూడా దృష్టి సారించవలసి ఉంది.

datelinehyderabad@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement