వెంకయ్య హితోక్తులు ఎవరికి? | venkaiah naidu words not for their party MLA's | Sakshi
Sakshi News home page

వెంకయ్య హితోక్తులు ఎవరికి?

Published Wed, Jun 22 2016 12:58 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

వెంకయ్య హితోక్తులు ఎవరికి? - Sakshi

వెంకయ్య హితోక్తులు ఎవరికి?

డేట్‌లైన్ హైదరాబాద్
 
దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను చూసి ఆవేదన చెందుతున్న వెంకయ్య నాయుడు... మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన అన్నట్టే పార్టీ ఫిరాయించిన రోజునే పదవి పోయేట్టు చేస్తే బాగుంటుంది. తన ప్రియ మిత్రుడు చంద్రబాబును ఒప్పించి ఏపీలో పార్టీ ఫిరాయించిన ఇరవై మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయిస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారవుతారు. అక్షర క్రమంలో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ బృహత్ కార్యం ప్రారంభమైతే, దానికి వెంకయ్య నాయుడు కారకులైతే ఇంకా బాగుంటుంది.
 
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా గత వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో జరిగిన ఆత్మీయ సభల్లో ఆయనను ఘనంగా సత్కరించారు. విజయవాడ సన్మానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. అక్కడి ప్రసం గాలు విన్న వారికి అది వెంకయ్య నాయుడు ఒక్కరి సత్కార సభగా అనిపించ లేదు. దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న ఇద్దరు నాయుళ్ల అభినందన సభలాగా అనిపించింది. ఆయనను ఈయనా, ఈయనను ఆయనా కావాల్సినంత పొగిడారు. హైదరాబాద్ సన్మాన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కనిపించలేదు.

ఆయన ప్రభుత్వం తరఫున కూడా ఎవరూ హాజరయినట్టు లేరు. ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ బీజేపీ, టీడీపీ నాయ కులు హాజరయ్యారు. విజయవాడ సన్మానానికి ఏపీ ముఖ్యమంత్రి హాజరు కావడానికి వెంకయ్య నాయుడుతో ఆయనకు ఉన్న వ్యక్తిగత స్నేహానికి తోడు ప్రస్తుత రాజకీయ బంధం కూడా కారణం కావచ్చు. ఆ అవసరం తెలంగాణ ముఖ్యమంత్రికి లేకపోయినా, కేంద్ర మంత్రి అందునా పార్లమెంటరీ వ్యవహా రాలను చూస్తున్న సీనియర్ నేత కాబట్టి మర్యాదపూర్వకంగా హాజరై ఉండొచ్చు. అయితే రాష్ట్రంలోని అధికార పక్షానికీ, కేంద్రంలోని అధికార పక్షానికీ మధ్య ఉండాల్సిన మామూలు సంబంధాల విషయం ఎట్లా ఉన్నా... రాజకీయంగా రెండు రాష్ట్రాల అధికార పక్షాల పరిస్థితి పూర్తి విరుద్ధం.

రెండు రాష్ట్రాలు - రెండు తీరుల బంధాలు
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ రెండూ మిత్రపక్షాలుగా కలసి పోటీ చేశాయి. కేంద్రంలో, రాష్ట్రంలో కలసి అధికారం పంచుకుంటున్నాయి. అప్పుడప్పుడు, అక్కడక్కడా కింది స్థాయి నాయకులు లోలోపల గొణుక్కున్నట్టు ఒకరినొకరు విమర్శించుకున్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటించి పార్టీని ఎవరి మద్దతూ అవసరంలేని విధంగా బలోపేతం చెయ్యనున్నామని భ్రమలు కల్పించినా... వ్యవహారం అంతా ఇద్దరు నాయుళ్ల కనుసన్నల్లోనే నడుస్తుంది. తెలంగాణలో పరిస్థితి అది కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో సంబంధాలు ఎలా ఉన్నా రాజకీయంగా మాత్రం అధికార టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ అధినాయకత్వం ఏపీ కంటే తెలంగాణ మీదనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించినట్టుంది. తెలంగాణ బీజేపీ నాయకత్వం అక్కడి ప్రభుత్వాన్ని సమస్యల మీద నిలదీయడంలో ఏ మాత్రం వెనుకాడటం లేదు. పైగా అమిత్ షా ఒకటికి రెండుసార్లు తెలంగాణలో పర్యటించి, పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసే ప్రయత్నాల్లో పడ్డారు.

2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ స్నేహాలు ఎలా మారతాయో తెలియదు. ప్రస్తుతానికి ఏపీలో టీడీపీతో బీజేపీ సఖ్యతకు ఇద్దరు నాయుళ్ల స్నేహబంధం కూడా అందుకు కారణం కావచ్చు. 2019 నాటికి ఏపీలో టీడీపీతో స్నేహం కొనసాగింపు విషయంలో  మోదీ-అమిత్ షా జోడీ ఏం ఆలోచిస్తుందో, వెంకయ్య నాయుడు మాట అప్పుడు చెల్లు బాటు అవుతుందో లేదో చూడాలి. తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వ్యవహార శైలి... బీజేపీ సహా ఇతర ఏ రాజకీయ పార్టీకీ ఏ మాత్రం సందు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించదు. టీఆర్‌ఎస్‌ను రాజకీయంగా అత్యంత బలోపేతం చేసే ఆలోచ నతో ఆయన చాలా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర విభజనా నంతరం రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీపైనా, ఆ పార్టీ నాయకులపైనా వెంకయ్యనాయుడు చూపిన అనుకూల, ప్రతికూల ప్రభావాలు చాలా బలమై నవి. అందువల్లనే వెంకయ్య సన్మాన సభల సందర్భంలో బీజేపీ-టీడీపీ, బీజేపీ-టీఆర్‌ఎస్‌ల మధ్య సంబంధాలపై ఈ చర్చ చేయవలసి వచ్చింది.  

రాజస్తాన్‌కు ‘వలస’లోని మర్మం  
ఇక ఈ రెండు ఆత్మీయ సత్కార సభల్లో ఆయన ప్రసంగాలను చూద్దాం. వెంకయ్య  నాలుగవసారి రాజ్యసభకు ఎక్కడి నుంచి ఎన్నికవుతారనే విష యంపై జరిగిన ప్రచారంపట్ల ఆయన ఈ సభల్లో తీవ్ర ఆవేదన, కించిత్ ఆగ్రహం ప్రదర్శించారు. ‘చంద్రబాబును నేను సీటు అడుగుతానా? ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లకు వ్యతిరేకంగా నిలిచి గెలిచిన వాడిని’ అంటూ ఆయన తాను 1978, 1983 ఎన్నికల్లో రెండుసార్లు నెల్లూరు జిల్లా నుంచి శాసనసభకు ఎన్నికైన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ మద్దతు ఉన్నా 1985 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అదే జిల్లా నుంచి ఎందుకు గెలవలేకపోయారో కూడా వివరించి ఉంటే బాగుండేది. ఆ తరువాత పార్టీకి అంకితమై పనిచెయ్యడం కోసమే ఎన్నికల్లో పోటీ చెయ్యలేదంటున్న వెంకయ్య... ఒవైసీ మీద గెలుస్తా నంటూ మంచి పోటీ ఇచ్చే సత్తా ఉన్న తెలంగాణ భూమిపుత్రుడు బద్దం బాల్‌రెడ్డికి అన్యాయం చేసి మరీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఘోర పరాజయం పాలు ఎందుకయ్యారో? ఆ తరువాత నాలుగుసార్లు పరోక్షంగా పార్లమెంట్‌లోకి ప్రవేశించే మార్గాన్ని ఎందుకు ఎన్నుకున్నారో? మూడుసార్లుగా కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్న ఆయనపట్ల ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వంలోనూ, శ్రేణులలోనూ తీవ్ర వ్యతిరేకత రావడం వల్లనే వెంకయ్య రాజస్తాన్ ఎడారి దారి పట్టారన్న నగ్నసత్యాన్ని ఎలా కాదం టారు? రాజకీయాల అంతిమ లక్ష్యం అధికారం, ఆ విషయం ఒప్పుకుంటే ఏ పేచీ ఉండదు కదా! కర్ణాటక నుంచి ఆయన పక్కనే ఉన్న తన సొంత రాష్ట్రం ఏపీకి రావచ్చు.

అక్కడ చంద్రబాబు ఎలాగూ ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఈసారి ఇక్కడి నుంచి మరో రాష్ట్రానికి మార్చి, వెంకయ్య నాయుడును ఇక్కడి నుంచి బరిలోకి దింపడానికి బదులు బీజేపీ అధిష్టానం సురేష్ ప్రభు అనే కొత్త పాత్రను ఎందుకు ప్రవేశ పెట్టినట్లు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారకులై ఉండి కూడా నేటి ఏపీకి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా సహా పలు హామీలను కేంద్రం చేత అమలుచే యించడంలో విఫలమైన కారణంగా ఆ ఇద్దరు మంత్రుల పట్ల రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకత వల్లనే వారిని ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయలేదని వినవస్తోంది. వారిద్దరూ ఏపీ ప్రజల చెవులు చిల్లులు పడేట్టుగా ప్రత్యేక హోదా తదితర హామీల గానం వినిపించినవారు. ఆ తరువాత ఏమీ చేయలేక చేతులెత్తేసి దబాయింపులకు దిగినవారు. సురేష్ ప్రభుకు వీటితో సంబంధం లేదు. ఆయన రైల్వే మంత్రి కాబట్టి విశాఖ రైల్వే జోన్ గురించి అడగవచ్చంతే.

ఫిరాయింపుల వేళ హితవచనాల జోరు  
వెంకయ్య నాయుడు ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చెయ్యను అంటున్నారు. ఆరేళ్ల నాటికి రాజెవరో రౌతెవరో? అదలా ఉంచితే, ఇక ఈ ఆత్మీయ సభల్లో ఆయన ప్రస్తావించిన అతి ముఖ్యమైన అంశం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్య సౌధాల పునాదులకు ముప్పుగా మారుతున్న పార్టీ ఫిరాయిం పుల సమస్య. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విలువలు పతనం అయిపోతు న్నాయని వెంకయ్య తెగ బాధ పడిపోయారు. పార్టీ మారిన వెంటనే, అదే రోజున పదవి పోవాలని చెబుతున్నారాయన. ఉత్తరాదిలో బీజేపీ మాడు పగిలేసరికి పార్టీ ఫిరాయింపు నీతిమాలిన పని అని గుర్తొచ్చింది. రాజకీ యాల్లో విలువలు లుప్తం అవుతున్నాయన్న స్పృహ కలిగింది. విజయవాడలో చంద్రబాబును, హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డిని వేదిక మీద తన సరసన కూర్చోబెట్టుకుని ఆయన పార్టీ ఫిరాయింపులను క్షణం కూడా సహించ కూడదని హితవు పలికారు! తెలంగాణలోని అధికార పక్షం వద్ద ఆయన మాట చెల్లక పోవచ్చు.

మరి ఏపీలోని చంద్రబాబుకు ఆ హితవు ఎందుకు చెప్పరు? పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఫిరాయింపులను చూసి ఆవేదన చెందుతున్న వెంకయ్య... మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్టీ ఫిరాయింపుల చట్టంలో సమూల మార్పులను చేయించి ఆయన అన్నట్టే పార్టీ ఫిరాయించిన రోజునే పదవి పోయేట్టు చేస్తే బాగుంటుంది. ఆయన మాటలకు విలువ ఉంటుంది. తన ప్రియమిత్రుడు చంద్రబాబును కూడా ఒప్పించి ఏపీలో టీడీపీలోకి ఫిరాయించిన 20 మంది శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లేట్టు చేస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారవుతారు. అక్షర క్రమంలో మొదటిదైనా ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ బృహత్ కార్యం ప్రారంభం అయితే, దానికి వెంకయ్య నాయుడు కారకులయితే ఇంకా బాగుంటుంది.

దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement