పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి | anti defections will lead to lose post, says venkaiah naidu | Sakshi
Sakshi News home page

పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి

Published Sat, Jun 18 2016 3:07 AM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM

పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి - Sakshi

పార్టీ మారితే అదే రోజు పదవి పోవాలి

  •  అలా చట్టం తేవాలి: వెంకయ్య
  •  అప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుంది
  •  ఫిరాయింపులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే గాక దేశమంతటా విలువలు పడిపోతున్నాయి
  •  ఆ చట్టాన్ని పునఃసమీక్షించాలి: కేంద్ర మంత్రి
  •  ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలన్నింటికీ తానిక దూరమని ప్రకటన
  •  
     సాక్షి, హైదరాబాద్
     ప్రజాప్రతినిధులు పార్టీ మారితే అదే రోజు తమ పదవి కోల్పోయేలా చట్టం తీసుకొస్తేనే ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల కారణంగా ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ విలువలు పడిపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. వెంకయ్య రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్‌లో ఆయనకు ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రస్తుతం సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
     
      ‘‘నేడు రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టాయి. ఒక్కొక్కరుగా పార్టీ మారితేనే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది తప్ప గంపగుత్తగా మారితే వర్తించదనే ఆలోచనతో పార్టీ ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి ఒక గుర్తుపై గెలిచిన వారు పార్టీ మారితే అదే రోజు పదవి కోల్పోయేట్టు చట్టం తీసుకొస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. రాజకీయ పదవుల కోసం కులం, మతం, ధనం అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. సిద్ధాంతాలు నచ్చకపోతే పార్టీలు మారే స్వేచ్చ అందరికీ ఉంటుందన్నారు.
     
     ఇప్పుడైతే కాలో, చేయో విరగ్గొట్టేవాళ్లు!
     చట్టసభల్లో పరిస్థితులు చాలా మారాయని, ప్రస్తుత రాజకీయాల్లో ఓపిక పూర్తిగా నశించిపోయిందని వెంకయ్య ఆవేదన వెలిబుచ్చారు. సభలు జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. ‘‘మేం అసెంబ్లీలో ఉన్నప్పుడు అధికార పక్షంపై కఠిన విమర్శలు చేసేవాళ్లం. మర్రి చెన్నారెడ్డి హయాంలో నేను, జైపాల్‌రెడ్డి సీఎంపై వాడీవేడగా మాట్లాడేవాళ్లం. అప్పుడు గనుక సరిపోయింది. ఇప్పుడైతే కాలో, చెయ్యో విరగొట్టేవాళ్లు’ అని అన్నారు! ‘‘రాజకీయ పార్టీలు పరస్పరం శత్రువులుగా చూసుకునే పరిస్థితి వచ్చింది. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు. చైనాతో స్నేహం చేస్తున్నాం.
     
     ఆఖరికి మన దేశంలోకి నిత్యం ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌తో కూడా స్నేహానికి చర్చలు జరుపుతున్నాం. కానీ మన ఊరిలో మనపై పోటీ చేసిన వారిని మాత్రం సహించలేకపోతున్నాం. రాజకీయాల్లో ఓపిక, సిద్ధాంతం, గౌరవించడం వంటివి చాలా అవసరం’’ అని సూచించారు. రాజకీయం మిషన్‌లా ఉండాలే తప్ప కమీషన్‌గా కాదన్నారు. సభలో రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, సుజానచౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎంపీ ముర ళీమోహన్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ కేంద్రమంత్రి సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     
     రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తే లేదని వెంకయ్య ప్రకటించారు. ‘‘ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలు వేటిలోనూ పోటీ చేయబోను. 65 ఏళ్లు నిండాక రాజకీయాల నుంచి విరమించుకొని సేవా కార్యక్రమాలు చేయాలని భావించాను. కానీ ప్రస్తుతం దేశ అవసరం, ‘అభివృద్ధిలో భాగస్వాములు కండి’ అన్న ప్రధాని నరేంద్రమోదీ ఆలోచనతో ఈ ఒక్కసారి రాజ్యసభకు పోటీ చేశాను’’ అని చెప్పుకొచ్చారు.
     
     కేంద్ర నిధులపై టీఆర్‌ఎస్ దాపరికం
     వెంకయ్య విమర్శ
     తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పడం లేదని వెంకయ్య ఆరోపించారు. ‘‘బీపీఎల్ కుటుంబాలకు రాష్ట్రం సబ్సిడీపై అందిస్తున్న రూపాయికి కిలో బియ్యం పథకానికి కేంద్రం కిలోకు 29 రూపాయలిస్తోంది. కానీ ఈ విషయం ఎవరికి తెలుస్తుంది?’’ అని ప్రశ్నించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన తన అభినందన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇస్తున్న నిధులు, సాయాన్ని కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
     
     వచ్చే మూడేళ్లలో పేద మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని చెప్పారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డిలతో పాటు నేతలు నల్లు ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, ప్రొఫెసర్ శేషగిరిరావు, రాజాసింగ్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement