మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిత్రంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పేర్ని నాని, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను
సాక్షి, మచిలీపట్నం: ‘పార్టీలు మారే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మార్పురావాలి. విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడుతనం, వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం’ అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా మాజీ జెడ్పీ చైర్మెన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి ప్రజలను ప్రభావితం చేస్తాయన్నారు. వారసత్వంతో కాదు... జవసత్వంతో ముందుకు వెళ్లాలని చెప్పారు.
రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారి తీస్తోందన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని తెలిపారు. పార్టీలు మారే రాజకీయ నాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్ట్రపతి.. పార్టీ మారడంతో పాటు పదవిని త్యజించే విధంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయపార్టీల ఎన్నికల హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రచార, ప్రసార సాధనాలు, పత్రికలు అందించే సమాచారం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలని తెలిపారు
అసాధారణ నాయకుడు పిన్నమనేని..
ఇరవై ఏడు సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన పేదల పక్షపాతి పిన్నమనేని కోటేశ్వరరావు అసాధారణ నాయకుడన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, దూలం నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment