వాహనాల విడుదలను వ్యతిరేకించమనండి
♦ అన్ని కోర్టుల పీపీలు, ఏపీపీలను ఆదేశించండి
♦ ఢిల్లీ సర్కార్ తరహాలో సర్క్యులర్ ఇవ్వండి
♦ ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు స్పష్టీకరణ.. విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: జంతువుల అక్రమ రవాణా అరికట్టే విషయంలో కీలక ఆదేశాల జారీకి హైకోర్టు నిర్ణయించింది. జంతువులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహన యజమానులు వాటి విడుదలకు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తే, వాటిని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కార్ మాదిరిగానే ఓ సర్క్యులర్ జారీ చేయాలని సూచించింది.
జంతువులతో సహా వాహనాల విడుదలకు పిటిషన్లు దాఖలైనప్పుడు, యథావిధిగావాటి విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేయకుండా కిందిస్థాయి న్యాయాధికారులకు తగిన మార్గనిర్దేశం చేస్తామని తెలిపింది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిఠాపురం మునిసిపాలిటీలోని పశువుల మార్కెట్‌లో జంతువులను హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతు హింస నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతు రక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ, జంతు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను విడుదల చేయించేందుకు వాటి యజమానులు కింది కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కోర్టులు జంతువులతో సహా ఆ వాహనాలను విడుదల చేస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ మొత్తం వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, వాహనాల విడుదలకు ఎలా పిటిషన్లు దాఖలు చేస్తారని, వాటి విడుదలకు ఎలా ఉత్తర్వులు పొందుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ వాదనలు వినిపిస్తూ అక్రమ కట్టడాల విషయంలో ఎలాంటి ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయరాదని కింది కోర్టులకు గతంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అదేవిధంగా జంతు అక్రమ రవాణా విషయంలో ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.