నిధుల వేట.. నేతల ఆట
దేవులపల్లి అమర్
బాబు కోరుతున్న సహాయం చెయ్యడానికి కేంద్రం వద్ద నిధులు గుట్టలుగా లేవు. టీడీపీ, బీజేపీలు రెండూ వాస్తవ పరిస్థితిని ప్రజల నుంచి దాచినందువల్లనే ఈ దుస్థితి. పైగా మోదీ-షా నాయకద్వయం ఏపీ, తెలంగాణల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం మీదనే దృష్టి కేంద్రీకరిం చింది. దీంతో తాము కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వాపోవాల్సిన విచిత్ర స్థితి నెలకొంది. బాబు వంటి సీనియర్ నేత మాటకే దిక్కులేని చోట పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ రాయబారం ద్వారా ఏం సాధించనున్నారో వేచి చూడాలి.
పరిశేష ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగు తున్నాయి. సరిగ్గా తొమ్మిది నెలలయినా గడవక ముందే ఒక రకమైన రాజకీయ అనిశ్చితి ఆ రాష్ర్ట అధికార పక్షాలలో అలుముకున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లో అధికార కూటమికి నాయకత్వం వహిస్త్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిక్కుతోచని స్థితిలో తలపట్టుకుని కూర్చున్నారు. ఏమిటి ఇట్లా జరిగింది? అన్న అడిగిన మీడియా మిత్రులతో... నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని నిట్టూర్పు విడిచారు. రేపటి నుంచి ఏం చెయ్యా లి? ప్రజలకు ఏం చెప్పాలి? వాళ్లను ఎట్లా నమ్మించాలి? ఎట్లా ముందుకు పోవాలి? బీజేపీని నమ్ముకుని నట్టేట మునగాల్సి వస్తుందని బాబు కలలో కూడా ఊహించి ఉండనందునే ఆయన ఇంతగా దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషుల మాట. మా నేత అత్యంత అనుభవ శాలి, రాజకీయ చతురుడు. ఈ గండం నుంచి తాను బయటపడతారు. రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు అన్న ధీమాను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరుగుతున్నది?
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్ల్లీ ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఏపీకి సరైన కేటాయింపులు లేవు. రాష్ర్ట విభజన నాడు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం రూ.100 కోట్లు కేటా యించి చేతులు దులుపుకున్నది. ‘‘ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజధానిని నిర్మించుకోండి, నేనున్నాను’’ అన్న ప్రధాని బడ్జెట్‌లో దానికి రూపాయి విదిలించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ బాగా వాడుకున్న అస్త్రం రుణమాఫీ విషయంలో కూడా కేంద్రానిది సహాయ నిరాకరణ ధోరణే. హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రను కుదిపివేయగా దాదాపు 70 వేల కోట్ల నష్టం సంభవించింది. వెయ్యి కోట్లు తక్షణ సహాయం ప్రకటించిన మోదీ హామీ ప్రకటనకే పరిమితమైంది. వీటన్నిటికీ ‘‘కేంద్రం సహాయం చేస్త్తుం దిలే’’ అన్న ధీమాతో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏం చెయ్యాలో తోచనిస్థితిలో పడింది. ఇదంతా చూసి ఏపీ ప్రజలు అయోమయంలో పడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ అండ ఉంటే తమ రాష్ర్టం బాగుపడుతుందని నేతలు చెప్పిన మాటలు నమ్మి వారు టీడీపీ-బీజేపీ కూటమిని గెలిపించారు. తీరా జరుగుతున్నది చూసి వారు హతాశులు కావడంలో ఆశ్చర్యం లేదు.
అనూహ్య ఫలితాలు
2004 ఎన్నికలకు ముందు బీజేపీ మతతత్వ పార్టీ అంటూ టీడీపీ దానితో తెగ తెంపులు చేసుకుంది. రెండుసార్లు ఓటమిని చవిచూశాక, చివరి ప్రయత్నంగా మొన్నటి ఎన్నికల్లో మళ్లీ ఆ పార్టీ చెయ్యి అందుకున్నది. లోక్‌సభలో మెజారి టీని సాధించి మోదీని ప్రధానిని చేసుకునే ప్రయత్నంలో బీజేపీ కూడా టీడీపీ మద్దతు తీసుకోక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అటు బీజేపీకి ఇటు టీడీపీకి కూడా అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. టీడీపీ వంటి పార్టీల అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగల సంఖ్యాబలం బీజేపీకి లభించింది. ఇది టీడీపీకి మింగుడుపడని విషయమే. ఎన్నికలకు వెళుతున్న ప్పుడు ఆ పార్టీకి గెలుపుపట్ల పెద్దగా ఆశలులేవు. బీజేపీతో పొత్తుపెట్ట్టుకున్నా, సినిమా నటుడు పవన్ కల్యాణ్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినా, రుణమాఫీ వంటి అలవికాని వాగ్దానాలు చేసినా... అన్నీ ఆ ఆశలు లేని కారణంగానే.
తప్పిన బాబు లెక్కలు
రాష్ట్రంలో టీడీపీ గెలుపును, కేంద్రంలో తమలాంటి ప్రాంతీయ మిత్రుల మీద ఆధారపడ్డ సంకీర్ణ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత ఆశించారు. అట్లా జరిగితే యునెటైడ్ ఫ్రంట్ కాలంలోనూ, ఆ తరువాత అటల్ బిహారీ వాజపేయి జమానాలో లాగే ఇప్పుడు కూడా తాను కేంద్రంలో చక్రం తిప్పొచ్చునని ఆయన భావించారు. కానీ దేశ ప్రజలు సంకీర్ణ యుగానికి స్వస్తి పలికి బీజేపీకి సొంత బలం ఇచ్చారు. మిత్రుల మీద ఆధారపడవలసిన అవసరం లేక పోవడంతో బాటు, మోదీ ప్రధాన మంత్రి కావడం కూడా టీడీపీకి కలిసి రాని వ్యవహారమే. పోనీలే ఏపీకి చెందిన వెంకయ్య నాయుడు కేంద్రంలో అత్యంత కీలక స్థానంలో ఉన్నారు, రాష్ట్ర అవసరాలను చూసుకోడానికి ఆయన చాలులే అనుకుంటే, ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న మాటను ఆయన పదే పదే వినిపిస్తూ వచ్చారు. పైగా మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ సహజ మిత్రులైన శివసేన వంటి పార్టీలనే పక్కన పెట్టి తమ సొంత బలం పెంచుకోవాలని భావిస్తున్నారు. వారు ఏపీ, తెలం గాణల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి పెట్టడం కూడా టీడీపీని ఇబ్బందుల్లో పడేసింది. రాష్ర్టంలో బీజేపీ, కేంద్రంలో టీడీపీ ప్రభుత్వ భాగ స్వాములుగా ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ వాపో వడం ఒక విచిత్ర స్థితి.
పవన్ రాయబార పర్వం
ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. బాబు ప్రభుత్వం కోరుతున్న మేరకు సహా యం చెయ్యడానికి కేంద్రం దగ్గరా నిధులు గుట్టలు గుట్టలుగా పడి లేవు. రెండు పార్టీలూ వాస్తవ పరిస్థితిని ప్రజల నుంచి దాచి ఉంచినందువల్లే ఇవ్వాళ ఈ దుస్థితి. గోప్యత కొంప ముంచుతుందని ఇకనైనా తెలుసు కుంటే మంచిది. ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదీ ప్రతిపక్షాలకు తెలియదు. వాళ్లను విశ్వాసంలోకి తీసుకోవడం అట్లా ఉంచి ప్రతిపక్షం అస్థిత్వాన్నే గుర్తించడానికి సిద్ధంగా లేని స్థితి. చంద్రబాబు నాయుడు తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని మహజరులు ఇచ్చి వచ్చారు. ప్రతిపక్షంతో కనీసం ఇదీ పరిస్థితి అని చెప్పారా? లేదు. ఇప్పుడు కూడా చేస్తున్నదేమిటి? జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాయబారానికి పంపుతున్నారని వార్తలు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో ఆయన ప్రధాన మంత్రిని కలిసి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యండని బాబు తరఫున కోరతారట. ఏపీ సీఎం బాబు వంటి సీనియర్ నాయకుని మాటకే దిక్కులేని దగ్గర పార్ట్ టైం రాజకీయాల పవన్ కల్యాణ్ ఏం సాధించు కొస్తారో చూడాలి. ఏపీని మేం తప్ప ఇంకెవరూ ఆదుకోలేరు అన్నట్టు విభజన బిల్లు మీద చర్చ సందర్భంగా రాజ్యసభలో వాదించిన వెంకయ్య నాయుడు కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నారు. ఆయన మాటకంటే పవన్ కల్యాణ్ మాటే అక్కడ చెల్లు బాటయ్యే పరిస్థితి ఉందేమో కూడా చూడాలి .
ముందున్నది మొసళ్ల పండుగే
ఇదంతా మొన్న శనివారం నాటి బడ్జెట్ కేటాయింపులతో మొదలు కాలేదు, అక్కడితో ఆగిపోదు కూడా. రాష్ర్టంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య అధికారం లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పొరపొచ్చాలు బయట పడ్డాయి. బీజేపీ తమకు దీర్ఘకాల మిత్రుడేమీ కాదని తెలుగుదేశం వారూ, టీడీపీ నమ్మదగ్గ స్నేహితు డేమీ కాదని భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న ఉదంతాలు మనకు మొదటి నుంచి కనిపిస్తాయి. కాకపోతే బడ్జెట్ వ్యవహారం తరువాత గొంతులు పెంచారంతే. ముఖ్యమంత్రి వెంట వెళ్లి నమస్కారాలు పెట్టి రావడం తప్ప మేం చెయ్యగలిగింది ఏమీ లేదన్న ఎంపీ దివాకర్ రెడ్డి అంటే, ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఇక తిరుపతి ఎంపీ డాక్టర్ శివప్రసాద్, విరాట రాజు కొలువులోని పాండవుల పరిస్థితి మాది అని వాపోయారు. వారితోపాటూ ఇంకా పలువురు ఇతర టీడీపీ నాయకులు మాట్లాడుతున్న ఇలాంటి మాటలు ఆషామాషీగా కొట్టి పారేయాల్సినవి కావు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు ముందున్నది మొసళ్ల పండుగే.
datelinehyderabad@gmail.com