దేవులపల్లి అమర్
డేట్‌లైన్ హైదరాబాద్
ఒకే ఎన్‌కౌంటర్‌లో 20 మంది చనిపోతే... నోరైనా విప్పకుండా చైనా వెళ్ళిన ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు నేరస్తులే కావొచ్చు. రాష్ట్రానికి బోలెడు ఆదాయాన్నిచ్చే ఎర్ర చందనం దొంగలే కావొచ్చు. నేరస్తులే అయినా వారిని చంపే అధికారాన్ని రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇవ్వలేదు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌కు కితాబులిచ్చిన వెంకయ్యనాయుడు ఏపీ ఎన్‌కౌంటర్‌పై మాత్రం ఎన్‌కౌంటర్‌ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని మౌనం దాల్చారు.
గత వారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒకే రోజున జరిగిన రెండు ఎన్‌కౌంటర్‌లకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీది ఒక విచిత్రమైన పరిస్థితి. తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్ లో హతమైన ఐదుగురూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియో గాలతో జైల్లో ఉండి విచారణను ఎదుర్కొంటున్నవారు, అంతా ముస్లింలే కావడంతో... బీజేపీ స్థానిక నాయకులు కొందరు చాలా అలవోకగానో లేదా యధాలాపంగానో వికారుద్దీన్ ముఠాను మట్టుబెట్టడంలో మన పోలీసులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడారు. స్థానిక నాయకులేం కర్మ, జాతీయస్థాయిలోనే అత్యంత ముఖ్య నాయకుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కుడిభుజంగా ఉన్న ముప్పవరపు వెంకయ్యనాయుడుది సైతం అదే ధోరణి. ‘సిమి’ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవా దులను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసిందని ప్రశంసించారు. (ఉగ్రవాదాన్ని సమర్థవం తంగా ఎదుర్కోవడ మంటే ఇట్లా చేతులకు సంకెళ్ళు వేసివున్న ఖైదీలను చంపేసి, చేతిలో తుపాకీ పెట్టేయడమేనా వెంకయ్య నాయుడు గారూ?) ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ విషయంలో అనుమానాలను నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత మాత్రం ఆ రాష్ర్ట ప్రభుత్వానిదేనని ఆయన ఒక్క మాటలో తేల్చిపారేశారు.
‘శేషాచలం’పై వెంకయ్య మౌనవ్రతం
ఈ రెండు ఎన్‌కౌంటర్‌ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, అది రాష్ట్రా లకు సంబంధించిన అంశం అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తెలం గాణలో జరిగిన ఎన్‌కౌంటర్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వానికి కితాబులిచ్చిన కేంద్ర మంత్రి ఏపీ ఎన్‌కౌంటర్ విషయంలో కూడా అంతే స్పష్టంగా ఏదో ఒక మాట అని ఉండొచ్చు కదా? ఏపీలోని ‘‘శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం నరుక్కుపోతున్న వాళ్ళను చంపడంలో తప్పు లేదు. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, మా అడవుల్లోకి వస్తే ఇదే పని చేస్తాం’’ అని అధికార పార్టీకి చెందిన బాధ్యతగలిగిన నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉన్నారు కదా! వారితో ఏకీభవిస్తున్నామనో లేదా వ్యతిరేకిస్తున్నామనో చెప్పా లి కదా, మరి ఎందుకిలా రాష్ర్ట ప్రభుత్వంపైకి బాధ్యతను నెట్టేసి మౌనంగా ఉన్నారు వెంకయ్యనాయుడు గారూ? రెండు రాష్ట్రాల్లో పోలీసు కాల్పుల్లో మరణించిన వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడం వల్లనేనా? వెంకయ్య నాయుడు ప్రకటనే అటువంటి అనుమానానికి తావునిస్తున్నది. ముస్లింలకు ఓటు హక్కు తీసెయ్యాలనే విపరీత ధోరణిని వెంకయ్యనాయుడు భావజాలానికి సన్నిహితులైనవారు అతి బిగ్గరగా మాట్లాడుతున్న రోజులివి. ‘‘ఇండోనేసియా తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లింలు నివసించే భారత దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఎంతో దారుణం, బాధాకరం’’ అన్నారు ప్రముఖ మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ ఒక సందర్భంలో.
ఎర్రచందనం నెత్తుటి మడుగున ఏపీ సర్కారు
సరే, ఈ అంశాన్ని పక్కన పెట్టి ఏపీ ఎన్‌కౌంటర్ గురించే మాట్లాడుకుందాం. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించాక రాష్ర్ట ప్రభుత్వానికి వేరే దారి లేదు. ప్రత్యక్ష సాక్షులున్నారు కాబట్టి శేషాచలం ఎన్‌కౌంటర్ నిజానిజాలు బయటికి రాక తప్పదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లెక్కలేనన్ని ఎన్‌కౌంటర్‌లలో ఎన్నిం టిని బూటకంగా నిరూపించగలిగారు? ఎన్నింట్లో పోలీసులకు శిక్షలు పడ్డాయి? అని తేలికగా కొట్టి పారేయలేరు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లకూ, దీనికి తేడా ఉంది. ‘శేషాచలం’లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరుకున పడక తప్పేట్టు లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పోలీసు అధికారులు, కొన్ని మీడియా సంస్థలు ఎంతసేపూ ఆ ఎన్‌కౌంటర్‌ను సమర్థిం చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయే తప్ప ఎంతటి నేరస్తులనైనా చంపే అధి కారం పోలీసులకు లేదనే విషయం మరచిపోతున్నారు. దొంగలకు కూడా పౌర హక్కులుంటాయని బాలగోపాల్ కొన్ని వందలసార్లు చెప్పి ఉంటాడు, రాసి ఉంటాడు. ఎర్ర చందనాన్ని దొంగతనంగా నరుక్కుపోయే స్మగ్లర్‌లకూ, పొట్ట కూటి కోసం, కిరాయికి స్మగ్లర్ల కోసం అడవుల్లో చె ట్లు కొట్టడానికి వ చ్చి తూటాలకు బలైన కూలీలకు కూడా ఆ పౌర హక్కులుంటాయి. ఆ మాటంటే మరి విధి నిర్వహణలో ఉన్న అటవీ సిబ్బందినీ అధికారులనూ, పోలీసు ఉద్యోగులనూ ఎర్ర చందనం స్మగ్లర్లు హింసించి చంపినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకు? అని ఎదురు ప్రశ్నిస్తారు. అధికార పార్టీ, ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం అంతా నిజానికి అదే. ఎర్ర చందనం దొంగల అకృత్యాల గురించి గతంలో ఎన్నడు లేనంతగా పత్రికల్లో వరుసగా కథనాలు వస్తు న్నాయి. అధికారులూ, రాజకీయ నాయకులూ అదే మాట్లాడుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్ అన్యాయం అని అంటే చాలు... ఈ ఉదాహరణలతో వారి మీద విరుచుకు పడిపోతున్నారు. ఆ ఇరవై మందినీ చంపేయడం న్యాయమేనని అందరినీ ఒప్పించేయడానికి సకల ప్రయత్నాలూ సాగుతున్నాయి.
అడ్డగోలు ప్రకటనలతో బిగుస్తున్న ఉచ్చు
శేషాచలం అడవుల నుంచి ఎర్ర చందనం నరుక్కుపోవడానికి 150 మంది కూలీలు వచ్చినట్టు సమాచారమని డీఐజీ కాంతారావు తొలి ప్రకటన. వాళ్ళను ఎదుర్కోవడానికి 24 మందితో కూడిన రెండు టాస్క్‌ఫోర్సు బృందాలు వెళ్లాయనీ ఆయనే చెప్పారు. ఆ బృందాలకు 100 మంది స్మగ్లర్లు ఎదురుపడ్డారనీ ప్రకటించారు. 100 మంది గొడ్డళ్ళూ, రాళ్ళతో దాడికి దిగితే, 24 మంది సాయుధ పోలీసులు వారిని నిలువరించలేక కాల్పులు జరిపారనీ, 20 మందిని చంపగలిగారనీ చెబితే ఎవరు నమ్మాలి? ఆ ప్రకటనలే ఇదో కట్టు కథని స్పష్టంగా చెబుతున్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు కూడా బోలెడు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, మంత్రులూ, అధికార పార్టీ నాయకులూ చేస్తున్న ప్రకట నలను చూస్తే వీళ్ళకు రాజ్యాంగంపట్లా, చట్టాల పట్లా ఏ మాత్రం గౌరవం లేదనుకోవాలో, అవగాహన లేదనుకోవాలో అర్థంకాని పరిస్థితి. మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఎన్‌కౌంటర్ జరిగిన జిల్లాకే చెందినవారు, పైగా అటవీశాఖ మంత్రి. అటవీ సంపదను హరించడానికి వస్తే హతమారుస్తాం అంటాడాయన. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి అయిన బొజ్జల, ఈ ప్రకటన చేశాక ఇంకా మంత్రి పదవిలో ఎట్లా కొనసాగుతారు? కూలీలు అర్ధరాత్రి గడ్డి కోసుకోడానికి వచ్చారా? తమిళనాడు కూలీలకు ఆంధ్రప్రదేశ్ అడవుల్లో ఏం పనీ? అంటూ అటవీ శాఖామాత్యులు ఇంకా చాలానే మాట్లాడారు. ఇక సాక్షాత్తూ హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నిమ్మకాయల చిన్నరాజప్ప ఎన్‌కౌంటర్లో చనిపోయినవారు మన రాష్ట్రానికి చెందిన వారు కారు కాబట్టి నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేశారు. రాష్ర్ట సంపదను కళ్ళ ముందే కొల్లగొట్టి, తీసుకెళ్ళే వాళ్ళను కాల్చి చంపేస్తే తప్పేంటి? అంటూ మాజీ మంత్రి, చాలా సీనియర్ నాయ కుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఏకంగా విధాన ప్రకటనే చేసేశారు. ఇదీ మన నాయకుల తీరు. బాధ్యతారహితమైన ఈ ప్రకటనలన్నీ తమ ప్రభుత్వం గొంతుకు ఉచ్చును మరింతగా బిగిస్తున్నాయని వారు అర్థం చేసుకోడం లేదు.
నేరస్తులను చంపే హక్కు ప్రభుత్వాలకు లేదు
ఇంత పెద్ద సంఘటన జరిగి, ఒక పొరుగు రాష్ర్టంతో సంబంధాలు చెడిపోయే పరిస్థితి వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం మరీ విడ్డూరం. వాళ్ళు నేరస్తులే కావొచ్చు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి బోలెడు ఆదాయాన్ని సమకూర్చే ఎర్ర చంద నాన్ని కొల్లగొట్టుకుపోతున్న దొంగలే కావొచ్చు. కానీ ఒకే ఒక్క ఎన్‌కౌంటర్ ఘటనలో 20 మంది మనుషులు తానే పాలకునిగా ఉన్న రాజ్యంలో చని పోతే... కనీసం నోరైనా విప్పకుండా చైనా వెళ్ళిపోయిన ముఖ్యమంత్రిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనాగానీ ఇక్కడ చూడవలసినది ఎన్‌కౌంటర్ మృతులు తమిళనాడు వారా, స్మగ్లర్‌లా, కూలీలా, మరింకెవరైనానా? అనేది కాదు. ఎర్ర చందనం నరుక్కుపోవడానికి వచ్చారా, గడ్డి కోసుకోవడానికి వచ్చారా? అనేదీ కాదు. వాళ్ళు మనుషులు, ఆ మనుషులు నేరస్తులయినా సరే చంపే అధికారాన్ని మన రాజ్యాంగం ప్రభుత్వాలకు ప్రసాదించలేదు. ఇక్కడ తుపాకులే మాట్లాడతాయి అంటే చెప్పేదేమీ లేదు.
datelinehyderabad@gmail.com