సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకునేలా మెడలు వంచిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందని ఏపీ బీజేపీ చీఫ్ కంభంపాటి హరిబాబు అన్నారు. వైఎస్సార్‌సీపీతో బీజేపీ ఎన్నటికీ కలవబోదని, అలాంటిదేదో జరుగుతుందనుకోవడం చంద్రబాబు భ్రమేనని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో జీవీఎల్, గోకరాజులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు.
‘‘ఇవాళ టీడీపీ అజెండాను నిర్దేశిస్తున్నది వైఎస్సార్‌సీపీనే. హోదా రావాలంటే మంత్రులు రాజీనామా చేయాలన్న జగన్ డిమాండ్ మేరకు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలోనూ అదే జరిగింది. చంద్రబాబు మెడపై వైఎస్సార్‌సీపీ కత్తిపెట్టగానే ఆయనా అవిశ్వాసం పెట్టారు. ఏ రకంగా చూసినా వైఎస్సార్‌సీపీ పన్నిన ఉచ్చులో టీడీపీ పడింది’’ అని హరిబాబు వ్యాఖ్యానించారు.
అలా ఉండే బాబు ఇలా: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ‘‘ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబును ఇవాళ ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు నేతలు ఆయన కోసం ఏపీ భవన్‌కు వెళ్లేవారు.. ఇప్పుడు ఆయనే అందరి దగ్గరికి వెళ్లి బతిమాలుకుంటున్నారు. ఒక్క శరద్ పవార్ తప్ప పెద్ద నాయకులెవరినీ చంద్రబాబు కలవలేదు. నాలుగేళ్లుగా ఆయన చేసిన పనులకు లెక్కలు అడిగితే ఇవ్వడంలేదు. అమరావతి అంటే అమ్మో అవినీతి అని భయపడుతున్నారు. ఇచ్చిన నిధులు ఏం చేశారంటే చెప్పరు. పైగా వైఎస్సార్‌సీపీతో బీజేపీ కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని జీవీఎల్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment