
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేతలతో తాను సమావేశమైనట్టు వస్తున్న వార్తలు అబద్ధమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అనైతిక రాజకీయాలు, జర్నలిజంలో తెలుగజాతి పరువు తీస్తున్నారు. వ్యక్తిగత పనుల మీద నేను ఢిల్లీ వెళ్లాను. ఏపీ భవన్‌లో అన్నీ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ విప్ కూన రవికుమార్‌లు ఏపీ భవన్‌లో కలిశారు. రవికుమార్ నన్ను ఆలింగనం కూడా చేసుకున్నారు. మరి ఈ విజువల్స్ ఎందుకు చూపించడం లేదు. రవి నాకు కాలేజ్ మిత్రుడు. టీడీపీ విప్ నన్ను కౌగిలించుకుంటే ఆయన వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టా. సత్యనారాయణతో కలిసి భోజనం చేస్తేనే ఇంత ఉలిక్కి పడతారా? మేము నిజంగా కలిస్తే ఏమైపోతారు? అతిథి గృహం లాబీలో ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్య మర్యాదపూర్వక సన్నివేశం చుట్టూ ఓకథ అల్లడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనం. మా పార్టీ నేతలు ఎవరిని కలిసినా టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? అసలు ఏం జరిగిందని ఇంతలా ప్రచారం చేస్తున్నారు’
మెదడు లేదని మరోసారి..
‘అచ్చెన్నాయుడు మంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదు. ఆయనకు మెదడు లేదని మరోసారి నిరూపించుకున్నారు. మరోవైపు మంత్రి లోకేశ్ చాలా అమాయకులుగా ఉన్నారు. ఆయన ట్వీట్లు చూస్తే.. తనకున్న ‘పప్పు’ బిరుదును పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై బురదజల్లే ఆటలో దిగినట్టు ఉంది. ఒక పార్టీ నేతను.. మరో పార్టీ నేత కలవకూడదని ఎక్కడైనా చట్టముందా? రాజ్యాంగం గురించి మీరు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. టీడీపీ నాయకులు మానసిక స్థితి ఉన్మాదానికి చేరిపోయింది’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment