హోదా కోసం ఐక్య పోరాటం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం సామాన్యుడు చేపట్టిన శాంతియుత ఉద్యమంతో వణికిపోతున్న చంద్రబాబు సర్కారు పోలీసులను ప్రయోగించి నిర్బంధకాండను కొనసాగించడం దారుణం అని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఈ ఏడాది ఐక్య పోరాటాలను ఉధృతం చేయనున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి
ఇçప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో హోదా ఉద్యమం కొనసాగనిస్తే నూకలు చెల్లుతాయనే భయంతో చంద్రబాబు సర్కారు పెద్ద ఎత్తున పోలీసుల ద్వారా నిర్బంధాలకు దిగిందన్నారు. హోదా ఉద్యమాన్ని పందుల పోటీలతో పోల్చి కేంద్ర మంత్రి సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలు అనాగరికం అన్నారు. బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలతో కలిసి రావాలి. ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ప్రజల సమస్యలపైన, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్నారు.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రమంగా వాయిస్ పెంచుతున్నారు. పది వామపక్షాలు పోరాటాలు కొనసాగిస్తున్నాయి. జాతీయ నేతలతోపాటు మేథాపాట్కర్ తదితర సామాజికవేత్తలు ఏపీలో జరుగుతున్న పౌరహక్కుల ఉల్లంఘనలపై దృష్టి సారించారు. హోదా నినాదంతో ఈసారి యువత స్వచ్చందంగా కదలడం శుభపరిణామం. హోదా సాధనకు, ప్రజా సమస్యలపైన ఐక్య ఉద్యమాలకు ఇవే సానుకూల సంకేతాలు’ అని చెప్పారు.