అజ్ఞాతవాసా.. అజాతశత్రువా.. మీకు ఎవరు కావాలి? | Pawan Kalyan Vs Tippala nagi reddy in Gajuwaka | Sakshi
Sakshi News home page

అజ్ఞాతవాసా.. అజాతశత్రువా.. మీకు ఎవరు కావాలి?

Published Fri, Mar 22 2019 1:35 PM | Last Updated on Mon, Mar 25 2019 1:23 PM

Pawan Kalyan Vs Tippala nagi reddy in Gajuwaka - Sakshi

పవన్‌కల్యాణ్‌ , తిప్పల నాగిరెడ్డి

సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం : కామన్‌మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(సీపీఎఫ్‌) గుర్తుందా.. అదేనండి 2008లో చిరంజీవి కుమార్తె వివాహ సమయంలో పవన్‌కల్యాణ్‌ ఆవేశపడి తన లైసెన్స్‌ రివాల్వర్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి సీపీఎఫ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారే.. ఆ సీపీఎప్ఫేనండీ..సదరు సీపీఎఫ్‌ పేరిట తక్షణమే రూ. 2 కోట్లు డిపాజిట్‌ చేస్తున్నామనీ.. ఎవరు కష్టంలో ఉన్నా నైతికంగా. ఆర్థికంగా ఆదుకుంటామని తనకు కొట్టిన పిండి అయిన సినిమా డైలాగులు పేల్చారు.పాపం.. ఆ డైలాగులను నమ్మేసిన చాలామంది తమ గోడు చెప్పుకుందామని వెళ్తే.. కనీసం దర్శనభాగ్యం కూడా కల్పించలేదు.అంతెందుకు.. అప్పట్లో రాజకీయ ప్రముఖుడు కె.కేశవరావు కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందని.. మీలాంటి పెద్దలు అండగా నిలవాలని ఓ మహిళ ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఆమె బహిరంగంగానే సీపీఎఫ్‌పై విమర్శలు గుప్పించారు.కట్‌ చేస్తే..

అసలు ఆ సీపీఎఫ్‌ ఏమైంది.. దాని కార్యకలాపాలు సాగుతున్నాయా..?! ఈ ప్రశ్నకు బహుశా పవన్‌ వీరాభిమానులు కూడా చెప్పలేరేమో.. అసలు అటువంటిదొకటి ఉందన్న విషయం వారికి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు.ఒకవేళ తెలిసినవారెవరైనా ఉంటే.. అప్పటి పీఆర్పీలోనో.. ఇప్పటి జనసేనలోనో విలీనం చేసేశారని చెబుతారు.ఇక పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్‌ యువరాజ్యం అధ్యక్షుడిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ రైలింజన్‌ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.2014 ఎన్నికలకు వచ్చేసరికి.. మనసు మార్చుకొని బాబుతో మిలాఖత్‌ అయ్యారు. టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటెయ్యాలని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు.2019.. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. బాబుకు కటీఫ్‌ చెప్పారు. నేరుగా పోటీ చేస్తున్నామంటూ గ్లాసుకు వేయాలని కోరుతున్నారు..ఇలా మూడు ఎన్నికల్లో మూడు గుర్తులు మార్చి.. ఓటర్లను ఏమార్చడంతోపాటు ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయిన అజ్ఞాతవాసి ఇప్పుడు ఊరు కాని ఊరు గాజువాక నుంచి పోటీ అంటూ వచ్చారు. ఎన్నికల తర్వాత కన్పించని ఆ అజ్ఞాతవాసి కావాలా..  గాజువాకలోనే పుట్టి పెరిగి అందరితో పెద్దమనిషి అనిపించుకుంటున్న అజాతశత్రువు తిప్పల నాగిరెడ్డి కావాలా?.. ఒక్కసారి పరిశీలిద్దాం రండి.

– గరికిపాటి ఉమాకాంత్

 నిలకడలేమికి చిరునామా - పవన్‌కల్యాణ్, జనసేన అభ్యర్ధి, గాజువాక
అసలు గాజువాకతో ఏం సంబంధం.
నాకు కులమతాలే లేవని బీరాలు పలికి ఇక్కడికెందుకొచ్చినట్టు..
పక్కపక్కనే ఉన్న ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని
భీమవరం, గాజువాక.. రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్టు?
భీమవరంపై నమ్మకం లేకనా..?
సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పాలకొల్లులో
ఏకంగా చిరంజీవికే పరాజయం చూపించిన ‘లెక్క’ భయపెట్టిందా...
మరి గాజువాక ప్రజలు అంత అమాయకంగా కనిపించారా..
ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో రెండింటిలో గెలిస్తే ఏ సెగ్మెంట్‌ వదిలేస్తారు
కచ్చితంగా గాజువాకే.. అనుమానం ఏమైనా ఉందా?..
పురిటిగడ్డ, సొంత జిల్లా అని సెంటిమెంట్‌ కబుర్లు చెప్పి
భీమవరంలోనే బిచాణా వేయడం తథ్యం.
ఒకవేళ అక్కడ ఓడి ఇక్కడ గెలిస్తే గాజువాకను ఏం చేస్తారు..
రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకే సహకరించకుండా ఏడిపించిన చరిత్ర ఆయనది?
అలాంటిది ఓటేసిన ప్రజలకేం చేస్తారు?
పోనీ గెలిచినా.. ఓడినా గాజువాకలోనే ఉంటానని మాట ఇస్తారా..
ఆ మాటపై నిలబడతారా..  ఏమాత్రం నిలకడ లేని మనస్తత్వం ఉన్న ఆయన్ను నమ్మేదెలా?
పీఆర్పీ నుంచీ ఆ కుటుంబాన్నే నమ్ముకుని ఉన్న చింతలపూడి వెంకట్రామయ్యను
తన పోటీ కోసం గాజువాక నుంచి పెందుర్తికి తరిమేయడం సబబేనా?
వర్గ దృష్టిలో ’సేఫ్‌ సెగ్మెంట్‌’ కోసం నమ్మినోళ్లను కూడా బలి చేసేస్తారా..


నిత్యం ప్రజలతోనే.. తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి
66 ఏళ్ళ నాగిరెడ్డి వయసురీత్యానే కాదు.. స్థానికులకు మేలు చేసే పెద్ద మనిషిగా పేరుగడించారు.
రైతు కుటుంబానికి చెందిన ఆయన గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ వెంకన్నపాలెం గ్రామంలోనే పుట్టి పెరిగారు.
అప్పట్లో ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకున్నారు. ఈ ప్రాంతంలోనే పెరిగి పెద్దయ్యారు.
గ్రామ పరిపాలనాధికారిగా, గ్రామ కార్యదర్శిగా మూడు దశాబ్దాలకుపైగా పని చేసి ప్రజలకు సేవలందించారు.
మొదటి నుంచి కాంగ్రెస్‌లో మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరొందారు.
2007 జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇలా గెలిచిన పదిమంది స్వతంత్రులకు నాయకత్వం వహించారు.
నాడు వైఎస్‌ కోరిక మేరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి జీవీఎంసీ మేయర్‌ పదవిని కాంగ్రెస్‌ పరం చేశారు.
2009లో గాజువాక నుంచి శాసనసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లు సాధించారు.
2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు.
ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు.
స్థానిక టీడీపీ నేతల అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేశారు.
జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు.
2019లో మళ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు.
గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న చరిత్ర నాగిరెడ్డిది.
ఓడినప్పటికీ ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించిన
నాగిరెడ్డిని గెలిపిస్తే గాజువాక ఏరీతిన అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement