History of Political Parties
-
కేసీఆర్‌ని మట్టికరిపించిన ఏకైక నేత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తొలినాళ్లలో ఎన్నికల్లో ఓ నేత మట్టికరిపించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అనుంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మదన్ మోహన్ కేసీఆర్‌పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కేసీఆర్‌కు ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. ఆ తర్వాత కేసీఆర్ 13 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు కేసీఆర్. కాగా తనను ఓడించిన మదన్ మోహన్‌ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా ఓడించారు. కొంతకాలానికి రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్ 2004లో కన్నుమూశారు. -
పతనంతిట్ట.. పాలనలో దిట్ట
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ‘పతనం తిట్ట’ది ప్రత్యేకమైన స్థానం. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతం పేరు వినని వారుండరంటే ఆశ్చర్యం కాదు. పశ్చిమ కనుమల అంచుల్లోని దక్షిణ కేరళలో ఉన్న పతనం తిట్ట శబరిమల వివాదం సందర్భంగా బాగా వెలుగులోకి వచ్చినప్పటికీ, అంతకు మించిన అంతర్జాతీయ ఖ్యాతి ఈ ప్రాంతం సొంతం చేసుకుంది. విద్య, వైద్యంలోనే కాదు, ప్రపంచమంతా బాలబాలికల నిష్పత్తిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి వెయ్యి మంది బాలురకి 1,129 మంది బాలికలతో సమానత్వ భావనకు తార్కాణంగా నిలిచింది. దేశంలోని మొత్తం 123 ప్రధాన నగరాల్లో ఈ ప్రాంతంలోని సెంట్రల్ ట్రావెన్కోర్ భారత వాయు స్వచ్ఛతకు కొలమానంగా భావిస్తారు. ప్రధానంగా మానవాభివృద్ధి సూచీలో ఈ ప్రాంతం అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతోంది. పతనంతిట్టలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వారెవరికైనా.. ఆమర్త్యసేన్లాంటి వారు ఆరోగ్యం విషయంలో కేరళని మోడల్‌గా ప్రస్తావించడానికి కారణమేమిటో అర్థం అవుతుంది. ఆరోగ్యంలో అగ్రగామి.. అభివృద్ధిలో ప్రధానంగా ఆరోగ్యరంగంలో పతనం తిట్ట అగ్రగామిగా ఉంది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఇక్కడ ఈ విషయం చర్చనీయాంశం కాకపోవడం విచిత్రం. పతనం తిట్టలో శిశు ఆరోగ్యంలో ఉన్నతమైన ప్రమాణాలున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ, టాటా ట్రస్ట్ ఇటీవల లోక్‌సభ సెగ్మెంట్లలోని మానవాభివృద్ధి సూచీపై జరిపిన అధ్యయనం వెల్లడించింది. లోక్‌సభ సభ్యులను మరింత జవాబుదారీగా మార్చాలనే ఉద్దేశంతో జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. కమ్యూనిస్టుల కంచుకోటలో కాషాయజెండా ఎగురవేసేందుకు బీజేపీ శబరిమల విషయాన్ని సానుకూలంగా మార్చుకున్న నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పతనం తిట్ట ప్రాధాన్యతను సంతరించుకుంది. శబరిమల అంశం తెరపైకి రావడంతో ఆరోగ్యం తదితర అంశాల్లో ఈ ప్రాంతం సాధించిన అభివృద్ధి సానుకూలత కూడా కొట్టుకుపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. శబరిమల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతిష్టాత్మక తీర్పుతో ఆరోగ్యాంశం ఈ ఎన్నికల్లో అంత ప్రాధాన్యతను సంతరించుకోలేకపోయింది. క్రిస్టియన్ ఓటర్లే కీలకం.. ఈ ప్రాంతంలో క్రిస్టియన్ ఓటర్లదే కీలకపాత్ర. అందుకే ఇక్కడ అభ్యర్థుల ఎంపికలో సైతం మతం ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తోన్న క్రిస్టియన్ ఓటర్లు సీపీఎం వైపు ఉన్నారు. నిజానికి లౌకిక వాదాన్ని అనుసరిస్తూ, మైనారిటీల పక్షం వహిస్తే అది సీపీఎంకి అనుకూలిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయంలో సీపీఎం వైఖరి వేరుగా ఉండడం గమనార్హం. రోమన్ క్యాథలిక్ చర్చ్‌కి చెందిన ఆంటోనీ కాంగ్రెస్ నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆంటోనీ ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. మరోమారు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. అయితే ఇదే వర్గానికి చెందిన ప్రముఖ టీవీ యాంకర్ వీణా జార్జ్‌ని ఈ స్థానం నుంచి సీపీఎం పోటీకి దింపింది. ఈ సనాతన చర్చ్‌కి వీణా జార్జ్ భర్త ఎగ్జిక్యూటివ్ మెంబర్ కావడం, పతనం తిట్టలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉండడంతో సీపీఎం వీణా జార్జ్‌ని బరిలోకి దింపింది. వీణా జార్జ్ భర్త జార్జ్ 2016లో ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే శబరిమల అంశాన్ని అడ్డంపెట్టుకొని ఓట్లు దండుకోవాలని చూడొద్దని కేరళ ఎన్నికల కమిషనర్ టీకారాం నాయక్ హెచ్చరించడం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంది. మొత్తం ఓటర్లు 13,40,193 మహిళా ఓటర్లు 6,98,718 అక్షరాస్యత 96.55% ఎత్తుకు తగ్గ బరువులేని ఐదేళ్లలోపు బాలలు (జాతీయ సగటు 33 శాతం)12.5% ప్రతి 3.95 కిలోమీటర్లకూ ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (జాతీయ సగటు ప్రకారం ప్రతి 7.3 కిలోమీటర్లకూ ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రం) ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని సెంట్రల్ ట్రావెన్ కోర్.. వాయు స్వచ్ఛతకు కొలమానంగా నిలుస్తోంది. ఆయు ప్రమాణం 44 ఏళ్ల నుంచి 74 ఏళ్లకు పెరిగింది వెయ్యి మందిబాలురకు బాలికలు 1,129 -
మండ్య: పౌరుషానికి మారుపేరు
కర్ణాటక పేరు చెబితే టక్కున గుర్తుకొచ్చేది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ..బెంగళూరు.. మైసూరు దసరా ఉత్సవాలు. కానీ, ఇది ఎన్నికల సీజన్. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ‘రాజకీయ కోలాహలం’ నెలకొంది. ఇక్కడి పార్టీల కార్యకలాపాలు.. గెలుపు కోసం వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రాలనూ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే, గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో తెలుగు వారూ ఇక్కడ ఉన్నారు. కీలకమైన 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక్కడ గెలిచే వారే ‘అరసు’ (కింగ్). ఏప్రిల్ 11న పోలింగ్‌కు వెళ్తున్న కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో నెలకొన్న స్థితిగతులు.. చిక్కబళ్లాపుర: మినీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెగ్మెంట్లు: గౌరీబిదనూరు,బాగేపల్లి, చిక్కబళ్లాపుర, యలహంక, హొసకోటె, దేవనహళ్లి (ఎస్సీ),దొడ్డబళ్లాపుర, నెలమంగళ. పోటీ:బి.ఎన్.బచ్చేగౌడ (బీజేపీ), డాక్టర్ ఎం.వీరప్ప మొయిలీ (కాంగ్రెస్) ఎస్సీ, ఎస్టీ ఓటర్లు దాదాపు ఐదు లక్షల మంది ఉన్న లోక్‌సభ స్థానం ఇది. ఒక్కళిగలు కూడా దాదాపు అంతే సంఖ్యలో ఉంటారు. బలిజ సామాజిక వర్గం వారు మూడు లక్షల మంది వరకూ ఉంటే మైనార్టీల సంఖ్య రెండు లక్షల పైమాటే. మైనార్టీలు సుమారు 50 వేల మంది వరకు ఉంటారు. 2004 నుంచి ఈ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998 నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోట ఇది. ఆర్.ఎల్.జాలప్ప 1998, 1999, 2004లో గెలుపొందారు. పురుషులు8,43,740 మహిళలు8,14,602 మొత్తం ఓటర్లు16,58,342 కోలార్ బంగారు గనుల బరి అసెంబ్లీ సెగ్మెంట్లు: శిడ్లఘట్ట, చింతామణి, శ్రీనివాసపుర, ముళబాగిలు (ఎస్సీ), కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ (ఎస్సీ), బంగారుపేట, మాళూరు. పోటీ:కె.హెచ్.మునియప్ప (కాంగ్రెస్),ఎస్.మునియప్ప (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కోలార్ బంగారు గనులు ఉన్న ఈ ప్రాంతం ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. తెలుగు మాట్లాడే వారు దాదాపు 30 శాతం వరకూ ఉన్నారని అంచనా. కాంగ్రెస్‌కు కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి కె.హెచ్.మునియప్ప 1991 నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ఎన్నికల్లో కుల ప్రాధాన్యం ఎక్కువ. పురుషులు7,55,450 మహిళలు7,37,525 మొత్తం ఓటర్లు14,92,975 ఉడుపి–చిక్కమగళూరు: ‘కరావళి’ గడప అసెంబ్లీ సెగ్మెంట్లు: చిక్కమగళూరు, కాపు, కార్కళ, కుందాపుర, ముద్దిగెరె (ఎస్సీ), శృంగేరి, తారికెరె, ఉడుపి. పోటీ:శోభ కరంద్లాజే (బీజేపీ),ప్రమోద్ మద్వరాజ్ (జేడీఎస్) అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానమిది. 2009లో ఈ స్థానం నుంచి గెలిచిన డి.వి.సదానంద గౌడ కేంద్రమంత్రిగా పనిచేశారు. రెండేళ్ల తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కె.జయప్రకాశ హెగ్డే ఇక్కడ గెలుపొందారు. 2014 నుంచి బీజేపీ నేత శోభ కరంద్లాజే ఎంపీగా ఉన్నారు. సముద్ర తీర ప్రాంతంతోపాటు కర్ణాటకలోని మళెనాడు ప్రాంతాన్ని కూడా కలిగి ఉండటం ఈ నియోజకవర్గ ప్రత్యేకత. ఎస్సీ, ఎస్టీ, బిల్లవ, ఒక్కళిగ, బంట్ సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లిం, బ్రాహ్మణ, లింగాయత్‌లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. పశ్చిమ కనుమల ప్రాంతంలోని ధర్మస్థల, కుక్కే, కొల్లూరు వంటి పుణ్యక్షేత్రాలు ఈ నియోజవకర్గం పరిధిలోనే ఉన్న నేపథ్యంలో హిందుత్వ రాజకీయాల ప్రభావం కూడా ఎక్కువే. పురుషులు6,79,286 మహిళలు7,08,009 మొత్తం ఓటర్లు13,87,295 హాసన్: దేవెగౌడ అడ్డా అసెంబ్లీ సెగ్మెంట్లు: కడరు, శ్రావణ బెళగొళ,అర్సికెరె, బేళూరు, హాసన, హొళెనర్సీపుర,అర్కల్గుడ్, సకలేశ్పుర. పోటీ:ప్రజ్వల రేవణ్ణ(జేడీఎస్) కర్ణాటక దక్షిణ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ఒక్కళిగ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న స్థానమిది. పునర్విభజనలో భాగంగా 2008లో చిక్కమగళూరు స్థానంలోని బీరూరు, కడూరు ప్రాంతాలను కలిపారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ పోటీ చేసిన నియోజకవర్గంగా దీనికి గుర్తింపు ఉంది. 1999లో ఇక్కడి నుంచి జి.పుట్టస్వామి గౌడ కాంగ్రెస్ తరఫున గెలుపొందగా.. 2004 నుంచి దేవెగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఒక్కళిగల జనాభా 15 శాతం ఉండగా.. ఈ స్థానంలో అంతకంటే ఎక్కువ మోతాదులో ఈ సామాజిక వర్గం వారు ఉన్నారు. తరువాతి స్థానంలో లింగాయత్‌లు, దళితులు, ఎస్టీలు ఉన్నారు. ప్రస్తుతం దేవెగౌడ్ మనవడు ప్రజ్వల రేవణ్ణ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దేవెగౌడకు ఉన్న పేరుతో పాటు తమ తండ్రి ఇమేజ్ సాయంతో ప్రజ్వల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పురుషులు7,89,668 మహిళలు 7,71,668 మొత్తం ఓటర్లు 15,61,336 దక్షిణ కన్నడ: ‘మత’మే కీలకం అసెంబ్లీ సెగ్మెంట్లు: బెళ్తంగడి, మూడ్‌బిద్రీ,మంగళూరు సిటీ నార్త్ (గతంలో సూరత్కల్), మంగళూరు సిటీ సౌత్ (గతంలో మంగళూరు), మంగళూరు (గతంలో ఉళ్లాల్), బంట్వాళ్, పుత్తూరు, సూళియా (ఎస్సీ) పోటీ: నళిన్ కుమార్ కటీల్ (బీజేపీ),మిథున్ రై (కాంగ్రెస్) తుళునాడు ముఖ్య కేంద్రంగా గల దక్షిణ కన్నడ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొత్తం ఓటర్లలో బిల్లవులు 4.5 శాతం వరకు ఉండగా ముస్లింలు కూడా దాదాపు అంతే శాతం ఉన్నారు. బంట్స్, గౌడ, ఒక్కళిగ, క్రైస్తవ జనాభా తరువాతి స్థానంలో ఉన్నారు. బెళ్తంగడి నియోజకవర్గం 2008 కంటే ముందు చిక్కమగళూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేది. బంట్వాళ్, మూడ్‌బిద్రీ, సూరత్కల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉడుపి లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేవి. 2009 నుంచి ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ తరఫున నళిన్‌కుమార్ కటీల్ గెలుపొందుతూ వస్తున్నారు. మతపర రాజకీయాలు కీలకమైన నియోజకవర్గమిది. గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ క్రమేపీ బలం పుంజుకుంటూ వస్తోంది. పురుషులు 8,33,719 మహిళలు 8,63,599 మొత్తం ఓటర్లు16,97,418 చిత్రదుర్గ (ఎస్సీ): దళితుల కోట అసెంబ్లీ సెగ్మెంట్లు: మొళకాల్మూరు (ఎస్టీ),చెళ్లకెరు (ఎస్టీ), చిత్రదుర్గ, హిరియూరు, హొసదుర్గ, హెళలకెరె (ఎస్సీ), శిర, పావగడ పోటీ: ఏ.నారాయణ స్వామి (బీజేపీ),బి.ఎన్.చంద్రప్ప (కాంగ్రెస్) దేశం మొత్తమ్మీద అత్యంత వెనుకబడ్డ జిల్లాగా చిత్రదుర్గకు పేరుంది. కుల, మతపరమైన రాజకీయాలకు ప్రాధాన్యం ఎక్కువ. షెడ్యూల్డ్ కులాలకు చెందిన భోవి, మాదిగ కులాల జనాభా పెద్దసంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో మాదిగల సంఖ్యే నాలుగు లక్షలకుపైగా ఉంటుంది. ఒక్కళిగ, ముస్లింలు తరువాత స్థానంలో ఉన్నారు. బీజేపీ, జేడీ(ఎస్).. భోవి వర్గం అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తాయి. 1999లో జేడీయూ తరఫున శశికుమార్ ఇక్కడి నుంచి గెలుపొందారు. 2008లో ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్వై హనుమంతప్ప విజయం సాధించగా.. 2009లో బీజేపీ అభ్యర్థి జనార్దన స్వామి గెలుపొందారు. పురుషులు 8,44,864 మహిళలు 8,16,408 మొత్తం ఓటర్లు 16,61,272 తుముకూరు: కర్ణాటక నడిగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్లు: చిక్కనాయకనహళ్లి,టిప్టూర్, తురువెకెరె, తుముకూరు సిటీ, తుముకూరు రూరల్, కొరటగెరె (ఎస్సీ), గుబ్బి, మధుగిరి. పోటీ: జి.ఎస్.బసవరాజ్ (బీజేపీ), హెచ్.డి.దేవెగౌడ(జేడీఎస్) కర్ణాటక రాజధాని బెంగళూరు పొరుగున ఉన్న నియోజకవర్గమిది. శాటిలైట్ టౌన్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎనిమిది జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటోంది. లింగాయత్‌ల ఆధిపత్యం ఎక్కువ. రెండు మూడు స్థానాల్లో ఒక్కళిగలు, దళితులు ఉన్నారు. 1999, 2009లో జి.ఎస్.బసవరాజ్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున, రెండోసారి బీజేపీ టికెట్‌పై గెలిచారు. 2004లో బీజేపీకి చెందిన మల్లికార్జునయ్య గెలుపొందగా.. 2014లో బీజేపీ ఈ స్థానాన్ని కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎస్పీ ముద్దహనుమేగౌడ గెలుపొందారు. పురుషులు 7,64,561 మహిళలు7,53,957 మొత్తం ఓటర్లు15,18,518 మండ్య: పౌరుషానికి మారుపేరు అసెంబ్లీ సెగ్మెంట్లు: మాలవళ్లి (ఎస్సీ), మద్దూరు, మేలుకోటే, మండ్య, శ్రీరంగపట్న, నాగమంగళ, కృష్ణరాజపేటె, కృష్ణరాజ నగర పోటీ: సుమలత అంబరీష్ (స్వతంత్ర), నిఖిల్ గౌడ (జేడీఎస్) మద్దూరు, మాలవళ్లి స్థానాల్లో కొన్ని మార్పులు చేసి పునర్విభజించారు. కన్నడ సినీ హీరో దివంగత అంబరీష్ 2009 వరకూ ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. 2009 ఎన్నికల్లో జేడీఎస్‌కు చెందిన చెలువరాయ చేతిలో అంబరీష్ ఓటమి పాలయ్యారు. 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో మరో సినీ నటి, కాంగ్రెస్ ఐటీ విభాగపు అధ్యక్షురాలు రమ్య గెలుపొందారు. గత ఎన్నికల్లో జేడీఎస్‌కు చెందిన సి.ఎస్.పుట్టరాజ్ గెలిచారు. అయితే రాష్ట్ర మంత్రిగా పనిచేసేందుకు 2018లో పుట్టరాజ్ తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ జేడీఎస్ అభ్యర్థి ఎల్.ఆర్.శివరామేగౌడ గెలుపొందారు. ఒక్కళిగల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న స్థానమిది. జనాభాలో సగానికి పైగా ఈ సామాజిక వర్గం వారే ఉన్నారు. పురుషులు 8,39,052 మహిళలు8,30,210 మొత్తం ఓటర్లు16,69,262 మైసూరు రాజసం అసెంబ్లీ సెగ్మెంట్లు: మడికెరె, విరాజ్పేట్,పిరియపట్టణ, హున్సుర్, చాముండేశ్వరి,కృష్ణరాజ, చామరాజ, నరసింహరాజ. పోటీ:ప్రతాప సింహ (బీజేపీ),విజయశంకర్ (కాంగ్రెస్). పాత మైసూరు ప్రాంతంలోని నియోజకవర్గం. కొడగు, మైసూ రు ప్రాంతాలు కలిసి ఉంటాయి. గ్రామీణ, నగర ఓటర్ల కలగలుపుగా ఉండే స్థానం. కృష్ణరాజ, నరసింహరాజ, చామరాజ నగర ప్రాంతాలు. ఒక్కళిగలు, కురుబ సామాజిక వర్గం వారు ఎక్కువ. లింగాయత్, ముస్లింలు, ఇతర వెనుకబడ్డ తరగతుల వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. కొంత కాలం క్రితం మడికెరె, విరాజ్‌పేట అసెంబ్లీ స్థానాల్లోని కొన్ని ప్రాంతాలను మంగళూరు లోక్‌సభ పరిధిలోంచి వేరు చేసి ఇందులో కలిపారు. 1999 ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన మైసూరు రాజ కుటుంబానికి చెందిన శ్రీకంఠ దత్త వడయార్.. 2004లో బీజేపీ అభ్యర్థి సి.హెచ్.విజయశంకర్ చేతిలో ఓడిపోయారు. 2009లో విజయ శంకర్.. ఎ.హెచ్.విశ్వనాథ్ (కాం గ్రెస్) చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ప్రతాపసింహ (బీజేపీ) గెలుపొందారు. పురుషులు8,67,893 మహిళలు8,55,241 మొత్తం ఓటర్లు 17,23,134 చామరాజనగర గిరిపుత్రుల పవర్ అసెంబ్లీ సెగ్మెంట్లు: హనూర్, కొళ్లెగాళ,చామరాజ నగర, గుండ్లుపేటె, టి.నర్సీపుర, నంజనగూడు, హెగ్గడదేవనకోటె, వరుణ పోటీ:శ్రీనివాస ప్రసాద్ (బీజేపీ), ధృవ నారాయణ (కాంగ్రెస్) ఎస్సీ రిజర్వుడు స్థానం. వరుణ అసెంబ్లీ స్థానంలో కొన్ని మార్పులు చేసి 2008లో పునర్విభజించారు. ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానం. దళితులు, వెనుకబడిన తరగతుల వారు, మైనార్టీల సంఖ్య కూడా ఎక్కువే. హెగ్గడదేవనకోటె తాలూకాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. జేడీయూ అభ్యర్థి శ్రీనివాస ప్రసాద్ 1999 ఎన్నికల్లో విజయం సాధించగా 2009లో జేడీఎస్ అభ్యర్థి శివణ్ణ గెలుపొందారు. 2009 నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఆర్.ధృవ నారాయణ విజేతగా ఉన్నారు. పురుషులు 7,89,383 మహిళలు 7,66,396 మొత్తం ఓటర్లు 15,55,779 బెంగళూరు రూరల్: రాజధాని శివారు అసెంబ్లీ సెగ్మెంట్లు: కుణిగల్, రాజరాజేశ్వరి నగర, బెంగళూరు సౌత్, అనేకల్, మాగడి, రామనగర, కనకపుర, చెన్నపట్టణ. పోటీ: అశ్వత్నారాయణ్ (బీజేపీ),డీకే సురేశ్ (కాంగ్రెస్) 2008లో ఏర్పడ్డ నియోజకవర్గం. రాజధాని బెంగళూరులోని కొన్ని ప్రాంతాలతోపాటు శివారు పట్టణాలైన చెన్నపట్టణ, అనేకల్లు ఉన్న లోక్‌సభ స్థానమిది. లింగాయతులు, ముస్లింలతోపాటు కురుబలు, ఇతర వెనుకబడ్డ తరగతుల వారి ప్రాబల్యం ఎక్కువ. 2009లో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి ఈ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అయితే అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశంతో 2013లో తన లోక్‌సభ స్థానాన్ని వదులుకున్నారు. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి డీకే సురేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పురుషులు 11,35,845 మహిళలు10,54,552 మొత్తం ఓటర్లు21,90,397 బెంగళూరు నార్త్: వలసదారులే కీలకం అసెంబ్లీ సెగ్మెంట్లు: కె.ఆర్.పురం, బ్యాటరాయనపుర, యశ్వంతపుర, దాసరహళ్లి, మహాలక్ష్మి లేఔట్, మల్లేశ్వరం, హెబ్బాళ, పులకేసనగర. పోటీ: డి.వి.సదానంద గౌడ (బీజేపీ),కృష్ణ బైరేగౌడ (కాంగ్రెస్) 2008లో బెంగళూరులోని శివాజీనగర, శాం తినగర అసెంబ్లీ నియోజకవర్గాల కు కొన్ని ఇతర ప్రాంతాలను కలి పి ఈ లోక్‌సభ స్థానాన్ని ఏర్పా టు చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన స్థానమూ ఇదే. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు ఎక్కువగా ఉంటారు. 2008 పునర్విభజన తరువాత ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు బెంగళూరు సెంట్రల్‌కు వెళ్లి పోయాయి. 1977–99 మధ్య కాలంలో ఎనిమిది సార్లు కాంగ్రెస్ నుంచి సీకే జాఫర్ ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి బీజేపీ మూడుసార్లు గెలుస్తూ వచ్చింది. షరీఫ్‌పై మాజీ పోలీస్ ఉన్నతాధికారి హెచ్‌టీ సాంగ్లియానా 2004లో గెలుపొందారు. 2009లో చంద్రేగౌడ, 2014లో డి.వి.సదానంద గౌడ గెలుపొందారు. ఒక్కళిగ, ముస్లిం, షెడ్యూల్డ్ తెగల వారు కీలకం. పురుషులు12,60,356 మహిళలు11,41,116 మొత్తం ఓటర్లు24,01,472 బెంగళూరు సౌత్: తేజస్వీ సూర్య ఉదయించేనా అసెంబ్లీ సెగ్మెంట్లు: గోవిందరాజ నగర, విజయ నగర, చిక్పేట్, బసవనగుడి, పద్మనాభ నగర, బీటీఎం లేఔట్, జయనగర, బొమ్మనహళ్లి. పోటీ:తేజస్వీ సూర్య (బీజేపీ), బి.కె.హరిప్రసాద్ (కాంగ్రెస్) బీజేపీకి బాగా పట్టున్న లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. 1991 నుంచి కాషాయ పార్టీ వరుసగా గెలుపొందటం ఇందుకు నిదర్శనం. 1996 నుంచి 2018 మధ్య కాలంలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ ప్రాతినిధ్యం వహించింది ఇక్కడి నుంచే. గత ఏడాది నవంబరులో ఆయన మరణం తరువాత ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ తేజస్వీ సూర్య అనే 28 ఏళ్ల న్యాయవాదిని బరిలోకి దింపింది. బ్రాహ్మణ ఓటర్లు గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో ఉంటారు. అయితే దాదాపు 5 లక్షల మంది ఓటర్లతో ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. మైనార్టీ ఓటర్లు దాదాపు రెండు లక్షల మంది ఉంటారు. పురుషులు10,51,316 మహిళలు9,48,566 మొత్తం ఓటర్లు19,99,882 బెంగళూరు సెంట్రల్: ప్రకాశ్‌రాజ్‌కు పరీక్ష అసెంబ్లీ సెగ్మెంట్లు: సర్వజ్ఞనగర్,సి.వి.రామన్ నగర్, శివాజీనగర,శాంతినగర, గాంధీనగర్, రాజాజీనగర్, చామరాజపేట్, మహాదేవపుర. పోటీ:పి.సి.మోహన్ (బీజేపీ), రిజ్వాన్ అర్షద్ (కాంగ్రెస్), ప్రకాశ్‌రాజ్ (స్వతంత్ర) 2008లో బెంగళూరు ఉత్తర, దక్షిణ లోక్‌సభ స్థానాల నుంచి కొన్ని ప్రాంతాలను వేరుచేసి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన పి.సి.మోహన్ సిట్టింగ్ ఎంపీ. దాదాపు అన్ని రకాల భాషలు, మతాలు, మైనార్టీలతో కూడిన స్థానం. ముస్లింలు, క్రైస్తవులతోపాటు తమిళ ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. పునర్విభజన కారణంగా ఎక్కువమంది మైనార్టీలు వచ్చి చేరారని అంచనా. పురుషులు10,10,586 మహిళలు9,21,077 మొత్తం ఓటర్లు19,31,663 -
మహారాష్ట్రలో మల్లయుద్ధాలు
మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమితో ఎలా తలపడాలో ఆలోచించాల్సిన సమయంలో కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయింది. మహారాష్ట్రలో 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తక్షణమే పార్టీలో సీట్లకోసం మల్లయుద్ధాలు ప్రారంభం అయ్యాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు సీనియర్ నాయకుడు అశోక్ చవాన్కీ, చంద్రాపూర్కి చెందిన పార్టీ కార్యకర్తకీ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్పింగ్ లీక్ అవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి వెలుగులోకి వచ్చింది. ఇది అధిష్టానం దృష్టికి సైతం చేరింది. మరో పక్క బీజేపీ, శివసేన పార్టీల్లో సైతం పార్టీ టికెట్ దక్కని సిట్టింగ్ అభ్యర్థులు పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తామని బెదిరిస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. చంద్రాపూర్‌లో చవాన్ అలక పాన్పు చంద్రాపూర్‌లో తాను సూచించిన అభ్యర్థికి కాకుండా వేరే వ్యక్తికి సీటు కేటాయించడంపై పార్టీ అధిష్టానం వైఖరిపై అలకపాన్పు ఎక్కిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ చంద్రాపూర్‌లోని ఓ కార్యకర్తతో ఫోన్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆ రాష్ట్రంలోని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జాగ్రత్త పడిన కాంగ్రెస్ మరుసటి రోజే పార్టీ ప్రకటనని వెనక్కి తీసుకొని వినాయక్బాంగాడే స్థానంలో చవాన్ సూచించిన సురేష్ ధనోర్కర్కి సీటు ఖరారు చేసింది. దీంతో తాత్కాలికంగా అక్కడ అంతర్గత అసంతృప్తిని నివారించినా రాష్టంలోని మరికొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ సీటు దక్కని తిరుగుబాటుదార్ల నుంచి అసంతృప్తి సునామీని ఎదుర్కోక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ని మహారాష్ట్రలో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఔరంగాబాద్‌లో అసమ్మతి జ్వాలలు అశోక్ చవాన్‌కి ప్రీతిపాత్రుడైన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ ఔరంగాబాద్‌లో పార్టీ అభ్యర్థి సుభాష్ జాంబాద్కి వ్యతిరేకంగా స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడంతో చవాన్‌కి మరో షాక్ తగిలింది. సత్తార్ ఏకంగా అక్కడి ముఖ్యమంత్రిని కలిసి తాను పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని స్పష్టం చేయడంతో అంతా అయోమయంగా మారింది. అయితే సుభాష్ జాంబాడ్ సత్తార్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధమేనని ప్రకటించారు. భీవాండీలో భీముడెవరు? భీవాండీలో కూడా పార్టీ అభ్యర్థి సురేష్ తవారే కూడా తమ వారి నుంచి, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన విశ్వనాథ్ పాటిల్ ఈ సారి కూడా పార్టీ సీటుని ఆశించి, నిరాశచెందారు. మరోవర్గం వారు ఇదే స్థానం నుంచి మాజీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నాయకుడు సురేష్ మాత్రేని కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయించాలని తీవ్రంగా యత్నిస్తుండడంతో ఈ ముగ్గురిలో ఈ సీటు ఎవరికిఇవ్వాలో తేల్చుకోలేక కాంగ్రెస్ తలబద్దలు కొట్టుకుంటోంది. సంగ్లీలో సంకటం.. పార్టీ సంగ్లీ యూనిట్ సైతం అసంతృప్తి భూతాన్ని అణచిపెట్టలేక అవస్థలు పడుతోంది. అక్కడ మాజీ కేంద్ర మంత్రి ప్రతీక్ పాటిల్ ఆదివారం పార్టీకి గుడ్‌బై చెప్పేయడంతో సంగ్లీ పార్టీ యూనిట్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. కేవలం ప్రతీక్ మాత్రమే కాకుండా, ఆయన వ్యతిరేక వర్గం ఎమ్మెల్యే విశ్వజీత్ కదం కూడా ఈ సీటుని రాజుశెట్టి నాయకత్వంలోని స్వాభిమాని పక్షకి కేటాయించడంపై అసంతృప్తితో ఉన్నారు. శివసేనలోనూ లుకలుకలు ♦ అహ్మద్‌నగర్‌లో బీజేపీ శివసేన క్యాంపులో సైతం అసమ్మతి ఆ పార్టీలను ముప్పతిప్పలు పెడుతోంది. మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు దిలీప్‌గాంధీ తన కుమారుడు సురేంద్రని స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇక్కడ ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సుజయ్ విఖే పాటిల్ కోసం బీజేపీ ఈ సీటుని ఖాళీ చేయించింది. ♦ భండారా గోండియా నుంచి పార్టీ అభ్యర్థిగా సునీల్ మేంధే పేరుని ప్రకటించడంతో పార్టీకి రాజీనామా చేస్తానంటూ బీజేపీ నాయకుడు రాజేంద్ర పాటిల్ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా ఇటీవలే కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరిన రంజిత్ నాయక్ నింబాల్కర్‌ని బీజేపీ మాధ నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. దీంతో ఇటీవలనే ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరిన రంజిత్ సిన్హా మోహిత్ పాటిల్ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ♦ ఉస్మానాబాద్ శివసేన సిట్టింగ్ ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు సీటు దక్కలేదు. ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఉస్మానాబాద్‌లో తన మద్దతుదారులతో శనివారం సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆయన అనుచరులు కొంత మంది ముంబైలో నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు. మొత్తం శివసేనకున్న 18 మంది లోక్‌సభ సభ్యుల్లో తిరిగి సీటు దక్కని ఏకైక ఎంపీ గైక్వాడ్. దీనికి ప్రధాన కారణం గతంలో ఎంపీ రవీంద్రగైక్వాడ్ విమానాశ్రయంలో అక్కడి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి, దేశవ్యాప్త నిరసనలకు కారణమయ్యారు. ఇది పార్లమెంటుని సైతం ఆ రోజు ఓ కుదుపు కుదిపింది. అందుకే శివసేన ఈసారి గైక్వాడ్‌కి సీటు నిరాకరించింది. -
చిల్లర పొత్తులు చెల్లని ఎత్తులు
కేంద్రంలోని అధికార బీజేపీతో తెలుగుదేశం నాలుగేళ్ల సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి ఆంధ్రలో ఎన్నికల నగారా అనధికారంగా మోగి వివిధ రాజకీయ పార్టీల మధ్య పోరు ప్రారంభమైనట్లే. తమిళనాడులో జయలలిత మరణించినప్పటి నుంచే ఎన్నికల పర్వానికి తెరలేచింది. తొలుత అధికార అన్నాడీఎంకేలో జయలలిత నెచ్చెలి శశికళకు అప్పటి ఉప ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గానికి మధ్య జరిగిన పోరాటం, ఆ నేపథ్యంలో జరిగిన వివిధ నాటకీయ పరిణామాలు ప్రజాస్వామ్యంలో అనేక విస్మయాత్మక సంఘటనలకు దారితీశాయి. అధికారం కోసం, అన్నిరకాల ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి అన్ని పార్టీలు చేసిన విన్యాసాలను తమిళ ప్రజలు మౌనంగా వీక్షించారు. నటుల అరంగేట్రం జయలలిత ఉన్నంతకాలం రాజకీయాల వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించని సినీ హీరోలు, కమల్‌హాసన్, రజనీకాంత్.. ఆమె మరణించిన వెంటనే ఆ నాయకత్వ శూన్యం భర్తీకి ఆమె వారసత్వాన్ని తమ సినీ గ్లామర్‌తో చేజిక్కించుకోవాలని రంగ ప్రవేశం చేశారు. అలాగే విజయకాంత్, అంబుమణి రామదాస్, వై గోపాలస్వామి వంటి వారు కూడా తమ బలం కూడదీసుకుని ప్రజల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. జల్లికట్టు ఆందోళన కమల్ హాసన్‌కు వేదికగా మారగా, తరువాత అభిమానుల ఒత్తిడితో, అజ్ఞాతంగా జాతీయ పార్టీ ప్రేరణతో రజనీకాంత్ కూడా రంగంలోకి దిగారు. అన్నాడీఎంకే ఏర్పడినప్పుడు ఎంజీఆర్, ఆ తరువాత జయలలితను వరించినట్లే తమను కూడా ప్రజలు వరిస్తారనే నమ్మకం, ఆశతో వారు రాజకీయ ప్రవేశం చేశారు. తప్పులేదు. కానీ కరుణానిధి వంటి బలమైన నాయకుడిని ఎదుర్కొనడానికి ఎంజీఆర్, జయలలిత ఎంత కృషి చేశారో, ఎన్ని ఆటుపోట్లను తట్టుకున్నారో వారికి తెలియదు. అప్పటికి ఇప్పటికి తరాలలో వచ్చిన అంతరాలు, ప్రజలలో పరిణతి కారణంగా కమల్, రజనీల ప్రయత్నాలు నల్లేరు మీద నడకలాగా సాగే పరిస్థితి లేదు. రాజకీయ శూన్యం పాలనాదక్షత, రాజకీయానుభవం, ప్రజల మద్దతు కలిగిన నేతలను కోల్పోయి అటు అన్నాడీఎంకే ఇటు డీఎంకే తమ బలంపై కాక ఎదుటి వారి బలహీనతతో అధికారాన్ని దక్కించుకోవాలనే నిరాశాపూరితమైన ప్రయత్నాలు చేస్తూ బరిలో నిలిచాయి. ఉభయ పార్టీలలోని ముఠా తగాదాలు, వర్గపోరు, ఒక వ్యూహాత్మక పంథాను అనుసరించడానికి వీల్లేని పరిస్థితిని కల్పించాయి. అన్నాడీఎంకేలో శశికళ, దినకరన్ ముఠా, పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాల కుమ్ములాటలు జయలలిత మరణానంతరం రాజకీయాలను ప్రభావితం చేస్తే, డీఎంకేలో అళగిరి, స్టాలిన్ వర్గాల మధ్య వారసత్వ పోరు కరుణానిధి ప్రాణాలు వదిలే వరకు కొనసాగింది. అందుకే, అన్నాడీఎంకేలో చీలిక రాజకీయాలను ప్రజలు అసహ్యించుకున్నా డీఎంకే ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజాభిమానం పొందడంలో విఫలమైంది. తండ్రి పాలనాదక్షత కానీ, నాయకత్వ లక్షణాలు కానీ అంతగా లేని స్టాలిన్ తనపై గతంలో వచ్చిన అవినీతి నేరారోపణలు, గత చరిత్రను ప్రజలు మరిచిపోయే వాతావరణం కల్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ ఇంకా ఇతర ప్రతిపక్షాలతో జతకట్టి పోరాడుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వారి కూటములలో చిన్న పక్షాలకు సీట్లు కేటాయించడంలో ఎదురైన సవాళ్లు అభ్యర్థులను ఖరారు చేయడంలో జాప్యానికి, ఉత్కంఠకు దారితీసింది. ఇష్టానుసారం ఎడాపెడా హామీలు.. ఎన్నికల ప్రణాళికల విడుదలలో ప్రత్యర్థుల మేనిఫెస్టోలు వచ్చాక మనం విడుదల చేద్దామనే వ్యూహం అందరి సహనానికి పరీక్షగా మారింది. తమిళనాడులో ఇంతవరకు అన్నాడీఎంకే, డీఎంకే, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలే మేనిఫెస్టోలను విడుదల చేశాయి. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేశాయి. అన్నాడీఎంకే తరఫున పన్నీరుసెల్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో అమ్మ జాతీయ పేదరిక నిర్మూలన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించింది. విద్యార్థులకు విద్యా రుణాలను, సన్న, చిన్నకారు రైతుల రుణాలను రద్దు చేస్తామని నేరుగా ప్రకటించకుండా ఈ మేరకు కేంద్రాన్ని అర్థిస్తామని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ నుంచి హామీ పొంది అన్నాడీఎంకే ప్రణాళికను సిద్ధం చేసుకుందని ఒక రాజకీయ పరిశీలకుడు చమత్కరించారు. డీఎంకే విద్య, సన్న–చిన్నకారు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో పాటు ఆదాయ పన్ను పరిమితిని రూ 8 లక్షలకు, మహిళలు, వికలాంగులకు రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అన్నాడీఎంకేలా స్టాలిన్ ఆదాయ పన్ను విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామనే పదాన్ని కనీసం వాడలేదు. అమాయకులు, నిరక్షరాస్యులు నిజమని నమ్మి ఓటేస్తారని స్టాలిన్ అనుకుంటున్నట్లున్నారు. లేకపోతే కేంద్రానికి సంబంధించిన అంశంపై డీఎంకే ఇలా ఎలా హామీనిస్తుంది?’ అని కులశేఖరన్ అనే అన్నాడీఎంకే మద్దతుదారు ఒకరు వ్యాఖ్యానించారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ‘నీట్’ రద్దు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలలో మహిళలకు ఉపాధి కల్పనకు రూ 50,000 మంజూరు, సీఎస్ఆర్ కింద ప్రైవేట్ కంపెనీలలో నెలకు రూ.10,000 జీతంతో 50 లక్షల మందికి ఉపాధికల్పన వంటివి డీఎంకే ఓటర్లను ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలో పొందుపరిచిన మరికొన్ని అంశాలు. కేంద్రం తరఫున డీఎంకే మేనిఫెస్టో ఇచ్చిన మరొక హామీ ఏమిటంటే వ్యవసాయ రంగానికి ప్రత్యేక కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని. కనీసం ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పినా కొంత అర్థవంతంగా ఉండేది. అలాగే విద్యారుణాల మాఫీ కూడా రాష్ట్ర పరిధిలో లేదు. రాజీవ్ హంతకుల విషయంలో ఏకాభిప్రాయం రెండు పార్టీలు శ్రీలంక సమస్య, రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుల విడుదల డిమాండ్ గురించి ఇంచుమించు ఒకే స్వరాన్ని వినిపించాయి. తమిళుల మనోభావాలకు దగ్గర కావడానికి ద్రావిడ పార్టీలు ఈ విషయంలో ఏకాభిప్రాయంతోనే వున్నాయి. డీఎంకే ప్రత్యేకంగా ఇచ్చిన హామీ ఏమిటంటే గతంలో కుదిరిన ఇండో– శ్రీలంక ఒప్పందం ప్రకారం శ్రీలంక శరణార్థులకు భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడం. రిజర్వేషన్లకు సంబంధించి శ్రీరంగనాథ మిశ్రా, సచార్ కమిషన్ల సిఫార్సులను అమలు చేస్తామని, ఎల్పీజీ సబ్సిడీని రద్దుచేసి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తామని కూడా డీఎంకే హామీ ఇచ్చేసింది. శ్రీలంక యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తునకు కేంద్రాన్ని డిమాండ్ చేస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అన్నాడీఎంకే ఇలా హామీలు ఇవ్వడంలో సాధ్యాసాధ్యాలను యోచించినట్లు కనిపిస్తోంది. అది డీఎంకే ప్రణాళికలో కనిపించదు. ఇవన్నీ ఇలా ఉంటే.. ఒంటరిగా పోటీకి దిగిన మక్కల్ నీతి మయ్యాం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్ తొలి జాబితాలో కొత్త వారిని బరిలోకి దింపి ఆసక్తిని పెంచారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ రైతులకు వందశాతం లాభాలు 50 లక్షల కొత్త ఉద్యోగాలు వంటి అంశాలను ప్రస్తావించారు. అన్నాడీఎంకేలో అటు పన్నీరుసెల్వం ఇటు పళనిస్వామికి సవాలుగా నిలిచిన దినకరన్ పార్టీ ‘అమ్మ మున్నేట్ర కజగ’ ఇంతవరకు ఎన్నికల కమిషన్ వద్ద నమోదు కాలేదు. తనకు కేటాయించిన కుక్కర్ గుర్తును పార్టీకీ వర్తించేలా చేసుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా ఆ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులందరినీ ఇండిపెండెంట్లుగా పరిగణించాల్సిన పరిస్థితి. ఎంజీఆర్ ఆశయ సాధన కోసమంటూ నంబియార్ అనే వ్యక్తి స్థాపించిన అఖిలభారత ఎంజీఆర్ మ్యూన్త్ర కజగం పార్టీకి ఎన్నికల కమిషన్ రెండు వీధి దీపాలున్న స్తంభం గుర్తు కేటాయించింది. జయలలిత మేనకోడలు దీప అన్నాడీఎంకేలో చేరి జయలలిత ఆశయాలకు కృషి చేస్తానని ప్రకటించింది. డేట్లైన్ చెన్నై ఎస్.వి.సూర్యప్రకాశరావు రచయిత చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్. మనీవైస్ ఇంగ్లిష్ పత్రిక కన్సల్టెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. -
అరవై ఏడేళ్లలో ఆరున్నరేళ్లే..
సామాజిక వర్గాలు, మెజారిటీ జనాభాతో సంబంధం లేకుండా నాయకత్వ విలువలకే ప్రాధాన్యతనిచ్చి అందలం ఎక్కించే పరిణతి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం సొంతం. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల ప్రజలే పెద్దసంఖ్యలో ఉన్నారు. ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలు గ్రామాల్లో తక్కువగానే ఉన్నా.. స్వాతంత్య్రం పూర్వం నుంచే వారిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అదే ఒరవడి స్వాతంత్య్రం వచ్చాక కూడా కొనసాగింది. 1952 నుంచి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే బీసీ వర్గాలకు చెందిన నేతలు ఎన్నికవడం గమనార్హం. వారు కూడా కేవలం ఆరున్నరేళ్లే ప్రాతినిథ్యం వహించారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా, ఆ సంవత్సరంతో పాటు 1957లో ఇద్దరు సభ్యులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ద్విసభ్య నియోజకవర్గంగా రెండుసార్లు కొనసాగినప్పుడు కూడా రిజర్వు చేసిన స్థానంలో ఎస్సీలు గెలుపొందితే, మరో స్థానంలో ఉన్నత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎంపీగా గెలిచారు. ఆ తరువాత 1962 నుంచి వరుసగా జె.రమాపతిరావు, ఎం.సత్యనారాయణరావు, జువ్వాది చొక్కారావు 1991 వరకు ఎన్నికవుతూ వచ్చారు. వీరంతా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారే. 1996లో తొలిసారిగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణ కాంగ్రెస్ కురువృద్ధుడు జువ్వాది చొక్కారావుపై అనూహ్య విజయం సాధించారు. అయితే బీసీ నేతగా ఎన్నికైనప్పటికీ, 1996లో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏడాదిన్నరకే రద్దవడంతో 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు విజయం సాధించారు. 1999లో మరోసారి విద్యాసాగర్‌రావు గెలవగా, 2004లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గెలుపొందారు. 2006, 2009 ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ జయకేతనం ఎగరేశారు. కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌పై విజయం సాధించి, ఇక్కడి నుంచి గెలిచిన రెండో బీసీ నేతగా రికార్డుల్లోకి ఎక్కారు. 2014లో మళ్లీ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన బి.వినోద్‌కుమార్ గెలిచారు. ఈసారి వినోద్‌కుమార్ (టీఆర్ఎస్), పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు.– సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
అక్కడ ‘చేయి’ పడలేదు.. ఇక్కడ ‘కాషాయం’ పండలేదు
ఆ 14 లోక్‌సభ స్థానాల్లో ఒక్కదాంట్లోనయినా పాగా వేయాలని కాంగ్రెస్ గత పదిహేనేళ్లుగా విఫలయత్నం చేస్తోంది. అలాగే, రెండు లోక్‌సభ సీట్లను కాంగ్రెస్ నుంచి గుంజుకోవడానికి బీజేపీ కూడా పదిహేనేళ్లుగా పోరాడుతోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఇది. గత పదిహేనేళ్లుగా బీజేపీ చేతిలో ఉన్న మధ్యప్రదేశ్‌ను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ స్ఫూర్తితో ఈ ఎన్నికల్లోనయినా ఆ 14 సీట్లలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని ఆశపడుతోంది. రాష్ట్రంలోని భోపాల్, ఇండోర్, విదిష, మొరెనా, భింద్, సాగర్, తికంగఢ్, దామో, ఖజురహో, సత్నా, జబల్పూర్, బాలాఘాట్, బీటల్, రెవా లోక్‌సభ నియోజకవర్గాల్లో గత పదిహేనేళ్లలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. ఈ సీట్లన్నింటిలోనూ ఎప్పుడూ బీజేపీయే నెగ్గుతోంది. అలాగే, కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ, చింద్వారా నియోజకవర్గాల్లో ఇంత వరకు బీజేపీ బోణీ చేయలేదు. ఇక్కడ నెగ్గడం కోసం కమలదళం గత దశాబ్దంన్నరగా కృషి చేస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని 29 నియోజకవర్గాల్లో 27 చోట్ల విజయం సాధించింది. అయితే, ఈ రెండూ మాత్రం కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. ఈ 14 సీట్లలో తమ పార్టీ ఒక్కసారి కూడా నెగ్గకపోవడాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి పంకజ్ చతుర్వేది అన్నారు. ఈసారి ఈ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను నిలబెడతామని, మోదీ వ్యతిరేకత కారణంగా ఇక్కడ తాము గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రతినిధి దీపక్ విజయవర్గీయ కూడా గుణ, చింద్వారా నియోజకవర్గాల్లో శక్తిమంతమైన అభ్యర్థులను బరిలో దించుతామని అంటున్నారు. ఈ రెండు సీట్లను కూడా గెలుచుకుని ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
యడ్డీ డైరీ కలకలం..
కర్ణాటకలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇటు కాంగ్రెస్‌కూ కీలకంగా మారాయి. ఇందుకు తగ్గట్టే రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో (ఏప్రిల్ 18, ఏప్రిల్ 23) పోలింగ్ జరగనుండగా.. ఇరు పక్షాల నేతలు తమదైన వ్యూహాల అమలుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ తొలిసారి కాంగ్రెస్ –జేడీఎస్ రూపంలో గట్టి సవాలు ఎదుర్కొంటుండగా, అధికార కూటమిలోని లుకలుకలు, ఇరు పార్టీల్లోని అసమ్మతి తమకు మేలు చేస్తుందన్న ఆంచానాలో కమలనాథులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో జట్టుకట్టి విపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచినప్పటికీ తదనంతర పరిణామాలు కాంగ్రెస్‌కు మేలు చేసేవిగా లేవు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ– బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో బీజేపీ కర్ణాటకపై మరింత ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా యూపీలో నష్టమేదైనా జరిగినా తట్టుకోవచ్చునన్నది వారి ఆలోచనగా ఉంది. ఈ కారణంగానే కర్ణాటకలో అటు కాంగ్రెస్, ఇటు దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌కు చెక్ పెట్టేందుకు అందరినీ కలుపుకుపోయేలా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని బీజేపీ నేత ఒకరు చెబుతున్నారు. దక్షిణ కర్ణాటక జిల్లాలతో పాటు, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లోనూ బీజేపీ తన ఓటుబ్యాంకును పదిలం చేసుకునేందుకు కాంగ్రెస్ –జేడీఎస్ పొత్తు ఉపకరిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎత్తులు..పై ఎత్తులు 2004 నుంచి కర్ణాటక రాజకీయ చరిత్రను ఒక్కసారి చూస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే ఆధిపత్యమన్న విషయం స్పష్టమవుతుంది. 2004 ఎన్నికల్లో 28 స్థానాలకు 17 గెలుచుకోగా, 2009లో 18 స్థానాల్లో గెలుపొందింది. 2014లోనూ 17 స్థానాల్లో కాషాయ దళం విజేతగా నిలిచింది. కాంగ్రెస్‌కు తొమ్మిది, జేడీఎస్‌కు రెండు స్థానాలే దక్కాయి. ఇంకోలా చెప్పాలంటే 1999లో కాంగ్రెస్ అత్యధికంగా 18 స్థానాలు సాధించిన తరువాత రాష్ట్రంలో రాజకీయపరమైన మార్పు మొదలైందని చెప్పాలి. లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ బలం పుంజుకోవడం మొదలైందన్నమాట. రాష్ట్ర జనాభాలో 19 శాతమున్న లింగాయతులు, వొక్కళిగ (గౌడ)లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. రామకృష్ణ హెగ్డే శకంలో.. కర్ణాటకలో కాంగ్రెస్‌కు దీటుగా ఒక రాజకీయ వ్యవస్థ ఎదగడం మొదలైంది. బీఎస్ యడ్యూరప్ప వయసిప్పుడు 75పై మాటే. అయినా సరే.. బీజేపీ ఆ వయసు వారికి టిక్కెట్ ఇవ్వరాదన్న నిబంధనలను పక్కన పెట్టి మరీ ఎన్నికలకు వెళుతోంది. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను నేతగా అంగీకరించేందుకు కొందరికి ఇష్టం లేకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వర్గం ఓట్లు రాబట్టుకునేందుకు మరో ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి నాయకుల వలస.. ఆపరేషన్ లోటస్ వంటివి బీజేపీ మరోసారి అధిక స్థానాలు గెలుచకునేందుకు లేదా ఉన్న స్థానాలను నిలబెట్టుకునేందుకు సాయం చేస్తాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి కూడా తమకు పాత మైసూరు, ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి, బాగల్కోట్, బళ్లారి, చిక్కోడి, రాయచూర్, బీదర్ స్థానాల్లో 15కుపైగా సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. ముక్కోణపు పోటీ ఉన్న పక్షంలో మోదీకున్న సానుకూలత తమకు లాభిస్తుం దని, ముంబై సెంట్రల్, హైదరాబాద్, కోస్తా కర్ణాటక ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాల్లో కూటమికి గట్టిపోటీ ఇవ్వగలమని బీజేపీ నేతల అంచనా. వలస నేతలకు సీట్లు.. బీజేపీ.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన ఉమేశ్ జాదవ్ (గుల్బర్గా), ఎ.మంజు (హాసన్)కు టికెట్లు ఇచ్చారు. మరోవైపు బీజేపీ మైనింగ్ వివాదాలున్న బళ్లారిలో గాలి జనార్ధనరెడ్డి సోదరులకు కాక దేవేంద్రప్పకు టిక్కెట్ ఇవ్వడం తెలివైన వ్యూహమనే చెప్పాలి. 2014లో ఈ స్థానాన్ని బి.శ్రీరాములు గెలుచుకున్నా, 2018 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన వి.ఎస్.ఉగ్రప్ప గెలుపొందారు. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కూడా బీజీపీని ఎదుర్కొనేందుకు ఉపక్ర మించింది. మహాగఠ్ బంధన్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ బీజేపీకి పదికంటే తక్కువ స్థానా లు మాత్రమే దక్కేలా చేస్తానని ప్రతినబూనడమే కాక.. తుముకూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకూ పోటీ చేసిన హాసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. కీలకమైన మండ్య స్థానాన్ని ఇంకో మనవడు నిఖిల్ కుమారస్వామికి కేటాయించారు.ఈ రెండుచోట్లా వొక్కళిగల ఓట్లు చీలిపోతాయేమోనని జేడీఎస్ కలవరపడుతోంది. సిద్ధరామయ్య గేమ్.. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ వ్యతిరేకి సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ను బలహీనపరిచేందుకు ‘గేమ్’ ఆడుతున్నారు. మండ్య స్థానం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్న సినీ నటి సుమలతకు పరోక్షంగా మద్దతివ్వడం ఇందుకు నిదర్శనం. దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఓడించడం కోసం బీజేపీ కూడా సుమలతకు పరోక్ష మద్దతునిస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర తుముకూరు నుంచి దేవెగౌడ పోటీ చేస్తుండటంపై ఏమంత సంతృప్తిగా లేరు. యడ్డీ డైరీ కలకలం.. సీఎంగా కొనసాగేందుకు బీజేపీ అధిష్టానానికి రూ.1,800 కోట్లు చెల్లించుకున్నట్లు యడ్యూరప్ప రాసుకున్న డైరీని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఆలోచనలు కరవైనందునే కాంగ్రెస్ తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోం ది. ఆ డైరీ కూడా ఫేక్ అని ఇప్పటికే విచారణలో తేలిందని యడ్యూరప్ప అంటూండటం విశేషం. కాగా, బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కలబుర్గి నుంచి ఓడించే లక్ష్యంతో కీలక నేతలను తమ వైపునకు తిప్పుకుం ది. ఆపరేషన్ కమలలో భాగంగా చించోళి ఎమ్మెల్యే గా ఉన్న ఉమేశ్ జాదవ్‌ను మల్లికార్జున్ ఖర్గేపై పోటీకి నిలబెట్టింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో సీనియర్ నేత అయిన డాక్టర్ ఏబీ మాలక రడ్డీ కూడా బీజేపీ వైపు మళ్లడం అనుకూలించేదే. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, బాబూ రావు చించన్సూర్ రావడం గుల్బర్గా ప్రాంతంలో బీజేపీకి కలిసొచ్చే అంశం. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్న ఈయనకు బీజేపీ సిట్టింగ్ ఎంపీ పి.సి.మోహన్ పోటీనిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తెలియదు. పొత్తులతో నెగ్గుకు రావాలన్నది కాంగ్రెస్ –జేడీఎస్ కూట మి వ్యూహమైతే.. మోదీ హవా.. చౌకీదార్ ప్రచారంతో పొత్తులను చిత్తు చేయాలని బీజేపీ తలపోస్తోంది. మొత్తమ్మీద కర్ణాటక ఎన్నిక లు మోదీ, రాహుల్‌కు పరీ క్షగా మారాయనడంలో సందేహం లేదు. యడ్యూరప్ప భవితను తేల్చేది కూడా ఈ ఎన్నికలే!! - ఎలక్షన్ వాచ్ కెస్తూర్ వాసుకి, జర్నలిస్టు -
బీజేపీ కులం కార్డు
ఎంత సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీ అయినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కుల సమీకరణాలకు తలొగ్గక తప్పదని బీజేపీ నిరూపించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ (ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమికి దీటుగా నిలిచేందుకు చివరి నిమిషంలో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. కుల సమీకరణాలతో లబ్ధి పొందే ఎలాంటి అవకాశాన్ని విపక్ష కూటమి ఇవ్వకుండా ఉండేందుకే బీజేపీ ఈ మార్పులు చేసింది. అభ్యర్థులను మార్చిన ఆరు నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వుడు నియోజకవర్గాలే. ఆగ్రాలో మొదట కేంద్ర మాజీ మంత్రి రాంశంకర్ కతేరియాను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో రాష్ట్ర మంత్రి ఎస్పి సింగ్ బఘేల్‌ను ఎంపిక చేశారు. షాజహాన్పూర్లో సిట్టింగ్ ఎంపీ కృష్ణ రాజ్ బదులు అరుణ్ సాగర్‌ను నిలబెట్టారు. ఇక, బదాన్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిగా ధర్మేంద్ర యాదవ్ బరిలో ఉన్నారు. ఆయనపై పోటీకి బీజేపీ సంఘమిత్ర మౌర్యను దింపింది. సంఘమిత్ర తండ్రి స్వామి ప్రసాద్ మౌర్య బీఎస్పీ అధినేత మాయావతికి నమ్మిన బంటు. ఆయన కూతురును పోటీకి పెట్టడం ద్వారా నియోజకవర్గంలో యాదవేతర ఓట్లను రాబట్టుకోవచ్చని కమలనాథుల ఆశ. హర్దోయి, మిస్రిక్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ ఆ ఇద్దరినీ కూడా మార్చింది. -
అజ్ఞాతవాసా.. అజాతశత్రువా.. మీకు ఎవరు కావాలి?
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం : కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్(సీపీఎఫ్) గుర్తుందా.. అదేనండి 2008లో చిరంజీవి కుమార్తె వివాహ సమయంలో పవన్‌కల్యాణ్ ఆవేశపడి తన లైసెన్స్ రివాల్వర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి సీపీఎఫ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారే.. ఆ సీపీఎప్ఫేనండీ..సదరు సీపీఎఫ్ పేరిట తక్షణమే రూ. 2 కోట్లు డిపాజిట్ చేస్తున్నామనీ.. ఎవరు కష్టంలో ఉన్నా నైతికంగా. ఆర్థికంగా ఆదుకుంటామని తనకు కొట్టిన పిండి అయిన సినిమా డైలాగులు పేల్చారు.పాపం.. ఆ డైలాగులను నమ్మేసిన చాలామంది తమ గోడు చెప్పుకుందామని వెళ్తే.. కనీసం దర్శనభాగ్యం కూడా కల్పించలేదు.అంతెందుకు.. అప్పట్లో రాజకీయ ప్రముఖుడు కె.కేశవరావు కుటుంబంతో తనకు ప్రాణహాని ఉందని.. మీలాంటి పెద్దలు అండగా నిలవాలని ఓ మహిళ ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఆమె బహిరంగంగానే సీపీఎఫ్పై విమర్శలు గుప్పించారు.కట్ చేస్తే.. అసలు ఆ సీపీఎఫ్ ఏమైంది.. దాని కార్యకలాపాలు సాగుతున్నాయా..?! ఈ ప్రశ్నకు బహుశా పవన్ వీరాభిమానులు కూడా చెప్పలేరేమో.. అసలు అటువంటిదొకటి ఉందన్న విషయం వారికి తెలియకపోయినా ఆశ్చర్యం లేదు.ఒకవేళ తెలిసినవారెవరైనా ఉంటే.. అప్పటి పీఆర్పీలోనో.. ఇప్పటి జనసేనలోనో విలీనం చేసేశారని చెబుతారు.ఇక పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ రైలింజన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.2014 ఎన్నికలకు వచ్చేసరికి.. మనసు మార్చుకొని బాబుతో మిలాఖత్ అయ్యారు. టీడీపీ గుర్తు సైకిల్‌కు ఓటెయ్యాలని ఊరూవాడా తిరిగి ప్రచారం చేశారు.2019.. మళ్లీ ఎన్నికలొచ్చాయి.. బాబుకు కటీఫ్ చెప్పారు. నేరుగా పోటీ చేస్తున్నామంటూ గ్లాసుకు వేయాలని కోరుతున్నారు..ఇలా మూడు ఎన్నికల్లో మూడు గుర్తులు మార్చి.. ఓటర్లను ఏమార్చడంతోపాటు ఎన్నికల తర్వాత కనిపించకుండా పోయిన అజ్ఞాతవాసి ఇప్పుడు ఊరు కాని ఊరు గాజువాక నుంచి పోటీ అంటూ వచ్చారు. ఎన్నికల తర్వాత కన్పించని ఆ అజ్ఞాతవాసి కావాలా.. గాజువాకలోనే పుట్టి పెరిగి అందరితో పెద్దమనిషి అనిపించుకుంటున్న అజాతశత్రువు తిప్పల నాగిరెడ్డి కావాలా?.. ఒక్కసారి పరిశీలిద్దాం రండి. – గరికిపాటి ఉమాకాంత్ నిలకడలేమికి చిరునామా - పవన్‌కల్యాణ్, జనసేన అభ్యర్ధి, గాజువాక ⇔ అసలు గాజువాకతో ఏం సంబంధం. ⇔ నాకు కులమతాలే లేవని బీరాలు పలికి ఇక్కడికెందుకొచ్చినట్టు.. ⇔ పక్కపక్కనే ఉన్న ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ⇔ భీమవరం, గాజువాక.. రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నట్టు? ⇔ భీమవరంపై నమ్మకం లేకనా..? ⇔ సొంత జిల్లా, సొంత నియోజకవర్గం పాలకొల్లులో ⇔ ఏకంగా చిరంజీవికే పరాజయం చూపించిన ‘లెక్క’ భయపెట్టిందా... ⇔ మరి గాజువాక ప్రజలు అంత అమాయకంగా కనిపించారా.. ⇔ ఒకవేళ పొరపాటునో, గ్రహపాటునో రెండింటిలో గెలిస్తే ఏ సెగ్మెంట్ వదిలేస్తారు ⇔ కచ్చితంగా గాజువాకే.. అనుమానం ఏమైనా ఉందా?.. ⇔ పురిటిగడ్డ, సొంత జిల్లా అని సెంటిమెంట్ కబుర్లు చెప్పి ⇔ భీమవరంలోనే బిచాణా వేయడం తథ్యం. ⇔ ఒకవేళ అక్కడ ఓడి ఇక్కడ గెలిస్తే గాజువాకను ఏం చేస్తారు.. ⇔ రూ.కోట్లు ఖర్చు చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకే సహకరించకుండా ఏడిపించిన చరిత్ర ఆయనది? ⇔ అలాంటిది ఓటేసిన ప్రజలకేం చేస్తారు? ⇔ పోనీ గెలిచినా.. ఓడినా గాజువాకలోనే ఉంటానని మాట ఇస్తారా.. ⇔ ఆ మాటపై నిలబడతారా.. ఏమాత్రం నిలకడ లేని మనస్తత్వం ఉన్న ఆయన్ను నమ్మేదెలా? ⇔ పీఆర్పీ నుంచీ ఆ కుటుంబాన్నే నమ్ముకుని ఉన్న చింతలపూడి వెంకట్రామయ్యను ⇔ తన పోటీ కోసం గాజువాక నుంచి పెందుర్తికి తరిమేయడం సబబేనా? ⇔ వర్గ దృష్టిలో ’సేఫ్ సెగ్మెంట్’ కోసం నమ్మినోళ్లను కూడా బలి చేసేస్తారా.. నిత్యం ప్రజలతోనే.. తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి ⇔ 66 ఏళ్ళ నాగిరెడ్డి వయసురీత్యానే కాదు.. స్థానికులకు మేలు చేసే పెద్ద మనిషిగా పేరుగడించారు. ⇔ రైతు కుటుంబానికి చెందిన ఆయన గాజువాక నియోజకవర్గం పెదగంట్యాడ వెంకన్నపాలెం గ్రామంలోనే పుట్టి పెరిగారు. ⇔ అప్పట్లో ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. ఈ ప్రాంతంలోనే పెరిగి పెద్దయ్యారు. ⇔ గ్రామ పరిపాలనాధికారిగా, గ్రామ కార్యదర్శిగా మూడు దశాబ్దాలకుపైగా పని చేసి ప్రజలకు సేవలందించారు. ⇔ మొదటి నుంచి కాంగ్రెస్‌లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరుడిగా పేరొందారు. ⇔ 2007 జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇలా గెలిచిన పదిమంది స్వతంత్రులకు నాయకత్వం వహించారు. ⇔ నాడు వైఎస్ కోరిక మేరకు కాంగ్రెస్‌కు మద్దతిచ్చి జీవీఎంసీ మేయర్ పదవిని కాంగ్రెస్ పరం చేశారు. ⇔ 2009లో గాజువాక నుంచి శాసనసభకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ⇔ 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ⇔ ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ జెండా పట్టుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. ⇔ స్థానిక టీడీపీ నేతల అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేశారు. ⇔ జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని భరోసా ఇచ్చారు. ⇔ 2019లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిగానే బరిలో నిలిచారు. ⇔ గెలిచినా ఓడినా నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న చరిత్ర నాగిరెడ్డిది. ⇔ ఓడినప్పటికీ ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించిన ⇔ నాగిరెడ్డిని గెలిపిస్తే గాజువాక ఏరీతిన అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం -
‘పవర్’ గేమర్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. ఈయన పేరు వినగానే రాజకీయాలతో పాటు, క్రికెట్ ఆట కూడా కళ్లెదుట మెదులుతుంది. క్రికెట్లో రాజకీయాలు చేసినా, రాజకీయాలను ఓ ఆటాడుకున్నా ఆయనకే చెల్లింది. క్రీడలంటే పవార్‌కి ఆరో ప్రాణం. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, రెజ్లింగ్, ఫుట్‌బాల్.. ఇలా ఎన్నో క్రీడా సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. ముంబై క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐ సారథ్యంతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. అటు రాజకీయ క్రీడలోనూ ఆరితేరారు. అంశమేదైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఒకప్పుడు ప్రధాని కావాలని కలగన్నారు. కానీ ఇప్పుడు వయో భారంతో ఆ ఆశ వదులుకున్నారు. సిద్ధాంతాలకు, భావజాలాలకు, ప్రాంతీయవాదాలకు అతీతంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా పవార్‌కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అదే ఆయన అసలు సిసలైన పవర్. చక్కెర రైతుల్లో పవార్‌కున్న అంతులేని ఆదరణ ఆయన రాజకీయ జీవితంలో ఎప్పటికీ తీపి గురుతుగా మిగిలిపోతుంది. శరద్ పవార్ రాజకీయ గురువు వైబీ చవాన్. ఆయన సలహా సూచనలు పాటిస్తూ 1978లో, అత్యంత పిన్న వయసులో (37) మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. నోటి కేన్సర్‌ను కూడా జయించి విజేతగా నిలిచారు. ♦ మహారాష్ట్రలోని పుణే జిల్లా బారామతిలో 1940, డిసెంబర్ 12న శరద్ పవార్ జన్మించారు. ♦ పుణేలో బృహన్ మహారాష్ట్ర కాలేజీ ఆఫ్ కామర్స్‌లో చదివారు. చదువుల్లో పెద్దగా రాణించలేదు. సాదాసీదా విద్యార్థిగానే ఉన్నారు. ♦ విద్యార్థి దశలో ఉండగానే రాజకీయాల వైపు మళ్లి కొత్త పంథాలో వ్యూహాలు రచించారు. ♦ 1967లో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ♦ 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి జనతా పార్టీతో కలిసి సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేశారు. ♦ 1983లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్టు) పార్టీ పగ్గాలు చేపట్టారు. ♦ 1984లో బారామతి నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ♦ 1985లో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ♦ 1987లో శివసేన హవాను అడ్డుకోవడానికి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ♦ ఆ తర్వాత కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు పని చేశారు. ♦ 1991లో పీవీ నరసింహారావు హయాంలో రక్షణ మంత్రిగా సత్తా చాటారు ♦ 1993 ముంబైలో అల్లర్ల అదుపునకు పీవీ.. మహారాష్ట్ర సీఎంగా పవార్‌నే పంపించారు. అదే సీఎం పదవిలో ఉండటం పవార్‌కు చివరిసారి. ♦ 1999లో కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ అధ్యక్షురాలు కావడంతో ఆమె విదేశీ మూలాల్ని ధైర్యంగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ని వీడి పీఏ సంగ్మాతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ♦ 2004లో యూపీఏ హయాంలో తిరిగి సోనియాకు దగ్గరై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవిని పొందారు. ♦ శరాద్ పవార్ మంచి రచయిత, వ్యాపారవేత్త, వ్యవసాయవేత్త. అధ్యయనాలపై ఆయనకు అమితమైన ఆసక్తి. ♦ అత్యంత ధనికుడైన రాజకీయవేత్త. ప్రపంచం నలుమూలలా లక్షలాది ఎకరాల భూమి ఆయన సొంతం. ♦ ఎన్నో అవినీతి కేసుల్లో ఆరోపణలు, అండర్ వరల్డ్ మాఫియాతో లింక్‌లు, నకిలీ స్టాంపు కుంభకోణం, గోధుమ ఎగుమతులు, తప్పుడుగా ఆస్తుల్ని చూపించారన్న ఆరోపణలు, క్రికెట్‌కు రాజకీయ రంగు పులమడం వంటివి పవార్ రాజకీయ జీవితానికి ఓ మచ్చలా మారాయి. అయినా పవార్ రాజకీయ ఎదుగుదలకు అవేవీ అడ్డంకి కాలేదు. ♦ బాలీవుడ్ తారలందరికీ పవార్‌తో సత్సంబంధాలున్నాయి. ♦ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు. ఎంపీగా మంచి గుర్తింపును పొందారు. ♦ చిన్నతనంలో చదువుని నిర్లక్ష్యం చేశానన్న బాధతో ఎన్నో విద్యాసంస్థలు స్థాపించారు. అందులో పుణేలో శరద్ పవార్ ఇంటర్నేషనల్ స్కూలు, శరద్ పవార్ పబ్లిక్ స్కూలు ప్రముఖమైనవి. -
రాజకీయాల్లో బ్రహ్మచారులు.. ఒంటరి వారు..
భారత్‌లో బంధాలకు విలువెక్కువ. మన కుటుంబ వ్యవస్థ ఇతర దేశాలకుఆదర్శం. ఏడాదికి కోటి పెళ్లిళ్లు జరుగుతాయి. పిల్లాజెల్లా కష్టాలు కన్నీళ్లు ఉంటేనే జీవితం సంపూర్ణమైనట్టు లెక్క. కానీ రాజకీయాలకు వచ్చేసరికిసీన్ రివర్స్. ఇక్కడ సోలో లైఫే సో బెటరేమో..?! అటువంటి వారే ప్రజాసేవకి జీవితాన్ని అంకితం చేస్తారన్న భావన పెరుగుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసే వాళ్లంతా ఒంటరి పక్షులే. పెళ్లి చేసుకోని వారు కొందరు.. పెళ్లయి ఒంటరిగా ఉన్నవారు ఇంకొందరు.. భార్య లేదంటే భర్తని కోల్పోయిన ఒంటరి జీవితం గడుపుతున్న వారు మరికొందరు.. దేశం దశ దిశ ఇప్పుడు వీళ్ల చేతుల్లోనే ఉన్నాయి. 1980 దశకంలో అతి పెద్ద రాష్ట్రాలను పాలించిన వాళ్లంతా కుటుంబ జీవితం గడిపినవారే. కానీ గత ఏడాదికి వచ్చేసరికి పెళ్లి కాని వారే సీఎంలుగా పరిపాలిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరికొందరు మాజీ ముఖ్యమంత్రులు ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. ఈసారి ఎన్నికలు ఎన్డీయే, యూపీఏ మధ్య ముఖాముఖీ జరుగుతున్నాయి. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని చేపట్టేది మోదీయే. ఆయనకు పెళ్లయినా చాలా ఏళ్లుగా సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక యూపీఏ విషయానికొస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇక ప్రధానమంత్రి రేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ముందున్నారు. వీళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకోకుండా ప్రజా జీవితానికే అంకితమైనవారే. ఒకప్పుడు ప్రధాని కావాలని కలలు కన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భార్య గత ఏడాదే మరణించడంతో ప్రస్తుతం ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. నితీశ్‌కి నిన్నమొన్నటి వరకు కుటుంబం ఉన్నా ఆయన ఎప్పుడూ వారి గురించి ప్రస్తావించలేదు. అవినీతి రొంపిలో కూరుకుపోయిన బిహార్‌ని మార్చడానికి ఎనలేని కృషి చేసి నీతి, నిజాయితీ ఉన్న నాయకుడిగా పేరు సంపాదించారు. సింగిలే సుప్రీం? ఇప్పుడు రాజకీయాలంటే డబ్బు, బంధుగణం చుట్టూ తిరుగుతున్నాయి. రాజు కన్నా రాజు గారి బావమరిది ఎక్కువ పవర్ఫుల్ అన్నట్టు అధికారంలో ఎవరున్నా వారి బంధువులే చక్రం తిప్పుతుంటారు. అదే సింగిల్ పొలిటీషియన్లయితే ఆ బాదరబందీ ఉండదు. ముందూ వెనుకా ఎవరూ ఉండరు కాబట్టి అవినీతి, బంధుప్రీతికి స్థానం ఉండదు. కుటుంబ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పనిలేదు. ప్రజా జీవితానికే ఉన్న సమయమంతా వినియోగించవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ‘సింగిలే సుప్రీం’ అనే నినాదం ఊపందుకుంది. ఈసారి ప్రధాని రేసులో ఉన్నవారిలో మోదీ, రాహుల్, మమత, మాయ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో సింగిల్‌గా ఉన్నవారే సుప్రీం అని జై కొట్టించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆరెస్సెస్ ప్రచారక్లంతా బ్రహ్మచారులే రాజకీయాలలో ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్న వారిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలున్న వారే ఎక్కువ కనిపిస్తారు. ఆరెస్సెస్ ప్రచారక్‌లలో ఎక్కువ మంది బ్రహ్మచారులే. అలా కుటుంబ బంధాలు లేకుండా జీవనం సాగించడం ఆషామాషీ కాదు. కొందరైతే జీవితాంతం పెళ్లి చేసుకోబోమని ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. ఇలా ఒంటరిగా గడపడం ఎలా సాధ్యమవుతుందని ఆర్ఎస్ఎస్ అధికార ప్రతినిధి ఎంజీ వైద్యని ప్రశ్నిస్తే, ప్రజాసేవపై చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని, అందుకు తామే నిదర్శనమని ఆయన చిరునవ్వుతో బదులిస్తారు. మాయావతి: కార్యకర్తల ‘హీరో’ దళిత నాయకుడు కాన్షీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీని ఆయన మరణానంతరం చేతుల్లోకి తీసుకున్న మాయావతి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఈమె ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే 38 డిగ్రీల ఎండలోనూ గంటల తరబడి అభిమానులు నిల్చుంటారు. 2017 ఎన్నికల్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు జౌనాపూర్లో ఏకంగా 50 వేల మంది ఆమె కోసం ఎదురు చూశారంటే జనంలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుస్తుంది. ఒంటరి మహిళే అయినా.. కార్యకర్తలు ఆమెను అభిమానంగా ‘మా హీరో వస్తోంది’ అని పిలుస్తారు. మమత: సాదాసీదా దీదీ పెళ్లి చేసుకోకుండా ప్రజాక్షేత్రంలోనే అత్యధిక సమయాన్ని వెచ్చించే మమత అంటే పశ్చిమబెంగాల్ ప్రజల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే శారదా చిట్‌ఫండ్స్ వంటి ఎన్ని ఆరోపణలొచ్చినా జనం ఆమెనే నమ్ముతుంటారు. తెల్ల చీర కట్టుకొని సాదాసీదాగా కనిపిస్తూ ముందూ వెనుకా ఎవరూ లేని మమతకు అవినీతి చేయాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు బెంగాల్ వీధుల్లో వినిపిస్తుంటాయి. తాను రాసిన 65 పుస్తకాలపై వచ్చే రాయల్టీలపై జీవనం సాగిస్తానని ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా తీసుకోనని, టీ తాగినా తన సొంత పైసలే ఖర్చు చేస్తానని మమత చెప్పుకుంటారు. జయలలిత: ‘పోయెస్’ గార్డెన్లో ఒంటరి రాణి తమిళ రాజకీయాల్లో జయలలితది ఒక చరిత్ర. రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించారు. సంక్షేమానికి మారుపేరయ్యారు. సినీ రంగం నుంచి వచ్చినా, ఒంటరి మహిళ అయినప్పటికీ ఆమె బలహీనంగా ఎన్నడూ కనిపించలేదు. ఆధిపత్య ధోరణితో కరుణానిధితో ఢీ అంటే ఢీ అన్నారు. మంత్రులూ ఆమె కాళ్లపై సాష్టాంగ పడేవారు. 2014 ఎన్నికల్లో కూడా ‘మోదీ వర్సెస్ లేడీ’ ప్రచారంతో మోదీ హవాను అడ్డుకున్న సమర్థురాలు. జయలలిత ప్రభావం ఎంతంటే ఆమెలాగే ఒంటరిగా ఉంటూ అద్భుతాలు చేయాలని ఎందరో మహిళలు కలలుకన్నారు. మోదీ అందరివాడిని.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోదీది ఒంటరి జీవితమే. ఆయన ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్నే ఎక్కువ ప్రస్తావిస్తుంటారు. 2012 గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ మాటే మంత్రంగా మారింది. ‘ప్రజాధనం నా చేతుల్లో ఉంటే చాలా భద్రంగా కాపాడతాను. నాకు కొడుకులు, కూతుళ్లు లేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. నా కుటుంబం మీరే. గుజరాత్‌లోని ఆరు కోట్ల జనాభాయే నా కుటుంబం‘ అంటూ జనంలో భావోద్వేగాన్ని రేపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి, భారతావని యావత్తూ తన కుటుంబమే అంటూ ప్రసంగించి, జనం నమో మంత్రంతో ఊగిపోయేలా చేశారు. ‘సింగిల్’ సీఎంలు వీరే హరియాణా మనోహర్ లాల్ ఖట్టార్ అసోం శర్వానంద సోనోవాల్ యూపీ యోగి ఆదిత్యనాథ్ ఒడిశా నవీన్ పట్నాయక్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ బిహార్ నితీశ్ కుమార్ -
గద్దెనెక్కించేది వృద్ధ ఓటరే!
ఈ ఎన్నికల్లో కోటీ యాభై లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ యువ ఓటర్ల సంఖ్య గణనీ యంగా పెరిగిందని, చాలా నియోజకవర్గాల్లో వారే నిర్ణయాత్మక శక్తిగా ఆవిర్భవించనున్నారనేది ఎన్నికల పండితుల మాట. పంజాబ్‌లో మాత్రం ఈ సీన్ రివర్స్ అయింది. అక్కడ వృద్ధ ఓటర్లే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. పంజాబ్‌లో 60 ఏళ్లు పైబడిన ఓటర్లు 30 లక్షల మంది ఉన్నారు. వీరుకాక మరో 5,916 మంది వందేళ్లు దాటిన వారున్నారు. చండీగఢ్ ఓటర్లలో ఈసారి సీనియర్ సిటిజన్లు 36 శాతం పెరిగారని, యువ ఓటర్లు 33 శాతమే పెరిగారని ఎన్నికల సంఘం చెబుతోంది. రెండో, మూడో తరం వాళ్లంతా ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో మొదటి తరం వాళ్లే ఇక్కడ మిగిలారని, అందుకే ఓటర్ల జాబితాలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని అక్కడి బీజేపీ సీనియర్ నేత వినీత్‌జోషి చెప్పారు. చండీగఢ్‌తో పాటు హోషియార్పూర్, జలంధర్, నవాన్షార్, కర్తార్‌పూర్ జిల్లాలో కూడా వృద్ధులే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. సీనియర్ సిటిజన్లతో పాటు ప్రవాస భారతీయులూ ఇక్కడి ఎన్నికలను ప్రభావితం చేయగలరని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. -
యువ ఓటర్లు– వృద్ధ నేతలు
ఎన్నికల వేడి దేశవ్యాప్తంగా రాజుకుంటోంది. మళ్లీ కమలం వికసిస్తుందా?. హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా?. మూడో కూటమే చక్రం తిప్పుతుందా?.. ఇప్పడు అందరిలోనూ ఇదే ఆసక్తి. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకులు ప్రణయ్‌రాయ్, దొరాబ్ ఆర్ సుపారివాలా సంయుక్తంగా రాసిన ది వెర్డిక్ట్ అనే పుస్తకం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ పుస్తకంలో 2019 ఎన్నికల్లో కొత్త పోకడలు ఎలా ఉన్నాయి? ఓటర్ల ప్రాథమ్యాలు ఎలా మారుతున్నాయి? అనే అంశాలను ద వర్డిక్ట్ పుస్తకంలో విశ్లేషించారు. ఆ బుక్‌లో ఏముందంటే.. యువ ఓటర్లు– వృద్ధ నేతలు 2019 ఎన్నికల్లో నేతలకీ, ఓటర్లకీ మధ్య వయసు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఓటర్లలో 18–40 ఏళ్ల మధ్య వయసున్న వారు 59 శాతం ఉంటే, ఎంపీలలో 25–40 ఏళ్ల మధ్య వయసు వారు 15 శాతం ఉన్నారు. అంటే 85 శాతం మంది నేతలకు, ఓటర్లకు మధ్య జనరేషన్ గ్యాప్ కనిపిస్తోంది. ఇది ఈసారి ఎన్నికల్లో నయా ట్రెండ్. ఫలితాల్లో ఉత్కంఠ ఓట్ల లెక్కింపు రోజు నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్‌కి లీడ్స్‌లో వచ్చే మార్పులు అభ్యర్థులను, ప్రజలను కుర్చీ చివరకు చేరుస్తాయి. సాధారణంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొదటి గంట కౌంటింగ్‌లో లీడింగ్‌లో ఉన్న పార్టీయే గద్దెనెక్కే అవకాశాలెక్కువ. మొదట్లో లీడింగ్‌లో ఉన్న పార్టీ చివరికి వచ్చేసరికి అంతకంటే 40 నుంచి 45 సీట్లు ఎక్కువగా గెలుచుకునే అవకాశాలుంటాయి. ఇదే ఇంకో రకంగా చెప్పాలంటే వెనుకబడిన పార్టీలు చివరికి వచ్చేసరికి 40–45 సీట్లను కోల్పోవచ్చన్న మాట. ఈసారి ఎన్నికల్లోనూ ఇది కనిపించనుంది. ఫిఫ్టీ.. ఫిఫ్టీ చాన్స్ సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ఓటర్లలో వ్యతిరేకత ఉంటుందని ఎక్కువ మంది విశ్వాసం. 1977–2002 మధ్య కాలంలో వివిధ రాష్టాల్లో 70 శాతం ప్రభుత్వాలకి ఓటర్ల అసంతృప్తి సెగ తాకి పాలకులు గద్దె దిగాల్సి వచ్చింది. కానీ గత 20 ఏళ్లలో ఓటర్లు పరిణతి చెందారు. సమర్థంగా పనిచేసే ప్రభుత్వానికి మరో చాన్స్ ఇవ్వడానికి సందేహించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేకత యుగం భారత్‌లో ముగిసినట్టే!. భారత్ నెమ్మది నెమ్మదిగా 50:50 యుగం వైపు వెళ్తోంది. అందుకే ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఫిఫ్టీ–ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయని ప్రణయ్‌రాయ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. స్వతంత్రులేరీ? ఈ మధ్య కాలంలో ఓటరు మనోగతంలో వచ్చిన మరో ప్రధాన మార్పు స్వతంత్ర అభ్యర్థుల్ని వారు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు 13 శాతం మంది ఓటర్లు స్వతంత్రులకు ఓటు వేసే పరిస్థితి ఉంటే ఇప్పుడు కేవలం 4శాతం మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల హవా దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతోంది. తొలి తరం ఎన్నికల్లో 35 సీట్లకే మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఇప్పుడు ఏకంగా 162 సీట్లకి చేరింది. ప్రాంతీయ పార్టీ సీట్లే కాదు ఓట్ల శాతమూ గణనీయంగా పెరుగుతోంది. తొలినాళ్లలో 4 శాతం ఓట్లు సాధించిన ప్రాంతీయ పార్టీల ఓట్లు ప్రస్తుతం 34 శాతంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్ని కేవలం మోదీ వర్సస్ రాహుల్‌గా చూడలేని పరిస్థితి. చాలా రాష్ట్రాల్లో అక్కడున్న బలమైన నేతల ప్రభావం కచ్చితంగా ఉండనుంది. మహిళ చేతిలోనే తీర్పు! మహిళల్లో ఓటరు చైతన్యం వెల్లివిరుస్తోం ది. కానీ వాళ్లు ఎవరికి ఓటేస్తారన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే. సంప్రదాయంగా బీజేపీ వైపు పురుషుల కంటే మహిళలే మొగ్గు ఎక్కువ చూపిస్తూ వచ్చారు. ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ మోదీ ఇమేజ్ను పెంచింది. ఈసారి దేశవ్యాప్తంగా ఓట్ల గల్లంతు కూడా కీలకాంశమే. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది మహిళల పేర్లు ఓటర్ల జాబితా నుంచి గల్లంతయ్యాయి. అంటే ఒక్కో సెగ్మెంట్ నుంచి సగటున 39 వేల మంది మహిళా ఓటర్లు ఓటుహక్కును కోల్పోయారన్నమాట. విపక్షాల ఐక్యతతో గెలిచినవెన్ని.. ఎన్నికల్లో విజయానికి అర్థాలు మారిపోతున్నాయి. ఒకప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు, కూటములు అంతగా లేవు. జనంలో ఆదరణ ఉన్న పార్టీనే అందలం ఎక్కించేవారు. 1952–2002 మధ్య గణాంకాలు పరిశీలిస్తే అధికార పార్టీకి రెండింట మూడో వంతు సీట్లు జనాదరణతో పడితే, మరో మూడింట ఒకటో వంతు ఓట్లు విపక్షాల్లో చీలికల వల్ల వచ్చేవి. జాతీయ పార్టీలను అడ్డుకోవడానికి ఇటీవల వివిధ పార్టీలు చేతులు కలుపుతున్నాయి. విపక్షల ఐక్యత కారణంగా లోక్‌సభలో వారి సీట్ల శాతం పెరుగుతోంది. గత మూడు ఎన్నికల ఫలితాల్ని పరిశీలిస్తే 45 శాతం సీట్లు విపక్షాల ఐక్యతతోనే పెరిగాయి. ఈసారీ పొత్తులే జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయి. -ప్రణయ్‌రాయ్, ఎన్నికలవిశ్లేషకులు -దొరాబ్ ఆర్ సుపారివాలా, ఎన్నికల విశ్లేషకులు -
ఒకటీ, రెండూ, మూడూ, నాలుగూ..
సాక్షి ప్రతినిధి, వరంగల్: 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు ‘కమలా’నికి కలిసొచ్చాయి. ఆ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు సీట్లను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ అంతకు ముందు.. ఆ తర్వాత ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది. 1984లో జరిగిన ఎన్నికల్లో హన్మకొండ నుంచి చందుపట్ల జంగారెడ్డి ఎంపీగా బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనే భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బీజేపీ అభ్యర్థి జంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1991లో సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ ఎంపీగా గెలుపొందగా, అప్పుడు కూడా బీజేపీ ఒకే స్థానాన్ని గెలుచుకుంది. 1998లో కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించగా, బీజేపీ ఖాతాలో రెండు పార్లమెంట్ స్థానాలు పడ్డాయి. 1999లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి సీహెచ్ విద్యాసాగర్‌రావు, మెదక్ నుంచి ఆలె నరేంద్ర, సికింద్రాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ, మహబూబ్‌నగర్ నుంచి ఏపీ జితేందర్‌రెడ్డి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ‘కమలం’కు కలిసి రాగా.. మొదటి సారిగా తెలంగాణ నుంచి నాలుగు పార్లమెంట్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడ్డాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టిన బీజేపీ సికింద్రాబాద్ స్థానానికే పరిమితమైంది. ఇక్కడ గెలిచిన బండారు దత్తాత్రేయకి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా చోటు లభించింది. -
హస్తం నిస్తేజం
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడని సామెత. మరి కాలం కలిసిరాకపోతే..ఆ ఏముంది.. పరిస్థితి కాంగ్రెస్ పార్టీలా మారిపోతుంది! ఏళ్లుగా తోడున్న మిత్రులు ముఖం చాటేస్తారు! అవసరం కొద్దీ చేయి కలిపిన వాళ్లూ.. పెద్ద పెద్ద అవసరాలు వెతుక్కుని వెళ్లిపోతారు! ఎన్నికల వేళ కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ సరిగ్గా ఇలాగే వ్యవహరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌తో అప్పటివరకూ జరిగిన పొత్తు మాటలను అటకెక్కించి నగరంలోని మొత్తం ఏడు స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించేసింది. సీట్ల సంఖ్యలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, సొంతపార్టీలోనే పొత్తులపై వ్యతిరేకత వ్యక్తమవుతూండటం దీనికి కారణాలని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చుగానీ.. ఇంకో 20 రోజుల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతున్న వేళ 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి ఇదేమంత మంచి సంకేతమైతే కాదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి పెట్టని కోటలా ఉన్న యూపీతోపాటు అనేక కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఒకప్పుడు ఒంటిచేత్తో ఈ రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ఇప్పుడు కనీసం ఇంకొకరి సాయం కూడా దక్కని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ కలసి ప్రతిపాదించిన మహాఘఠ్ బంధన్ ఉనికే సందిగ్ధంలో పడింది. యూపీ, బెంగాల్ తరువాత తాజాగా బిహార్, ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఆధిపత్యం చెలాయించాలని ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ కూడా వెనకంజ వేయడం లేదని, అందుకే ప్రతిష్టంభన ఏర్పడిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్, ఆప్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముందుకొచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఆ తరువాత ఆప్‌తో పొత్తును పునఃపరిశీలించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. పంజాబ్, హరియాణాల్లో సీట్లు కేటాయించాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పట్టుబడుతుండగా, కాంగ్రెస్ అందుకు అంగీకరించడం లేదు. ఇక ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ నాలుగు సీట్ల కోరుతుండగా, మూడుకు మించి కేటాయించేందుకు ఆప్ ఆసక్తి కనబరచడం లేదు. పొత్తులపై డైలమా...? వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలోనే కాంగ్రెస్‌లో కొంత డైలమా ఉం దని తెలుస్తోంది.కొంతమంది పొత్తులతో లాభమంటూండగా.. ఇంకో వర్గం మాత్రం ససేమిరా అంటోంది. రాజకీయాలు మారిపోయిన నేపథ్యం లో పాతకాలపు ఒంటెత్తు పోకడలను పక్కనబెట్టి పరిస్థితులకు తగ్గట్టుగా అందరినీ కలుపుకుపోవాలని ఒక వర్గం సూచిస్తోంది. ఉత్తరప్రదేశ్ విషయాన్నే తీసు కుంటే.. ఇంతకాలం అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడినందున ఒకప్పటి కాంగ్రెస్ బలమైన దళితులు పార్టీకి దూరమయ్యారని.. బీఎస్పీ లాంటి పార్టీలు ఆయా వర్గాల వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న తరుణంలో వారితో పొత్తులు అత్యవసరమని వీరు అంటున్నారు. అగ్రవర్ణ బ్రాహ్మణుల్లో అధికు లు బీజేపీ వైపు.. ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పూర్వపు స్థితికి చేరుకోగలదన్నది వీరి అభిప్రాయం. అయితే.. ప్రాంతీయ పార్టీలకు చోటు కల్పించడం అసలుకే మోసం తెస్తుందని.. కొంత కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ మనుగడకే ముప్పు అన్నది సంప్రదాయ వాదుల వాదన. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించడం ద్వారా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూడాలని వీరు అంటున్నారు. కష్టమైనాసరే.. పార్టీ పునరుజ్జీవానికి ఒంటరిపోరే మేలన్నది వీరి అభిప్రాయం. క్షేత్రస్థాయిలో పార్టీ బలాలను పరిరక్షించుకుంటూనే దీర్ఘకాలపు ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని.. బలీయమైన శక్తిగా ఎదిగేందుకు కృషి చేయాలని వీరు సూచి స్తున్నారు. ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ సీట్లు సంపాదించడం ఇతర పార్టీలతో పొత్తు చర్చలకు బలమిస్తుందని వీరు అంటున్నారు. 2007 నాటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధమైన రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన తరువాత మాత్రం అందుకు భిన్నమైన మార్గంలో వెళుతున్నారని ఆరోపిస్తున్నారు. ఒంటెత్తు పోకడలు కారణమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈమధ్య చేసిన ప్రసంగంలో కేసీఆర్ తన వద్ద పనిచేశాడని, అయినా తాను తగ్గానని మాట్లాడారు గుర్తుందా? ఈ హాస్యాస్పదం వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ పోకడలకూ వర్తిస్తుంది. పెద్దన్న తరహాలో వ్యవహరిస్తుండటాన్ని భాగస్వామ్య పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత డిసెంబర్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ వైఖరి మరింత మారిందన్నది ఎస్పీ, బీఎస్పీ వర్గాల ఆరోపణ. కేవలం ఒక్క సీటు తక్కువ కేటాయిస్తున్నారన్న కారణంగా ఢిల్లీలో ఆప్‌తో పొత్తు కుదుర్చుకోకపోవడం.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్పార్టీలతోనూ గిల్లికజ్జాలకు దిగడం కాంగ్రెస్ వైఖరికి నిదర్శనంగా చెబుతున్నారు. 2004లో చిన్న చిన్న పార్టీలతోనూ సానుకూలంగా వ్యవహరించి పొత్తులు కుదుర్చుకున్న కాంగ్రెస్ ఈ సారి మాత్రం పెడసరంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావడాన్ని ఇష్టపడని చాలామంది కాంగ్రెస్ వైఖరిపై గుర్రుగానే ఉన్నారు. బీజేపీ, మోదీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో విఫలమైందని.. ఈ నిర్లక్ష్యానికి ఫలితం అనుభవించడం ఖాయమని అంటున్నారు. పంతం వీడని ఆర్జేడీ, సీపీఎం.. బిహార్‌లో విశ్వసనీయ భాగస్వామి ఆర్జేడీతోనూ కాంగ్రెస్‌కు తలనొప్పులు తప్పట్లేదు. సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నామని, త్వరలోనే కొలిక్కి వస్తుందని బిహార్ ఏఐసీసీ ఇన్చార్జి శక్తిసింగ్ గోహిల్ చెప్పారు. 11 సీట్లు కేటాయిస్తామని గత బుధవారం ఆర్జేడీ చేసిన ఆఫర్‌కు కాంగ్రెస్ నొచ్చుకున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కు 8 సీట్లకు మించి ఇవ్వలేమని ఆర్జేడీ చెబుతుండటం గమనార్హం. ఇక బెంగాల్ విషయానికి వస్తే కాంగ్రెస్, సీపీఎం కలసి పనిచేస్తాయని భావించినా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సోమవారం రాత్రి చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. బెంగాల్ కాంగ్రెస్ యూనిట్ సలహాతో ఒంటరిగానే పోటీకి రాహుల్ అయిష్టంగానే అంగీకరించినట్లు సమాచారం. తమను సంప్రదించకుండానే సీపీఎం ఏకపక్షంగా వ్యవహరించి 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి మోసం చేసిందని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా ఆరోపించారు. రాష్ట్రంలోని 42 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీచేస్తుందని ఆయన ప్రకటించారు. -
బహుజన హితాయ సర్వజన సుఖాయ
1989 అలహాబాద్ లోక్‌సభ ఉప ఎన్నికలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షుడు కాన్షీరామ్ పోటీ చేయడంతో ఈ పార్టీకి మొదటిసారి విశేష ప్రచారం లభించింది. అప్పటికే దళితులు, బీసీలు, మైనారిటీలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యంతో పాటు వారి ప్రయోజనాలు కాపాడే పార్టీగా జాతీయ స్థాయిలో పరిచయమైంది. మాజీ ప్రధాని వీపీ సింగ్, కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ శాస్త్రిపై పోటీచేసి అలహాబాద్‌లో కాన్షీరామ్ దాదాపు 70 వేల ఓట్లు తెచ్చుకుని సంచలనం సృష్టించారు. సమాజంలో మెజారిటీగా ఉన్న (85 శాతం) వర్గాల అభివృద్ధికి పాటుపడే పార్టీగా బీఎస్పీ స్థాపించిన కొన్నేళ్లకే ఉత్తరాదిలో ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన కులాలను ఆకట్టుకోగలిగింది. పంజాబ్‌లోనే బీజం పంజాబ్ దళిత (చమార్) సిక్కు కుటుంబంలో పుట్టిన కాన్షీరామ్ పుణేలోని రక్షణశాఖ కంపెనీలో పనిచేస్తూనే ఎస్సీ, బీసీ ఉద్యోగులను సమీకరిస్తూ బడుగు వర్గాలను సంఘటితం చేసేవారు. మొదట దళితుల పార్టీగా పేరున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కి మద్దతు పలికారు. ఈ పార్టీ కాంగ్రెస్‌తో చేతులు కలపడంతో విసుగెత్తి కొత్త సంస్థ స్థాపనకు నడుం బిగించారు. ఈ క్రమంలో 1978లో ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఎస్సీ, బీసీ, మైనారిటీ ఉద్యోగుల కోసం బామ్సెఫ్ అనే సంస్థను, 1981లో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్‡్ష సమితి (డీఎస్4) ప్రారంభించి దళిత ఓటర్లను సమీకరించారు. 1984 ఏప్రిల్ 14న (బీఆర్ అంబేడ్కర్ జయంతి) బీఎస్పీని స్థాపించారు. అలహాబాద్ ఉప ఎన్నిక ముందు 1984 ఎన్నికల్లో జాంజిగిర్–చాంపా (ఛత్తీస్‌గఢ్), తర్వాత 1989లో తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీకి ఎక్కువ ఆదరణ లభించడంతో వేగంగా రాష్ట్రమంతటా విస్తరించింది. ఘర్షణపడే దళితులు, బీసీలను ఏకం చేయడంలో యూపీకే చెందిన యువ నాయకురాలు మాయావతి చాలా వరకు విజయం సాధించారు. మూడు సీట్లు.. 2 శాతం ఓట్లు పార్టీ స్థాపించిన ఐదేళ్లకు 1989 లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు బీఎస్పీ సాధించింది. 1990లో సంక్షోభంలో పడిన వీపీ సింగ్ సర్కారుకు బీఎస్పీ మద్దతు ఇవ్వడానికి కాన్షీరామ్ నిరాకరించారు. పదేపదే ఎన్నికలొస్తే తమ పార్టీకి ప్రయోజనకరమని ఆయన ప్రకటించారు. అయితే 1991 లోక్‌సభ, యూపీ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో బీఎస్పీకి పాత సంఖ్యలోనే (3 లోక్‌సభ, 12 అసెంబ్లీ) సీట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గింది. ‘బాబ్రీ’ తర్వాత పెరిగిన బలం బాబ్రీ మసీదు కూల్చివేశాక 1993లో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పెట్టుకున్న పొత్తు బీఎస్పీ బలం పెరగడానికి ఉపకరించింది. బీఎస్పీ 19.6 శాతం ఓట్లతో 67 సీట్లు.. మిత్రపక్షం ఎస్పీ 17.9 శాతం ఓట్లతో 109 సీట్లు కైవసం చేసుకున్నాయి. ములాయం ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణానికి కాంగ్రెస్, జనతాదళ్ బయటి నుంచి మద్దతు ఇచ్చాయి. మాయావతిపై దాడితో మలుపు 1995 మేలో ములాయం సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. ఆ సమయంలో లక్నో గెస్ట్‌హౌస్‌లో ఉన్న మాయావతిపై ఎస్పీ గూండాలు జరిపిన దాడితో రెండు పార్టీలూ 2018 చివరి వరకూ వైరిపక్షాలుగా మారిపోయాయి. ములాయం రాజీనామా చేశాక బీజేపీ మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇలా అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీతో కాన్షీరామ్ చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయించడం సంచలనమే అయింది. తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం, 1996 మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్లీ ఆ పార్టీతోనే చేతులు కలపడం (1997), ఆరు నెలలకు కాషాయ పక్షానికి దూరం కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఇలా మాయావతి రెండుసార్లు సీఎం అయ్యారు. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా మారి శాశ్వతంగా బలహీనమైంది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 98 సీట్లు గెలిచిన బీఎస్పీకి బీజేపీ (88), ఇతర చీలిక వర్గాలు మద్దతు ఇవ్వడంతో మాయావతి మూడోసారి ముఖ్యమంత్రి అయినా ఆరు నెలలకే రాజీనామా చేశారు. ఈ కాలంలోనే బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల నేతలను బీఎస్పీలోకి ఆకర్షించే ప్రయత్నంలో మాయావతి విజయం సాధించారు. 2003లో కాన్షీరామ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మాయావతి పార్టీ జాతీయ అధ్యక్షురాలయ్యారు. మాయావతి కులమైన చమార్లు (జాటవ్‌లు), ఇతర దళితులు, యాదవేతర బీసీలతోపాటు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ప్రజల ఆదరణ లభించడంతో 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తొలిసారి సంపూర్ణ మెజారిటీ లభించింది. దీంతో మాయావతి పూర్తిగా ఐదేళ్లు పదవిలో కొనసాగారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి ఓటమి తప్పలేదు. అప్పటి నుంచి బీఎస్పీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బీఎస్పీ మూడో స్థానానికి (19 సీట్లు) దిగజారింది. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి దాదాపు 20 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటూ గెలవలేదు. బీజేపీ దూకుడుతో భయపడి ఎస్పీ, బీఎస్పీలు తమ ఉనికి కాపాడుకోవడానికి 2018లో మూడు యూపీ లోక్‌సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో చేతులు కలిపాయి. ములాయం స్థానంలో ఆయన కొడుకు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎస్పీ అధ్యక్షుడు కావడం కూడా రెండు పార్టీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకోవడానికి దోహదం చేసింది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఎస్పీ, ఆర్ఎల్డీతో చేతులు కలిపి యూపీలో చేస్తున్న మాయావతి ప్రయోగం బీఎస్పీకి గట్టి పరీక్షే. 35 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి రావచ్చనే సిద్ధాంతంతో బయల్దేరిన బీఎస్పీ ‘బహుజన హితాయ’ నినాదం నుంచి ‘సర్వజన హితాయ సర్వజన సుఖాయ’ అనే కొత్త నినాదంతో అన్ని సామాజిక వర్గాలను ఆకుట్టుకోవాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. లోక్సభలోబీఎస్పీ సీట్లు -
‘రణ’మూల్
పశ్చిమబెంగాల్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌తో 26 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని స్థాపించిన పార్టీయే ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ/టీఎంసీ). బెంగాల్లో ప్రస్తుత పాలకపక్షంగా ఉన్న ఈ పార్టీ 1998 జనవరి 1న ఆవిర్భవించింది. దీదీ, అంతకు ముందు బెంగాల్ ‘అగ్నికన్య’గా పేరు సంపాదించిన మమత పోరాట పటిమ, 34 ఏళ్ల సీపీఎం పాలనకు ముగింపు పలకాలనే పట్టుదలతో స్థాపించిన 13 ఏళ్లకే (2011) తృణమూల్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లుగా తిరుగులేని మెజారిటీతో రాష్ట్రాన్ని పాలిస్తోంది. సీపీఎం మొదటి ముఖ్యమంత్రి జ్యోతిబసు హయాంలో కాంగ్రెస్ నేతగా మార్క్సిస్ట్ సర్కారుపై ఎడతెగని పోరాటం చేశారు. 2000 నవంబర్‌లో జ్యోతిబసు వారసునిగా వచ్చిన సీనియర్ సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో తృణమూల్ కాంగ్రెస్ పదిన్నరేళ్ల కాలం హింసాత్మక ఉద్యమాలతో సంచలనం సృష్టించింది. చివరికి 2011 మే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకుంది. మమత ‘నిరసన నృత్యం’ 1970ల చివర్లో జనతా పార్టీకి స్ఫూర్తిప్రదాత జయప్రకాశ్ నారాయణ్ కారు బానెట్‌పై యూత్ కాంగ్రెస్ నేతగా ఎదుగుతున్న మమత డాన్స్ చేసి మొదటిసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. మధ్య తరగతి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఎం సమరశీల కార్యకర్తల ధాటికి కాంగ్రెస్ కార్యకర్తలు భయపడి పారిపోయే రోజుల్లో ఆమె వారికి ఎదురొడ్డి నిలిచి దెబ్బలు తిన్నారు. జ్యోతిబసు హయాంలో 1991లో వామపక్ష కార్యకర్తల దాడిలో మమత తల పగిలి కుట్లుపడ్డాయి. తృణమూల్ పార్టీ ఆవిర్భావం 1996–98 మధ్య కేంద్రంలో పాలన సాగించిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు లోక్‌సభలో బయటి నుంచి కాంగ్రెస్, సీపీఎం మద్దతు ఇచ్చాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రయోగం కారణంగా బెంగాల్లో సీపీఎంతో కాంగ్రెస్ రాజీపడుతోందని మమత గ్రహించారు. ఈ క్రమంలోనే 1998 జనవరి 1న పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ స్థాపించారు. కొన్ని నెలలకే జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే టీఎంసీకి 7 సీట్లు రాగా, మిత్రపక్షం బీజేపీకి ఒక స్థానం దక్కింది. 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తుపెట్టుకుని పశ్చిమ బెంగాల్లో 8 సీట్లు తృణమూల్ కైవసం చేసుకుంది. వాజ్‌పేయి నాయకత్వంలో ఏర్పడిన మూడో ఎన్డీఏ ప్రభుత్వంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రి అయ్యారు. 2001 వేసవిలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడానికి వీలుగా వాజ్‌పేయి ప్రభుత్వం నుంచి మమత సహా తృణమూల్ మంత్రులు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకు 226 స్థానాలకు పోటీచేసి 60 స్థానాలు టీఎంసీ కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించింది. మళ్లీ 2003 సెప్టెంబర్‌లో తృణమూల్ (మమతా) వాజ్‌పేయి ప్రభుత్వంలో చేరింది. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తృణమూల్ పొత్తుపెట్టుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా బీజేపీతో పాటే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. టీఎంసీకి ఒకే ఒక సీటు దక్కింది. 2006 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. తృణమూల్ బలం 60 నుంచి 30కి పడిపోయింది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 235 సీట్లు సాధించింది. మమత, తృణమూల్ పని ఇక అయిపోయిందనుకున్న ఈ దశలో బుద్ధదేవ్ సర్కారుపై బ్రహ్మాండమైన పోరు సాగించడానికి తృణమూల్‌కు గొప్ప అవకాశం వచ్చింది. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలో సింగూరులో సారవంతమైన వేయి ఎకరాల భూమిని సీపీఎం సర్కారు టాటా మోటార్స్ నానో కారు ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించింది. భూసేకరణను రైతులు వ్యతిరేకించారు. రైతులకు మద్దతుగా మమత కోల్‌కతాలో 25 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత మరో విదేశీ సంస్థకు నందిగ్రామ్‌లో కెమికల్ కాంప్లెక్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం వేలాది ఎకరాల భూమి కేటాయించడమేగాక 70 వేల మంది ప్రజలను ఖాళీ చేయించడానికి ప్రయత్నించింది. ఈ ఉద్యమంతోనూ తృణమూల్ లబ్ధిపొందింది. సింగూర్, నందిగ్రామ్‌తోపాటు భాంగోర్, సాల్బొనీ లాల్‌గఢ్, నయాచార్లో సీపీఎం కార్యకర్తలు, పోలీసుల హింస, అత్యాచారాల ఫలితంగా బుద్ధదేవ్ ప్రభుత్వం, కమ్యూనిస్టులు జనాదరణ కోల్పోయారు. పరిస్థితులు తృణమూల్‌కు అనుకూలంగా మారాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని టీఎంసీ 19 సీట్లు గెలుచుకుంది. అధికార పీఠంపై మమత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని పోటీచేసిన తృణమూల్ సొంతంగానే మెజారిటీ సీట్లు సాధించింది. తృణమూల్ కూటమికి 227 సీట్ల భారీ మెజారిటీ లభించింది. ఒక్క తృణమూల్‌కే 184 స్థానాలు దక్కడంతో మంత్రివర్గంలో ఇతర పార్టీలకు స్థానం కల్పించలేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న మమత లక్ష్యం ఎట్టకేలకు నెరవేరింది. ఐదేళ్ల పాలనలో అనేక ప్రజాహిత కార్యక్రమాలతో తృణమూల్ పలుకుబడి విపరీతంగా పెరిగింది. సీపీఎం సహా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఎంసీలో చేరారు. టీఎంసీని రాజకీయంగా ఎదుర్కొనలేక సీపీఎం, ఇతర వామపక్షాలు చతికిలపడ్డాయి. ముస్లింలు కూడా పాలకపక్షానికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 42 సీట్లలో 34 కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రధాని నరేంద్రమోదీతో ఓ పక్క, కమ్యూనిస్టులతో మరోపక్క పోరాడుతూనే టీఎంసీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లకు పోటీచేసి 211 స్థానాలు కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ లేదా ఎన్డీఏకు 200 లేదా అంతకన్నా తక్కువ సీట్లు వస్తే ప్రధాని అయ్యే అవకాశం వస్తుందనే అంచనాతో మమతా బెనర్జీ ముందుకు సాగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ సీట్లు 1998 - 7 1999 - 8 2004 - 1 2009 - 19 2014 - 34 -
కురువృద్ధ పార్టీ..కుర్రతరం నేత
ఏడాది క్రితం వరకూ బలహీనమవుతూ వచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో విజయానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో అత్యంత కనిష్ట స్థాయిలో 44 లోక్‌సభ సీట్లు సాధించింది. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందడానికి అవసరమైన పది శాతం సీట్లు (55) కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. అప్పటి నుంచి మూడున్నరేళ్ల వరకూ అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కేంద్రంలో పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ, దాని మిత్రపక్షాలకు అత్యధిక రాష్ట్రాల్లో అధికారం అప్పగించింది. 133 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ కిందటేడాది మార్చి నాటికి అధికారంలో ఉన్న రాష్ట్రాలు నాలుగే (కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు పంజాబ్, కర్ణాటక, మిజోరం). బీజేపీ చేతిలో చిత్తు కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియానే ప్రభుత్వంపై పెత్తనం చేస్తున్నారని, మన్మోహన్ బలహీనుడైన ప్రధాని అనే బీజేపీ ప్రచారం జనంలో పనిచేసింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించడం కూడా ఎన్డీఏ ఘన విజయానికి, బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు కైవసం చేసుకోవడానికి దోహదం చేసింది. ఐదేళ్లు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ కొత్త నాయకత్వానికి తోడు, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో యూపీ కాంగ్రెస్ వ్యవహారాలు ఆయన చెల్లెలు ప్రియాంకకు అప్పగించడంతో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సిద్ధమౌతోంది. ప్రతిపక్ష నేతగా ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ హత్యకు గురయ్యాక సోనియా గాంధీ ఏడేళ్లపాటు పార్టీ నాయకత్వ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. అధ్యక్ష పదవిలో ఆరేళ్లు కొనసాగాక ఆమె కాంగ్రెస్‌ను 2004లో విజయ పథంలో నడిపించారు. పార్టీ అధ్యక్ష పదవి దక్కిన ఏడాదిన్నరకు రాహుల్ కాంగ్రెస్‌కు మళ్లీ అధికారంలోకి వచ్చేలా పార్టీని నడిపిస్తారన్న నమ్మకం లేకున్నా మోదీ సర్కారు వైఫల్యాలే బీజేపీని ఓడిస్తాయనే ఆశ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఇతర ప్రతిపక్షాలతో కాంగ్రెస్‌కు పొత్తులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రఫేల్ కుంభకోణం, నిరుద్యోగమే అస్త్రాలుగా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌కు 2019 లోక్‌సభ ఎన్నికలు నిజంగా పెద్ద సవాలే. కొత్తగా జవసత్వాలు గతేడాది డిసెంబర్లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్ల–రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ విజయం సాధించాక 17వ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై ఆశతో ముందుకు సాగుతోంది. కిందటేడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సాధించకపోయినా జనతాదళ్(ఎస్)తో కలిసి సంకీర్ణ భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించడం కాంగ్రెస్‌కు కొత్త ఊపునిచ్చింది. ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అత్యధిక ప్రతిపక్షాల నేతలు హాజరుకావడం కూడా కాంగ్రెస్‌కు ఇతర పార్టీల నుంచి మద్దతు, గుర్తింపు లభించింది. 1998 మార్చిలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియాగాంధీ 2017 డిసెంబర్లో రాహుల్‌గాంధీకి ఈ కీలక పదవి అప్పగించారు. నెహ్రూ–గాంధీ కుటుంబంలోని ఐదో తరం నేత సారథ్యంలో ప్రతిపక్షం నుంచి పాలకపక్షంగా మారడానికి వచ్చే ఎన్నికలను మంచి అవకాశంగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. సోనియా నేతృత్వంలోనే... ఎనిమిదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ 2004 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి అత్యధిక రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించింది 145 సీట్లేగాని డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ వంటి ప్రాంతీయపక్షాలను కలుపుకుని, బయటి నుంచి వామపక్షాల మద్దతుతో యూపీఏ పేరుతో తొలిసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్ల పాలనలో జనాదరణ సంపాదించింది. ఫలితంగా 2009 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 206 సీట్లు పెరిగి యూపీఏ పాలన పదేళ్లు కొనసాగడానికి కారణమైంది. అయితే, యూపీఏ మొదటి హయాంలో(2004–09) జరిగిన అవినీతి కుంభకోణాలు, నిరుద్యోగం వంటి అంశాల వల్ల 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యాహక్కు, సమాచార హక్కు చట్టాల వల్ల మన్మోహన్ నాయకత్వంలోని ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా ఓటమి తప్ప లేదు. -
మలుపు తిప్పిన మోదీ గెలుపు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మొదటిసారి ఐదేళ్లు అధికారంలో కొనసాగాక జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలివి. 2004ఎన్నికల్లో మాదిరిగానే మళ్లీ విజయం సాధించడానికి పాలకపక్షం మున్నెన్నడూ లేనంత గట్టిప్రయత్నాలు చేస్తోంది. బీజేపీతొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రెండోసారి ప్రమాణం చేశాక పదవిలో వరుసగా ఆరేళ్ల రెండు నెలలు కొనసాగినాఈ పదవీకాలం రెండు లోక్‌సభలకు సంబంధించినది. పూర్తిగా ఐదేళ్లు కొనసాగకుండానే ఈ 12, 13వ లోక్సభలురద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఒకే లోక్‌సభ కాలంలో ఐదేళ్లు ప్రధానిగా కొనసాగిన రికార్డు బీజేపీలో నరేంద్రమోదీకే దక్కింది. లోక్‌సభలో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించడం కూడా ఇదే మొదటిసారి. 1951–77 మధ్య మనుగడ సాగించినభారతీయ జనసంఘ్ (బీజేఎస్) కొత్త రూపమే బీజేపీ. దశ మారింది కాషాయపక్షం మొదటిసారి పోటీచేసిన లోక్‌సభ ఎన్నికల్లో (1984) గెలిచింది రెండు సీట్లే. 1989 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం ఒక్కసారిగా 86 సీట్లకు పెరిగింది. జనతాదళ్ నేత వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సర్కారుకు బయటి నుంచి బీజేపీ మద్దతు ఇచ్చింది. సోమ్‌నాథ్ నుంచి అయోధ్యకు రథయాత్రతో బయల్దేరిన సీనియర్ నేత లాల్‌కృష్ణ ఆడ్వాణీని బిహార్‌లో లాలూప్రసాద్‌యాదవ్ ప్రభుత్వం (జనతాదళ్) అరెస్ట్ చేశాక వీపీసింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అదే సమయంలో బాబరీ మసీదు కూల్చివేతకు విఫలయత్నం జరిగింది. చంద్రశేఖర్ ప్రభుత్వం రాజీనామా తర్వాత 1991 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం 124 సీట్లకు పెరిగింది. ఐదేళ్ల పీవీ నరసింహారావు పాలన కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా సమర్థంగా పనిచేసింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ రాకున్నా అతిపెద్ద పార్టీగా (161 సీట్లు) అవతరించింది. బెడిసికొట్టిన తొలి యత్నం సీనియర్ నేత వాజ్‌పేయి నేతృత్వంలో ఏర్పడిన మొదటి బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం లోక్‌సభలో మెజారిటీ కూడగట్టలేక 13 రోజులకే రాజీనామా చేసింది. రెండేళ్ల తర్వాత జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లతో మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్‌పేయి నాయకత్వాన రెండో బీజేపీ ప్రభుత్వం 1998 మార్చి 19న అధికా రంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం నుంచి జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే వైదొలగడంతో జరిగిన బలపరీక్షలో ఓడిపోవడంతో 13 నెలలకే ఈ ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత లోక్‌సభ రద్దయినా కార్గిల్ పోరు కారణంగా ఆలస్యంగా సెప్టెంబర్–అక్టోబర్‌లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ బలం (182) కంటే మిత్రపక్షాల బలం పెరిగింది. వాజ్‌పేయి మూడోసారి ప్రధానిగా 1999 అక్టోబర్‌లో ప్రమాణం చేశారు. నాలుగేళ్ల ఏడు నెలలకు పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేక సవాళ్లు ఎదుర్కొంది. మసూద్‌ను వదిలేశారు డిసెంబర్లో హర్కతుల్ ముజాహిదీన్ పేరుతో కశ్మీర్ తీవ్రవాదులు కఠ్మాండు నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కాందహార్‌కు బలవంతంగా దారిమళ్లించడంతో మసూద్ అజహర్ సహా ముగ్గురు తీవ్రవాద నేతలను బీజేపీ సర్కారు విడుదల చేసింది. 2001 డిసెంబర్ 13న కశ్మీర్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ తీవ్రవాదులు భారత పార్లమెంటు భవనంపై జరిపిన దాడిలో 12 మంది మరణించారు. తర్వాత ఏడాది వరకూ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు 2002 జనవరి–ఫిబ్రవరిలో జరిగిన గుజరాత్ అల్లర్లపై సకాలంలో చర్యలు తీసుకోలేదనే విమర్శలు వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొంది. 2004 ఫిబ్రవరి నాటికి దేశ ఆర్థికాభివృద్ధి రేటు దాదాపు పది శాతానికి చేరింది. అప్పట్లో ఏడు నెలల ముందే బీజేపీ సర్కారు మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ అనూహ్య పరాజయం! జీడీపీ రేటు బాగున్నా, వాజ్‌పేయి ప్రభుత్వం పనితీరుపై జనం అనేక సర్వేల్లో సంతృప్తి వ్యక్తం చేసినా చివరికి ఏప్రిల్–మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఓడిపోయింది. బీజేపీ బలం 182 నుంచి 138కి పడిపోయింది. కాంగ్రెస్ నాయకత్వాన యూపీఏ సర్కారు అధికారం చేపట్టి ఐదేళ్లు పాలన సాగించింది. సీనియర్ నేత ఎల్.కె.ఆడ్వాణీ నేతృత్వంలో బీజేపీ 2009 ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఓటమిపాలైంది. బీజేపీ బలం ఈసారి 116 స్థానాలకు దిగజారింది. మలుపు తిప్పిన మోదీ గెలుపు ముఖ్యమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడంతో 2013 సెప్టెంబర్‌లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఆడ్వాణీ వంటి సీనియర్లకు ఈ నిర్ణయం మొదట మింగుడుపడకపోయినా చివరికి అందరూ అంగీకరించారు. యూపీఏ మొదటి హయాం పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు 2009 ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూడడం, యూపీఏ ప్రధాని మన్మోహన్సింగ్ కేబినెట్లోని మంత్రులు అవినీతిపరులుగా జనంలో ముద్రపడడం, కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ చేతుల్లోనే అధికారం ఉండడం, మన్మోహన్ బలహీన ప్రధానిగా ప్రచారం జరగడంతో 2014 ఎన్నికల్లో బీజేపీ మొదటిసారి 282 సీట్లతో విజయం సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక పార్టీకి సొంతంగా మెజార్టీ సీట్లు(273) రావడం ఇదే మొదటిసారి. వరుస పరాజయాలు ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ నినాదంతో ప్రధాని అయిన మోదీ 2014 మే నుంచీ జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించారనే పేరు సంపాదించారు. అవినీతి తగ్గిపోయిందనీ, ప్రభుత్వ యంత్రాంగంపై మోదీకి పూర్తి పట్టు ఉందని ప్రచారం జరిగింది. 2016 చివర్లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం మాయం కాలేదు గాని సామాన్య ప్రజానీకం నానా ఇబ్బందులు పడింది. జీఎస్టీతో ఆరంభంలో ధరలు పెరిగాయి. వృద్ధి రేటు తగ్గింది. నిరుద్యోగం పెరిగిందనే వార్తలొస్తున్నాయి. ఇటీవల మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయాక కాంగ్రెస్ దూకుడు పెరిగిం ది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత బదులుగా నిర్వహించిన ‘బాలాకోట్ ఆపరేషన్’తో బీజేపీ సర్కారు పరువు నిలిచింది. రఫేల్ ఒప్పందంపై వచ్చిన విమర్శల వల్ల మోదీ నిజాయతీపై మచ్చ పడలేదు. మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాల్లో ప్రాంతీయ పక్షాలతో పొత్తులు కుదిరాయి. మొత్తానికి ఈ ఎన్నికలు మోదీకి కంటే బీజేపీకే కీలకం.