మండ్య: పౌరుషానికి మారుపేరు | Karnataka Politics Special Story on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

ఎవరో కన్నడ అరసు!

Published Sat, Mar 30 2019 11:56 AM | Last Updated on Sat, Mar 30 2019 11:56 AM

Karnataka Politics Special Story on Lok Sabha Election - Sakshi

కర్ణాటక పేరు చెబితే టక్కున గుర్తుకొచ్చేది.. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ..బెంగళూరు.. మైసూరు దసరా ఉత్సవాలు. కానీ, ఇది ఎన్నికల సీజన్‌. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ‘రాజకీయ కోలాహలం’ నెలకొంది. ఇక్కడి పార్టీల కార్యకలాపాలు.. గెలుపు కోసం వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రాలనూ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే, గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో తెలుగు వారూ ఇక్కడ ఉన్నారు. కీలకమైన 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక్కడ గెలిచే వారే ‘అరసు’ (కింగ్‌). ఏప్రిల్‌ 11న పోలింగ్‌కు వెళ్తున్న కర్ణాటక రాష్ట్రంలోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో నెలకొన్న స్థితిగతులు..

 చిక్కబళ్లాపుర:  మినీ ఆంధ్రప్రదేశ్‌
అసెంబ్లీ సెగ్మెంట్లు: గౌరీబిదనూరు,బాగేపల్లి, చిక్కబళ్లాపుర, యలహంక, హొసకోటె, దేవనహళ్లి (ఎస్సీ),దొడ్డబళ్లాపుర, నెలమంగళ.
పోటీ:బి.ఎన్‌.బచ్చేగౌడ (బీజేపీ), డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీ (కాంగ్రెస్‌)
ఎస్సీ, ఎస్టీ ఓటర్లు దాదాపు ఐదు లక్షల మంది ఉన్న లోక్‌సభ స్థానం ఇది. ఒక్కళిగలు కూడా దాదాపు అంతే సంఖ్యలో ఉంటారు. బలిజ సామాజిక వర్గం వారు మూడు లక్షల మంది వరకూ ఉంటే మైనార్టీల సంఖ్య రెండు లక్షల పైమాటే. మైనార్టీలు సుమారు 50 వేల మంది వరకు ఉంటారు. 2004 నుంచి ఈ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998 నుంచి కూడా కాంగ్రెస్‌ కంచుకోట ఇది. ఆర్‌.ఎల్‌.జాలప్ప 1998, 1999, 2004లో గెలుపొందారు.

పురుషులు8,43,740
మహిళలు8,14,602
మొత్తం ఓటర్లు16,58,342

కోలార్‌  బంగారు గనుల బరి 
అసెంబ్లీ సెగ్మెంట్లు: శిడ్లఘట్ట, చింతామణి, శ్రీనివాసపుర, ముళబాగిలు (ఎస్సీ), కోలార్‌ గోల్డ్‌ఫీల్డ్స్‌ (ఎస్సీ), బంగారుపేట, మాళూరు.
పోటీ:కె.హెచ్‌.మునియప్ప (కాంగ్రెస్‌),ఎస్‌.మునియప్ప (బీజేపీ)
ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో కోలార్‌ బంగారు గనులు ఉన్న ఈ ప్రాంతం ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. తెలుగు మాట్లాడే వారు దాదాపు 30 శాతం వరకూ ఉన్నారని అంచనా. కాంగ్రెస్‌కు కంచుకోట. కేంద్ర మాజీ మంత్రి కె.హెచ్‌.మునియప్ప 1991 నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ఎన్నికల్లో కుల ప్రాధాన్యం ఎక్కువ.

పురుషులు7,55,450
మహిళలు7,37,525
మొత్తం ఓటర్లు14,92,975

ఉడుపి–చిక్కమగళూరు: ‘కరావళి’ గడప

అసెంబ్లీ సెగ్మెంట్లు: చిక్కమగళూరు, కాపు, కార్కళ, కుందాపుర, ముద్దిగెరె (ఎస్సీ), శృంగేరి, తారికెరె, ఉడుపి.
పోటీ:శోభ కరంద్లాజే (బీజేపీ),ప్రమోద్‌ మద్వరాజ్‌ (జేడీఎస్‌)
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2008లో ఏర్పాటైన లోక్‌సభ స్థానమిది. 2009లో ఈ స్థానం నుంచి గెలిచిన డి.వి.సదానంద గౌడ కేంద్రమంత్రిగా పనిచేశారు. రెండేళ్ల తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కె.జయప్రకాశ హెగ్డే ఇక్కడ గెలుపొందారు. 2014 నుంచి బీజేపీ నేత శోభ కరంద్లాజే ఎంపీగా ఉన్నారు.

సముద్ర తీర ప్రాంతంతోపాటు కర్ణాటకలోని మళెనాడు ప్రాంతాన్ని కూడా కలిగి ఉండటం ఈ నియోజకవర్గ ప్రత్యేకత. ఎస్సీ, ఎస్టీ, బిల్లవ, ఒక్కళిగ, బంట్‌ సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లిం, బ్రాహ్మణ, లింగాయత్‌లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. పశ్చిమ కనుమల ప్రాంతంలోని ధర్మస్థల, కుక్కే, కొల్లూరు వంటి పుణ్యక్షేత్రాలు ఈ నియోజవకర్గం పరిధిలోనే ఉన్న నేపథ్యంలో హిందుత్వ రాజకీయాల ప్రభావం కూడా ఎక్కువే.

పురుషులు6,79,286
మహిళలు7,08,009
మొత్తం ఓటర్లు13,87,295

 హాసన్‌:  దేవెగౌడ అడ్డా
అసెంబ్లీ సెగ్మెంట్లు:  కడరు, శ్రావణ బెళగొళ,అర్సికెరె, బేళూరు, హాసన, హొళెనర్సీపుర,అర్కల్‌గుడ్, సకలేశ్‌పుర.
పోటీ:ప్రజ్వల రేవణ్ణ(జేడీఎస్‌)
కర్ణాటక దక్షిణ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత ఒక్కళిగ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న స్థానమిది. పునర్విభజనలో భాగంగా 2008లో చిక్కమగళూరు స్థానంలోని బీరూరు, కడూరు ప్రాంతాలను కలిపారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ పోటీ చేసిన నియోజకవర్గంగా దీనికి గుర్తింపు ఉంది. 1999లో ఇక్కడి నుంచి జి.పుట్టస్వామి గౌడ కాంగ్రెస్‌ తరఫున గెలుపొందగా.. 2004 నుంచి దేవెగౌడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఒక్కళిగల జనాభా 15 శాతం ఉండగా.. ఈ స్థానంలో అంతకంటే ఎక్కువ మోతాదులో ఈ సామాజిక వర్గం వారు ఉన్నారు. తరువాతి స్థానంలో లింగాయత్‌లు, దళితులు, ఎస్టీలు ఉన్నారు. ప్రస్తుతం దేవెగౌడ్‌ మనవడు ప్రజ్వల రేవణ్ణ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దేవెగౌడకు ఉన్న పేరుతో పాటు తమ తండ్రి ఇమేజ్‌ సాయంతో ప్రజ్వల్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పురుషులు7,89,668
మహిళలు 7,71,668
మొత్తం ఓటర్లు 15,61,336

దక్షిణ కన్నడ:  ‘మత’మే కీలకం
అసెంబ్లీ సెగ్మెంట్లు: బెళ్తంగడి, మూడ్‌బిద్రీ,మంగళూరు సిటీ నార్త్‌ (గతంలో సూరత్‌కల్‌), మంగళూరు సిటీ సౌత్‌ (గతంలో మంగళూరు), మంగళూరు (గతంలో ఉళ్లాల్‌), బంట్వాళ్, పుత్తూరు, సూళియా (ఎస్సీ)
పోటీ: నళిన్‌ కుమార్‌ కటీల్‌ (బీజేపీ),మిథున్‌ రై (కాంగ్రెస్‌)
తుళునాడు ముఖ్య కేంద్రంగా గల దక్షిణ కన్నడ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొత్తం ఓటర్లలో బిల్లవులు 4.5 శాతం వరకు ఉండగా ముస్లింలు కూడా దాదాపు అంతే శాతం ఉన్నారు. బంట్స్, గౌడ, ఒక్కళిగ, క్రైస్తవ జనాభా తరువాతి స్థానంలో ఉన్నారు. బెళ్తంగడి నియోజకవర్గం 2008 కంటే ముందు చిక్కమగళూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేది. బంట్వాళ్, మూడ్‌బిద్రీ, సూరత్‌కల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉడుపి లోక్‌సభ స్థానం పరిధిలో ఉండేవి. 2009 నుంచి ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ తరఫున నళిన్‌కుమార్‌ కటీల్‌ గెలుపొందుతూ వస్తున్నారు. మతపర రాజకీయాలు కీలకమైన నియోజకవర్గమిది. గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ క్రమేపీ బలం పుంజుకుంటూ వస్తోంది.

పురుషులు  8,33,719
మహిళలు 8,63,599
మొత్తం ఓటర్లు16,97,418

చిత్రదుర్గ (ఎస్సీ):  దళితుల కోట
అసెంబ్లీ సెగ్మెంట్లు: మొళకాల్మూరు (ఎస్టీ),చెళ్లకెరు (ఎస్టీ), చిత్రదుర్గ, హిరియూరు, హొసదుర్గ, హెళలకెరె (ఎస్సీ), శిర, పావగడ
పోటీ: ఏ.నారాయణ స్వామి (బీజేపీ),బి.ఎన్‌.చంద్రప్ప (కాంగ్రెస్‌)
దేశం మొత్తమ్మీద అత్యంత వెనుకబడ్డ జిల్లాగా చిత్రదుర్గకు పేరుంది. కుల, మతపరమైన రాజకీయాలకు ప్రాధాన్యం ఎక్కువ. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన భోవి, మాదిగ కులాల జనాభా పెద్దసంఖ్యలో ఉన్నారు. మొత్తం ఓటర్లలో మాదిగల సంఖ్యే నాలుగు లక్షలకుపైగా ఉంటుంది. ఒక్కళిగ, ముస్లింలు తరువాత స్థానంలో ఉన్నారు. బీజేపీ, జేడీ(ఎస్‌).. భోవి వర్గం అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తాయి. 1999లో జేడీయూ తరఫున శశికుమార్‌ ఇక్కడి నుంచి గెలుపొందారు. 2008లో ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌వై హనుమంతప్ప విజయం సాధించగా.. 2009లో బీజేపీ
అభ్యర్థి జనార్దన స్వామి గెలుపొందారు.

పురుషులు 8,44,864
మహిళలు 8,16,408
మొత్తం ఓటర్లు 16,61,272

తుముకూరు:  కర్ణాటక నడిగడ్డ
అసెంబ్లీ సెగ్మెంట్లు: చిక్కనాయకనహళ్లి,టిప్‌టూర్, తురువెకెరె, తుముకూరు సిటీ, తుముకూరు రూరల్, కొరటగెరె (ఎస్సీ), గుబ్బి, మధుగిరి.
పోటీ: జి.ఎస్‌.బసవరాజ్‌ (బీజేపీ), హెచ్‌.డి.దేవెగౌడ(జేడీఎస్‌)
కర్ణాటక రాజధాని బెంగళూరు పొరుగున ఉన్న నియోజకవర్గమిది. శాటిలైట్‌ టౌన్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎనిమిది జిల్లాలతో సరిహద్దులు పంచుకుంటోంది. లింగాయత్‌ల ఆధిపత్యం ఎక్కువ. రెండు మూడు స్థానాల్లో ఒక్కళిగలు, దళితులు ఉన్నారు. 1999, 2009లో జి.ఎస్‌.బసవరాజ్‌ ఒకసారి కాంగ్రెస్‌ పార్టీ తరఫున, రెండోసారి బీజేపీ టికెట్‌పై గెలిచారు. 2004లో బీజేపీకి చెందిన మల్లికార్జునయ్య గెలుపొందగా.. 2014లో బీజేపీ ఈ స్థానాన్ని కోల్పోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన ఎస్పీ ముద్దహనుమేగౌడ గెలుపొందారు.

పురుషులు 7,64,561
మహిళలు7,53,957
మొత్తం ఓటర్లు15,18,518

మండ్య:  పౌరుషానికి మారుపేరు
అసెంబ్లీ సెగ్మెంట్లు: మాలవళ్లి (ఎస్సీ), మద్దూరు, మేలుకోటే, మండ్య, శ్రీరంగపట్న, నాగమంగళ, కృష్ణరాజపేటె, కృష్ణరాజ నగర
పోటీ: సుమలత అంబరీష్‌ (స్వతంత్ర), నిఖిల్‌ గౌడ (జేడీఎస్‌)
మద్దూరు, మాలవళ్లి స్థానాల్లో కొన్ని మార్పులు చేసి పునర్విభజించారు. కన్నడ సినీ హీరో దివంగత అంబరీష్‌ 2009 వరకూ ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. 2009 ఎన్నికల్లో జేడీఎస్‌కు చెందిన చెలువరాయ చేతిలో అంబరీష్‌ ఓటమి పాలయ్యారు. 2013లో జరిగిన ఉప ఎన్నికల్లో మరో సినీ నటి, కాంగ్రెస్‌ ఐటీ విభాగపు అధ్యక్షురాలు రమ్య గెలుపొందారు. గత ఎన్నికల్లో జేడీఎస్‌కు చెందిన సి.ఎస్‌.పుట్టరాజ్‌ గెలిచారు. అయితే రాష్ట్ర మంత్రిగా పనిచేసేందుకు 2018లో పుట్టరాజ్‌ తన లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లోనూ జేడీఎస్‌ అభ్యర్థి ఎల్‌.ఆర్‌.శివరామేగౌడ గెలుపొందారు. ఒక్కళిగల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న స్థానమిది. జనాభాలో సగానికి పైగా ఈ సామాజిక వర్గం వారే ఉన్నారు.

పురుషులు 8,39,052
మహిళలు8,30,210
మొత్తం ఓటర్లు16,69,262

 మైసూరు  రాజసం
అసెంబ్లీ సెగ్మెంట్లు: మడికెరె, విరాజ్‌పేట్,పిరియపట్టణ, హున్సుర్, చాముండేశ్వరి,కృష్ణరాజ, చామరాజ, నరసింహరాజ.

పోటీ:ప్రతాప సింహ (బీజేపీ),విజయశంకర్‌ (కాంగ్రెస్‌).
పాత మైసూరు ప్రాంతంలోని నియోజకవర్గం. కొడగు, మైసూ రు ప్రాంతాలు కలిసి ఉంటాయి. గ్రామీణ, నగర ఓటర్ల కలగలుపుగా ఉండే స్థానం. కృష్ణరాజ, నరసింహరాజ, చామరాజ నగర ప్రాంతాలు. ఒక్కళిగలు, కురుబ సామాజిక వర్గం వారు ఎక్కువ. లింగాయత్, ముస్లింలు, ఇతర వెనుకబడ్డ తరగతుల వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు. కొంత కాలం క్రితం మడికెరె, విరాజ్‌పేట అసెంబ్లీ స్థానాల్లోని కొన్ని ప్రాంతాలను మంగళూరు లోక్‌సభ పరిధిలోంచి వేరు చేసి ఇందులో కలిపారు. 1999 ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన మైసూరు రాజ కుటుంబానికి చెందిన శ్రీకంఠ దత్త వడయార్‌.. 2004లో బీజేపీ అభ్యర్థి సి.హెచ్‌.విజయశంకర్‌ చేతిలో ఓడిపోయారు. 2009లో విజయ శంకర్‌.. ఎ.హెచ్‌.విశ్వనాథ్‌ (కాం గ్రెస్‌) చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ప్రతాపసింహ (బీజేపీ) గెలుపొందారు.

పురుషులు8,67,893
మహిళలు8,55,241
మొత్తం ఓటర్లు 17,23,134

 చామరాజనగర  గిరిపుత్రుల పవర్‌
అసెంబ్లీ సెగ్మెంట్లు: హనూర్, కొళ్లెగాళ,చామరాజ నగర, గుండ్లుపేటె, టి.నర్సీపుర, నంజనగూడు, హెగ్గడదేవనకోటె, వరుణ
పోటీ:శ్రీనివాస ప్రసాద్‌ (బీజేపీ), ధృవ నారాయణ (కాంగ్రెస్‌)
ఎస్సీ రిజర్వుడు స్థానం. వరుణ అసెంబ్లీ స్థానంలో కొన్ని మార్పులు చేసి 2008లో పునర్విభజించారు. ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానం. దళితులు, వెనుకబడిన తరగతుల వారు, మైనార్టీల సంఖ్య కూడా ఎక్కువే. హెగ్గడదేవనకోటె తాలూకాలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. జేడీయూ అభ్యర్థి శ్రీనివాస ప్రసాద్‌ 1999 ఎన్నికల్లో విజయం సాధించగా 2009లో జేడీఎస్‌ అభ్యర్థి శివణ్ణ గెలుపొందారు. 2009 నుంచి కాంగ్రెస్‌కు చెందిన ఆర్‌.ధృవ నారాయణ విజేతగా ఉన్నారు.

పురుషులు 7,89,383
మహిళలు 7,66,396
మొత్తం ఓటర్లు 15,55,779

 బెంగళూరు రూరల్‌:  రాజధాని శివారు
అసెంబ్లీ సెగ్మెంట్లు: కుణిగల్, రాజరాజేశ్వరి నగర, బెంగళూరు సౌత్, అనేకల్, మాగడి, రామనగర, కనకపుర, చెన్నపట్టణ.
పోటీ: అశ్వత్‌నారాయణ్‌ (బీజేపీ),డీకే సురేశ్‌ (కాంగ్రెస్‌)
2008లో ఏర్పడ్డ నియోజకవర్గం. రాజధాని బెంగళూరులోని కొన్ని ప్రాంతాలతోపాటు శివారు పట్టణాలైన చెన్నపట్టణ, అనేకల్‌లు ఉన్న లోక్‌సభ స్థానమిది. లింగాయతులు, ముస్లింలతోపాటు కురుబలు, ఇతర వెనుకబడ్డ తరగతుల వారి ప్రాబల్యం ఎక్కువ. 2009లో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి ఈ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అయితే అసెంబ్లీకి పోటీ చేసే ఉద్దేశంతో 2013లో తన లోక్‌సభ స్థానాన్ని వదులుకున్నారు. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి డీకే సురేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

పురుషులు 11,35,845
మహిళలు10,54,552
మొత్తం ఓటర్లు21,90,397

 బెంగళూరు నార్త్‌:  వలసదారులే కీలకం
అసెంబ్లీ సెగ్మెంట్లు: కె.ఆర్‌.పురం, బ్యాటరాయనపుర, యశ్వంతపుర, దాసరహళ్లి, మహాలక్ష్మి లేఔట్, మల్లేశ్వరం, హెబ్బాళ, పులకేసనగర.
పోటీ: డి.వి.సదానంద గౌడ (బీజేపీ),కృష్ణ బైరేగౌడ (కాంగ్రెస్‌)
2008లో బెంగళూరులోని శివాజీనగర, శాం తినగర అసెంబ్లీ నియోజకవర్గాల కు కొన్ని ఇతర ప్రాంతాలను కలి పి ఈ లోక్‌సభ స్థానాన్ని ఏర్పా టు చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన స్థానమూ ఇదే. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చినవారు ఎక్కువగా ఉంటారు. 2008 పునర్విభజన తరువాత ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు బెంగళూరు సెంట్రల్‌కు వెళ్లి పోయాయి. 1977–99 మధ్య కాలంలో ఎనిమిది సార్లు కాంగ్రెస్‌ నుంచి సీకే జాఫర్‌ ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి బీజేపీ మూడుసార్లు గెలుస్తూ వచ్చింది. షరీఫ్‌పై మాజీ పోలీస్‌ ఉన్నతాధికారి హెచ్‌టీ సాంగ్లియానా 2004లో గెలుపొందారు. 2009లో చంద్రేగౌడ, 2014లో డి.వి.సదానంద గౌడ గెలుపొందారు. ఒక్కళిగ, ముస్లిం, షెడ్యూల్డ్‌ తెగల వారు కీలకం.

పురుషులు12,60,356
మహిళలు11,41,116
మొత్తం ఓటర్లు24,01,472

 బెంగళూరు సౌత్‌:  తేజస్వీ సూర్య ఉదయించేనా
అసెంబ్లీ సెగ్మెంట్లు: గోవిందరాజ నగర, విజయ నగర, చిక్‌పేట్, బసవనగుడి, పద్మనాభ నగర, బీటీఎం లేఔట్, జయనగర, బొమ్మనహళ్లి.
పోటీ:తేజస్వీ సూర్య (బీజేపీ), బి.కె.హరిప్రసాద్‌ (కాంగ్రెస్‌)
బీజేపీకి బాగా పట్టున్న లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి. 1991 నుంచి కాషాయ పార్టీ వరుసగా గెలుపొందటం ఇందుకు నిదర్శనం. 1996 నుంచి 2018 మధ్య కాలంలో కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహించింది ఇక్కడి నుంచే. గత ఏడాది నవంబరులో ఆయన మరణం తరువాత ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ తేజస్వీ సూర్య అనే 28 ఏళ్ల న్యాయవాదిని బరిలోకి దింపింది. బ్రాహ్మణ ఓటర్లు గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో ఉంటారు. అయితే దాదాపు 5 లక్షల మంది ఓటర్లతో ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. మైనార్టీ ఓటర్లు దాదాపు రెండు లక్షల మంది ఉంటారు.

పురుషులు10,51,316
మహిళలు9,48,566
మొత్తం ఓటర్లు19,99,882

బెంగళూరు సెంట్రల్‌:  ప్రకాశ్‌రాజ్‌కు పరీక్ష
అసెంబ్లీ సెగ్మెంట్లు: సర్వజ్ఞనగర్,సి.వి.రామన్‌ నగర్, శివాజీనగర,శాంతినగర, గాంధీనగర్, రాజాజీనగర్, చామరాజపేట్, మహాదేవపుర.
పోటీ:పి.సి.మోహన్‌ (బీజేపీ), రిజ్వాన్‌ అర్షద్‌ (కాంగ్రెస్‌), ప్రకాశ్‌రాజ్‌ (స్వతంత్ర)
2008లో బెంగళూరు ఉత్తర, దక్షిణ లోక్‌సభ స్థానాల నుంచి కొన్ని ప్రాంతాలను వేరుచేసి ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన పి.సి.మోహన్‌ సిట్టింగ్‌ ఎంపీ. దాదాపు అన్ని రకాల భాషలు, మతాలు, మైనార్టీలతో కూడిన స్థానం. ముస్లింలు, క్రైస్తవులతోపాటు తమిళ ఓటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. పునర్విభజన కారణంగా ఎక్కువమంది మైనార్టీలు వచ్చి చేరారని అంచనా.

పురుషులు10,10,586
మహిళలు9,21,077
మొత్తం ఓటర్లు19,31,663

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement