బెంగళూరు : సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడింది. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా సీఎం కుమారస్వామికి ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ఆయన తండ్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడతో పాటు.. కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా ఓటమి పాలయ్యారు. తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన నిఖిల్.. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో ఘోర పరాభవం చవిచూశారు. అదే విధంగా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు కూడా ఈ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ మరోసారి ఆపరేషన్ కమలానికి తెరలేపిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో సీఎం కుమారస్వామి, మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత సిద్ధరామయ్య అత్యవసరంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసే క్రమంలో త్వరలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో గతేడాది ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ ఫలితాల్లో 105 సీట్లు గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ తమ కన్నా తక్కువ స్థానాలే గెలిచినప్పటికీ జేడీఎస్‌తో కూటమి ఏర్పాటు చేసి.. కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో.. అసంతృప్త ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో తమ ఎమ్మెల్యేలు ఎవరినీ బీజేపీ కొనలేదంటూ కాంగ్రెస్-జేడీఎస్ నేతలు చెబుతున్నప్పటికీ వారిలో ఆందోళన మాత్రం కొట్టొచ్చినట్లుగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment