కర్ణాటకలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇటు కాంగ్రెస్‌కూ కీలకంగా మారాయి. ఇందుకు తగ్గట్టే రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో (ఏప్రిల్ 18, ఏప్రిల్ 23) పోలింగ్ జరగనుండగా.. ఇరు పక్షాల నేతలు తమదైన వ్యూహాల అమలుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ తొలిసారి కాంగ్రెస్ –జేడీఎస్ రూపంలో గట్టి సవాలు ఎదుర్కొంటుండగా, అధికార కూటమిలోని లుకలుకలు, ఇరు పార్టీల్లోని అసమ్మతి తమకు మేలు చేస్తుందన్న ఆంచానాలో కమలనాథులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌తో జట్టుకట్టి విపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచినప్పటికీ తదనంతర పరిణామాలు కాంగ్రెస్‌కు మేలు చేసేవిగా లేవు.
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ– బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో బీజేపీ కర్ణాటకపై మరింత ఎక్కువ దృష్టి పెట్టింది. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం ద్వారా యూపీలో నష్టమేదైనా జరిగినా తట్టుకోవచ్చునన్నది వారి ఆలోచనగా ఉంది. ఈ కారణంగానే కర్ణాటకలో అటు కాంగ్రెస్, ఇటు దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌కు చెక్ పెట్టేందుకు అందరినీ కలుపుకుపోయేలా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని బీజేపీ నేత ఒకరు చెబుతున్నారు. దక్షిణ కర్ణాటక జిల్లాలతో పాటు, మధ్య ప్రాంతంలోని జిల్లాల్లోనూ బీజేపీ తన ఓటుబ్యాంకును పదిలం చేసుకునేందుకు కాంగ్రెస్ –జేడీఎస్ పొత్తు ఉపకరిస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఎత్తులు..పై ఎత్తులు
2004 నుంచి కర్ణాటక రాజకీయ చరిత్రను ఒక్కసారి చూస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే ఆధిపత్యమన్న విషయం స్పష్టమవుతుంది. 2004 ఎన్నికల్లో 28 స్థానాలకు 17 గెలుచుకోగా, 2009లో 18 స్థానాల్లో గెలుపొందింది. 2014లోనూ 17 స్థానాల్లో కాషాయ దళం విజేతగా నిలిచింది. కాంగ్రెస్‌కు తొమ్మిది, జేడీఎస్‌కు రెండు స్థానాలే దక్కాయి. ఇంకోలా చెప్పాలంటే 1999లో కాంగ్రెస్ అత్యధికంగా 18 స్థానాలు సాధించిన తరువాత రాష్ట్రంలో రాజకీయపరమైన మార్పు మొదలైందని చెప్పాలి. లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ బలం పుంజుకోవడం మొదలైందన్నమాట. రాష్ట్ర జనాభాలో 19 శాతమున్న లింగాయతులు, వొక్కళిగ (గౌడ)లు రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. రామకృష్ణ హెగ్డే శకంలో.. కర్ణాటకలో కాంగ్రెస్‌కు దీటుగా ఒక రాజకీయ వ్యవస్థ ఎదగడం మొదలైంది.
బీఎస్ యడ్యూరప్ప వయసిప్పుడు 75పై మాటే. అయినా సరే.. బీజేపీ ఆ వయసు వారికి టిక్కెట్ ఇవ్వరాదన్న నిబంధనలను పక్కన పెట్టి మరీ ఎన్నికలకు వెళుతోంది. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్పను నేతగా అంగీకరించేందుకు కొందరికి ఇష్టం లేకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వర్గం ఓట్లు రాబట్టుకునేందుకు మరో ప్రత్యామ్నాయం లేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి నాయకుల వలస.. ఆపరేషన్ లోటస్ వంటివి బీజేపీ మరోసారి అధిక స్థానాలు గెలుచకునేందుకు లేదా ఉన్న స్థానాలను నిలబెట్టుకునేందుకు సాయం చేస్తాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి కూడా తమకు పాత మైసూరు, ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి, బాగల్‌కోట్, బళ్లారి, చిక్కోడి, రాయచూర్, బీదర్ స్థానాల్లో 15కుపైగా సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. ముక్కోణపు పోటీ ఉన్న పక్షంలో మోదీకున్న సానుకూలత తమకు లాభిస్తుం దని, ముంబై సెంట్రల్, హైదరాబాద్, కోస్తా కర్ణాటక ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాల్లో కూటమికి గట్టిపోటీ ఇవ్వగలమని బీజేపీ నేతల అంచనా.
వలస నేతలకు సీట్లు..
బీజేపీ.. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వలసొచ్చిన ఉమేశ్ జాదవ్ (గుల్బర్గా), ఎ.మంజు (హాసన్)కు టికెట్లు ఇచ్చారు. మరోవైపు బీజేపీ మైనింగ్ వివాదాలున్న బళ్లారిలో గాలి జనార్ధనరెడ్డి సోదరులకు కాక దేవేంద్రప్పకు టిక్కెట్ ఇవ్వడం తెలివైన వ్యూహమనే చెప్పాలి. 2014లో ఈ స్థానాన్ని బి.శ్రీరాములు గెలుచుకున్నా, 2018 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన వి.ఎస్.ఉగ్రప్ప గెలుపొందారు. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి కూడా బీజీపీని ఎదుర్కొనేందుకు ఉపక్ర మించింది. మహాగఠ్ బంధన్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బీజేపీకి పదికంటే తక్కువ స్థానా లు మాత్రమే దక్కేలా చేస్తానని ప్రతినబూనడమే కాక.. తుముకూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకూ పోటీ చేసిన హాసన్ నుంచి మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్నారు. కీలకమైన మండ్య స్థానాన్ని ఇంకో మనవడు నిఖిల్ కుమారస్వామికి కేటాయించారు.ఈ రెండుచోట్లా వొక్కళిగల ఓట్లు చీలిపోతాయేమోనని జేడీఎస్ కలవరపడుతోంది.
సిద్ధరామయ్య గేమ్..
కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ వ్యతిరేకి సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ను బలహీనపరిచేందుకు ‘గేమ్’ ఆడుతున్నారు. మండ్య స్థానం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్న సినీ నటి సుమలతకు పరోక్షంగా మద్దతివ్వడం ఇందుకు నిదర్శనం. దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఓడించడం కోసం బీజేపీ కూడా సుమలతకు పరోక్ష మద్దతునిస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ 20 స్థానాల్లో, జేడీఎస్ 8 స్థానాల్లో పోటీ చేస్తున్నప్పటికీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర తుముకూరు నుంచి దేవెగౌడ పోటీ చేస్తుండటంపై ఏమంత సంతృప్తిగా లేరు.
యడ్డీ డైరీ కలకలం..
సీఎంగా కొనసాగేందుకు బీజేపీ అధిష్టానానికి రూ.1,800 కోట్లు చెల్లించుకున్నట్లు యడ్యూరప్ప రాసుకున్న డైరీని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఆలోచనలు కరవైనందునే కాంగ్రెస్ తమపై ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీజేపీ విమర్శిస్తోం ది. ఆ డైరీ కూడా ఫేక్ అని ఇప్పటికే విచారణలో తేలిందని యడ్యూరప్ప అంటూండటం విశేషం. కాగా, బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను కలబుర్గి నుంచి ఓడించే లక్ష్యంతో కీలక నేతలను తమ వైపునకు తిప్పుకుం ది. ఆపరేషన్ కమలలో భాగంగా చించోళి ఎమ్మెల్యే గా ఉన్న ఉమేశ్ జాదవ్‌ను మల్లికార్జున్ ఖర్గేపై పోటీకి నిలబెట్టింది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో సీనియర్ నేత అయిన డాక్టర్ ఏబీ మాలక రడ్డీ కూడా బీజేపీ వైపు మళ్లడం అనుకూలించేదే. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, బాబూ రావు చించన్‌సూర్ రావడం గుల్బర్గా ప్రాంతంలో బీజేపీకి కలిసొచ్చే అంశం. సినీనటుడు ప్రకాశ్‌రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. హిందుత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్న ఈయనకు బీజేపీ సిట్టింగ్ ఎంపీ పి.సి.మోహన్ పోటీనిస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తెలియదు. పొత్తులతో నెగ్గుకు రావాలన్నది కాంగ్రెస్ –జేడీఎస్ కూట మి వ్యూహమైతే.. మోదీ హవా.. చౌకీదార్ ప్రచారంతో పొత్తులను చిత్తు చేయాలని బీజేపీ తలపోస్తోంది. మొత్తమ్మీద కర్ణాటక ఎన్నిక లు మోదీ, రాహుల్‌కు పరీ క్షగా మారాయనడంలో సందేహం లేదు. యడ్యూరప్ప భవితను తేల్చేది కూడా ఈ ఎన్నికలే!!
- ఎలక్షన్ వాచ్ కెస్తూర్ వాసుకి, జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment