దక్షిణాపథంలో అటు జాతీయ పార్టీలకు.. ఇటు ప్రాంతీయ పార్టీకి కూడా ముఖ్యమైన రాష్ట్రమేదైనా ఉందంటే.. అది కర్ణాటక మాత్రమే. మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ.. ఉన్న అధికారాన్ని బలపరచుకునేందుకు కాంగ్రెస్– జేడీఎస్ కూటమి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీల ఆశలు ఎలా ఉన్నా.. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఓటర్ల ఆలోచన ఏమిటి? ధనం, కులమనే అంశాలు కాకుండా.. ఒక పార్టీకి ఓటేసేలా ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?. ఈ ఎన్నికల్లో కర్ణాటకలో రైతు ఆత్మహత్యలు.. నత్తనడకన సాగుతున్న తాగు, సాగునీటి ప్రాజెక్టులు అనే రెండు అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
కర్ణాటకలోని అనేక జిల్లాల్లో ఇప్పుడు కరవు పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న సామాన్యుడి కష్టాలు నేతలకు ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలోని మొత్తం 176 తాలూకాల్లో 156 తాలూకాలను కరవు తాలూకాలుగా ప్రకటించారు. గత ఏడాది దాదాపు 49 శాతం వర్షాభావం నమోదైంది. అదే సమయంలో కూర్గ్ ప్రాంతంలో సంభవించిన అకాల వరదలు, ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం కూడా ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపనుందని అంచనా. నీటి కటకట, వ్యవసాయ సంక్షోభం, జన్యుమార్పిడి పంటల వైఫల్యం, కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వాలు ప్రకటించి అమలు చేస్తున్న రైతు సహాయక పథకాలను వెక్కిరిస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినప్పటికీ రైతుల ఆత్మహత్యలైతే ఆగడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి గద్దెనెక్కిన హెచ్‌డీ కుమారస్వామి రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అమలైంది పాక్షికంగానే. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.42 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించారు కానీ పూర్తిగా అమలైతే కాలేదు. ఇది కాస్తా ఎన్నికల్లో కీలకమైపోయింది. లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రధాని మోదీ కూడా రంగంలోకి దిగి కుమారస్వామి వైఫల్యాలను ఎత్తిచూపడం ఇక్కడ చెప్పుకోవాలి. ఒకవైపు ఆత్మహత్యలు కొనసాగుతున్నా.. ఇంకోవైపు రుణమాఫీ ఘనత తమదంటే తమదని పార్టీలు పోటాపోటీ ప్రకటనలు గుప్పిస్తున్నాయి.
రోజుకు ఇద్దరు...
2018 ఏప్రిల్, ఆగస్టులో ప్రతి పన్నెండు గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 283 మంది బలవన్మరణానికి పాల్పడగా.. వీరిలో అత్యధికులు కర్ణాటక ఉత్తర, మధ్యజిల్లాల వారు కావడం గమనార్హం. 2017 డిసెంబరు 31 నాటికి రాష్ట్రంలోని రైతులందరిపై ఉన్న రుణభారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పది శాతం వరకూ ఉంది. 2017 –18 బడ్జెట్ కేటాయింపుల్లో 57 శాతం ఇందుకోసం కేటాయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ అంచనాల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 85 లక్షల మంది రైతులు 45 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1.2 లక్షల కోట్లు రుణంగా పొందారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాలంలో (ఏప్రిల్ 2013 – నవంబర్ 2017)నూ ఇదే పరిస్థితి. ఈ కాలంలో 3,515 రైతులు మరణించగా కరవు.. పంటల వైఫల్యం ప్రధాన కారణాలుగా నిలిచాయి. చెరకు, వరి రైతులపై ఎక్కువ ప్రభావం కనిపించింది. మహారాష్ట్ర, తెలంగాణ తరువాత రైతు ఆత్మహత్యలు ఎక్కువగా నమోదైంది కర్ణాటకలోనే అని 2015 నాటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కూడా స్పష్టం చేసింది. సిద్ధరామయ్య కూడా దాదాపు రూ.8,550 కోట్లు రుణ మాఫీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా కుమారస్వామి ప్రభుత్వానికి చెరకు రైతుల నుంచి రుణమాఫీ డిమాండ్లు వస్తున్నాయి. బెళగావి, బాగల్‌కోటె, బీదర్, బిజాపుర, రాయచూర్, మండ్య, మైసూరు జిల్లాల్లో చెరకు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే చక్కెర ఫ్యాక్టరీల యజమానుల్లో అధికులు రాజకీయ నేతలు కావడం.. సమస్య పరిష్కారంపై వారు ఆసక్తి చూపకపోవడంతో పరిస్థితి జటిలంగా మారింది.
ప్రాజెక్టు చిక్కులు
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు తాగు, సాగునీటి ప్రాజెక్టులు కూడా తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుగా మారిపోయాయి. తుముకూరు నుంచి పోటీ చేస్తున్న మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ హేమావతి నది నుంచి తుముకూరుకు నీళ్లు తీసుకొచ్చే అంశంపై ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును దేవెగౌడతోపాటు, పెద్ద కుమారుడు, రాష్ట్ర మంత్రి హెచ్.డి.రేవణ్ణ, చిన్న కుమారుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం. కావేరి నది ఉపనది అయిన హేమావతి నుంచి తుముకూరుకు కొన్ని నీళ్లు మళ్లించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే తమ పలుకుబడితో దేవెగౌడ ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్నది స్థానికుల ఆరోపణ. ఎత్తినహొళె నది నుంచి హాసన్, తుముకూరు, చిక్కబళ్లాపుర, కోలార్‌లతోపాటు బెంగళూరు గ్రామీణ ప్రాంతాలకు నీరు అందించే ప్రాజెక్టు కూడా చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటం ఈ ప్రాంతాల వారిలో అసంతృప్తికి కారణంగా ఉంది. రూ.12,912 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడితే అరేబియా సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. దక్షిణ కన్నడ జిల్లా పర్యావరణవేత్తలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కలస బందూరి ప్రాజెక్టు మరో ఎత్తు. ఈ ప్రాజెక్టుకు నిరసనగా బెళగావీ, ధార్వాడ్, గదగ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లో తాగునీటి వసతిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా మహాదాయి ఉపనదులైన కలస, బందూరిల వద్ద రెండు డ్యామ్‌లు కట్టాలి. మహాదాయి నుంచి 7.56 టీఎంసీల నీళ్లు మలప్రభ నదిలోకి మళ్లించాలన్నది ప్రణాళిక. మహాదాయి బేసిన్‌లో తమ వాటా నీటిలో కొంత మాత్రమే మలప్రభకు మళ్లించాలని.. తద్వారా హుబ్బళ్లి, ధార్వాడ్ పరిసర ప్రాంతాలకు, గదగ ప్రాంతంలోని దాదాపు వంద గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మూడేళ్లుగా ఈ అంశంపై రైతులు ఆందోళన చేస్తున్నా రాజకీయ నేతలు పరిష్కారానికి ఆశించిన స్థాయిలో కృషి చేయకపోవడం ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది.
మేకేదాటుపై తమిళనాడుతో పేచీ..
కావేరీ–అర్కావతి నదుల సంగమ స్థానమైన మేకేదాటుపై ఓ ప్రాజెక్టు కట్టాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆలోచనకు తమిళనాడు కొర్రీ వేయడం పెద్ద వివాదమవుతోంది. బెంగళూరు నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలోని కనకపుర వద్ద ఉన్న మేకేదాటు వద్ద రూ.5,912 కోట్లతో బహుళార్థక సాధక ప్రాజెక్టు కడితే రాజధాని బెంగళూరుతోపాటు రామ్‌నగర జిల్లా తాగునీటి సమస్యలు తీర్చవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. సముద్రంలో కలుస్తున్న దాదాపు 66 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని సద్వినియోగం చేసుకోవడం.. 250 నుంచి 400 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అయితే కావేరీ జలాల విషయంలో తమిళనాడుతో ఉన్న తగాదా గురించి అందరికీ తెలిసిందే. మండ్య నుంచి బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత అంబరీష్ ఇప్పటికే కావేరీ నీటి అంశాన్ని లేవనెత్తి ప్రచారం చేస్తున్నారు.
డేట్‌లైన్ బెంగళూరు
కెస్టూర్ వాసుకి, సీనియర్‌జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment