అతుకుల పొత్తు.. కూటమి చిత్తు? | Modi popularity on test as Karnataka goes to polls | Sakshi
Sakshi News home page

అతుకుల పొత్తు.. కూటమి చిత్తు?

Published Thu, Apr 18 2019 5:32 AM | Last Updated on Thu, Apr 18 2019 5:32 AM

Modi popularity on test as Karnataka goes to polls - Sakshi

డేట్‌లైన్‌ – బెంగళూరు
దేశ ప్రధాని నరేంద్రమోదీ గత రెండు నెలల్లో కర్ణాటకకు ఎన్నిసార్లు వచ్చారో తెలుసా? కొంచెం అటుఇటుగా వారానికి ఒకసారి! ఎన్నికలు కదా.. ప్రచారం కోసం ఆ మాత్రం తిరగరా.. అంటున్నారా? నిజమే కానీ.. భారతీయ జనతా పార్టీ కర్ణాటకకు ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ పర్యటనలు తార్కాణంగా నిలుస్తున్నాయి. హుబ్బళి, కలబుర్గి, చిత్రదుర్గ, మైసూరు, బెంగళూరు, గంగావతి, మంగళూరుల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ.. ఓటర్లను పార్టీకి అనుకూలంగా మలచగలరన్న నమ్మకం ఆ పార్టీది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మోదీ మేజిక్‌ ఏమిటన్నది ఒక్కసారి తరచి చూస్తే..

రాష్ట్రం మొత్తమ్మీద ఉన్న స్థానాలు 28. ఏప్రిల్‌ 18న తొలిదశలో 14 స్థానాలకు, ఇదే నెల 23న రెండో దశ పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. శివమొగ్గ, దావణగెరె మినహాయిస్తే తొలిదశ పోలింగ్‌ జరిగే స్థానాలన్నీ పాత మైసూరు ప్రాంతంలోనివే. కాంగ్రెస్‌ –జేడీఎస్‌కు బాగా పట్టున్న ప్రాంతమిది. అయితే పరిస్థితులు చూస్తే మాత్రం ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ వైపే మొగ్గు ఉన్నట్లు కనిపిస్తోంది. దక్షిణాదిలో పాగా వేసేందుకు కర్ణాటక మేలిమి మార్గమని బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టారు. కాంగ్రెస్‌ –జేడీఎస్‌ కూటమికి ఈ ప్రాంతంలోని 8 స్థానాల్లో దాదాపు 55 శాతం ఓట్లు ఉన్నాయి. కాబట్టి వారి ఎన్నిక సులువే అనిపించక మానదు. కానీ తాజా పరిస్థితులు కూటమికి ఆందోళన కలిగించేవిగానే ఉన్నాయి. కూటమి నేతలు పరస్పర సహకారంతో ఎక్కువ సీట్లు సాధించాలని ప్రచారం చేస్తుంటే.. కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఉప్పు–నిప్పులా వ్యవహరిస్తున్నారు. సీట్ల సర్దుబాట్లపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రత్యర్థి బీజేపీకి అనుకూలంగా కొన్నిచోట్ల ప్రచారమూ చేస్తున్నారు.
  
కీలక ప్రాంతాల్లో మోదీ ప్రచారం
ఈ దఫా ఎన్నికల్లో మోదీ ప్రచారం చేసిన ప్రాంతాలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. పాత మైసూరులోని మళెనాడుతో పాటు మధ్య కర్ణాటక, హైదరాబాద్, ముంబై, తీర ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలతో పాటు ఇతర వర్గాల్లోని తటస్తులను తమ వైపునకు తిప్పుకోవాలనే లక్ష్యంతోనే పార్టీ నేతలు ఈ ప్రాంతాలను ఎంచుకుని మరీ మోదీతో భారీ ర్యాలీలు నిర్వహించారని అంచనా. కేంద్రంలో మరోసారి పగ్గాలు చేపట్టాలంటే కర్ణాటకలో అత్యధిక స్థానాలు సంపాదించడం అవసరమని పార్టీ భావిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పది కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకోగల రాష్ట్రం ఇదొక్కటే కావడం గమనార్హం. తమిళనాడులో పార్టీ ఖాతా తెరవకపోవడం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలోనూ ఆ అవకాశం లేకపోవడంతో కాషాయ పార్టీ కర్ణాటకలోనే తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతోంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తరువాత పొత్తులు పెట్టుకోవడం ద్వారా బలం పెంచుకునేందుకు బీజేపీ ఆలోచన చేస్తోంది. అందుకే బలం పెంచుకునేందుకు ఉన్న ఒక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు మోదీని స్టార్‌ క్యాంపెయినర్‌గా నిలబెడుతోంది.
 
ఎన్నికల తరువాత కూటమి పరిస్థితి..?
మొత్తానికి కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిలో చోటుచేసుకుంటు న్న పరిణామాలన్నీ బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయని అంచనా. మరోపక్క, జేడీఎస్‌లోని కొంతమంది నేతలు దేవెగౌడ కుటుంబంలోనే ముగ్గురు పోటీ చేస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తరువాత కూటమి పరిస్థితి ఏమిటన్న సందేహమూ వారిలో కనిపిస్తోంది. చిన్న చిన్న సామాజిక వర్గాల వారికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాల ఆశ చూపించి తమ వైపునకు తిప్పుకోగలమని బీజేపీ రాష్ట్ర నాయకత్వమూ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఏడాదికి లోక్‌సభ ఎన్నికల జరుగుతుండటం వల్ల కూటమి ప్రభావం ఎక్కువగా ఉండదని, ఓట్లు బదిలీ కాని పరిస్థితుల్లో బీజేపీకే  లాభమని వీరు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌–జేడీఎస్‌కు కీలకమైన కురబలు, ఒక్కళిగలు తమలో తాము పోట్లాడుకుంటున్న కారణంగా బీజేపీకి పట్టున్న లింగాయత్‌ వర్గం ఎన్నికల్లో కీలకంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. జాతీయవాదం, వారసత్వ రాజకీయాలే లక్ష్యంగా చేసుకుని మోదీ ప్రసంగించడం కూడా కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమిని బలహీనపరిచే వ్యూహంలోనే భాగంగా చూడాల్సి ఉంటుంది.  

మండ్యలో తిరుగుబాటు.. హాసన్‌లో అగచాట్లు
కాంగ్రెస్‌ –జేడీఎస్‌ కూటమి ఒకవైపు.. బీజేపీ ఒకవైపు ఉన్న ఈ ఎన్నికల్లో కర్ణాటకలోని దాదాపు అన్ని స్థానాల్లో ప్రత్యక్ష పోరే జరుగుతోంది. అలాగే చాలాచోట్ల కూటమి అభ్యర్థులకు అసమ్మతి సెగలూ తాకుతున్నాయి.
► మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామి పోటీ చేస్తున్న మండ్యలో ఆసక్తికరమైన రాజకీయం నడుస్తోంది. ఈ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ మద్దతుతో స్వతంత్రంగా పోటీ చేస్తున్న సినీ నటి సుమలతకు అనుకూలంగా ప్రచారం చేశారు. నటుడు, కాంగ్రెస్‌ నేత అంబరీష్‌ భార్య సుమలతకు టికెట్‌ ఇవ్వకపోవడాన్ని వీరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. స్థానిక నేతలను మచ్చిక చేసుకుందుకు పార్టీ పలు దఫాలు చర్చించినా ఫలితం మాత్రం శూన్యం. కాంగ్రెస్‌ –జేడీఎస్‌ పార్టీలు రెండింటికీ దాదాపు 80 శాతం ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ నిఖిల్‌ను గెలిపించేందుకు నేతలు నానా అగచాట్లూ పడుతున్నారు. అసమ్మతిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే చర్యలు చేపట్టింది. మండ్యలో ప్రత్యర్థికి సాయపడుతున్నారన్న కారణంతో ఏడుగురు బ్లాక్‌ అధ్యక్షులను డిస్మిస్‌ చేసింది. అయితే ఈ క్రమశిక్షణ చర్యలు అంతగా ఫలితం చూపుతున్నట్టు లేవు.

► మైసూరు, హాసన్, తుముకూరు, బళ్లారి, కలబుర్గి, ఉడుపిలో ఈ అసమ్మతి స్వరాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రత్యర్థుల్లా ఉన్న తాము కలిసి పనిచేయడం ఎలా సాధ్యమన్నది వారి ప్రశ్న.

► హాసన్‌లో దేవెగౌడ ఇంకో మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ బరిలో ఉండటాన్ని కూడా కాంగ్రెస్‌ నేతలు సహించడం లేదు.

► తుముకూరులోనూ కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోంది. సిట్టింగ్‌ ఎంపీ ముద్దె హనుమేగౌడను కాదని ఈ స్థానాన్ని దేవెగౌడకు కేటాయించడం కాంగ్రెస్‌ కార్యకర్తలకు రుచించడం లేదు. ఈ ప్రాంతానికే చెందిన కాంగ్రెస్‌ మంత్రి కె.ఎన్‌.రాజణ్ణలోనూ దేవెగౌడ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో 57 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన దేవెగౌడ తన 16వ ప్రత్యక్ష ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

► చిక్కబళాపుర, కోలార్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు వీరప్ప మొయిలీ, కె.హెచ్‌.మునియప్పకు మద్దతిచ్చేందుకు జేడీఎస్‌ కార్యకర్తలు సుముఖంగా లేరు. మరోవైపు కొంతమంది కాంగ్రెస్‌ నేతలూ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
► మైసూరు– కొడగులో కాంగ్రెస్‌ అభ్యర్థి సి.హెచ్‌.విజయ శంకర్‌ కూడా జేడీఎస్‌ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

ఈ స్థానాల్లో పోటాపోటీ..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కాంగ్రెస్‌ –జేడీఎస్‌ కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కొంటున్నాయి. రాజధానిలోని మూడు స్థానాలను జేడీఎస్‌ కాంగ్రెస్‌కు కేటాయించింది.
► బెంగళూరు నార్త్‌ స్థానంలో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ డి.వి.సదానంద గౌడ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి కృష్ణ భైరేగౌడ బరిలో ఉన్నారు. స్వచ్ఛమైన రాజకీయవేత్తగా, యువకుడిగా పేరున్న కృష్ణ భైరేగౌడ పదిహేనేళ్లుగా బీజేపీ ఆధీనంలో ఉన్న స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

► బెంగళూరు సెంట్రల్‌లో కాంగ్రెస్‌ తరఫున రిజ్వాన్‌ అర్షద్‌ మరోసారి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ పి.సి.మోహన్‌తో పోటీ పడుతుండగా ఇదే స్థానంనుంచి నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నియోజకవర్గంలోని దాదాపు 40 శాతం ముస్లిం ఓటర్లు తమకు ఓటేస్తారని రిజ్వాన్‌ అర్షద్‌ ధీమాగా ఉన్నారు. పౌర ఎజెండాతో ప్రచారం చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ కాంగ్రెస్‌ ఆశలను వమ్ము చేస్తారా? అన్న అంచనా ఉంది.

► బెంగళూరు సౌత్‌లో పదేళ్ల తరువాత కాంగ్రెస్‌ నేత బీకే హరిప్రసాద్, బీజేపీ అభ్యర్థి 28 ఏళ్ల తేజస్వీ సూర్య మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. బీజేపీ సీనియర్‌ నేత అనంతకుమార్‌ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఆయన మరణానంతరం భార్య తేజస్వినికి కేటాయిస్తారని అందరూ అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో బీజేపీ తేజస్వీ సూర్యకు సీటు కేటాయించింది. 1991 నుంచి ఈ స్థానంలో బీజేపీ గెలుస్తూ వస్తోంది. అయితే స్థానిక నేతల్లో తేజస్వీ సూర్యపై కొంత వ్యతిరేకత ఉందని, దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీకే హరిప్రసాద్‌ ప్రయత్నిస్తుండగా.. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీల దేశవ్యాప్త విజయాలు తనకు విజయ సోపానాలవుతాయని తేజస్వీ సూర్య భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement