కర్ణాటకలో కులక్షేత్రం | Congress And BJP Targets Caste Votings in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో కులక్షేత్రం

Published Tue, Apr 2 2019 10:57 AM | Last Updated on Tue, Apr 2 2019 10:57 AM

Congress And BJP Targets Caste Votings in Karnataka - Sakshi

సామాజిక వర్గాల ఆధారంగా ఓట్ల సమీకరణ జరగడంలో కర్ణాటక మిగిలిన రాష్ట్రాలకేమీ అతీతం కాదు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌ జతకట్టడం వల్ల ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతోంది. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ఫలితంగా రాష్ట్రంలో బాగా ప్రాబల్యమున్న ఒక్కళిగ (గౌడ)లు.. అహింద (మైనార్టీ, దళిత, వెనుకబడిన తరగతులవారికి కర్ణాటకలో పెట్టిన సంక్షిప్త నామం)లు ఒక వేదికపైకి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత దేవరాజ్‌ అరస్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ రకమైన కొత్త సామాజిక పునరేకీకరణకు ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ పార్టీలు తమకు మద్దతిచ్చే సామాజిక వర్గాలతో సంబంధాలను సుదృఢం చేసుకుంటుండగా.. మఠాలు కూడా ఇందుకు తమదైన పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవలి పార్లమెంటు, నాలుగు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ పొత్తు మంచి ఫలితాలే సాధించింది. నిన్నమొన్నటివరకూ బద్ధ శత్రువుల్లా పోటీపడిన సిద్ధరామయ్య.. మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌పై ప్రమాణం చేసి మరీ ఒక్కటిగా పనిచేస్తున్నారు. అయితే ఇరుపార్టీల కిందిస్థాయి కార్యకర్తల్లోనూ ఈ ఐక్యత కనపడేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది.

ఒక్కళిగలు, అహింద వర్గం ఒకవైపున ఉంటే రాష్ట్రంలో ఇక మిగిలే బలమైన సామాజిక వర్గం లింగాయతులు. వీరిని తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. యడ్యూరప్ప వంటి ఆ సామాజిక వర్గపు నేతకు నేతృత్వం కట్టబెట్టింది కూడా ఇందుకే. వెనుకబడిన వర్గాలకు చెందిన మోదీ హవా కూడా తోడైతే కర్ణాటక అసెంబ్లీలో తమ బలం పెరుగుతుందని బీజేపీ అంచనా వేస్తోంది. ఎస్సీలు, మడివాళాలు, చిన్నివారాలనూ కలుపుకుని ముందుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసింది. పార్టీలో ఉండే దళిత నాయకులు, మోదీ కేబినెట్‌లో విజయపుర ఎంపీ జిగజిణిగికి మంత్రి పదవి కల్పించడం బీజేపీ ప్రయత్నాలకు కొన్ని మచ్చుతునకలుగా చెప్పుకోవచ్చు.

 కూటమి తారకమంత్రం.. ‘అహింద’
సిద్ధరామయ్య ‘అహింద’ తారక మంత్రం పుణ్యమా అని రాష్ట్రంలోనిరెండు ప్రధాన సామాజిక వర్గాలు రెండుగా వీడిపోయాయి. చారిత్రకంగానూ వీరిద్దరి మధ్య సఖ్యత తక్కువే. తన రాజకీయ లక్ష్యాలను అందుకునే క్రమంలో సిద్ధరామయ్య కురబలను రాష్ట్రంలో ప్రధానసామాజిక వర్గంగా మార్చారని అనడంలో సందేహం లేదు. ఈ ఆయుధంతోనే ఒక్క మండ్య మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ బీజేపీ.. కాంగ్రెస్‌–జేడీఎస్‌ మధ్య ప్రత్యక్ష పోరు నడుస్తోంది. మండ్యలో ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ ఉండగా.. ఇంకోవైపు బీజేపీ మద్దతుతో సుమలతా అంబరీష్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్‌లలోని రెబెల్‌ నేతలు కూడా సుమలతకే మద్దతు ప్రకటిస్తుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇక్కడ కూడా నిఖిల్‌ కుమారస్వామిని ఎదుర్కొనేందుకు సుమలత అంబరీష్‌.. దళితులు, కురబలు, మత్స్యకారులు, ఇతరచిన్న సామాజిక వర్గాలను కలుపుకువెళ్లేందుకుప్రయత్నిస్తున్నారు. దీనివల్ల అహింద వర్గాల నేతలు కొందరు సుమలతను ‘తమ’ అనుకుంటున్నారు. ‘మండ్యద గండు’గా పేరొందిన అంబరీష్‌ భార్యగా, మండ్య కోడలిగా సుమలతకు వెన్నుదన్నుగామారుతున్నారు.

ఇవీ కులాల లెక్కలు..
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం.. కర్ణాటకలో హిందువులు 84 శాతం మంది వరకు ఉన్నారు. ముస్లింలు 12.9 శాతం, క్రిస్టియన్లు   1.9 శాతం, జైనులు 0.7 శాతం, బౌద్ధులు 0.2 శాతం, సిక్కులు 0.1 శాతం మేరకు ఉన్నారు. ఈ లెక్కల ఆధారంగా చూసినప్పుడు రాష్ట్రంలో లింగాయతులు 17 శాతం, ఒక్కళిగలు 12 నుంచి 14 శాతం ఉన్నారని అంచనా వేయవచ్చు. కురబల జనాభా దాదాపు తొమ్మిది శాతం వరకూ ఉంటుంది. ముస్లింలు 13 శాతాన్ని తీసేసిన తరువాత మిగిలిన దాదాపు 45 శాతం మంది దళితులు. 2014లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలో లింగాయతులు, ఒక్కళిగలు పూర్తిగా పార్టీల వారీగా విడిపోయారు. బీజేపీ ఎమ్మెల్యేలలో 65 శాతం మంది లింగాయతులు కాగా.. ఒక్కళిగలు 20 శాతం మంది మాత్రమే. కాంగ్రెస్‌ – జేడీఎస్‌లు రెండింటినీ కలుపుకున్నా ఇందులో లింగాయత ఎమ్మెల్యేలు 35 శాతానికి మించరు. ఒక్కళిగలే అత్యధికం. ఈ పోకడ కారణంగా కాంగ్రెస్‌ ఇతర వర్గాల్లో తన పట్టు కోల్పోతోందన్న అభిప్రాయమూ ఉంది. ఈ క్రమంలోనే ‘అహింద’ ప్రయోగం తాజా లోక్‌సభ ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. ఈ కుల సమీకరణలనే ప్రధాన అస్త్రంగా చేసుకుని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ కూటమి అదృష్టాన్ని పరీక్షించు కుంటోంది.

‘అహింద’తో తొలి ప్రయోగం
దళితులు, వెనుకబడిన తరగతుల వారందరినీ ఏకం చేయడం ద్వారా అధికారాన్ని సాధించే తొలి ప్రయత్నం దేవరాజ్‌ అరస్‌ హయాంలో జరిగింది. కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చిన ఆయన కర్ణాటక క్రాంతి రంగ (కేకేఆర్‌) పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. మరో ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కూడా కాంగ్రెస్‌ను వదిలి ఈ పార్టీలో చేరారు. 1983లో ఏర్పడ్డ తొలి కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వంలో కేకేఆర్‌ సంకీర్ణ భాగస్వామి కూడా. ఆ తరువాత కాలంలో సిద్ధరామయ్య కూడా ఇదే అహింద వర్గాలను ఏకం చేయడం ద్వారా కాంగ్రెస్‌ను బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కేకేఆర్‌లో దేవెగౌడకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరారు. తొలి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ చివరకు అదే పార్టీలో చేరి ముఖ్యమంత్రి స్థాయికి చేరిన వ్యక్తి సిద్ధరామయ్య! తాజాగా బీజేపీని ఎదుర్కొనేందుకు కూడా తన చిరకాల ప్రత్యర్థి దేవెగౌడతో చేతులు కలపడం ఇక్కడ చెప్పుకోవాలి. 

భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో తొలిసారి అధికారం చేపట్టింది యడ్యూరప్ప నేతృత్వంలో కర్ణాటకలోనే అన్నది తెలిసిందే. కానీ.. యడ్యూరప్ప హయాంలో జగదీశ్‌ షెట్టర్, డి.వి.సదానందగౌడ రూపంలో ముగ్గురు సీఎంలు పనిచేశారు. ప్రభుత్వంపై విపరీతమైన అవినీతి ఆరోపణలు.. అక్రమ మైనింగ్‌ వివాదాలు కూడా ఈ కాలంలో వచ్చినవే. ఈ కారణంగానే ప్రజలు తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జై కొట్టారు. సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు. అక్రమ మైనింగ్, అవినీతి ఆరోపణల కారణంగా బీజేపీ యడ్యూరప్పను పార్టీ నుంచి బహిష్కరించగా.. ఆయన కర్ణాటక జనతా పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు కూడా. ఎన్నికల్లో ఈ పార్టీకి 11 శాతం ఓట్లు కూడా వచ్చాయి. అయితే కేంద్రంలో మోదీ రాకతో పరిస్థితులు మారిపోయాయి. యడ్యూరప్ప మరోసారి బీజేపీ పక్షాన చేరారు.

కర్ణాటకలో ఏప్రిల్‌ 18, ఏప్రిల్‌ 23 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది. తొలిదశలో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దక్షిణాదిలో తమిళనాడు తరువాత అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 43.31, కాంగ్రెస్‌ పార్టీ 41.15 శాతం ఓట్లు సాధించాయి. జేడీఎస్‌కు 11.07 శాతం ఓట్లు రాగా భారతీయ జనతా పార్టీకి 17 స్థానాలు, కాంగ్రెస్‌కు తొమ్మిది, జేడీఎస్‌కు రెండు స్థానాలు లభించాయి.  

మోదీకిఅటు ఇటు కూడా..
కర్ణాటక ఎన్నికలను నిశితంగా పరిశీలించే అనేకమంది విశ్లేషకుల అంచనా ఏమిటంటే.. ఈ ఎన్నికల్లో అన్నిసామాజిక వర్గాలు, ఇతర ఉప వ్యవస్థల్లోనూ ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారని! ఒక వర్గం మోదీనిబలపరిచేందుకు తహతహలాడుతుండగా.. ఇంకోవర్గం వ్యతిరేకంగా పనిచేస్తోంది. బీజేపీ మాత్రంమధ్యతరగతి మనస్తత్వం, నగర ప్రాంత ఓటర్ల సాయంతో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి ద్వారా ఎదురవుతున్న
సవాలును ఎదుర్కోగలమన్న ధీమాతో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అయినప్పటికీ కర్ణాటకలో మాత్రం జాతీయ పార్టీలే అధికారం కోసంకుల, మత రాజకీయాలను పెంచి పోషించాయి.
జనతా పార్టీ రాక వరకూ అంటే 1990 వరకూ కాంగ్రెస్‌ఆధిపత్యం చెలాయించగా.. ఇప్పుడు హెచ్‌డీ దేవెగౌడ వర్గం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని బీజేపీని రాష్ట్రంలో ఓడించేందుకుప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా కర్ణాటకను కాంగ్రెస్‌విముక్తం చేస్తామని, 22 స్థానాలను గెలుచుకుంటామని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement