సోలో లైఫ్‌లో వీరు
భారత్‌లో బంధాలకు విలువెక్కువ. మన కుటుంబ వ్యవస్థ ఇతర దేశాలకుఆదర్శం. ఏడాదికి కోటి పెళ్లిళ్లు జరుగుతాయి. పిల్లాజెల్లా కష్టాలు కన్నీళ్లు ఉంటేనే జీవితం సంపూర్ణమైనట్టు లెక్క. కానీ రాజకీయాలకు వచ్చేసరికిసీన్ రివర్స్. ఇక్కడ సోలో లైఫే సో బెటరేమో..?! అటువంటి వారే ప్రజాసేవకి జీవితాన్ని అంకితం చేస్తారన్న భావన పెరుగుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసే వాళ్లంతా ఒంటరి పక్షులే. పెళ్లి చేసుకోని వారు కొందరు.. పెళ్లయి ఒంటరిగా ఉన్నవారు ఇంకొందరు.. భార్య లేదంటే భర్తని కోల్పోయిన ఒంటరి జీవితం గడుపుతున్న వారు మరికొందరు.. దేశం దశ దిశ ఇప్పుడు వీళ్ల చేతుల్లోనే ఉన్నాయి.
1980 దశకంలో అతి పెద్ద రాష్ట్రాలను పాలించిన వాళ్లంతా కుటుంబ జీవితం గడిపినవారే. కానీ గత ఏడాదికి వచ్చేసరికి పెళ్లి కాని వారే సీఎంలుగా పరిపాలిస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరింది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరికొందరు మాజీ ముఖ్యమంత్రులు ఒంటరి జీవితాన్నే గడుపుతున్నారు. ఈసారి ఎన్నికలు ఎన్డీయే, యూపీఏ మధ్య ముఖాముఖీ జరుగుతున్నాయి. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని చేపట్టేది మోదీయే. ఆయనకు పెళ్లయినా చాలా ఏళ్లుగా సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక యూపీఏ విషయానికొస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు.
ఇక ప్రధానమంత్రి రేసులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ముందున్నారు. వీళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకోకుండా ప్రజా జీవితానికే అంకితమైనవారే. ఒకప్పుడు ప్రధాని కావాలని కలలు కన్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భార్య గత ఏడాదే మరణించడంతో ప్రస్తుతం ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. నితీశ్‌కి నిన్నమొన్నటి వరకు కుటుంబం ఉన్నా ఆయన ఎప్పుడూ వారి గురించి ప్రస్తావించలేదు. అవినీతి రొంపిలో కూరుకుపోయిన బిహార్‌ని మార్చడానికి ఎనలేని కృషి చేసి నీతి, నిజాయితీ ఉన్న నాయకుడిగా పేరు సంపాదించారు.
సింగిలే సుప్రీం?
ఇప్పుడు రాజకీయాలంటే డబ్బు, బంధుగణం చుట్టూ తిరుగుతున్నాయి. రాజు కన్నా రాజు గారి బావమరిది ఎక్కువ పవర్‌ఫుల్ అన్నట్టు అధికారంలో ఎవరున్నా వారి బంధువులే చక్రం తిప్పుతుంటారు. అదే సింగిల్ పొలిటీషియన్లయితే ఆ బాదరబందీ ఉండదు. ముందూ వెనుకా ఎవరూ ఉండరు కాబట్టి అవినీతి, బంధుప్రీతికి స్థానం ఉండదు. కుటుంబ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన పనిలేదు. ప్రజా జీవితానికే ఉన్న సమయమంతా వినియోగించవచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ‘సింగిలే సుప్రీం’ అనే నినాదం ఊపందుకుంది. ఈసారి ప్రధాని రేసులో ఉన్నవారిలో మోదీ, రాహుల్, మమత, మాయ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో సింగిల్‌గా ఉన్నవారే సుప్రీం అని జై కొట్టించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆరెస్సెస్ ప్రచారక్‌లంతా బ్రహ్మచారులే
రాజకీయాలలో ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్న వారిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) మూలాలున్న వారే ఎక్కువ కనిపిస్తారు. ఆరెస్సెస్ ప్రచారక్‌లలో ఎక్కువ మంది బ్రహ్మచారులే. అలా కుటుంబ బంధాలు లేకుండా జీవనం సాగించడం ఆషామాషీ కాదు. కొందరైతే జీవితాంతం పెళ్లి చేసుకోబోమని ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. ఇలా ఒంటరిగా గడపడం ఎలా సాధ్యమవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి ఎంజీ వైద్యని ప్రశ్నిస్తే, ప్రజాసేవపై చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని, అందుకు తామే నిదర్శనమని ఆయన చిరునవ్వుతో బదులిస్తారు.
మాయావతి: కార్యకర్తల ‘హీరో’
దళిత నాయకుడు కాన్షీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీని ఆయన మరణానంతరం చేతుల్లోకి తీసుకున్న మాయావతి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఈమె ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే 38 డిగ్రీల ఎండలోనూ గంటల తరబడి అభిమానులు నిల్చుంటారు. 2017 ఎన్నికల్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు జౌనాపూర్‌లో ఏకంగా 50 వేల మంది ఆమె కోసం ఎదురు చూశారంటే జనంలో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుస్తుంది. ఒంటరి మహిళే అయినా.. కార్యకర్తలు ఆమెను అభిమానంగా ‘మా హీరో వస్తోంది’ అని పిలుస్తారు.
మమత: సాదాసీదా దీదీ
పెళ్లి చేసుకోకుండా ప్రజాక్షేత్రంలోనే అత్యధిక సమయాన్ని వెచ్చించే మమత అంటే పశ్చిమబెంగాల్ ప్రజల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే శారదా చిట్‌ఫండ్స్ వంటి ఎన్ని ఆరోపణలొచ్చినా జనం ఆమెనే నమ్ముతుంటారు. తెల్ల చీర కట్టుకొని సాదాసీదాగా కనిపిస్తూ ముందూ వెనుకా ఎవరూ లేని మమతకు అవినీతి చేయాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు బెంగాల్ వీధుల్లో వినిపిస్తుంటాయి. తాను రాసిన 65 పుస్తకాలపై వచ్చే రాయల్టీలపై జీవనం సాగిస్తానని ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా తీసుకోనని, టీ తాగినా తన సొంత పైసలే ఖర్చు చేస్తానని మమత చెప్పుకుంటారు.
జయలలిత: ‘పోయెస్’ గార్డెన్‌లో ఒంటరి రాణి
తమిళ రాజకీయాల్లో జయలలితది ఒక చరిత్ర. రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించారు. సంక్షేమానికి మారుపేరయ్యారు. సినీ రంగం నుంచి వచ్చినా, ఒంటరి మహిళ అయినప్పటికీ ఆమె బలహీనంగా ఎన్నడూ కనిపించలేదు. ఆధిపత్య ధోరణితో కరుణానిధితో ఢీ అంటే ఢీ అన్నారు. మంత్రులూ ఆమె కాళ్లపై సాష్టాంగ పడేవారు. 2014 ఎన్నికల్లో కూడా ‘మోదీ వర్సెస్ లేడీ’ ప్రచారంతో మోదీ హవాను అడ్డుకున్న సమర్థురాలు. జయలలిత ప్రభావం ఎంతంటే ఆమెలాగే ఒంటరిగా ఉంటూ అద్భుతాలు చేయాలని ఎందరో మహిళలు కలలుకన్నారు.
మోదీ అందరివాడిని..
గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు అధికారాన్ని చేపట్టిన నరేంద్రమోదీది ఒంటరి జీవితమే. ఆయన ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్నే ఎక్కువ ప్రస్తావిస్తుంటారు. 2012 గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ మాటే మంత్రంగా మారింది. ‘ప్రజాధనం నా చేతుల్లో ఉంటే చాలా భద్రంగా కాపాడతాను. నాకు కొడుకులు, కూతుళ్లు లేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. నా కుటుంబం మీరే. గుజరాత్‌లోని ఆరు కోట్ల జనాభాయే నా కుటుంబం‘ అంటూ జనంలో భావోద్వేగాన్ని రేపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి, భారతావని యావత్తూ తన కుటుంబమే అంటూ ప్రసంగించి, జనం నమో మంత్రంతో ఊగిపోయేలా చేశారు.
‘సింగిల్’ సీఎంలు వీరే
హరియాణా మనోహర్ లాల్ ఖట్టార్
అసోం శర్వానంద సోనోవాల్
యూపీ యోగి ఆదిత్యనాథ్
ఒడిశా నవీన్ పట్నాయక్
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ
బిహార్ నితీశ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment