సామాజిక వర్గాలు, మెజారిటీ జనాభాతో సంబంధం లేకుండా నాయకత్వ విలువలకే ప్రాధాన్యతనిచ్చి అందలం ఎక్కించే పరిణతి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం సొంతం. వ్యవసాయ ప్రాధాన్యత గల ఈ నియోజకవర్గంలో వెనుకబడిన వర్గాల ప్రజలే పెద్దసంఖ్యలో ఉన్నారు. ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాలు గ్రామాల్లో తక్కువగానే ఉన్నా.. స్వాతంత్య్రం పూర్వం నుంచే వారిలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అదే ఒరవడి స్వాతంత్య్రం వచ్చాక కూడా కొనసాగింది. 1952 నుంచి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే బీసీ వర్గాలకు చెందిన నేతలు ఎన్నికవడం గమనార్హం. వారు కూడా కేవలం ఆరున్నరేళ్లే ప్రాతినిథ్యం వహించారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా, ఆ సంవత్సరంతో పాటు 1957లో ఇద్దరు సభ్యులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.
ద్విసభ్య నియోజకవర్గంగా రెండుసార్లు కొనసాగినప్పుడు కూడా రిజర్వు చేసిన స్థానంలో ఎస్సీలు గెలుపొందితే, మరో స్థానంలో ఉన్నత సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎంపీగా గెలిచారు. ఆ తరువాత 1962 నుంచి వరుసగా జె.రమాపతిరావు, ఎం.సత్యనారాయణరావు, జువ్వాది చొక్కారావు 1991 వరకు ఎన్నికవుతూ వచ్చారు. వీరంతా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారే. 1996లో తొలిసారిగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణ కాంగ్రెస్ కురువృద్ధుడు జువ్వాది చొక్కారావుపై అనూహ్య విజయం సాధించారు. అయితే బీసీ నేతగా ఎన్నికైనప్పటికీ, 1996లో ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏడాదిన్నరకే రద్దవడంతో 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన చెన్నమనేని విద్యాసాగర్‌రావు విజయం సాధించారు. 1999లో మరోసారి విద్యాసాగర్‌రావు గెలవగా, 2004లో టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు గెలుపొందారు. 2006, 2009 ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ జయకేతనం ఎగరేశారు. కానీ 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌పై విజయం సాధించి, ఇక్కడి నుంచి గెలిచిన రెండో బీసీ నేతగా రికార్డుల్లోకి ఎక్కారు. 2014లో మళ్లీ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన బి.వినోద్‌కుమార్ గెలిచారు. ఈసారి వినోద్‌కుమార్ (టీఆర్‌ఎస్), పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు.– సాక్షి ప్రతినిధి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment