ఢిల్లీ వెళ్లేదెవరు! | Elections to 17 Lok Sabha Seats Today | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వెళ్లేదెవరు!

Published Thu, Apr 11 2019 3:28 AM | Last Updated on Thu, Apr 11 2019 3:28 AM

Elections to 17 Lok Sabha Seats Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 ఎంపీ సీట్లలో విజయం కోసం అధికార టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ ప్రచారంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. 16స్థానాలు లక్ష్యంగా ప్రచారం చేసింది. అసెంబ్లీ ఫలితాలే పునరావృతం అవుతాయని ధీమాగా చెబుతోంది. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, మహబూబాబాద్‌ సెగ్మెంట్లలో గెలుపు ఖాయమని, మెజారిటీయే తేలాలని అంచనాలు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది.

ఖమ్మం, చేవెళ్ల, భువనగిరి, మల్కాజ్‌గిరి, నల్లగొండ స్థానాల్లో సత్తాచాటుతామని భావిస్తోంది. అయితే.. కేంద్రంలో ఏర్పడేది ఎన్డీయే ప్రభుత్వమేనని.. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ ఆశిస్తోంది. సికింద్రాబాద్‌ సహా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ స్థానాల్లో సత్తా చాటుతామని భావిస్తోంది. హైదరాబాద్‌లో గెలుపుపై మజ్లిస్‌ పూర్తి ధీమాతో ఉంది. పోలింగ్‌ పూర్తయ్యే వరకు అన్ని పార్టీలూ ఓటర్లను ఆకర్శించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఓటరు తన నిర్ణయాన్ని గురువారం నిర్ణయించనున్నాడు. 

►ఆదిలాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ గోడం నగేశ్, కాంగ్రెస్‌ తరఫున రమేశ్‌ రాథోడ్, బీజేపీ అభ్యర్థిగా సోయం బాపూరావు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థానంలో గెలుపు ఏకపక్షమే అవుతుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఉండే ఆదివాసీలు ఈసారి ఏ పార్టీకి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

►పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోనూ ద్విముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ నుంచి వెంకటేశ్‌ నేతకాని, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్, బీజేపీ తరపున ఎస్‌.కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ ఉంది. ఈ సెగ్మెంట్‌లో రెండోసారి గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది.  

►కరీంనగర్‌లోనూ ముక్కోణపు పోటీ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, బీజేపీ తరఫున బండి సంజయ్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉన్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్, బండి సంజయ్‌ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. గతంలో బీజేపీకి పలుసార్లు గెలిచిన ఈ స్థానంపై ఆ పార్టీ ఈసారీ ఆశలు పెట్టుకుంది. 

►జహీరాబాద్‌లో సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ రెండోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరఫున కె.మదన్‌మోహన్‌రావు, బీజేపీ అభ్యర్థిగా బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటీ నెలకొంది. ఈ స్థానంలో విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. 

►మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో భారీ విజయం ఖాయమని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోనే ఉండడంతో గెలుపు అంశం కంటే మెజారిటీ వీలైనంత ఎక్కువగా ఉండాలనేదానిపైనే.. చర్చ జరుగుతోంది. 

►మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని ఈసారైనా గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో దాదాపు 20వేల ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. టీఆర్‌ఎస్‌ తరుపున మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఎన్‌. రాంచందర్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. 

►సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుని రాజధానిలో సత్తాచాటాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అందనిద్రాక్షగా ఉన్న ఈ స్థానంలో గెలుపు బాధ్యతలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భుజాలకెత్తుకున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున తలసాని సాయికిరణ్‌ యాదవ్, కాంగ్రెస్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. 

►హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ విజయం లాంఛనమే కానుంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు బరిలో ఉన్నా పోటీ నామమాత్రంగానే ఉంది. బీజేపీ తరఫున డాక్టర్‌ భగవంత్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఫిరోజ్‌ఖాన్, టీఆర్‌ఎస్‌ తరుపున పుస్తె శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో భగవంత్‌రావు కొంతమేర ఒవైసీకి పోటీ ఇచ్చారు. 

►చేవెళ్లలో పోటీ రసవత్తరంగా మారింది. సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డి, బీజేపీ నుంచి జనార్దన్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య ఉంది. ఈ స్థానంలో గెలుపు అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ భావిస్తోంది. చేవెళ్ల సెగ్మెంట్‌ను రెండోసారీ గెలుచుకుంటామని టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. 

►మహబూబ్‌నగర్‌లో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్‌ తరుపున మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరుపున చల్లా వంశీచంద్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ పోటీలో ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ స్థానంలో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. వరుసగా మూడోసారి ఇక్కడ విజయం తమేదనని టీఆర్‌ఎస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. 

►నాగర్‌కర్నూల్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోతుగంటి రాములు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లు రవి, బీజేపీ తరఫున బంగారు శ్రుతి పోటీలో ఉన్నారు. ఇక్కడ గెలుపు ఖాయమని, మెజారిటీపైనే స్పష్టత రావాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

►నల్గొండలో పోటీ ఆసక్తికరంగా మారింది. పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండగా.. టీఆర్‌ఎస్‌ తరుపున వేమిరెడ్డి నర్సింహారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా జి.జితేంద్రకుమార్, సీపీఎం అభ్యర్థిగా మల్లు లక్ష్మి బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ స్థానంలో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ విజయం సాధిస్తారని కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. 

►టీఆర్‌ఎస్‌ కంచుకోటగా ఉన్న వరంగల్‌లో పోటీ ఏకపక్షంగానే జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ తరుపున సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్, కాంగ్రెస్‌ తరుపున దొమ్మాటి సాంబయ్య, బీజేపీ అభ్యర్థిగా చింతా సాంబమూర్తి పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య పోటీ ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు ఖాయమని, మెజారిటీ తేలడానికే ఎన్నికలని ఆ పార్టీ అంచనాలో ఉంది. 

►మహబూబాబాద్‌లో గెలుపుపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. టీఆర్‌ఎస్‌ తరుపున మాలోతు కవిత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్, బీజేపీ తరుపున హుస్సేన్‌నాయక్, సీపీఐ తరుపున కల్లూరి వెంకటేశ్వర్‌రావు, జనసేన అభ్యర్థిగా భాస్కర్‌నాయక్‌ బరిలో ఉన్నారు. పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉంది.

►నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మధుయాష్కీ గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మరోసారి విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. డిమాండ్ల సాధన కోసం ఈ స్థానంలో 176 మంది రైతులు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఫలితాల్లో తేలనుంది.

►భువనగిరిలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా ఉంది. సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ రెండోసారి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా పీవీ శ్యాంసుందర్‌ రావు పోటీలో ఉన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. రెండు పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నాయి. భువనగిరిలో రెండోసారి గెలుస్తామని టీఆర్‌ఎస్‌ భావిస్తుండగా.. తమ బలం, బలగంతో ఈసారి గెలిచి చూపిస్తామని హస్తం పార్టీ అంచనాలు వేస్తోంది.

►ఖమ్మంలో ఎన్నికల పోరు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేణుకా చౌదరి, టీఆర్‌ఎస్‌ తరఫున నామా నాగేశ్వర్‌రావు, బీజేపీ అభ్యర్థిగా వాసుదేవరావు, సీపీఎం అభ్యర్థిగా బి.వెంకట్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. రెండు పార్టీలూ విజయంపై ధీమాగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చిన అనుభవం నేపథ్యంలో ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ విజయం కోసం టీఆర్‌ఎస్‌ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement