
సాక్షి, వికారాబాద్: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ నియంతలుగా మారారని, ఇద్దరూ బడా డిక్టేటర్, చోటా డిక్టేటర్‌గా పాలన సాగిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్ ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లాలోని మిర్జాపూర్‌లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ను ఓడించి వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబం ఎంతో గౌరవప్రదమైనదని తెలిపారు. ప్రజలకు సేవచేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో కొండాను గెలిపించాలని కోరారు. కేంద్రంలోని మోదీ పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీ రెండో స్వాతంత్య్ర పోరాటం చేస్తోందని చెప్పారు.
తన ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై మోదీ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్, వివిధ పార్టీల అధ్యక్షులు శరద్‌పవార్, మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్ తదితరులపై ప్రధాని ఈడీ, ఐటీ, సీబీఐ కేసులను బనాయిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను ఇలా ఎప్పుడూ వేధింపులకు గురిచేయలేదని తెలి పారు. మోదీ ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ఓట్ల దొంగతనం చేస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల యూపీఏ పాలనలో పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం దారుణమని ఆయన మండిపడ్డారు.
విశ్వేశ్వర్‌రెడ్డిని గెలిపించండి: కుంతియా
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ఓటర్లను కోరారు. బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, విశ్వేశ్వర్‌రెడ్డి గెలిస్తే కేంద్రంలో పదవి లభిస్తుందని తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని తెలిపారు. సభను విజయవంతం చేసినందుకు ప్రజలు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలో మరో పార్టీని బతకనివ్వడం లేదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, ప్రలోభాలకు గురై ఓటు వేయవద్దని కోరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు టీఆర్‌ఎస్ అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ దొర పాలనకు అంతం పలకాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్, మోదీలు ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతినెలా పేదల ఖాతాల్లో రూ.6 వేలు జమచేసే ఆర్థిక భరోసా పథకం అమలు చేస్తామని చెప్పారు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై పెట్టేందుకు టీఆర్‌ఎస్ పార్టీకి స్థానిక నేతలు ఎవ్వరూ దొరకలేదని, స్థానికేతరుడిని పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా గెలిస్తే చేవెళ్ల పార్లమెంట్‌ను అభివృద్ధి చేయటంతోపాటు సాగునీరు, తాగునీటి కష్టాలు తీరుస్తానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం రామకృష్ణ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment