
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో మరో కీలక పోరుకు తెరలేచింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి పెట్టని కోటగా ఉంటున్న ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించే లక్ష్యంతో టీఆర్‌ఎస్ దూసుకెళ్తోంది. సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్‌సభ స్థానం పరిధిలో ఉండటంతో ఐదు లక్షలకు పైగా మెజారిటీ సాధించి దేశం దృష్టిని ఆకర్షించేలా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. వరుస వలసలు కాంగ్రెస్ పార్టీని కుంగదీయగా, కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడం కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి గణనీయమైన ఓట్లు సాధించిన ఎం.రఘునందన్‌రావును ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రంగంలోకి దించింది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచినా.. ప్రచార పర్వంలో మాత్రం టీఆర్‌ఎస్ దూసుకెళ్తోంది. గ్రౌండ్ రిపోర్టు -కల్వల మల్లికార్జున్‌రెడ్డి
టీఆర్‌ఎస్: అభివృద్ధి మంత్రం
లోక్‌సభ సభ్యుడిగా సీఎం కేసీఆర్ రాజీనామా నేపథ్యంలో 2014 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి మెదక్ ఎంపీగా ఎన్నికైన కొత్త ప్రభాకర్‌రెడ్డి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. ‘నాయకుడిగా కాదు.. సేవకుడిగా’ అనే నినాదంతో ప్రచారంలోకి అడుగుపెట్టిన ఈయన నాలుగున్నరేళ్లలో తాను ఎంపీగా నియోజకవర్గానికి చేసిన సేవలను ప్రస్తావిస్తున్నారు. రూ.430 కోట్లతో నర్సాపూర్ జాతీయ రహదారి, మెదక్, గజ్వేల్ రైల్వే లైను, రీజినల్ రింగు రోడ్డు, పటాన్‌చెరుకు ఎంఎంటీఎస్, మెదక్, సిద్దిపేటకు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయ వంటి అంశాలను ఏకరువు పెడుతున్నారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ప్రచార వేడి తగ్గకుండా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న సంగారెడ్డిలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. కళా బృందాలు, రోడ్‌షోలతో ఉద్యమ కాలం నాటి ఊపును పార్టీ కేడర్‌లో నింపే ప్రయత్నం చేస్తున్నారు. వివాద రహితుడు కావడం, పార్టీ నేతలతో సమన్వయం ఆయనకు కలిసొచ్చే అంశాలు.
కాంగ్రెస్: శ్రేణుల్లో స్తబ్దత
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కూడా తాజాగా టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. సిద్దిపేటలో నాయకత్వ లేమిని ఎదుర్కొంటుండగా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెదక్, దుబ్బాక అభ్యర్థులు తిరిగి క్షేత్రస్థాయిలో కనిపించకుండా పోయారు. పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పటికీ నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదు. టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు పార్టీ శ్రేణులతో పెద్దగా సంబంధాలు లేకపోవడంతో ప్రచారం తన సొంత అసెంబ్లీ సెగ్మెంట్ పటాన్‌చెరును దాటడం లేదు. మాజీ ఎంపీ విజయశాంతికి ప్రచార బాధ్యత అప్పగించినా.. పార్టీ శ్రేణుల్లో స్తబ్దత వీడటం లేదు. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించకుండానే, నేరుగా ప్రచారంలోకి అడుగు పెట్టడంతో గందరగోళం నెలకొంది. పార్టీ తరపున ప్రణాళిక, ప్రచార వ్యూహం లేకపోవడంతో పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ అభ్యర్థి ఆధారపడినట్లు కనిపిస్తోంది.
బీజేపీ: అభ్యర్థిపైనే ఆధారం
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 22 వేలకు పైగా ఓట్లు సాధించిన రఘునందన్‌రావు ప్రస్తుతం మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రతీ లోక్‌సభ ఎన్నికలోనూ అభ్యర్థులను మారుస్తూ వస్తున్న బీజేపీ.. ఈసారి కూడా కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులందరికీ కలిపి 55 వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. దుబ్బాక మినహా ఇతర నియోజకవర్గాల్లో నామమాత్ర ఓట్లను కలిగి ఉన్న బీజేపీ.. ప్రస్తుత ఎన్నికల్లో జాతీయ స్థాయి అంశాలకు ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తోంది. కేసీఆర్ కుటుంబ పాలన, నరేంద్ర మోదీ ఛరిష్మా, యువ ఓటర్ల మొగ్గు తమకు అనుకూలిస్తాయని బీజేపీ లెక్కలు వేస్తోంది. అభ్యర్థి రఘునందన్‌రావు తన సొంత వ్యూహంతో ప్రచార పర్వంలో అడుగు పెట్టారు. కాంగ్రెస్‌తో పోలిస్తే ప్రచారంలో బీజేపీ కొంత ముందంజలో ఉంది.
హరీశ్: సర్వం తానై.. సారథ్యం
‘లక్ష ఓట్ల మెజారిటీ ఇస్తే లక్ష ఎకరాలకు సాగు నీరు ఇస్తా’ నినాదంతో.. అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ ప్రచారాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 1.18 లక్షల మెజారిటీతో గెలుపొందిన హరీశ్.. లోక్‌సభ ఎన్నికలోనూ మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ పరం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గత ఎన్నికల్లో 3.6 లక్షల మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించగా, ఈసారి మెజారిటీని 5 లక్షలు దాటించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అంతా తానై పార్టీ యంత్రాంగాన్ని నడిపిస్తున్న హరీశ్‌రావు.. లోక్‌సభ పరిధిలో స్వయంగా ప్రచారం నిర్వహించేలా ఎన్నికల షెడ్యూలు సిద్ధం చేసుకున్నారు. దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనూ లక్ష ఓట్ల మెజారిటీ సాధించేలా ప్రణాళిక రూపొందించడంతో పాటు, మిగతా నియోజకవర్గాల్లో మెజారిటీ పెంచడం లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టి, మెజారిటీ సాధించేలా పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తున్నారు. చేరికలు, వలసలతో పాటు జోరుగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో దేశం దృష్టిని ఆకర్షిస్తామని హరీశ్ ప్రతీ సభలోనూ చెబుతున్నారు.
జనం మనోగతం చెట్టు పన్ను రద్దు చేసిండ్రు
గతంలో ఈత, తాటి చెట్లకు చెల్లించే పన్నును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో చెట్టు పన్ను రద్దు విషయం ఎవరూ పట్టించుకోలేదు. గీత కార్మికుల పింఛన్ కూడా పెంచిండ్రు. కులవృత్తులపై ఆధార పడిన వారికి అండగా నిలబడటం పెద్ద విషయమే. ఊర్లల్లో బతుకుదెరువు అవకాశాలు మెరుగు పడేటట్లు ప్రభుత్వం ఇంకా ఏమైనా పథకాలు ఆలోచిస్తే మంచిది.– ఆంజనేయులు గౌడ్,దేవులపల్లి, హత్నూర మండలం
మంచి చేసే వాళ్లే కావాలి
ఎవరు అధికారంలోకి వచ్చినా మా లాంటోళ్లం కష్టం చేసుకుంటేనే బతుకుతం. ఎన్నికల్లో ఓట్ల కోసం చాలా మంది అడుగుతున్నరు. కానీ మన రాష్ట్రంకు ఎవరు మంచి చేస్తరన్నదే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలె. మాకు పార్టీలతో సంబంధం లేదు కానీ ఇక్కడైతే లోకల్ పార్టీకే ఓటు వేయాలని అనుకుంటున్నం. మనకు బలం ఉంటేనే పైన కూడా గుర్తిస్తరు.– రాహుల్, కూరగాయలవ్యాపారి, పటాన్‌చెరు
మా కోసం కూడా ఏదైనా..
స్థానికంగా మా ఎమ్మెల్యే హరీశ్‌రావు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఎంపీ అభ్యర్థి కూడా ఎప్పుడూ జనాల్లో ఉండే మనిషి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలతో సాయం చేస్త్తంది. గతంలో రైతులు చనిపోతే కుటుంబం తెర్లయ్యేది. అయితే మా లాంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసం కూడా ఏదైనా పథకం పెడితే బాగుంటుంది.– అనగోని సంతోష్‌గౌడ్, రాంపూర్,నంగునూరు మండలం
పింఛనుతో భరోసా
మాది చేనేత కార్మిక కుటుంబం. కానీ కులవృత్తి దెబ్బతినడంతో బీడీల తయారీ బువ్వ పెడుతోంది. ఇంతకు ముందు పనిచేస్తే నెలకు వెయ్యో, రెండు వేలో వచ్చేది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవనభృతి పేరిట వేయి రూపాయలు ఇస్తోంది. రేపోమాపో రూ.2116 ఇస్తమని చెప్తున్నరు. ఆర్థికంగా మాకు భరోసా ఇచ్చి, మాకు అండగా ఉన్న వారికే ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని అనుకుంటున్నం.– సాంలేటి చంద్రకళ,బీడీ కార్మికురాలు, దుబ్బాక
ఎవరొచ్చినా చేసేదేముంది
ఏండ్ల తరబడి ఊర్లలో సమస్యలు ఉన్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. మొన్న ఎన్నికల్లో ఓట్లు వేసే దాక ఎంబడివడి తిరిగిండ్రు. ఇప్పుడు మళ్ల ఓట్లు వచ్చినయని వస్తుండ్రు. ఎన్నిసార్లయినా ఓటేయడానికి ఇబ్బంది లేదు. కానీ గెలిచినోళ్లు జనం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. సరే.. రైతుబంధు, రైతుబీమా మంచిగనే ఉన్నయి. పేదలకు న్యాయం చేసేటోళ్లకే ఓటు వేస్త.– శంకరయ్య, గొల్లపల్లి,కొండాపూర్ మండలం
అన్నింటా దూకుడే.. సిద్దిపేట: మెజారిటీ ఎంత?
1985 నుంచి వరుసగా ఆరుసార్లు సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్లో 2004 నుంచి 2018 వరకు మాజీ మంత్రి హరీశ్‌రావు డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావు ఏకంగా 1.18 లక్షల రికార్డు మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాటి లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీ తగ్గకుండా హరీశ్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.
మెదక్: అడ్రస్ లేని విపక్షాలు
గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి 47 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చివరి వరకు అభ్యర్థి ప్రకటనలో తాత్సారం చేసిన కాంగ్రెస్.. చివరకు ఉపేందర్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఎన్నికల తర్వాత ఈయన కనిపించలేదు. మాజీ మంత్రి సునీత కాంగ్రెస్‌ను వీడిన నేపథ్యంలో కాంగ్రెస్‌పై ప్రభావం చూపనుంది. కాంగ్రెస్, బీజేపీ సంస్థాగత బలహీనతలు టీఆర్‌ఎస్‌కు ఇక్కడ ఓట్ల శాతం పెంచనున్నాయి.
నర్సాపూర్: ‘కారె’క్కిన కేడర్
కాంగ్రెస్ పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన మదన్‌రెడ్డి 38,320 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సునీత వెంట కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మెజారిటీ కనీసం 80 వేలకు చేరుతుందని పార్టీ నేతలు లెక్కలు వేస్తున్నారు. బీజేపీకి ఇక్కడ నామమాత్ర ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్‌లో నేతలు లేరు.
సంగారెడ్డి: దిద్దుబాటులో టీఆర్‌ఎస్
సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందింది. పార్టీ అభ్యర్థి టి.జయప్రకాశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌పై 2,589 స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుంచి జయప్రకాశ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల వేడిని తగ్గించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి లోపాలను సరిదిద్దుకుని మెజారిటీ సాధించే లా టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.
పటాన్‌చెరు: ఎవరి దరి చేరు?
వరుసగా రెండుసార్లు టీఆర్‌ఎస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన గూడెం మహిపాల్‌రెడ్డి 2018 డిసెంబరు అసెంబ్లీ ఎన్నికల్లో 37 వేల పైచిలుకు ఓట్ల మెజారి టీతో గెలుపొందారు. కాంగ్రెస్ ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఇదే నియోజకవర్గంలో ని అమీన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన వారు కావడంతో.. ఎన్నికల ప్రచారం ఇక్కడ మాత్రమే కొంత మేర కనిపిస్తోంది. బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావుకు పటాన్‌చెరుతో అనుబంధం ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటి మెజారిటీని అధిగమించాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది.
దుబ్బాక: మెజారిటీ లక్ష్యం లక్ష
గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మాజీ మంత్రి ముత్యంరెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషంలో అభ్యర్థిగా తెర మీదకు వచ్చిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డి.. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కేడర్‌కు అందుబాటులో లేరు. ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇదే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 22 వేలకు పైగా ఓట్లు సాధించారు. ట్రక్కు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన 12 వేలకు పైగా ఓట్లను తమకు చెందిన ఓట్లుగానే టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంతో టీఆర్‌ఎస్ పని చేస్తోంది.
గజ్వేల్: టీఆర్‌ఎస్ జోష్‌ఫుల్
సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమిది. 2009, 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ 58 వేల పైచిలుకు ఓట్లు సాధించగా, ప్రతాప్‌రెడ్డి చేరికతో లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీని లక్ష దాటించేలా వ్యూహం ఖరారు చేశారు. బీజేపీకి ఇక్కడ కేవలం వందల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం, కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి టీఆర్‌ఎస్‌కు బాగా కలిసొచ్చే పరిస్థితి.. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం జోష్ కనిపించడం లేదు.
ఆడుతూ పాడుతూ: దుబ్బాకలో బీడీ కార్మికులు..
లోక్‌సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లు
సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వేల్.
లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,98,836
స్త్రీలు 8,04,070
ఇతరులు 41
మొత్తం 16,02,947
Comments
Please login to add a commentAdd a comment