సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల విజయాలతో ఊపు మీదున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సత్తా చాటిందా..? కారు... సారు... పదహారు నినాదం సానుకూల ప్రభావం చూపిందా..? కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగరేయాలన్న బండి సంజయ్ కల నెలవేరుతుందా..? కకావికలమై పోయిన కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చిందా...? ఓటరు మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. పార్లమెంటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది. తొలుత మందకొడిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్నం తరువాత ఊపందుకుంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 69.40 శాతం పోలింగ్ నమోదు కాగా, పెద్దపల్లిలో 59.24 శాతం ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. కాగా రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. ఒక్కో చోట ఒక్కో విధంగా ఓటర్లు తమ విజ్ఞతను ప్రదర్శించినట్లు ప్రాథమికంగా అర్థమమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగిన టీఆర్‌ఎస్ హవా
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు లోకసభ నియోజకవర్గాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రభావం పోలింగ్ సరళిలో స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల స్థాయిలో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు జరగకపోయినా, గ్రామాల్లో ఓటర్లు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓట్లేశారు. వృద్ధులు, ఆసరా పెన్షన్ల లబ్ధిదారులు, రైతులు బూత్‌లలో క్యూ కట్టిన తీరు టీఆర్‌ఎస్‌కు అనుకూల గాలిని స్పష్టం చేసింది.
అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తే అభివృద్ధి పనులు జరుగుతాయనే ధోరణితో ఓటర్లు కనిపించారు. పట్టణాల్లో కొంత మార్పు కనిపించినప్పటికీ, మహిళలు, ముస్లిం మైనారిటీలు టీఆర్‌ఎస్‌ను ఆదరించినట్లు స్పష్టమైంది. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ తన ఓటు బ్యాంకును కొంత కోల్పోయినా, విజయానికి అవసరమైన ఓట్లు పెద్ద సంఖ్యలోనే పోలయినట్లు ఆ పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామగుండంలో స్వల్ప తేడా కనిపించినా, మిగతా ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. కోల్‌బెల్ట్ ఏరియాలో మాజీ ఎంపీ వివేక్ ప్రభావం కొంత కనిపించిందని పోలింగ్ సరళితో అర్థమవుతోంది.
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ సవాల్
కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌కు బీజేపీ సవాల్ విసిరినట్లు అంచనాలను బట్టి తెలుస్తోంది. కరీంనగర్‌తోపాటు పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. మైనారిటీ ప్రభావం అధికంగా గల కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంటులో సంజయ్ మెరుగైన ఫలితాన్ని రాబడతారని భావిస్తున్నారు. ఇక మానకొండూరు, చొప్పదండి, వేములవాడల్లో బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో కేటీఆర్ ప్రభావం ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు బీజేపీనే పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో బీజేపీ ఓటర్లను ఆకర్షించడంలో సఫలీకృతం కాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంజయ్ హిందుత్వ ఎజెండా, మోదీ పాలన, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలన్నీ కరీంనగర్‌లో బీజేపికి అనుకూలంగా పనిచేసినట్లు భావిస్తున్నారు. యువత, కొత్త ఓటర్లు చేసిన హంగామా ఈవీఎంలలో ఓట్ల రూపంలోకి మారిందా అనేది ప్రశ్నార్థకం. ఓవరాల్‌గా 1998, 1999 ఎన్నికల తరువాత కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. కాగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాత్రం తనదే విజయమనే ధీమాతో ఉన్నారు. ఇక పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ ప్రభావం చూపలేకపోయారని పోలింగ్ తీరును బట్టి తెలుస్తోంది. యువత, కొత్త ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తున్నా.. టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టలేక పోయింది.
పొన్నం 2009 నాటి ఓటు బ్యాంకు పదిలమా..?
అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి, మూడోస్థానంలో నిలిచినప్పటికీ.. ఎంపీగా 2009లో గెలిచిన నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే నమ్మకంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరోసారి బరిలో దిగారు. కరీంనగర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆనాటి ఓటుబ్యాంకు తిరిగి సమకూర్చుకోలేక పోయినట్టు గురువారం నాటి పోలింగ్‌కు వచ్చిన ఓటర్ల నాడిని బట్టి అర్థమవుతోంది. కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్‌ల పరిధిలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ నువ్వానేనా అనే స్థాయిలోనే పోటీ ఇవ్వగా, కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి కనిపించలేదు. హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో మాత్రం టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిరిసిల్లలో సైతం టీఆర్‌ఎస్ తరువాత స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడ్డట్టు తెలుస్తోంది.
పెద్దపల్లిలో కాంగ్రెస్ విఫల ప్రయోగమేనా?
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్‌కు చెందిన మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌ను ఆ పార్టీ దిగుమతి చేసింది. జిల్లాకు చెందిన మాదిగ సామాజిక వర్గం నాయకులను సైతం కాదని చంద్రశేఖర్‌ను తీసుకురాగా, ఉన్న వారు సైతం తగిన సహకారం అందించలేదు. కాంగ్రెస్‌కు చెందిన రెండో శ్రేణి నాయకత్వం పూర్తిగా టీఆర్‌ఎస్‌లోకి చేరిన పరిస్థితుల్లో చంద్రశేఖర్‌కు ఏమాత్రం సహకారం లభించలేదు. మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగర్‌రావు మినహా చెప్పుకోదగ్గ నాయకులు లేకుండా పోయారు.
ఇక్కడ కూడా రెండోస్థాయి నాయకుల్లో అధిక శాతం గులాబీ కండువాలే కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్ తన సామాజిక వర్గం ఓట్లతోపాటు కాంగ్రెస్ ఓటుబ్యాంకు మీదే ఆధారపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో ఓటు వేయమని అడిగే నాథుడు కూడా లేకపోవడం, ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకురాలేని పరిస్థితి నెలకొనడంతో చంద్రశేఖర్ ప్రయోగం ఆశించిన స్థాయిలో కూడా సఫలం కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి కారు హవా రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా కనిపించనుందని తెలుస్తోంది. వచ్చేనెల 23న ఫలితాల వరకు వేచి చూస్తూ ఎవరి అంచనాల్లో వారు ఉండడం మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment