తెలంగాణ: 7 జాతీయ, 4 ప్రాంతీయ పార్టీలు | Election Commission Identified 7 National, 4 Regional Parties in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: 7 జాతీయ, 4 ప్రాంతీయ పార్టీలు

Published Wed, Oct 13 2021 9:30 AM | Last Updated on Wed, Oct 13 2021 10:02 AM

Election Commission Identified 7 National, 4 Regional Parties in Telangana - Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రంలో 7 జాతీయ, నాలుగు ప్రాంతీయ పార్టీలకు గుర్తింపు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో 4 శాతం ఓట్లు సాధిస్తే జాతీయ పార్టీగా, ఏదైనా పార్టీ ఒక రాష్ట్రం లేదా ప్రాంతంలో 4 శాతం ఓట్లు సాధిస్తే దాన్ని రాష్ట్ర లేదా ప్రాంతీయ పార్టీగా పరిగణిస్తారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యా లేదా వ్యక్తుల వల్ల పార్టీలు చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తు ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడడం సహజమే. అలాంటప్పుడు సమస్య పరిష్కార చర్య ఎన్నికల సంఘమే తీసుకుంటుంది. 

రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పార్టీలు
సాధారణంగా ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పార్టీలు పోటీలో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు లేదా సంస్థలు ఎన్నికల సంఘంలో నమోదు చేసుకుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒకవేళ పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికలప్పుడు ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచిన వాటిలో నుంచి గుర్తులు కేటాయిస్తుంది. వారికి స్వతంత్య్ర అభ్యర్థుల కన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. దేశంలో సుమారు 1,983 రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పార్టీలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో 73 వరకు ఉంటాయి. తెలంగాణ జన సమితి, జనసేన, లోక్‌సత్తా, ఏఐఎఫ్‌బీలను ఇదే కోవలో పరిగణిస్తారు. రిజిస్టర్డ్‌ అన్‌రికగ్నైజ్డ్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు ఎన్నికల సంఘం 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచింది.

జాతీయ పార్టీలు
దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు కేటాయించిన గుర్తులను ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. దేశంలో ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా(సీపీఐ), కమ్యూనిస్టు పార్టీ ఇండియా(సీపీఎం), ఆలిండియా కాంగ్రెస్‌ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది.

ప్రాంతీయ పార్టీలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం–పతంగి గుర్తు), తెలంగాణ రాష్ట్ర సమితి (కారు గుర్తు), తెలుగుదేశం పార్టీ(సైకిల్‌ గుర్తు), వైఎస్సార్‌సీపీ (సీలింగ్‌ ఫ్యాన్‌ గుర్తు)లను ఎన్నికల 
సంఘం గుర్తించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement