సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ-ప్రతివ్యూహాలు, ఆరోపణలు- ప్రత్యారోపణలు, సవాళ్లు - ప్రతిసవాళ్లతో దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే హుజురాబాద్ కేంద్రంగా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రత్యేక దృష్టి సారించాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. షెడ్యూల్ కూడా విడుదల కావడంలో పార్టీల ప్రచార కార్యకలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. పాదయాత్రలు, జాతీయస్థాయి నేతల బహిరంగ సభలు వంటి వాటితో నియోజకవర్గం బిజీబిజీగా మారిపోయింది. కాగా జూన్ 12వ తేదీన ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే.
చదవండి: జోగులాంబ గద్వాల్‌లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్
ఇక అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుండడంతో దీపావళి కంటే ముందే హుజురాబాద్‌లో పండుగ వాతావరణం నెలకొననుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవడంతో ఎన్నికల సంఘం తక్షణమే ఎన్నికల కోడ్‌ను అమల్లోకి వచ్చింది. ఉప ఎన్నికపై ఈసీ కరోనా ఆంక్షలు విధించింది. ప్రభుత్వ కార్యక్రమాలకూ బ్రేక్ వేసింది. ర్యాలీలు రోడ్‌షోలపై నిషేధం విధించింది. వెయ్యి మందితోనే సభలకు అనుమతిచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నికపై ఈసీ కాసేపట్లో సమావేశం కానుంది. కాగా హుజురాబాద్‌లో 2 లక్షల 26వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్‌లోపాటు కడపలోని బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలకు ఈసీ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment