సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక నామినేషన్ల పర్వంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అభ్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే ఎన్నికల గుర్తులను ఎంచుకోవడం గమనార్హం. రాష్ట్రంలో 2014 అసెంబ్లీ–పార్లమెంటు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి గుర్తులే చాలాచోట్ల తమ ఓటమికి కారణమయ్యాయని టీఆర్‌ఎస్ లబోదిబోమన్న సంగతి తెలిసిందే. అయితే, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ కూడా ఇదేవిధమైన టెన్షన్‌కు గురవుతోంది.
ఈ గుర్తులతోనే టీఆర్‌ఎస్‌లో టెన్షన్
రోడ్‌రోలర్, ట్రక్కు, రైతు ట్రాక్టర్, చపాతీరోలర్, ఆటోరిక్షా, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ ఈ గుర్తులు గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓట్ల చీలికకు కారణమయ్యాయి. దీంతో తమ గుర్తును పోలిన గుర్తులను జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ట్రక్కు, రోడ్‌రోలర్, ఆటో గుర్తులను తొలగించింది. అయినప్పటికీ కారు గుర్తును పోలిన చపాతీ రోలర్, రైతు ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టే, లారీ, బస్సులను కావాలంటూ కొందరు స్వతంత్రులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
పువ్వుకు దడ..
కాలీఫ్లవర్, పైనాపిల్ ఇవి రెండూ దూరం నుంచి చూసినప్పుడు బీజేపీ అధికారిక గుర్తు అయిన కమలం పువ్వును పోలి ఉంటాయి. ఈ రెండు నామినేషన్లు కూడా ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న ఇ.రాజేందర్ అనే వ్యక్తులే వేయడం విశేషం. ఈ గుర్తులను ఈసీ ఆమోదిస్తే తమకు చిక్కులేనని కమలనాథులు కలవరపడుతున్నారు. మరోవైపు ఓ స్వతంత్ర అభ్యర్థి తనకు కేటాయించాలని కోరిన పెన్నుపాళి(పెన్‌నిబ్) గుర్తు కూడా దూరం నుంచి వికసించిన కమలాన్ని పోలి ఉండటం గమనార్హం.
ఎంఐఎం తరహాలో పతంగి కావాలట
ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)ను పోలిన పార్టీ పేరుతో ఓ అభ్యర్థి వేసిన నామినేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలిండియా మజ్లిస్ ఇ–ఇంక్విలాబ్ ఇ–మిలాత్ (ఏఐఎంఐఎం)ను తన పార్టీగా పేర్కొన్నారు. తనకు కూడా పతంగి గుర్తు కావాలని కోరడం గమనార్హం.
స్క్రూటినీ తరువాత తేలుస్తాం: ఆర్డీవో
‘ప్రస్తుతానికి కేవలం నామినేషన్ల ఘట్టమే ముగిసింది. స్క్రూటినీ అనంతరం నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరిస్తాం’అని ఆర్డీవో అరవింద్‌రెడ్డి తెలిపారు.
ఎందుకు ఈ టెన్షన్?
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో ఉన్న ట్రక్కు గుర్తే పలుచోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయాన్ని దూరం చేసిందని ఆ పార్టీ నిర్ధారించుకుంది. ట్రక్కు గుర్తు.. కారు గుర్తును పోలి ఉండటంతో టీఆర్‌ఎస్ పార్టీ ఓట్లు ట్రక్కు గుర్తు కలిగిన అభ్యర్థులకు పడ్డాయి. సంగారెడ్డి, నకిరేకల్ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తువల్లే టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్ ఫిర్యాదు కూడా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment